ప్రపంచ ప్రజలను ఆకలి నుండి, దారిద్య్రం నుండి విముక్తి చేసేందుకు ఐక్యరాజ్యసమితి 2015లోనే ఒక బృహత్తర వ్యూహాన్ని రచించింది. అంతర్జాతీయ సమాజం బాధ్యతాయుతంగా ఆయా దేశాల ప్రభుత్వాల కర్తవ్య నిర్వహణను ఎజెండాలో చేర్చి ఒక యజ్ఞంలా ఆకలి నివారణకు సూచనలను సిద్దం చేసింది. ప్రపంచ చిత్ర పటాన్ని ఆకలి రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు సమృద్దితో కూడిన అభివృద్ధి పదాన్ని ఎజెండాగా నిర్ణయించింది.
2030 వరకు ప్రపంచ జనాభా 800 మిలియన్లకు చేరుకోనున్న సందర్భంలో ఆకలి నుండి విముక్తి చేసే ఈ బృహత్తర పదకానికి సంబంధించిన వివరాలను 'అగ్రిక్లినిక్' పాఠకుల ముందు ఉంచుతున్నాం. 2050వ సంవత్సరం వరకు 70% అధిక ఆహారాన్ని ఉత్పత్తి చేసేందుకు దేశాలు సిద్దం కావాలని పిలుపునిచ్చింది. చాలా దశాబ్దాల క్రితం వరకు 3 శాతంగా ఉన్న ప్రపంచ జి.డి.పిని వృద్ధి చేసేందుకు తీసుకోవలసిన చర్యలను ఈ పథకంలో పొందుపరచింది. ఆహార కొరతను నివారించి ప్రపంచ పటాన్ని అభివృద్ధివైపు పరుగులు తీయించేందుకు ఇప్పుడు అనుసరిస్తున్న పందాకు భిన్నంగా ఆహార ఉత్పత్తి రంగంలో ముందుకు దూసుకు వెళితేనే సమస్యను పరిష్కరించగలమని భావించింది.
ఆహార ఉత్పత్తిని వేగంగానూ, సమృద్ధిగానూ పెంపొందించేందుకు అవలబించవలసిన పద్ధతులను కూడా దీనిలో ప్రస్తావించారు. ఆహార ఉత్పత్తి రంగంలో ఎదురవుతున్న నాలుగు ప్రధాన అవరోధాలను ఈ పధకంలో ప్రస్తావించారు. సహజ వనరుల కొరత వాతావరణమార్పు, భౌతిక పరిస్థితులు మరియు ఆహారం వృధాకావడం ఆకలి విస్తరణకు, ఆహార కొరతకు ప్రధాన సమస్యలుగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ సవాళ్ళను అధిగమించేందుకు ప్రభుత్వాలు, పెట్టుబడి వర్గాలు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించింది. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ అవరోధాలను అధిగమించే అవకాశాలను అన్వేషించాలని పిలుపునిచ్చింది. ప్రపంచంలో ప్రభుత్వాల సమ్మేళనం 2015 నుండి 2018 వరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల సమాహారంగా అగ్రికల్చర్ 4.0 అనే అవగాహన ప్రారంభమైంది. ప్రధానంగా పైన వివరించిన నాలుగు సమస్యల పైన ప్రపంచ దేశాలు దృష్టి సారించాలని 4.0 పేరుతో నాలుగు లక్ష్యాలను ఆయా దేశాలు నిర్ధేశించాయి.
ముఖ్యంగా ఈ సవాళ్ళను అదిగమించడానికి వైవిద్యభరితమైన వ్యవసాయం ద్వారా ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పనిచేయడానికి ఆయా దేశాలు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాయి. సెన్సార్లు, డివైస్‌లు, యంత్రాలను వినియోగించడంతోపాటు సమాచార సాంకేతికతను రైతులకు వెన్నుదన్నుగా నిలపడానికి నిర్ణయించాయి. అంతేకాకుండా వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి రోబోట్టు, వాతావరణ, తేమ పరిస్దితులను నియంత్రించేందుకు సెన్సార్ల వినియోగం, జిపియస్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం, ఆకాశమార్గాన ఫోటోలు, మ్యాప్‌లను రూపొందించడం వంటి కార్యక్రమాలతో ఖచ్చిత వ్యవసాయ పద్ధతులతో లాభదాయకమైన, సమర్ధవంతమైన, భద్రమైన పర్యావరణహిత వ్యవసాయానికి మార్గదర్శకాలు సిద్దమౌతున్నాయి.
ప్రభుత్వాలు ఆహారకొరతను నివారించి ఆకలి నుండి ప్రజలను విముక్తి చేయడానికి విశాల ప్రాతిపదికన సాంప్రదాయ, పద్ధతులను విడనాడి ఆధునిక పద్ధతుల్లో ముందుకు వెళ్ళడం తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వాలు భావించవలసి ఉంటుంది. సాంప్రదాయ పద్ధతులను అధిగమించి నూతన పద్ధతుల్లో ప్రభుత్వాలు ముందుకు వెళితే ఆకలిని అధిగమించడం అంత కష్టమేమీకాదనే భావన ఉంది. దీని కొరకు ప్రభుత్వాలు తమ విధాన నిర్ణయాల్లో మార్పులు చేసుకోవలసి ఉంటుంది. అవి
1. ఆహార భద్రతను సాధించడానికి దిగుమతులపై ఎక్కువ ఆధారపడకూడదు.
2. ఆధునిక సమాజాన్ని శాసిస్తున్న అంతర్జాల ఉత్పాదకాల ఎగుమతి, ఐపి అడ్రస్సుల ద్వారా నూతన పరిష్కారాల సాధనకు (సొల్యూషన్స్)కు కృషి జరగాలి.
3. నూతన ఆవిష్కరణల ద్వారా జ్ఞాన సముపార్జన లక్ష్యంగా ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి.
ఆకలి, ఆహారలేమి, దారిద్య్ర రహిత సమాజం కొరకు కలలు కనే వారు విజయంవైపు పైన చెప్పిన విధానాల ద్వారా ముందుకువెళితే ఆకాశమే హద్దుగా ప్రగతి దారుల వైపు పయనించవచ్చు. అందుకొరకు అధిగమించవలసిన సమస్యలపై అగ్రిక్లినిక్ మాసపత్రిక ఒక విహంగ వీక్షణాన్ని ముందుంచుతుంది. ముందుగా...
వ్యవసాయ రంగం - ఎదుర్కొంటున్న సవాళ్ళు :
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాల నేపధ్యంలో చూసినప్పుడు ఆహార భద్రతపై సర్వత్రా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దారిద్య్రం తాండవిస్తూ ఉత్పాదనా రంగం సమృద్ధి కొరవడి, వ్యవస్థీకృత లోపాలతో వ్యవసాయ రంగం కుదేలవుతున్న స్థితి.
వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న నాలుగు ప్రధాన సవాళ్ళను అధిగమించేందుకు భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు, సహజ వనరుల పెంపుకు, వాతావరణ పరిస్థితులను అధిగమించి ఉత్పాదనను పెంచేందుకు అవరోధంగా ఉన్న సమస్యలపై ఇప్పుడు మనం చర్చించుకుందాం. అదేసమయంలో ఆహారాన్ని దుబారా చేస్తున్న పరిస్థితులపై కూడా దృష్టి సారించాలి. అక్టోబరు 16వ తేదీన జరిగిన ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా కూడా ప్రపంచ ఆహార సంస్థ ఈ ఆహార దుబారా పైనే ప్రధానంగా దృష్టిని సారించి ఈసారి కార్యక్రమాలను నిర్వహించడం విశేషం.
విస్పోటనంలా పెరుగుతున్న జనాభా - ముంచుకొస్తున్న ముప్పు :
సమీప భవిష్యత్‌లో ప్రపంచ జనాభా 33 శాతానికి అంటే 2050 నాటికి 10 బిలియన్లకు చేరుకోనున్నది. 2017 అక్టోబరు నాటికి 7.6 బిలియన్లు ఉన్న జనాభా శరవేగంగా పెరుగుతుంది. ఇది అధికారిక అంచనాల ప్రకారం మాత్రమే. అనధికార అంచనాల ప్రకారం 16.5 బిలియన్లకు చేరుకోనున్నది. జనాభా ఈ రకంగా పెరిగిపోవడం వల్ల ఆహారానికి పెనుడిమాండ్ కలుగుతుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. దాని ఫలితంగా అత్యధికంగా మాంసపు ఆహారానికి, పోషక ఆహారానికి డిమాండ్ అధికమైంది. సాధారణ జనాభా రేటుతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ అధికమౌతుంది. పౌరుల ఆదాయాల శాతం కూడా పెరుగుతుండడంతో డిమాండ్ మరింత ఎక్కువైంది.
