పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంది. దేశ జనాభా సుమారు 125 కోట్లు ఉంటే ప్రస్తుత పాల సగటు తలసరి వినియోగం 235 గ్రాములు మాత్రమే కావడం గమనార్హం. న్యూట్రిషనిస్టుల సూచనల ప్రకారం సగటు తలసరి వినియోగం రోజుకు 250 గ్రాముల పైనే ఉండాలి. ప్రస్తుతం దేశంలో పాల దిగుబడి 110 మిలియన్‌ టన్నులు. ఐదు శాతం వద్ధి రేటుతో 2020వ సంవత్సరానికి మిలియన్‌ టన్నుల పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది.

కాబట్టి అధిక పాల దిగుబడికి ఎక్కువ పాలసార కలిగిన శ్రేష్టమైన జాతి పశువులు అవసరం. మనకున్న పశువుల్లో ఎక్కువ శాతం తక్కువ పాలసార ఉన్న నాటి జాతి పశువులు. కాబట్టి వీటిలో అధిక దిగుబడి ఆశించడం అసాధ్యం. దేశవాళి పశువుల స్థానంలో శ్రేష్టమైన జాతుల్ని పెంపొందించుకుని పోషించాల్సిన అవసరం ఉంది. రైతులు సంకర జాతి ఆవులను మరియు ముర్రాజాతి గేదెలను పెంచుకుంటే అధిక పాల దిగుబడితోపాటు ఆర్థికాభివద్ధి సాధించవచ్చు.

అధిక పాల ఉత్పత్తి చేసే ఆవు, గేదె జాతులు :

ల్‌స్టీన్ప్రీజియన్‌ జాతి ఆవు విదేశీ రకాలన్నిటిలో ఎక్కువ పాలు ఇస్తోంది. ఇది రోజుకూ 25 లీటర్ల పాలు ఇస్తాయి.

సంకర జాతి హెచ్‌ఎఫ్‌ ఆవులు రోజుకూ 10-15 లీటర్ల వరకు పాల దిగుబడినిస్తాయి.

జెర్సీ ఆవులు రోజుకూ 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.

సంకర జాతి జెర్సీ ఆవుల్లో 8 నుంచి 10 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది.

ముర్రాజాతి గేదెల సరాసరి పాల దిగుబడి రోజుకూ 8-10 లీటర్లు ఉంటుంది.

సంకర జాతి ముర్రా గేదెలు సగటున రోజుకూ 6-8 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది.

సంకరజాతి పాడితో అధిక పాల లాభాలు :

ప్రజల తలసరి వినియోగానికి కావలసిన పాలు లభించాలంటే సంకర జాతి ఆవుల పెంపకాన్ని చేపట్టాల్సి ఉంటుంది. పాల లభ్యత పెంచడం సంకర జాతి ఆవుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వీటితో తక్కువ సమయంలో ఎక్కవ పాల దిగుబడి సాధించవచ్చు. పొషణలో కొద్దిపాటి మొలకువలు పాటిస్తే పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవచ్చు.

సంకర జాతి ఆవులు రెండున్నర ఏళ్లలోనే మొదటిసారి ఈనుతాయి. 250 రోజుల నుంచి 300 రోజుల వరకు పాలిస్తాయి. 50 నుంచి 100 రోజులు వట్టిపోతాయి. ఈ ఆవులు ఏడాది పొడవునా ఎదుకు వచ్చి తొందరగా చూడి కట్టి ఈనుతాయి. వేసవిలో కూడా పాలు అందుబాటులో ఉంటాయి. సంకరజాతి ఆవులకు తిన్నంత పచ్చిగడ్డి మేపడం అవసరం. ఒక ఎకరంలో పండించిన పచ్చిగడ్డి దాదాపు 12 ఆవులకు వేయవచ్చు.

సంకర జాతి ఆవులు పాడి పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

సంకర జాతి ఆవులు అధిక వేడిని, గాలిలో అధిక తేమను తట్టుకోలేవు. పాకలోకి గాలి విస్తారంగా వీచేందుకు అనుకూలంగా పై కప్పును ఎక్కువ పైకి ఉండేలా చూసుకోవాలి. పాక ఇరుకుగా కాకుండా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. పశు శాలల చుట్టూ పచ్చని చెట్లు ఉంటే మంచిది.

