ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఉల్లి కూడా ఒకటి. ఉల్లి ఉత్పత్తిలో చైనా తరువాత భారతదేశం రెండో స్థానంలో ఉంది. ఉల్లిగడ్డ శీతాకాలం పంట. అన్ని రకాల భూముల్లో ఉల్లిగడ్డను సాగుచేయవచ్చు. మద్యస్ధ నల్లరేగడి నేలలు అనుకూలం. ఉల్లి పంట పెరుగుదలకు 12.8-210 సెం. ఉష్ణోగ్రత వాతావరణ అనుకూలం. ఉదజని సూచిక 5.8-6.5 ఉండే నేలలు అనకూలం. ఉల్లి గడ్డ పెరుగుదలకు 15-250 సెం. ఉష్ణోగ్రత వాతావరణం అనుకూలం. పంట మొదటిదశలో తక్కువ ఉష్ణోగ్రత ఉంటే పూలకాడలు వస్తాయి.

సస్యరక్షణ-పురుగులు

తామర పురుగులు :

తల్లి పురుగు 1.5 మి.మీ. పొడవుతో పసుపు మరియు గోధుమ రంగు శరీరం కలిగి రెండు జతల రెక్కలు ఉంటాయి. ఇవి లేత ఆకుల మీద గుడ్లు పెడతాయి. పురుగు జీవితకాలం ఒక నెల సమయంలో పూర్తవుతుంది.

లక్షణాలు :

తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితో పాటుగా ఆకులపై, కాడలపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి.

నివారణ :

సాంస్కృతిక నియంత్రణ

పురుగును తట్టుకునే రకాలను సాగు చేయాలి. పొలాన్ని క్రిమిరహితం చేయాలి. తామర పురుగులకు ఆశ్రయమిచ్చే వెల్లుల్లి మరియు క్యాబేజి, పత్తి, టమాట, దోస మొదలగు పంటలు సాగుచేయరాదు. స్ప్రింక్లర్‌ నీటిపారుదల పద్ధతిని అనుసరించడం వల్ల పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. పంట చుట్టూ రెండు వరుసల మొక్కజొన్న లేదా లోపలి వరుస గోధుమ మరియు బయటి వరుస మొక్కజొన్నలను రక్షక పంటలుగా వేసుకోవాలి.

రసాయన నియంత్రణ :

డైమిథోయేట్‌ 30 శాతం 264 ఎం.ఎల్‌ను 200-400 లీటర్ల నీటిలో ఎకరాకు చొప్పున మందును కలిపి పిచికారి చేయాలి. క్వినాల్‌ఫాస్‌ 25 శాతం 480 ఎం.ఎల్‌ను 200-400 / ఎకరానికి నీటిలో కలిపి మందును పిచికారి చేయాలి. ఆకులకు మందు బాగా పట్టడానికి స్ప్రెడర్‌ లేదా స్టిక్కర్‌ 0.05-1.0 శాతం మందులో కలపాలి.

ఉల్లి (ఈగ) :

తల్లి పురుగు 1.5 మి.మీ. పొడవు గల గుడ్లను నేలలో కాండం దగ్గర మరియు కొన్ని సార్లు లేత ఆకుల మీద పెడతాయి. ఉల్లిగడ్డ గాయాల ద్వారా ఈ లార్వాలు గడ్డలోనికి ప్రవేశిస్తాయి.

లక్షణాలు :

ఉల్లి ఈగ ఉల్లి మొలకల మీద గుడ్లు పెట్టడం వల్ల అవి పొదిగి మొలకలను తింటాయి. తరువాత దశలో లార్వాలు గడ్డ భాగాన్ని ఆశించి నాశనం చేస్తాయి. గడ్డ పెరుగుదల దశలో లార్వాలు ఉల్లిగడ్డలో సొరంగాలు చేసి పంటలు నాశనం చేసి నష్ట పరుస్తాయి.

నివారణ :

మొక్కలను దగ్గర దగ్గరగా నాటకూడదు. పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలి. భూమిని క్రిమి రహితం చేసుకోవాలి. పురుగు ఆశించిన మొక్క భాగాలను నాశనం చేయాలి.

ఎర్రనల్లి :

వెచ్చని పొడి వాతావరణంలో పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. జీవితకాలం ఒక వారంలో పూర్తవుతుంది. తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన గుడ్లు పెడతాయి.

లక్షణాలు :

నల్లులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చుతాయి. ఆకుల పై భాగాన చిన్న చిన్న రంధ్రాలు గమనించవచ్చు. నల్లి వల్ల ఆకులపైన ఏర్పడే తెల్లని గూళ్ళ లాంటివి గమనించవచ్చు. తరువాత దశలో ఆకుల రంగు మారి ఎండిపోయి రాలిపోతాయి.

