చెద పురుగు నివారణ

పంటలు పండించే అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎర్రని, తేలిక నేలల్లో ఈ చెదపురుగులు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. వరి మాగాణుల్లో మరియు నల్లని నేలల్లో పండిచినప్పుడు వీటి సమస్య తక్కువ. ఈ పురుగులు సామూహికంగా పుట్టల్లో నివశిస్తాయి. ఇవి ముఖ్యంగా 4 తెగలు 1. రాణి, 2.రాజు, 3. పనిచేసే చెదపురుగులు (సేవకులు), 4. సైనిక చెదపురుగులు (సిపాయిలు)

రాణి మరియు రాజు పురుగులు మొదట రెక్కలు కలిగి ఉంటాయి. ఈ రెక్కల పురుగులు తొలకరి వర్షాలు పడిన వెంటనే పుట్ట నుండి బయటకు వచ్చి నేల మీద కాని గాలిలో కాని సంపర్కం జరుపుకుంటాయి. సంపర్కం జరిగిన తరువాత పురుగుల రెక్కలు రాలిపోతాయి. రెక్కలు రాలిన రాణి పురుగు భూమిలోకి పోయి తరువాత ఒక్క రోజులో సుమారుగా 30 వేల నుండి 80 గుడ్లు పెడుతుంది. ఈ విధంగా అవసరాన్ని బట్టి 7-10 సంవత్సరాల వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లు నుండి పిల్ల పురుగులు 40-50 రోజుల్లోపు బయటికొస్తాయి. పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారడానికి సంవత్సరకాలం పడుతుంది. పనిచేసే చెద పురుగులు తెల్లగా లేక గోధుమ వర్ణం కలిగి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.

సైనిక చెదపురుగులు, పనిచేసే పురుగుల కంటే పెద్దవిగా ఉండి రెక్కలు లేకుండా ఉంటాయి. కొద్ది నేలల్లో పనిచేసే చెదపురుగులు కొత్తగా ఏర్పరచుకున్న నివాసాల నుండి ఆహారం వెదుకులాటలో బయటకు వెళ్ళడం ప్రారంభిస్తాయి. గట్టి దంతాల గల సైనిక చెద పురుగులు నివాసాన్ని కాపాడుతూ ఉంటాయి. చెదపురుగుల నివాసాలు భూమిలోపల అనేక మీటర్లు వ్యాపిస్తాయి. అతికష్టం మీద వీటిని తవ్వివేయవచ్చు. కాని 50 మి.మీ పొడవున్న రాణి పురుగులను నాశనం చేసే వరకు చెదపురుగులు నాశనమయినట్లు భావించరాదు. చెదపురుగు గూళ్ళను బాగా పెరిగిన మట్టి దిబ్బలు మరియు గాలిపోవు గొట్టాల ద్వారా గుర్తించవచ్చు.

నష్టపరచే విధానం :

తేలికపాటి నేలల్లో చెదపురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పనచేసే చెదపురుగులు ఎక్కువ సంఖ్యలో పంట పొలాలను ఆశించి మొక్కల కాండంలోనికి పోయి లోపలి పదార్థాన్ని తింటాయి. అలా తినడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను మట్టితో నింపుతాయి. దీనివల్ల మొక్కలు వడలిపోయి తరువాత ఎండిపోయి చనిపోతాయి. ఇటువంటి మొక్కలను చాలా సులభంగా పీకివేయవచ్చు. ఈ పురుగులు కాయలోనికి కూడా కన్నాలు చేసి గింజలు గింజలు పాడుచేస్తాయి. చెదలు మొక్కల్లోని కణలను తినడం వల్ల వేడి వాతావరణ పరిస్థితుల్లో మొక్కలు త్వరితగతిన కుళ్ళిపోయి త్వరగా అదృశ్యమవుతాయి. అంతేకాకుండా చెదపురుగులు వేరుశనగ వంటి పంటల్లో కాయల ఈనెల మధ్య గల పెంకు పదార్థాన్ని తినేస్తాయి. దీన్నే ''స్కారిఫికే

షన్‌'' అంటారు. దీనివల్ల విత్తనాలకు నేరుగా హానిజరుగదు. కానీ కాయలను ఒక రకం ఆస్పర్జిల్లస్‌ బూజు తెగులుకు గురిచేస్తాయి. ఈ బూజు తెగులు ''అఫ్లోటాక్సిన్‌'' అనే విషపదార్థాన్ని తయారు చేసి విత్తనాలను పనికి రాకుండా చేస్తుంది. అఫ్లోటాక్సిన్‌ ఒక బలమైన క్యాన్సర్‌ కారకం.

చెరుకులో విత్తనపు ముచ్చెలకిరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్థం, మొగ్గలు తినడం వల్ల మొలకశాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తని పదార్ధం తానివేసి కేవలం డొల్లలు మిగులుతాయి.

పండ్లు మరియు అడవి జాతుల మొక్కల బెరడును తింటూ మట్టితో కప్పేస్తాయి. ఇవి ఆశించే చెట్లు గిడసబారిపోతాయి. ఈ పురుగులు ఆశించిన నారుమళ్ళను కూడా వదిలి చనిపోతాయి. వీటి ఉధృతి మెట్ట పంటల్లో మరియు నీటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇసుక నేలల్లో తేమ లేనప్పుడు చెట్లను ఆశిస్తాయి. కాండంపై పొరను తొలచి చెట్లకు హాని కలిగిస్తాయి. నారుమడిలో కూడా మొక్కలను ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి.

నివారణ :

పంట పొలాల గట్లపైన లేక పొలం చుట్టూ ఉన్న చెదపురుగుల పుట్టలను పూర్తిగా తవ్వి రాణి పురుగును వెలికి తీసి చంపాలి. 5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ 50 ఇ.సి మందును లీటరు నీటికి కలిపి సుమారు 15-30 లీటర్ల మందు ద్రావణాన్ని చెద పుట్టల్లో బాగా తడిచేటట్లు పోయాలి. చెరకు నాటేటప్పుడు విత్తన ముచ్చెలను మలాథియాన్‌ లేదా డైమిథోయేట్‌ (లీటరు నీటికి 2.0 మి.లీ. మోతాదులో) కలిపి ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటాలి. ఈ చెదలు చెరకు పంటను ఆశించినప్పుడు ఫిప్రోనిల్‌ గుళిక మందును ఎకరానికి 10 కిలోల చొప్పున వేయాలి.

పండ్ల చెట్లను చెదపురుగులు ఆశించినప్పుడు కాండాన్ని గోనెసంచితో రుద్ది 5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ 50 ఇ.సి మందును లీటరు నీటిలో కలిపి కాండం మీద, మొదళ్లు మీద, చెట్టు చుట్టూ పిచికారి చేయాలి. పాదుల్లో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. వాణిజ్య పంటల్లో చెద పురుగులు ఆశించినప్పుడు, చెదపురుగుల ఉధృతిని అనుసరించి ఫిప్రోనిల్‌ గుళిక మందులను తగిన మోతాదులో భూమిలో వేసి కలియబెట్టాలి.

జి. హారిక, రీసెర్చ్‌ అసోసియేట్‌, డా|| కె. లక్ష్మణ, వై. సంధ్యారాణి, శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం, విజయనగరం