పాడి పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే వాటిని సకాలంలో చూడి కట్టించాలి. ఈనిన తరువాత ఆరోగ్యంగా ఉన్న ఆవు 45-60 రోజుల లోపు ఎదకు వస్తుంది. అలా రాకపోతే పశుసంవర్ధక శాఖ డాక్టర్‌తో వైద్యం చేయించాలి.

పాల దిగుబడిని బట్టి రోజుకు 10 నుంచి 15 కిలోల దాణా ఆహారంగా అందించాలి. సంకర జాతి ఆవులు రోజుకు 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తాయి. 20 లీటర్లు ఇచ్చే ఆవుకు 30 లీటర్లు ఇచ్చే ఆవుకు ఒకే పరిమాణంలో దాణా ఇవ్వకూడదు. ఆవు శరీర బరువును బట్టి రోజుకు 30 నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం తప్పని సరిగా దాణాలో కలిపి ఇవ్వాలి.

మొక్కజొన్నను చొప్పను కత్తిరించి పశువులకు మేపవచ్చు. ఎండిన మొక్కజొన్న చొప్పను ముక్కలుగా కత్తిరించి బెల్లం, నీళ్లు కలిపి పిచికారీ చేసి మేతగా ఉపయోగించవచ్చు. పచ్చిగడ్డి అధికంగా లభించే కాలం మొక్కజొన్న, జొన్న చొప్పను మాగుడు గడ్డిగా తయారు చేసి నిల్వ చేసుకొని పచ్చిగడ్డి దొరకని కాలంలో వాడుకోవచ్చు. దూడ పుట్టగానే ఆర గంటలోపు జున్ను పాలు పట్టాలి. తరువాత మూడు మాసాల వరకు రోజుకు 3 నుంచి 4 లీటర్ల పాలు తాగించడం అవసరం. రెండో మాసం నుంచి పచ్చిగడ్డి, దాణా, తవుడుని అలవాటు చేయాలి.

సంకర జాతి ఆవులు ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికీ మూడుసార్లు ఈనాలి. సంకరజాతి ఆవుల్లో విదేశీ రక్తం 60 శాతం కంటే మించి ఉండటం మంచిది కాదు. హెచ్చుపాలు గల వీర్యాన్ని వాడి మంచి దూడలను ఉత్పత్తి చేసుకుంటూ వాటిలో కనీసం సగం దూడలను పాడి పశువులుగా తయారు చేసుకుంటే పాడి పరిశ్రమ వద్ధి చెంది లాభసాటిగా ఉంటుంది.

ముర్రాజాతి గేదెలతో అధిక పాల సార..

ముర్రాజాతి గేదెలను గ్రామీణ ప్రాంతాల్లో గౌడిగేదెలు అని కూడా పిలుస్తారు.

కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా మన దేశవాళి గేదెల నుంచి గ్రేడీ ముర్రా జాతి దూడలను పొందవచ్చు.

పిండమార్పిడి ప్రక్రియ ద్వారా కూడా పొందవచ్చు.

పూర్తి ముర్రా లక్షణాలు కలిగిన మేలైన గేదెలకు హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల నుంచి తెచ్చుకోవచ్చు.

గేదెల పెంపకంలో కనీసం పూటకు 6-8 లీటర్ల పై బడి పాలు ఇచ్చేవి ఎంపిక చేసుకుంటే లాభాధాయకం.

ముర్రా జాతి గేదెలతో పాటు జాఫ్రాబాది, నీలి, రావి, సూర్తి, నాగపురి మొదలగు గేదెల పోషణ కూడా చేపట్టి అధిక పాల ఉత్పత్తి చేస్తున్నారు.

గేదె పాలలో వెన్న శాతం(7-10 శాతం)తో పోలిస్తే ఆవు పాలలో (4.45 శాతం)అధికం.

