బిటి హైబ్రీడ్స్‌ రాకతో పత్తిలో ఆశించే కాయతొలుచు పురుగులైన పొగాకు లద్దె పురుగు వల్ల నష్టం బాగా తగ్గి రైతులకు ఎక్కువ నికర లాభం రావడం జరిగింది. బి.టి పత్తిలో 120 రోజుల వరకు ఎలాంటి కాయతొలుచు పురుగులు రాదు. ఈ మధ్యకాలంలో పత్తిలో గులాబి రంగు పురుగు ఉధృతి ఎక్కువస్థాయిలో ఆశించడం వల్ల పత్తి దిగుబడులు బాగా తగ్గిపోయాయి. ఈ పురుగు సమస్య వల్ల పత్తిలో దిగుబడులు తగ్గడమే కాకుండా పత్తి నాణ్యత బాగా దెబ్బతింటుంది. ఈ గులాబి రంగు పురుగు ఒక్క పత్తి పంట మీదనే ఆశిస్తుంది. అందువల్ల పత్తిలో నష్టం బాగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది రైతు సోదరులు పత్తి పంటకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మొగ్గుచూపుతున్నారు. మరి పత్తికి ప్రత్యామ్నాయ పంటలు గమనించినట్లయితే..

వర్షాధార నల్లరేగడి భూముల్లో : కంది, మినుము, రబీలో శనగ

వర్షాధార తేలికపాటి భూముల్లో : కంది, మినుము, అలసంద

నీటివసతి ఉన్న నల్లరేగడి/తేలికపాటి భూముల్లో : మొక్కజొన్న, మిరప

కంది : 

  • కందికి మార్కెట్‌లో మంచి ధర ఉండడం వల్ల చాలా మంది రైతులు కందిని సాగుచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కందిలో యాజమాన్య పద్ధతులు గమనించినట్లయితే...
  • ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కందిరకాలైన ఎల్‌ఆర్‌జి-52, ఎల్‌ఆర్‌జి-41, మారుతి, ఆశ, పిఆర్‌జి-158 మొదలగు రకాలను ఎంపిక చేసుకోవాలి. 
  • కందిని ఆలస్యంగా సాగుచేయాలంటే సిఓఆర్‌జి-9701 రకాన్ని సాగుచేస్తే కందిలో మంచి దిగుబడులు సాధించవచ్చు. 
  • కందిని సాధారణంగా ఖరీఫ్‌లో జూన్‌-ఆగష్టు వరకు సాగుచేయవచ్చు. కానీ ఆగష్టు మాసం కూడా అయిపోయింది కాబట్టి కందిని ప్రస్తుతం రబీ కందిగా సాగు చేయవచ్చు. అంటే కంది సెప్టెంబరు 15వ తేది నుండి అక్టోబరు 15వ తేదీ వరకు సాగుచేయవచ్చు. 
  • రబీ కందిని సాగుచేయదలచినప్పుడు సాలుకు సాలుకు దూరం తగ్గించి విత్తనం విత్తుకోవలసి ఉంటుంది. రబీ కందిని వర్షాధారంగా సాగుచేస్తున్నప్పుడు సాలుకు సాలుకు 90 సెం.మీ. దూరంలో విత్తనం విత్తుకోవాలి.
  • ఎకరానికి 6 కిలోల విత్తనం రబీ సాగు చేస్తున్న కందికి అవసరం ఉంటుంది. 
  • కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడి మందును పట్టించి విత్తనం ఎదపెట్టుకోవడం వల్ల కందిలో ఆశించే ఎండుతెగులును రాకుండా నివారించవచ్చు.
  • ఎకరానికి 20 కిలోల యూరియాను మరియు 125 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వాడినట్లయితే కంది పంటకు అదనంగా గంధకం అందినట్లు అవుతుంది. దీనివల్ల కందిలో దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంది. 
  • విత్తనం విత్తిన వెంటనే పెండిమిధాలిన్‌ 30 శాతం ఎకరాకు 1.5 లీటర్ల మందును పిచికారి చేసినట్లయితే కలుపు రాకుండా అరికట్టవచ్చు. 

మినుము : 

ప్రస్తుతం మార్కెట్‌లో మినుముకు మంచి ధర ఉండడం వల్ల చాలా మంది రైతులు మినుము పండించడానికి ఇష్టంగా ఉన్నారు. మినుము పంటకు పత్తి పంటకు మంచి ప్రత్యామ్నాయ పంటగా చేయవచ్చు. మినుము పంటను వర్షాధారంగా తేలికపాటి భూముల్లో మరియు బరువు నేలల్లో సాగుచేయవచ్చు. 

