మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. రైతాంగాన్ని అన్ని విధాల అభివృద్ధిపరచేందుకు చిన్నతరహా పరిశ్రమలతోపాటు రైతాంగాన్ని ఆర్థికంగా బలపరచేదిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఇటీవల కాలంలో సహజసిద్దంగా పెరిగే వెదురు పంటపై అనేక పరిశోధనలను గావించి ఇతరదేశాల్లో వెదురుకు ఉన్న ప్రాముఖ్యతతోపాటు వెదురు ద్వారా నూతన అలంకరణ వస్తువులను తయారుచేసేందుకు పరిశ్రమలను ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మిజోరామ్‌, అస్సాం, త్రిపుర రాష్ట్రాల నుండి వెదురును మన రాష్ట్రానికి దిగుబడి చేసుకోవడం జరుగుతుంది. సహజసిద్దంగానే మన రాష్రంలో వెదురు దొరుకుతుంది. దీన్ని వ్యవసాయ పంటగా మార్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ భూముల్లో సాగు చేసేందుకు సిద్దమవుతున్నారు. 1927 చట్టం ప్రకారం వెదురు అటవీ చట్ట పరిధి నుండి సడలించి వ్యవసాయ పంటగా గుర్తించడం జరిగింది. నాటి నుండి వ్యవసాయ భూముల్లో సైతం వెదురు పంటను సాగుచేసుకోవచ్చు. తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా వెదురు సహజంగానే లభించడం ద్వారా ఇక్కడి రైతులు ఈ పంట సాగుపై ఎక్కువ ఆసక్తి కనబరచకపోవడం వల్ల ఈ ప్రాంతంలో వెదురుసాగు అంతగా ప్రాచుర్యంలోకి రాలేకపోయింది. 

తిరిగి వెదురు పంటను ఇక్కడి రైతాంగానికి లాభాల పంటగా చేకూర్చే విధంగా వెదురు పంటను పండించేందుకు ముందుగానే ప్రభుత్వం రూ. 13 కోట్లతో సాగుకు సిద్దమౌతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, అటవీ భూములను గుర్తించి వాటిలో వెదురుసాగు  ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సాగుచేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వెదురు సాగుపై ఆసక్తి కనబరుస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించేందుకు సిద్దంగా ఉంది. రైతుల వద్ద మిగులుభూముల్లో వెదురు పంట సాగుకు ప్రభుత్వం ప్రత్యేక పధకాలను తీసుకురానున్నది. రైతాంగానికి అధిక ఆదాయవనరులను కల్పించాలనే సంకల్పంతో వెదురు పంటను తెలంగాణ వ్యాప్తంగా సాగుచేసేందుకు సిద్దపడుతుంది. వెదురు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయ భూముల్లో పంటను పండించేందుకు జాతీయ వెదురు మిషన్‌ పథకాన్ని పునర్వవ్యవస్తీకరించి రైతులు తమ పంట భూముల్లోని గట్లపై వెదురు సాగు చేసుకుని. వెదురు పంటను అమ్ముకునేందుకు అన్ని అనుమతులను కూడా ప్రభుత్వం సులభతరం చేయనుంది. 

పరిశ్రమల ఏర్పాటు : 

వెదురు పంట ద్వారా అనేక రకాల వస్తువులను తయారు చేసేందుకు పరిశ్రమల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహికులకు ప్రోత్సాహం ఇవ్వనుంది. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వెదురు పరిశ్రమల సంస్థలు, మహీంద్రా కమ్మూనిటీ సభ్యులు, వీూవీజు, యూసఫ్‌గూడ, బాంబోసొసైటీ యాజమాన్యాలతో అవగాహన సదస్సును ఉద్యాన పట్టుపరిశ్రమల సంచాలకులు ఎల్‌. వెంకటరామిరెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్‌కు చెందిన రోహిత్‌ అగర్వాల్‌, అనిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వారిచే పరిశ్రమల అవగాహన కల్పించారు. పరిశ్రమల ఏర్పాటు చేసుకునే విధానంపై ఈ ప్రాంతంలో ఏఏ పరిశ్రమలకు  ఉపయోగంగా ఉంటుందో వివరించారు. వెదురు పరిశ్రమలు తెలంగాణ ప్రాంతంలో 5 రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. 

  1.     అగరబత్తి తయారీ, 
  2.     వెదురు పొడి మరియు చార్కోల్‌ తయారీ
  3.     వెదురు ఫర్నిచర్‌ మరియు అలంకరణ వస్తువుల తయారీ
  4.    వెదురు హస్తకళల తయారీ 
  5. .   హౌసింగ్‌ మరియు ఇంటీరియల్‌ పరిశ్రమలు 

ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటే ఏంతో లాభదాయకంగా ఉంటుందని సూచించారు. వెదురుతో తయారు చేసిన అలంకరణ వస్తువులకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని పెరిగిన నాగరికతకు అనుగుణంగా వెదురు ఉత్పత్తులకు రోజరోజుకూ తరగని డిమాండ్‌ ఉంటుందని తెలిపారు. ఔత్సాహికులు పరిశ్రమల ఏర్పటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందిస్తుందని ఉద్యానవన, పట్టుపరిశ్రమ సంచాలకులు వెంకట్రామిరెడ్డి తెలిపారు. వెదురు సంబంధిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే రైతులు వెదురు సేద్యానికి ముందుకు వస్తారని ఆయన తెలిపారు. 

- ఇ. రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి