బడి పిల్లలకు శక్తి, పెరుగుదల, రక్షణనిచ్చే ఆహారపదార్థాలు - ప్రాముఖ్యత

బడికి వెళ్లే పిల్లలల్లో శారీరక, మానసిక మరియు సాంఘిక అభివృద్ధి అనేవి వివిధ వయస్సుల వారిలో వివిధ రకాలుగా జరుగుతుంది. శరీరంలో జరిగే మార్పులు మరియు శారీరక అభివృద్ధికి తగ్గట్లుగా వారి ఆహారం విషయంలో చాలా జాగత్త్ర వహించాలి. సాధారణంగా బడికి వెళ్ళే పిల్లలు ఆహారం పట్ల అంత ఆసక్తి కనబరచరు. వారికి ఆటలు, స్నేహితులతో గడపడం మీద ఎక్కువ శద్ధ్ర చూపిస్తారు. కాబట్టి తల్లి తండుల్రు వారికి ఇచ్చే ఆహారంలో విటమిన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు అన్నీ ఉన్నాయో, లేదో చూసుకోవాలి. బడికి వెళ్ళే పిల్లల ఆహార విషయంలో జాగత్త్ర తీసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుంది. చదువు సాఫీగా సాగుతుంది.

శక్తి, పెరుగుదల రక్షణనిచ్చే ఆహార పదార్థాలను రోజువారి ఆహారంలో చేర్చాలి. శక్తినిచ్చే ఆహారపదార్థాలు ధాన్యాలు, దుంపలు, కొవ్వు పదార్థాలు, చక్కెర మరియు బెల్లం పెరుగుదలనిచ్చే ఆహార పదార్థాలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు రక్షణనిచ్చే ఆహార పదార్థాలు ఆకుకూరలు, కాయకూరలు మరియు పండ్లు. ఈ ఆహార పదార్థాల ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవాలి.

పిండిపదార్థాలు మరియు మాంసకృత్తులు :

విద్యార్థుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంపొందిస్తాయి. గాయాలు తగిలినప్పుడు తీసుకునే ఆహార పదార్థాల్లో మాంసకృత్తులు (ప్రొటీన్స్‌) పుష్కలంగా ఉండడం వల్ల గాయాలు కూడా త్వరగా మానతాయి. కోడిగుడ్లు, పప్పుదినుసులు మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాగే పిండిపదార్థాలు రోజు వారి పనులకు కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పదార్థాలు విద్యార్థులకు గ్లూకోజ్‌లాగా పనిచేస్తాయి. చిరుధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటివల్ల ఇవి సమృద్ధిగా లభిస్తాయి.

క్రొవ్వు పదార్థాలు :

కొవ్వు పదార్థాలతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు లోపల ముఖ్యభాగాలైన మూత్ర పిండాలు, గుండె లాంటి వాటికి రక్షణ కవచాలుంటాయి. క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న వారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్న, నెయ్యి, పాలు, పల్లీ నూనె, గింజలు తీసిన వంటనూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. క్రొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.

ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్లు :

ఆకుకూరలు, పండ్లు మరియు కూరగాయలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన జబ్బులను నియంత్రించడానికి మరియు అధిగమించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఆహారంలో విటమిన్‌-ఎ, ఇనుము, విటమిన్‌-సి, ఫోలిక్‌ ఆమ్లం అనే సూక్ష్మపోషకాలు మరియు పీచుపదార్థం, యాంటి ఆక్సిడెంట్లు అనే పోషకేతర ఆహార పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

గుడ్లు :

కోడిగుడ్లు పిల్లలకు ఎంతో ఆరోగ్యప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు చొప్పున కోడిగుడ్లు తినిపిస్తే వారి ఆరోగ్యానికి భరోసా లభించినట్లు అవుతుంది. కోడిగుడ్లులోని పచ్చసొన తినిపిస్తే పిల్లలకు క్రొవ్వు లభిస్తుంది. 100 శాతం పౌష్టికాహారం లభించేది గ్రుడ్డులోనే అన్న విషయం చాలా మందికి తెలియదు. 11 రకాల ఆమ్లాలు గ్రుడ్డులోనే లభిస్తాయి. గ్రుడ్డులోని విటమిన్‌-డి వల్ల ఎముకల వ్యాధిని నివారించవచ్చు. చర్మ సంబంధ వ్యాధులను తగ్గించుకోవచ్చు.

మినరల్స్‌ :

మినరల్స్‌ తక్కువగా ఉండడంతో విద్యార్థుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల నిలిచిపోతుంది. రక్తస్రావం త్వరగా అదుపులోకి రాదు. నాడీ వ్యవస్థలో చైతన్యం కోల్పోతుంది. కండరాలు పనిచేయవు. జీవక్రియ మెతకబడుతుంది. అలాగే ఐరన్‌ ఉండే ధాతువులు రక్తంలో తక్కువైనా ప్రమాదమే. రక్తాన్ని ఆక్సిజన్‌తో వివిధ భాగాలకు చేరవేయడానికి ఐరన్‌ కీలకభూమి పోషిస్తుంది. శారీరక మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగ్రుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, కర్జూరం, బాదం, ఖాజూ బాగా తినిపించాలి.

అయోడిన్‌ :

అయోడిన్‌ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్‌ తక్కువైతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. దీంతో విద్యార్థులు చదువుతున్నప్పటికీ వాటిని గుర్తుంచుకోలేకపోతారు. జింక్‌ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు, రొయ్యలు, పండ్లు కూరగాయలతో పాటు బాగా తినిపించాలి. అయోడిన్‌ మరియు ఐరన్‌ కలిసిన ఉప్పు మార్కెట్‌లో లభిస్తుంది.

పాలు :

పాలు శరీరాభివృద్ధికి తోడ్పడతాయి. అలాగే ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిలో కాల్షియం, ఫాస్పరస్‌, విటమిన్‌-డి అనేక పోషక విలువలుంటాయి. పాలలోని కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు తక్కువగా వస్తాయి.

చక్కెర, బెల్లం :

బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తెల్లని చక్కెరలాగా కాకుండా బెల్లంలో ఖనిజాలు మరియు ఐరన్‌ అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన అతిముఖ్య ఖనిజాలను అందించి శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. మరియు అవయవాలు వృద్ధికి సహాయపడుతుంది.

మొలకెత్తిన విత్తనాలు :

మొలకెత్తిన విత్తనాలు తినడం ఎంతో మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు శనగలు, రాగులు, బొబ్బర్లు, పల్లీలు, కర్జూరం, వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారే సరికి మొలకలువస్తాయి. వాటిని ప్రతిరోజు పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్థాలు లభిస్తాయి.

లోపాలు :

ప్రొటీన్లు, క్రొవ్వులు, పిండిపదార్థాలు మరియు విటమిన్ల లోపం వల్ల విద్యార్థుల్లో తొందరగా అలసటరావడం, చదువులో వెనకబడడం, జ్ఞాపకశక్తి తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, ఎప్పుడూ వ్యాధుల బారిన పడడం, దృష్టిలో పాలు రావడం, దంతాలు, ఎముకల సమస్యలు మరియు చురుగ్గా ఉండకపోవడం గమనించడం జరుగుతుంది.

డా|| యం. భవ్య మంజరి, డా|| ఆర్‌.వి.టి. బాలాజీనాయక్‌, బి. క్రాంతి కుమార్‌, పి. విజయకుమార్‌, డా|| బి.వి. రాజ్‌కుమార్‌,

డా|| యం. శ్వేత, కృషీవిజ్ఞానకేంద్రం, రుద్రూరు, ఫోన్‌ : 99896 23830