లాభాలు :

ముర్రా అంటే మెలివేయబడిన అని అర్థం. వీటి కొమ్ములు మెలి వేయబడి పొట్టిగా ఉండి గట్టిగా లోపలి వైపునకు స్పైరల్‌ ఆకారంలో తిరిగి ఉంటాయి. అందుకే వీటిని ముర్రా అని పిలుస్తారు. దేశంలోని జీవ జాతుల్లో అత్యంత శ్రేష్టమైనది. పాడికి, వెన్న శాతానికి పేరెన్నిక కలిగినది. దీని పుట్టినిల్లు హర్యానా రాష్ట్రం. దేశవాళి గేదె జాతుల నుంచి అధిక పాల దిగుబడిని పొందడానికి వాటిని అప్‌గ్రేడ్‌ చేయడానికి ముర్రా జాతి వీర్యాన్ని దేశమంతటా విరివిగా వినియోగిస్తారు.

దేశవాళి గేదెల కంటే ఎక్కువ పాలు ఇస్తాయి. రోజుకు సుమారు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ (వెన్న శాతం అధికంగా ఉండడం వల్ల, ఎక్కువ కాలం పాడి ఉండడం వల్ల). వీటికి రుతుక్రమం సరిగా ఉంటూ జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈనడంతోపాటు దృఢమైన దూడలనిస్తాయి. దూడ బరువు రోజువారీగా 400-500 గ్రా. పెరుగుతూ త్వరగా ఎదకు వస్తాయి.

గమనించాల్సిన విషయాలు..

ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ముర్రా గేదెలు మన రాష్ట్రంలో బతకలేవనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక మంది రైతులు తెలుసుకున్నారు. ముర్రా గేదెల జన్మ స్థలం ఇతర రాష్ట్రాల్లో అయినా అవి మన దేశానికి చెందినవేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన రాష్ట్రంలోని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయని గమనించాలి. ముర్రా గేదెలు అధిక పాల సారతో ఉండి ఎక్కువ ఖరీదు చేసేవి. వాటి పోషణ, ఆరోగ్యం, యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంది.

పాల దిగుబడికి తీసుకోవలిసిన జాగ్రత్తలు..

పశు పోషణ విషయంలో చాలా మంది రైతులు నేటికీ సాంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణాను అందించ లేకపోతున్నారు. ఫలితంగా దేశవాళీ గేదెలు గరిష్ట స్థాయిలో పాల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించ లేకపోతున్నాయి. పాడి పశువుల నుంచి అధిక పాల దిగుబడిని పొందాలంటే పుష్టికరమైన మేపును అందించాల్సిందే. అంటే వరి గడ్డితో పాటు సమీకృత దాణాను ఇవ్వాలి. అప్పుడే దేశవాళీ గేదెల్లో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చునని చెబుతున్నారు

దాణా ఎలా ఉండాలి?

పాల ఉత్పత్తి సమయంలో, చూడి దశలో, పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి. అంటే పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి. ఆ మిశ్రమాన్నే దాణా అంటారు. ఇందులో జీర్ణమయ్యే మాంసకృత్తులు, పూర్తిగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాణాలో మాంసకత్తులు 16 శాతం, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 70 శాతం ఉండేలా వివిధ దినుసులు, పదార్థాలను కలుపుకోవాలి.

ఎంత ఇవ్వాలి?

సాధారణంగా చాలా మంది రైతులు పశువులకు దాణాగా తౌడును వేస్తుంటారు. సమీకృత దాణా తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ కావడమే దీనికి కారణం. అయితే మాంసకృత్తులు, పోషకాలు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో ఉండే సమీకృత దాణాను అందిస్తే పశువుల్లో పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రెండు లీటర్లకు పైబడి పాలిచ్చే పశువులకు తప్పనిసరిగా సమీకృత దాణాను ఇవ్వాలి. పాలిచ్చే గేదెలైతే ప్రతి రెండు లీటర్లకు కిలో చొప్పున రోజుకు ఏడు కిలోలకు మించకుండా దాణాను అందించాలి. పాలిచ్చే ఆవులకు ప్రతి 2.5 లీటర్లకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి.