మినుములో మేలైన యాజమాన్య పద్ధతులు : 

మినుము పంటలో ప్రధాన సమస్య పల్లాక తెగులు కానీ ఈ మధ్యకాలంలో మినుములో పల్లాకు తెగులు తట్టుకొని మంచి దిగుబడులను ఇచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతుసోదరులందరూ పల్లాకు తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. 

పల్లాకు తెగులు తట్టుకునే రకాలు : 

టిబిజి-104 : పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. గింజ పాలిష్‌ కలిగి ఉంటుంది. పంటకాలం 80-85 రోజులు 

జిబిజి-1 : పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. గింజ పాలిష్‌ కలిగి ఉంటుంది. పంటకాలం 80-85 రోజులు 

 పియు-31 : పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. గింజ సాదాగా ఉంటుంది (మొద్దు మినుముల). పంటకాలం 85 రోజులు 

  • మినుములో విత్తన శుద్ధి కోసం గౌచ్‌ అనే మందును ఒక కిలో విత్తనానికి 5 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. 
  • మినుము పంటను సెప్టెంబరు చివరి వారం నుండి నవంబరు 15 వరకు సాగుచేయవచ్చు.
  • ఎకరానికి 10 కిలోల విత్తనం సరిపోతుంది. 
  • 20 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్ఫేట్‌ ఎరువులను ఎకరంపొలంలో చల్లుకోవాలి. 
  • కలుపు సమస్య ఉన్నట్లయితే విత్తనం విత్తిన వెంటనే పెండిమిథాలిన్‌ 1.5 లీటర్లు మందును పిచికారి చేయాలి. విత్తనం విత్తిన 15-20 రోజులకు ఇమితాజాఫిర్‌ ఎకరాకు 200 మి.లీ. పిచికారి చేయాలి. 

రబీరకాల్లో శనగ : 

శనగను రబీకాలంలో సాగుచేస్తారు కాబట్టి ఖరీఫ్‌లో ఏదైనా తక్కువ రోజులకు వచ్చే పంటలను సాగుచేసుకొని రబీలో శనగసాగు చేసినట్లయితే రైతుకు ఎక్కువ నికర లాభం వచ్చే అవకాశం ఉంది. శనగ వేసే భూముల్లో ఖరీఫ్‌లో కొర్రసాగు చేయడం వల్ల రైతుకు ఎకరానికి రూ. 20 వేలు ఒక్క కొర్ర పంటపై నికర లాభం రావడానికి అవకాశం ఉంది. 

కొర్ర : 

కొర్రలో తక్కువ రోజులకు కోతకు వచ్చే రకాలైన సూర్యనంది ఖరీఫ్‌లో విత్తనం వెదపెట్టుకోవడం వల్ల ఎకరానికి 10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. అంతే కాకుండా పంట 75 రోజులకు కోతకు వస్తుంది. 

  • ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. 
  • ఎకరానికి 25 కిలోల యూరియాను మరియు 50 కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్ఫేట్‌ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 
  • ఎకరాకు దిగుబడి 10 క్వింటాళ్ళు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ధర రూ. 2800-3000 మధ్య ఉంది. దాదాపు రూ. 28000 ఆదాయం వస్తుంది మరి ఖర్చులు పోను (రూ. 5000-6000 ఎకరానికి) రూ. 23000 నికర లాభం రైతుకు ఒక్క కొర్ర మీదనే ఉండవచ్చు.

దిగుబడి    -    10 క్విం

ఆదాయం    -    రూ. 25,000/-

సాగు ఖర్చు    -    రూ. 6000/-

నికర లాభం    -    రూ. 19,000/-

  • ఎవరైతే శనగ భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు వారికి కౌలు డబ్బులు ఈ కొర్ర ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది. 

శనగ : 

  • కొర్ర తరువాత మరలా అదే భూమిలో శనగపైరును సాగుచేయవచ్చు. చాలా మంది రైతులకు శనగ దిగుబడి తగ్గుతుంది అనే అనుమానం ఉంది. కానీ అది నిజంకాదు ఎందుకంటే కొర్ర తరువాత శనగ సాగు విధానంపై డాట్‌సెంటర్‌, ఒంగోలు వారు ప్రదర్శనాక్షేత్రాలు నిర్వహించి నిరూపించడం జరిగింది. 
  • శనగకు కూడా మార్కెట్‌లో మంచి ధర ఉంది కాబట్టి పత్తికి మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పుకోవచ్చు. 
  • పత్తికి ప్రత్యామ్నాయంగా శనగ పంటను సాగు చేస్తే రైతుకు ఎకరానికి ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ ప్రకారం రూ. 38,000 నికరలాభం పొందే అవకాశం ఉంది. 