పట్టణీకరణ ప్రభావం :
ప్రపంచీకరణ వల్ల పట్టణీకరణ వేగం పెరుగుతుంది. 2050 సంవత్సరానికి పట్టణీకరణ వల్ల 2.04 బిలియన్ల ప్రజలు వలసవచ్చే అవకాశం బలపడుతుంది. దీనితో మౌలిక సౌకర్యాల అభివృద్ధి, మార్కెట్ అనుబంధంతో కూడిన వ్యాపార సరళి పెరిగిపోయి, త్వరగా పాడైపోయే ఆహార పదార్థాల నిల్వ అవసరాలు పెరిగిపోయి, వాణిజ్య సరళి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
ఆదాయం గణనీయంగా పెరిగిపోతుండడంతో జంతుమాంసానికి, ప్రక్రియాత్మక ఆహారానికి డిమాండ్ పెరిగింది. మాంసాహార విషయానికొస్తే ప్రతి వ్యక్తికి తలసరి 45.3 కిలోల ఉత్పాదన 2030 నాటికి అవసరం ఏర్పడుతుంది. ఈ తలసరి 1997-99 లెక్కల ప్రకారం కేవలం 36.4 కిలోలు మాత్రమే.
అధిక పోషకాలతో కూడిన మాంసాహారం, ప్రోసెస్డ్ ఆహారం తీసుకోవడం వల్ల ఏర్పడే ఇబ్బందులు సైతం ఇక్కడ మనం గమనించాలి. చక్కెర వ్యాధి, బాల్యంలో అధిక బరువుతో నూతన తరం సతమతం కావడం వంటి సమస్యలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో అధికమౌతున్నప్పటికీ, వెనుకబడిన దేశాల్లో సంపన్నులు, మధ్యతరగతి ప్రజలు ఈ సమస్యలకు అతీతంగా లేరు.
మాంసాన్ని అధికంగా ఉత్పత్తి చేయాల్సి రావడంతో పర్యావరణం గతి తప్పుతుంది. ప్రపంచంలోని మొత్తం నీటి వినియోగంలో నాలుగు శాతాన్ని పశువులు, జంతువుల పెంపకానికి వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల మానవ తప్పిదానికి 18 శాతం గ్రీన్హౌస్ వాయువులను ప్రపంచ ప్రజలు భరించాల్సివస్తుంది. ఏది ఏమైనా మామూలు పరిస్థితులను మాత్రమే అవగాహన చేసుకున్న 2050 నాటికి 70 శాతం అధిక ఆహారాన్ని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడిందని ప్రపంచ ఆహార సంస్థ ఎఫ్.ఎ.ఒ నివేదిక స్పష్టం చేస్తుంది.
యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్పత్తిని ద్విగుణీకృతం చేసినా, ప్రపంచ జనాభా పెరిగినంత వేగంగా ఆహార భద్రతా కార్యక్రమం సమకూరడంలేదని ఆవేదన వ్యక్తమవుతుంది. వ్యవసాయ రంగం నుండి అనేక మంది నిష్క్రమించడం, సంక్షోభాన్ని అధిగమించలేక గ్రామాలను ప్రజలు విడిచి వెళ్ళడం, ఆ రంగంలో పనిచేసేవారు తగ్గిపోవడం, సాగు భూమి సడలిపోవడం గ్రామీణ ప్రాంతాలు పనిచేయడానికి స్వచ్చందసంస్థలు సైతం ముందుకు రాకపోవడం వంటి అంశాలు గ్రామ ప్రగతికి, ఆహార ఉత్పత్తికి, ఆర్థిక అభివృద్ధికి అవరోధంగా మారాయి.
సహజ వనరుల వినియోగం - సత్వర అవసరం :
ప్రపంచంలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎక్కువ శాతం తమ స్వభావాన్ని కోల్పోయి వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటికే 25 శాతం వ్యవసాయ భూమి గణనీయంగా తన సారాన్ని కోల్పోయినట్లు నివేదికలున్నాయి. మరో 44 శాతం దానికంటే కొంచెం తక్కువగానూ కొద్దిగా మెరుగైన స్థితిలోనే వ్యవసాయ యోగ్యంగా ఉన్నాయి. నీటి వనరులు వత్తిడికి గురౌతున్నాయి. ప్రపంచంలోని 40 శాతం మంది గ్రామీణ ప్రజలు ఇప్పటికే తాగు, సాగు నీటి వనరులకు దూరమైనారు. సాగు భూమి చిన్న చిన్న కమతాలుగా కుంచించుకుపోయి ఆధునిక సేద్యానికి అనుకూలంగా లేపోవడంతో దిగుబడుల పరిస్థితి ఆశాజనకంగా లేదు. రోజు రోజుకూ సాగు భూమి వివిధ కారణాలతో తగ్గిపోవడంతో దాని ప్రభావం దిగుబడులలో క్షీణతతోపాటు దారుణమైన గ్రామీణ పేదరికానికి హేతువుగా మారింది.