తాజాగా ఉండాలి..

పశువులకు అందించే దాణా తాజాగా ఉండాలి. అంటే దానిని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కలుపుకోవాలి. గాలి చొరబడని డబ్బాలు లేదా సంచులలో దాణాను నిల్వ చేసుకోవాలి. దాణా తయారీలో వినియోగించే గింజలను చెక్క ముక్కగా ఆడించాలి. వాటిని ముందుగానే ఆడించి నిల్వ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గింజలపై ఉన్న పొరలు ఊడిపోయి చీడపీడలు సులభంగా ఆశిస్తాయి.

ఏమిజాగ్రత్తలు తీసుకోవాలి?

దాణాను తయారు చేసేటప్పుడు పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా చూసుకోవాలి. ముఖ్యంగా తక్కువ పరిమాణంలో వాడే ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాలో కలిపేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే దాన్ని దాణాలో కలపకుండా పశువుకు అందించే ఆహారాన్ని బట్టి రోజువారీగా విడిగా ఇవ్వడం మంచిది. దాణా తయారీకి ఉపయోగించే పదార్థాలు బాగా ఎండి, పెళుసుగా ఉండాలి. వాటిలో తేమ 5 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. తేమ ఎక్కువైతే మొక్కజొన్న, వేరు శనగ, సోయా బూజు పడతాయి. అప్పుడు దాణాలో అప్లోటాక్సిన్‌ అనే విష పదార్థం చేరుతుంది. బూజు పట్టిన మొక్కజొన్న గింజలు నల్లగా మారతాయి. అలాంటి వాటిని దాణా తయారీకి ఉపయోగించకూడదు. నాణ్యమైన గింజలనే వాడాలి. వేరుశనగ, సోయా గింజలపై శిలీంద్రాలు (ఫంగస్‌) ఉన్నాయేమో చూసుకోవాలి. ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా విరిచి, అంచులను పరిశీలిస్తే నాణ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయం అర్థమవుతుంది.

పత్తి పిండిని మరీ ఎక్కువగా అంటే 10 శాతానికి మించి వాడకూడదు. ఎందుకంటే దానిలో గోస్పీపోల్‌ అనే విష లక్షణం ఉంటుంది. ఉప్పు కలపని ఖనిజ లవణ మిశ్రమాన్ని కొనడం మంచిది. ఆ తరువాత దానికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. అయొడైజ్డ్‌ఉప్పును వాడడం వల్ల పశువులకు పునరుత్పత్తికి దోహదపడే అయొడిన్‌ అందుతుంది.

ఇలా చేయండి...

100 కిలోల సమీకృత దాణాను తయారు చేసుకోవాలంటే 25-30 కిలోల బియ్యం/గోధుమ తౌడు, 30-40 కిలోల మొక్కజొన్న/జొన్న గింజల పిండి, 20-30 కిలోల వేరుశనగ / తెలగ / పత్తి / కొబ్బరి తెలగ పిండి, కిలో ఉప్పు, రెండు కిలోల ఖనిజ లవణ మిశ్రమంతో పాటు 20 కిలోల వరకూ ఉలవలు / శనగపొట్టు / కందిపొట్టు / కర్రపెండలం పిప్పి అవసరమవుతాయి. లభ్యత, ధరను దష్టిలో ఉంచుకొని అనువైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ధాన్యపు గింజలు పశువుకు శక్తినిస్తాయి. ఎందుకంటే వీటిలో పోషకాలు, మాంసకృత్తులు ఉంటాయి. తౌడు ద్వారా పశువులకు జీర్ణమయ్యే పోషకాలు, మాంసకృత్తులతో పాటు విటమిన్లు, భాస్వరం, పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. పిండి ద్వారా మాంసకత్తులు, అదనపు శక్తి చేకూరుతాయి. దాణాలో తగినంత మొలాసిస్‌ కలిపితే మంచి రుచి వస్తుంది. పశువులకు శక్తి కూడా లభిస్తుంది. ఖనిజ లవణాలు పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంద కిలోల దాణా కోసం 30 కిలోల తౌడు (నూనె తీసిన), 37 కిలోల గింజలు, 22 కిలోల తెలగ పిండి, 8 కిలోల పత్తి పిండి, 2 కిలోల ఖనిజ లవణాలు, కిలో ఉప్పు కలుపుకున్నా సరిపోతుంది.