శనగ పంట దిగుబడి     -     10 క్వి/ఎ

ఆదాయం (ఎకరానికి)    -     రూ. 48,000/-

సాగుఖర్చు  (ఎకరానికి)    -    రూ.19,500/-

నికర లాభం (ఎకరానికి)    -    రూ. 28,500/-

  • ఒకే భూమిలో రైతు రెండు పంటల సరళి పాటించినట్లయితే అంటే కొర్ర తరువాత శనగసాగు చేస్తే రైతుకు రూ.60,000/- ఎకరానికి నికర లాభం వస్తుంది. 

    కొర్ర ద్వారా నికర లాభం (ఎకరానికి)    రూ. 19,000/-

    శనగ ద్వారా నికర లాభం     (ఎకరానికి)    రూ. 19,000/-

    లాభం ఎకరానికి        రూ. 38,000/-

శనగలో మేలైన యాజమాన్య పద్ధతులు : 

  • శనగలో రకాల ఎంపిక అనేది ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌ రైతుకు అందుబాటులో ఉన్న రకాలు

    దేశవాళీ రకాలు :  జెజి-11, ఎన్‌బిఇజి-3, ఎన్‌బిఇజి-49

    కాబూలీ రకాలు :  కెఎకె-2, విహార్‌, ఎమ్‌ఎన్‌కె-1

  • శనగలో ప్రధానమైన సమస్య ఎండుతెగులు మరి ఎండుతెగులు రాకుండా ఒక కిలో విత్తనానికి 10 గ్రా. ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేయాలి. 
  • ఎక్కువ మంది రైతులు దేశవాళీ రకాలు ఎకరానికి 50-55 కిలోలు వాడుతున్నారు. దీనివల్ల రైతుకు పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతుంది. అందువల్ల సిఫార్సు చేసిన విత్తన మోతాదు (35-40 కిలోలు) వాడినట్లయితే సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు.
  • ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ ఆఖరిదుక్కిలో వేయాలి. 

మిరప : 

మిరప పంట కూడా పత్తిని మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పవచ్చు. మిరప పంటను నీటిపారుదల కింద సాగుచేస్తారు. కాబట్టి ఎక్కడైతే నీటి వసతి ఉన్నదో అక్కడ మిరప పంటను ఎంపిక చేసుకోవాలి. 

ఎక్కడైతే నీటి తడులు ఇవ్వడానికి అవకాశం ఉందో అక్కడ మిరప పంటను పత్తికి మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పవచ్చు. ఎందుకంటే మిరపకు మార్కెట్‌లో మంచి ధర లభ్యమవుతుంది. 

  • మార్కెట్‌తో మిరప చాలా రకాలు మరియు హైబ్రీడ్‌ అందుబాటులో ఉన్నాయి. రకాన్ని ఎన్నుకునేటప్పుడు పచ్చిచ మిరప కోసమా లేక ఎండు మిరప కోసమా అన్నది నిర్ణయం తీసుకొని రకాలను ఎంపికచేసుకోవాలి. 
  • మిరప పండించడానికి నల్లరేగడి నేలలు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మరియు గరప నేలలు అనుకూలం
  • ఒక కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌ఎస్‌ 5 మి.మీ. మరియు 3 గ్రా. మాంకోజెబ్‌ విత్తనశుద్ధి చేసుకోవాలి. 
  • 40 రోజుల వయస్సు నారును ఎంపిక చేసుకొని ఆగష్టు, సెప్టెంబరులో వర్షాలు కురిసిన వెంటనే నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. 
  • ఎకరానికి 120 కిలోల నత్రజని, 48 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పొటాష్‌ ఎరువులను పంటకాలంలో వేయాలి. 
  • మిరపలో ఈ మధ్యకాలంలో జెమిని మరియు కుకుంబరు వైరస్‌ తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. వైరస్‌ తెగులును సమర్థవంతంగా అరికట్టడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలను సామూహికంగా పాటించాలి. 
  • మిరపలో పెట్టుబడుల ఖర్చు తగ్గించాలంటే భాస్వరం ఎరువులను పైపాటుగా వేయరాదు.

డా|| జి. రమేష్‌, సైంటిస్టు, డా|| సి.హెచ్‌. వరప్రసాదరావు, సీనియర్‌ సైంటిస్టు, డా|| జి.ఎమ్‌.వి. ప్రసాదరావు, పోగ్రామ్‌ కోఆర్డినేటర్‌,

డాట్‌ సెంటర్‌, దర్శి, ఫోన్‌ : 9440358336