అస్తవ్యస్తమైన సాగు పద్ధతులతో భూసారం క్రమేణ క్షీణించిపోయి, సాగు భూముల్లో బెట్ట పరిస్థితి ఏర్పడడం, పంట మార్పిడి, పశువుల సహాయాన్ని తీసుకోకపోవడం కూడా భూసార క్షీణతకు కారణమౌతుంది. పంటకు సరిపడా ఎరువులు, రసాయనాలు వినియోగించుకోకుండా మోతాదుకు మించి వాటిని వాడడంతో రోజు రోజుకూ సారం క్షీణిస్తూ వస్తుంది. వ్యవసాయ, సాగు సమస్యలతో 80 శాతం భూమి డి-ఫారెస్టేషన్కు గురౌతుంది. ప్రపంచంలో నీటి వనరుల వినియోగం గణనీయంగా పెంచుకోగలిగినప్పటికీ పెరుగుతున్న జనాభా అవసరాలకు, భద్రతకు ఇంకా కొరత ఏర్పడే ఉంది. 2050 వరకు ఒక ట్రిలియన్ డాలర్ల మొత్తాన్ని నీటి యాజమాన్యం వరకు అభివృద్ధి చెందిన దేశాలతో సహా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడవలసి ఉంది.
దూరదృష్టి, ప్రణాళికా బద్ధమైన సాగు పద్ధతులు లేక ఆహార ఉత్పత్తి అనుకున్నంత రీతిలో సాగడం లేదు. భూ యాజమాన్య పద్ధతులు సక్రమంగా లేకపోవడంతో పేదరికం, భూపంపిణీ సక్రమంగా జరుగకపోవడంతో ఆహార రంగం అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. 160 బిలియన్ డాలర్లను భూసార పరిరక్షణ కొరకు, తద్వారా ఆహార నియంత్రణ కొరకు రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది.
భూమిని పదిలం చేసుకునే మార్గాలు :
1. కుంచించుకుపోతున్న అడవులను పరిరక్షించుకోలేకపోవడం
2. విచక్షణారహితంగా అడవులను నరికేయడం
3. పంట మార్పిడి పద్ధతులు లేకపోవడం
4. అస్థిరమైన క్షామ పరిస్థితులు
5. విచక్షణారహితంగా ఎరువులు, రసాయనాల వినియోగం
అస్తవ్యస్థమైన వాతావరణ పరిస్థితులు :
మానవ తప్పిదాల వల్ల గ్రీన్హౌస్ వాయువులు ప్రబలి రైతాంగానికి, వాతావరణానికి ఇబ్బందులు కలుగుతున్నాయని 2014 ప్రభుత్వాల ఆంతరంగిక నివేదికలు తెలియచేస్తున్నాయి. గత 50 సం||రాలుగా వ్యవసాయం, అడవుల పెంపకం మరియు ఇతర రకాలుగా భూవినియోగం 2 రెట్లు పెరిగాయి. వ్యవసాయం గాలిలో నైట్రస్ఆక్సైడ్ను, మెథానే శాతాన్ని ఇప్పటికే విస్తరింపచేస్తుండగా 2050 నాటికి దాని ప్రభావం ఇంకా విపరీతంగా ఉండవచ్చునని నివేదికలు తెలుపుతున్నాయి. వాతావరణ పరిస్థితులు వివిధ కారణాలతో వ్యవసాయాన్ని నిర్వీర్యం చేయడంతో కరువు పరిస్థితులు లేదా వరదలకు దారితీస్తుండడంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. అదే విధంగా విపరీతమైన వేడిమితో పంటల పరిస్థితి క్షీణించి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయినట్లు ఎఫ్ఎఓ-2016 నివేదిక తెలుపుతుంది. పర్యావరణ పరిస్ధితుల్లో తేడాలు, భూమిపై ఉన్న సహజ వాతావరణాన్ని ప్రభావం చూపడం, భూగర్భజలాల మట్టాలు గణనీయంగా పడిపోవడం, భూసార క్షీణత వెరసి పంటల దిగుబడుల క్షీణతకు కారణభూతమౌతున్నాయి.
వై.వి. నరసింహారావు, అసోసియేట్ ఎడిటర్