పశువు కొట్టం.. పరిశుభ్రత

పాడి పశువుల పాలనలో షెడ్డును నిర్మలంగా ఉంచుకోవడం అతి ముఖ్యమైంది. పశువుకు ఎంత మేత వేసి ఎన్ని ఖనిజ లవణాలిచ్చినా ఆశించిన పాల దిగుబడి రాదు. దీనికి ప్రధాన కారణం పశువులను పీడించే పరాన్నజీవులు. పశువులను గోమార్లు, పిడుదులు పీడించి రక్తం పీల్చడంతో పాటు పాకను ఆశ్రయించి ఉండే దోమలు కుట్టి బాధిస్తుంటాయి.

దొడ్డిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ పరాన్న జీవుల బెడదను అరికట్టవచ్చు. కొట్టాలను శుభ్రంగా ఉంచడానికి లాక్టోబ్యాక్టీరియా అద్భుతంగా ఉపయోగపడుతుంది. లాక్టోబ్యాక్టీరియా లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు చొప్పున కలిపి షెడ్డులోపల, బయట కనీసం వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి. దీని వల్ల పశువుల పాకలో దుర్వాసన పోవడమే కాకుండా వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా కూడా అంతరిస్తుంది. కొన్ని మూలికలతోనూ, గోమార్లు, పిడుదుల బాధను వదిలించుకోవచ్చు.

వనమూలికల పొడి : ముడి పసుపు, వేప నూనె, వస ఆంగ్లంలో దీన్ని స్వీట్‌ఫ్లాగ్‌ అంటారు. వీటికి కొబ్బరి చిప్పల బొగ్గును చేర్చి ముద్ద నూరుకోవాలి. ఈ ముద్దను తెల్లటి గుడ్డ లేదా తాటాకు, కొబ్బరాకులో చుట్టి పశువు మెడలో కట్టాలి. దీంతో పశువును గోమార్లు, పిడుదులు బాధించవు. జోరీగలు వంటివి దూరంగా పోతాయి. ప్రధానంగా వర్షకాలంలో దోమలు, ఈగలు, జోరీగల బారి నుంచి కాపాడడమే కాకుండా ఇతర పరాన్నజీవులు, బ్యాక్టీరియా సోకకుండా నిరోధిస్తుంది.

షెడ్డు చుట్టూ పరిసరాలు చిత్తడిగా మారి వర్షాకాలం, శీతాకాలంలో దోమలు, ఈగలు పశువులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ కాలంలో కొట్టం ముందు పిడకలతో పొగవేస్తే దోమలు ఈగలు పారిపోతాయి. ఒక ఇనుప తట్టలో పిడకలు వేసి అగ్గి ముట్టిస్తే నిలకడగా కాలి పొగ వస్తుంది. దీనితో ఈగలు దోమలు కూడా కొట్టం పరిసరాల్లో నిలవకుండా పారిపోతాయి. పిడకలు త్వరగా కాలకుండా ఉండడానికి దాని మీద కొంత పచ్చిపేడ వేసుకోవాలి. అందుబాటులో ఉంటే పిడకల మీద వరిపొట్టు పరిచి.. దాని మీద పచ్చి పేడ పలచగా వేస్తే కుంపటి రాజుకున్నట్లుగా పొగ వెలువడుతూ పిడకలు మరింత నిలకడగా కాలుతాయి. పిడకల పొగ వలన శ్వాసకు ఎలాంటి ఇబ్బంది రాదు.

పశువుల కొట్టం పరిసరాల్లో నిమ్మగడ్డి, తులసి, పుదీనా వంటి ఔషధ మొక్కలు పెంచినా దోమలు, ఇతర కీటకాల నిరోధానికి ఉపయోగపడుతాయి.

డాక్టర్‌.జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప, ఫోన్‌ : 9618499184