కొర్ర పంటను తేలిక పాటి ఎర్ర చల్కా నేలల్లో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సాగు చేసుకుని అధిక దిగుబడులు సాధించవచ్చు. కొర్రల శాస్త్రీయ నామం సెటేరియాయిటాలికా, దీన్ని ఇంగ్లీషులో ఫాక్స్‌ టైల్‌ మిల్లెట్‌ , హిందీలో కంగ్నీ, కాకుం, రాల అని పిలుస్తారు.  కొర్ర బియ్యం సమతుల్యమైన ఆహారం. 8 శాతం ప్రోటీన్‌ కూడా కలిగి ఉంది. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహవ్యాధి గ్రస్తులకిది మంచి ఆహారం. శరీరంలోని కొలేస్ట్రాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

కొర్రల్లో అధిక పీచు పదార్థం, మాంసకతులు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, భాస్వరంతో విటమిన్లు అధిక పాళ్ళలో  ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహారం. ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, మూత్రం పోసేటప్పుడు మంటగా ఉండటం, ఆకలి మాంద్యం, అతిసారం మెదలగు వ్యాధులకు ఔషధాహారం. మాంసకతులు, ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు చక్కటి ఔషదం. పీచు పదార్ధం అధికంగా ఉండటం వల్ల మలబద్దకాన్ని అరికడుతుంది. గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం, కీళ్లవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినటం మంచిది. 

కొర్రల్లో లభించే పోషకాలు : 

పోషకాలు పరిమాణం
నియాసిన్‌ 0.7 మి.గ్రా.
రిబోప్లోవిన్‌ 0.11 మి.గ్రా.
థయామిన్‌ 0.59 మి.గ్రా.
కెరోటిన్‌ 32 µg
ఐరన్‌ 6.3 మి.గ్రా. 
కాల్షియం 0.03 గ్రా.
ఫాస్ఫరస్‌ 0.29 గ్రా.
ప్రోటీన్‌ 12.3 గ్రా.
ఖనిజాలు 3.3 గ్రా.
పిండి పదార్థాలు 60.6 గ్రా.
పీచు పదార్థం 8.0 గ్రా.
పిండి పదార్థం / పీచు నిష్పత్తి 7.57

 

కొర్రలను ఆహారంలో తీసుకోవటం వల్ల నరాలశక్తి, మానసిక దృఢత్వం, ఆర్థయిటీస్‌, పార్కింసన్‌, మూర్ఛరోగాలనుండి విముక్తి కలుగుతుంది. 

కొర్రలు విలువ ఆధారిత ఉత్పత్తులు

కొర్ర కొబ్బరి అన్నం :

కావలసిన పదార్థాలు :

కొర్ర బియ్యం 100 గ్రా., కొబ్బరి తురుము 100 గ్రా., కొత్తిమీర తరుగు 5 గ్రా., ఉప్పు తగినంత, నెయ్యి 5 మి.లీ.

తయారీ విధానం :

కొర్ర బియ్యం 2 గంటలు నానబెట్టుకుని పొడిపొడిగా అన్నం లాగా వండుకొని వెడల్పాటి పళ్ళెంలో చల్లారిన తరువాత పెట్టుకోవాలి. బాణీలో నెయ్యి వేడి చేసుకుని, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి చేర్చుకొని దోరగా వేయించుకోవాలి. తరువాత  దీనికి కొబ్బరి తురుము చేర్చుకొని 2 నిముషాలు వేగిన తరువాత కొర్ర అన్నం తగినంత ఉప్పు చేర్చుకొని, కొత్తిమీర చల్లుకుంటే, కమ్మని కొర్ర కొబ్బరి అన్నం తయారవుతుంది. 

కొర్ర మామిడి అన్నం 

కావలసిన పదార్థాలు :

కొర్ర బియ్యం 100 గ్రా., మామిడి తురుము 50 గ్రా., ఉప్పు తగినంత, నూనె - 15 మి. లీ., పోపు దినుసులు :ఆవాలు 2.5 గ్రా., శనగప్పు 5 గ్రా., మినపప్పు 5 గ్రా., ఎండుమిర్చి 1, పచ్చిమిర్చి తరుగు 2.5 గ్రా., మెంతులు చిటికెడు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ.

