ప్రస్తుత తరుణంలో కూరగాయలపైన విచక్షణా రహితంగా పురుగు మందుల వాడకం ఎక్కువైంది. ఈ పురుగు మందుల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు మనుషుల ఆరోగ్యం కూడా సన్నగిల్లుతుంది. ఈ విధమైన దుష్పభ్రావాలను తగ్గించుటకు కూరగాయలను సేంద్రియ విధానంలో సాగుచేసి మనుషుల ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు.

సస్యరక్షణ-పురుగులు : 

కాండం, కాయ తొలిచే పురుగు : 

పురుగు తొలి దశలో నీమాస్త్రం లేదా 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేయాలి. తరువాత దశలో లేదా పచ్చిమిర్చి వెల్లుల్లి, అల్లం ద్రావణం, నేల బెండ (సైరా అక్యూట) కషాయం పిచికారి చేయాలి. 

దీపపు పురుగులు : 

  • పసుపు రంగు జిగురు పూసిన డబ్బాలను పంట నాటిన 30 రోజుల సమయంలో ఎకరానికి 12 చొప్పున అమర్చుకోవాలి. 
  • 5 శాతం వేపగింజల ద్రావణం లేదా కానుగ గింజల కషాయం లేదా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ద్రావణం లేదా పొగాకు కషాయం (1 కిలో పొగాకు 100 లీటర్ల నీటితో కలిపి) పిచికారి చేయాలి.

కాయ తొలిచే పురుగులు :

  • ఎకరానికి 6-8 పక్షిస్ధావరాలు ఏర్పాటు చేయాలి.
  • ఒక కిలో మెంతుల పిండిని 2 లీ. నీటిలో కలిపి 24 గంటలు పక్కన పెట్టాలి. తరువాత 40 లీ. నీటిని కలిపి పిచికారి చేయాలి. 
  • 4 కిలోల కలబంద 500 మి.లీ. పొగాకు పొడి 20 లీటర్ల నీటిలో కలిపి 3-4 గంటలు 4వ వంతు మాత్రమే మిగిలే వరకు మరగబెట్టాలి. తరువాత చల్లారనివ్వాలి. 50 గ్రా. కుంకుడు కాయల పొడిని కలిపాలి. 100-150 మి.లీ. కషాయాన్ని 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 
  • 400 గ్రా. ఇంగువపొడిని 1 లీటరు నీటితో కలిపి 24 గంటల పాటు ఉంచాలి. తరువాత 16 లీటర్ల నీటిని ఈ మిశ్రమానికి కలిపి ఎకరా విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేస్తే 7 రోజుల్లో 50 శాతం లార్వాలు నివారించబడతాయి. 
  • ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.
  • 5% వేపగింజల ద్రావణం లేదా నేలవేము కషాయం లేదా వాచపత్ర కషాయం పిచికారి చేసి తొలిదశలోని లార్వాలను నివారించవచ్చు.
  • దశపత్ర కషాయం, సీతాఫలం కాయల కషాయం, విషముష్టి ఆకులు లేదా కాయ కషాయం, తుమ్మికూర, తాటాకు కషాయం బాగా పనిచేస్తాయి. పైవాటిలో అందుబాటులో ఉండే ఏ రెండు-మూడింటినైనా పిచికారి చేస్తే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది.
  • ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా గుడ్లను వారం వ్యవధిలో 6 సార్లు విడుదల చేయాలి. 

తెల్లదోమ : 

  • పంట విత్తిన 30 రోజుల సమయంలో ఎకరానికి 8-10 జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను పొలంలో అమర్చాలి.
  • వేప కషాయం లేదా పొగాకు కషాయం (1 లీ. పొగాకు కషాయం 100 లీ. నీటిలో) పిచికారి చేయాలి. 

ఎర్రనల్లి : 

పొగాకు కషాయం పిచికారి చేయాలి. 

మిత్ర కీటకాలు : 

క్రికెట్లు, చీమలు, కందిరీగలు, అక్షింతల పురుగులు

సాధారణ తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు : 

  • 250 గ్రా. మెంతాకు పొడిని 2 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. 
  • 10 శాతం ఆవుమూత్రం 3 సార్లు 10 రోజుల వ్యవధిలో కలిపి పిచికారి చేయాలి. 
  • 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేయాలి. 
  • వాతడంగ (ఎంబిల్‌ మారైబ్స్‌) లేదా వస (అకరస్‌ కిరామస్‌) రెండు సార్లు సాయంత్రంవేళ వేయాలి.

రచయిత సమాచారం

బి. రాంబాబు, ఎం. సురేందర్‌, సేంద్రియ వ్యవసాయ విశ్వ విద్యాలయం, వికారాబాద్‌, ఫోన్‌ : 8008866517