శనగను రబీ సీజన్లో పండిస్తారు. దీన్ని అక్టోబరు నుండి నవంబరు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చును. ఖరిఫ్‌లో కొర్ర పంటను సాగు చేసుకొని, రబీలో శనగను సాగు చేసుకోవటం వల్ల రైతులు అధిక ఆదాయం పొందవచ్చు అని పరిశోధనలో తేలింది.

ఎరువుల యాజమాన్యం :

ఎరువులను భూసార పరీక్షలు చేసుకొని, దాని ప్రకారంగా ఎరువులను వాడుకోవాలి. సాధారణంగా శనగలో 8 కిలోలు నత్రజని, 20 కిలోలు భాస్వరాన్నిచ్చే ఎరువులను ఎకరాకు వేసుకోవాలి. అన్ని ఎరువులు దుక్కిలోనే వేసుకోవాలి. ఎకరాకు యూరియా 18 కిలోలు మరియు 125 కిలోలు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ వేసుకోవాలి లేదా డి. ఎ. పి ఎకరానికి 50 కిలోలు వేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వేసినట్లయితే పంటకు కావలసిన గంధకం కూడా లభిస్తుంది. ఎకరానికి జింక్‌ సల్ఫేటును 20 కిలోలు వేసుకోవాలి.

పురుగులు / తెగుళ్ళు :

1. శనగ పచ్చ పురుగు :

తల్లి పురుగు లేత చిగుళ్ళపై, పూ మొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లని పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన నార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తరువాత దశలో మొగ్గల్ని తొలిచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటుంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. పురుగు తిన్న కాయలకు గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి.

నివారణ :

పంటను సరైన కాలంలో విత్తుకోవాలి. వేసవిలో లోతుగా దుక్కులు దున్నుకున్నట్లయితే భూమిలో కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకుని తింటాయి. చుట్టు ప్రక్కల 4 వరుసల జొన్న పంటను వేయాలి. శనగలో అంతర పంటలుగా ఆవాలు మరియు ధనియాలను 8:2 సాగు చేసుకోవటం వల్ల పరాన్న భుక్కులు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడి పురుగు సహజసిద్ధ నివారణలో తోడ్పడుతుంది. పొలంలో అక్కడక్కడ 50-100 బంతి మొక్కలు నాటుకోవాలి. పైన తెలిపిన విధంగా పురుగును నియంత్రించలేకపోతే క్రిమిసంహార మందులైన ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా రైనాక్సిపైర్‌ 0.2 మి.లీ. లేదా క్వినాల్‌ ఫాస్‌ 2 మి.లీ. లేదా ఇండాక్సాకార్బ్‌ 1 మి.లీ. లేదా స్పైనోసాడ్‌ 0.35 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పూత, పిందె దశల్లో మందులను మార్చి మార్చి పిచికారీ చేయవలెను.

2. పచ్చ రబ్బరు పురుగు :

ఈ పురుగు పైరు తొలి దశలో ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. ఇది మొగ్గ దగ్గర పత్రహరితాన్ని గోకి తిని నష్టం చేకూరుస్తుంది. దీని ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పాలిపోయి రాలిపోతాయి.

నివారణ :

దీని ఉధృతి ఎక్కువైనప్పుడు ఎసిఫేట్‌ 1 గ్రా. లేదా థయోడికార్బ్‌ 1.5గ్రా. లేదా ఇండాక్సాకార్బ్‌ 1మి.లీ. లేదా రైనాక్సిపైర్‌ 0.2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

3. ఎండుతెగులు :

ఈ తెగులు సోకిన మొక్కలు కాడలతోపాటు ముడుచుకుపోయి అక్కడక్కడ గుంపులు, గుంపులుగా చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలుగచేసే శిలీంధ్రం విత్తనం ద్వారా మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది.

నివారణ :

ఈ తెగులను తట్టుకునే రకాలైన ఐసిసివి-2, ఐసిసివి-10, జె.బి-11 మరియు ఐసిసివి-37ను విత్తుకోవాలి. మొక్కల మొదళ్ళు తడిచే విధంగా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ 3గ్రా./లీ. నీటికి కలిపి పోయాలి.

4. మొదలు కుళ్ళు తెగులు :

ఈ తెగులు సోకిన తొలి దశలో కాండల పై తెల్లటి శిలీంధ్ర బీజాలు ఆవగింజల మాదిరిగా కనిపిస్తాయి. మొక్క యొక్క కాండం మొదలుపై నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. దీని ఉధృతి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, అంతగా కుళ్ళని సేంద్రియ పదార్థం నేలలో ఉన్నప్పుడు, నేలపై ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది.

నివారణ :

కుళ్ళని చెత్తని విత్తటానికి ముందు పొలంలో తీసివేసి, పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి. జొన్న మరియు ఇతర దీర్ఘకాలిక పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి.

5. వేరు కుళ్ళు తెగులు :

ఈ తెగులు పూత మరియు కాయ దశల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేర్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతాయి. బెట్ట పరిస్థితులు మరియు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

నివారణ :

శిలీంధ్ర నాశినితో విత్తన శుద్ధి చేసుకోవాలి. సకాలంలో విత్తనాన్ని విత్తుకోవడం వల్ల పంట చివరి దశలో బెట్టకు మరియు అధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా తెగులు తీవ్రతను తగ్గించుకోవచ్చు.

డా|| బి. సుధానంద్‌, ఎ. ప్రేమ్‌ కుమార్‌, వ్యవసాయ అభివృద్ధి ప్రయోగశాల, తిరుపతి, ఫోన్‌: 0877-2244866