తయారీ విధానం :

కొర్ర బియ్యం 2 గంటలు నానబెట్టుకుని తరువాత అన్నం వండుకొని, వెడల్పాటి పళ్ళెంలో ఆరబెట్టుకోవాలి. బాణాలిలో నూనె పోసుకుని ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, అల్లం తరుగు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపుతో పోపు పెట్టుకిని అందులో మామిడి తురుము వేసుకొని, పచ్చి వాసన పోయేదాకా, మగ్గనివ్వాలి. పోపు చల్లర్చిన తరువాత, కొర్ర అన్నం, తగినంత ఉప్పు చేర్చుకొని, అన్నీ బాగా కలుపుకుంటే కమ్మని కొర్ర మామిడి అన్నం తయారవుతుంది. 

కొర్ర కార్న్‌ అన్నం : 

కావలసిన పదార్థాలు :

కొర్ర బియ్యం 100 గ్రా., ఉడికించి పెట్టుకున్న కార్న్‌ గింజలు 50 గ్రా., నెయ్యి/ నూనె 10 మి.లీ., కొత్తిమీర 5 గ్రా., ఉప్పు తగినంత, పోపు దినుసులు : జీలకర్ర 2.5 గ్రా., మిరియాల పొడ 2.5 గ్రా., పచ్చి మిర్చి తరుగు 2.5 గ్రా., అల్లం తరుగు 2.5 గ్రా., ఉల్లి తరుగు 5 గ్రా., వెల్లుల్లి తరుగు 2.5 గ్రా., కరివేపాకు 1 రెమ్మ.

తయారీ విధానం :

కొర్ర బియ్యం 2 గంటలు నానబెట్టుకుని పొడిపొడిగా వెడల్పాటి పళ్ళెంలో చల్లర్చి పెట్టుకోవాలి. బాణాలిలో నెయ్యి వేడి చేసుకొని, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసుకొని, తిరగమోత బాగా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కార్న్‌, కొర్ర అన్నం, తగినంత ఉప్పు చేర్చుకుని బాగా కలపాలి. దించబోయే ముందు మిరియాల పొడి, కొత్తిమీర చల్లుకుంటే రుచికరమైన కొర్ర కార్న్‌ రేస్‌ తయారవుతుంది. 

కొర్ర రిబ్బన్‌ పకోడీ 

కావలసిన పదార్థాలు 

కొర్ర పిండి 100 గ్రా., శనగ పిండి 10 గ్రా., పుట్నాల పిండి, 10 గ్రా., వాము 2.5 గ్రా., కారం లేక మిరియాల పొడి 5 గ్రా., ఉప్పు తగినంత, నూన వేయించటానికి సరిపడా, వెన్న లేక వేడి నూనె 10  మి.లీ, ఇంగువ చిటికెడు.

తయారీ విధానం :

ఒక గిన్నెలో కొర్రపిండి తీసుకుని, దానికి శనగ పిండి, పుట్నాల పిండి, కారం, ఉప్పు, వాము ఇంగువ, 2 చెంచాల వేడి నూనె వేసుకుని, జంతికల పిండిలాగా కలుపుకోవాలి. బాణాలిలో నూనె వేసుకొని, జంతికల గిద్దలో పకోడిీ చక్రం పెట్టుకొని పకోడీ వత్తుకొని, దోరగా రెండుపైపులా వేపుకుంటే కరకర లాడే కమ్మని కొర్ర రిబ్బన్‌ పకోడీ తయారవుతుంది. 

కొర్ర కట్లెట్‌ :

కావలసిన పదార్థాలు :

కొర్ర పిండి 100 గ్రా., కంద 25 గ్రా., బఠాణీ 25 గ్రా., జీలకర్ర పొడి 5 గ్రా., ధనియాల పొడి 10 గ్రా., వాము 5 గ్రా., మిరియాల పొడి 5 గ్రా., కారం 2.5 గ్రా., కొత్తిమీర తరుగు 10 గ్రా., అల్లం తరుగు 5 గ్రా., జీడి పప్పు 5-10, ఉప్పు తగినంత, నూనె / నెయ్యి కాల్చటానికి సరిపడినంత, నువ్వుల పొడి 100 గ్రా., నిమ్మరసం 5 మి.లీ. 

తయారీ విధానం : 

కంద ముక్కలు, బఠాణీ మెత్తగా ఉడికించుకొని, మెత్తగా చేతితో చిదుముకొని పక్కన పెట్టుకోవాలి. కొర్ర పిండి దోరగా వేయించుకుని, చల్లారిన తర్వాత ఉడకబెట్టుకున్న కంద, బఠాణీ అందులో వేసి మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్ద లేదా అల్లం తురుము, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు,  ఉప్పు నిమ్మరసం, ఒకదాని తరువాత ఒకటి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఈ ఉండాలను కట్‌ లెట్‌గా వత్తుకుని నువ్వుల్లో ముంచి దోసెపెనం మీద రెండు వైపులా కాల్చి, జీడిపప్పుతో అలంకరిస్తే ఎంతో రుచికరమైన కొర్ర కట్‌ లెట్‌ తయారవుతుంది. 

కొర్ర వెజిటబుల్‌ బిర్యానీ/ చికెన్‌ బిర్యానీ :

కావలసిన పదార్థాలు :

కొర్ర 250 గ్రా., ఉల్లిపాయలు 100 గ్రా., క్యారెట్‌ 50 గ్రా., బీన్స్‌ 50 గ్రా., అల్లం వెల్లుల్లి పేస్ట్‌ 10 గ్రా., పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం పొడి 5-10 గ్రా., పచ్చి బఠానీ 50 గ్రా., పచ్చి మిర్చి 10 గ్రా., టమాటా 100 గ్రా., పుదీనా 1 కట్ట, కొత్తిమీర 1 కట్ట, బంగాళ దుంప 50 గ్రా., నిమ్మకాయలు 2, పెరుగు 100 గ్రా., నూనె 500 మి.లీ., గరం మసాలా 5 గ్రా., ధనియాల పొడి 5 గ్రా., జీలకర్ర పొడి 5 గ్రా., బిర్యానీ మసాలా దినుసులు 10 గ్రా., నీళ్ళు ఉడకబెట్టటానికి 750 మి.లీ.

తయారీ విధానం :

కొర్రలని ముందుగా 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. అన్ని కూరగాయలు ముక్కలుగా కోసుకోవాలి. పచ్చి బఠానీ ఉడక బెట్టుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, బంగాళాదుంప, క్యారెట్‌ , బీన్స్‌ని నూనెలో వేయించి తీయాలి. క్యారెట్‌, బీన్స్‌ని తక్కువ వేయించుకోవాలి. బీన్స్‌ కొంచెం పచ్చిగా ఉండాలి. నీళ్ళలో ఉప్పు, నూనె, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకుని నీరు బాగా మరిగిన తరువాత ముందుగా నానబెట్టిన కొర్ర బియ్యాన్ని వేసి, కొద్దిగా పలుకు ఉన్నప్పుడే వార్చుకోవాలి. వార్చిన తరువాత దానిపైన చల్లని నీళ్ళు కొద్దిగా పోసి ప్రక్కన పెట్టాలి. బాణాళిని తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి దానిలో పచ్చి మిర్చి వేసి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. తరువాత టమాటా ముక్కలు వేయాలి. టమాటా వేగిన తరువాత వేయించి తయారుగా ఉన్న కూరగాయలు ఉల్లిపాయలు వేయించినవి సగం తీసుకొని వేయాలి. దీనికి బఠానీ కూడా కలపాలి. తరువాత తయారుగా ఉన్న కొర్ర బియ్యాన్ని ఈ కూర పైన పొరలాగా ఒక వరుస వేయాలి. నిమ్మకాయ రసాన్ని సమానంగా పైన చిన్న మరికొంత గరం మసాలా పొడి చల్లాలి. తరువాత పాలలో కలిపిన ఆహార రంగు సమానంగా చల్లుకోవాలి. మిగిలి ఉన్న ఉల్లిపాయ వేయించి దానిపైన చల్లుకోవాలి. తరువాత తరిగిన కొత్తిమీర, పుదీన వేసుకొని 10 ని. లు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. 10 ని.ల తరువాత మనం కొర్ర బిర్యానీ వేసుకునేటప్పుడు ఒక పక్కన నుండి తీసుయికోవాలి. ఒక పక్క నుండి బాణాలిలోని బిర్యానినీ తీసుకోవడం వల్ల దేనికి అది విడి విడిగా కనిపిస్తుంది.-

రచయిత సమాచారం

డా|| యం. భవ్య మంజరి, డా|| ఆర్‌.వి.టి. బాలాజీ నాయక్‌, డా|| బి. వెంకట రాజ్‌ కుమార్‌, డా|| యం. శ్వేత, డా|| విజయ లక్ష్మి, పి. విజయ కుమార్‌ మరియు యం. మోహన్‌, కృషి విజ్ఞాన కేంద్రం, రుద్రూరు, నిజామాబాద్‌ జిల్లా.