నివారణ :

ఉల్లి పంట మీద స్వచ్ఛమైన నీటిని పిచికారి చేయడం వల్ల మొక్కలపై ఉన్న నల్లులు తొలగిపోతాయి.

రసాయన నివారణ :

ప్రొపారైట్‌ 1 మి.లీ. / లీటరు నీటిలో కలిపి మందును పిచికారి చేయాలి.

ఫెన్‌పైరాక్సిమేట్‌ 2 మి.లీ./ లీటరు నీటిలో కలిపి మందును పిచికారి చేయాలి.

స్పైరోమైగాసెఫాన్‌ 0.75 మి.లీ. / లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

బల్బ్‌మైట్‌ (నల్లి) :

దీని జీవితకాలం 31-62 రోజుల మధ్య పూర్తవుతుంది. ఈ నల్లి 0.5-0.9 మి.మీ. పొడవు ఉండి నాలుగు జతల కాళ్ళు కలిగి ఉంటుంది.

లక్షణాలు :

నల్లి ఆశించిన ఉల్లిగడ్డ పెరుగుదల ఆగిపోయి కుళ్ళిపోతాయి.

పురుగు సోకిన గడ్డల నుండి పక్కనున్న ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తుంది.

నివారణ :

క్యాబేజి, క్యాలిఫ్లవర్‌ పంటలు సాగు చేసిన పొలంలో వెంటనే ఉల్లిని సాగు చేయరాదు.

ఉల్లి మరియు వెల్లుల్లి పంటలను వెంట వెంటనే పొలంలో సాగు చేయరాదు.

వరద నీటి పారుదల పద్ధతిని అనుసరించడం వల్ల నల్లుల ఉధృతిని తగ్గించవచ్చు.

రసాయన నియంత్రణ :

ప్రొపార్గైట్‌ 1 మి.లీ. / లీటరు నీటిలో కలిపి మందును పిచికారి చేయాలి.

ఫెన్‌పైరాక్సిమేట్‌ 2 మి.లీ. / లీటరుకు లేదా స్పైరోమెగాసెఫాన్‌ 0.75 మి.లీ. / లీటరు నీటిలో కలిపి మందును పిచికారి చేయాలి.

మంగు నల్లి-ఎరోఫిడ్‌ మైట్‌ (నల్లి) :

పిల్ల మరియు పెద్ద పురుగులు రెండు లేత ఆకులను మరియు గడ్డలోపల ఉల్లి పొరలను ఆశిస్తాయి. దీనివల్ల గడ్డ పెరుగుదల ఆగిపోయి, ఆకులు ముడుచుకొని ఎండిపోతాయి.

ఈ నల్లి ద్వారా చాలా వైరస్‌ తెగుళ్ళు వ్యాపిస్తాయి.

నల్లి యొక్క జీవితకాలం 7-9 రోజుల మధ్యలో పూర్తవుతుంది.

గుడ్లు ఆకులను అత్తుకొని ఉండి 3 రోజుల్లో పెరుగుతాయి.

నివారణ :

ఉల్లి మరియు వెల్లుల్లి పంటలను వెంట వెంటనే ఒకే పొలంలో సాగు చేయరాదు.

వరద నీటిపారుదల పద్ధతిని అనుసరించడం వల్ల నల్లుల ఉధృతిని తగ్గించవచ్చు.

ప్రొపార్గైట్‌ 1 మి.లీ. / లీటరుకు లేదా స్పైరోమెగాస్‌ఫాన్‌ 0.75 మి.లీ. / లీటరు నీటిలో కలిపి మందును పిచికారి చేయాలి.

పొగాకు లద్దె పురుగు :

లక్షణాలు :

పిల్ల పురుగులు సాయంత్రం సమయాన మొక్కల అడుగు భాగాన్ని కత్తిరించి నష్టాన్ని కలుగచేస్తాయి.

ఈ పురుగులు లేత మొక్కలను ఆశించడం వల్ల గడ్డ పెరుగుదలను తగ్గించి నష్టాన్ని కలిగిస్తుంది.

నివారణ :

భూమిని క్రిమిరహితం చేయాలి.

అంతర పంటగా అలసంద, దనియాలు, మినుము పంటలను రక్షక పంటలుగా, నాలుగు వరుసల మొక్కజొన్నను ఉల్లి పంట చుట్టూ నాలుగు వరుసలు వేసుకోవాలి.

ఉల్లి పంటను ధాన్యం పంటలైన వరి, గోధుమ పంటలతో పంట మార్పిడి చేయాలి.

ఎకరాకు 20 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.

ఎకరానికి 4-5 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పరచి ప్రతి 2-3 వారాలకు ల్యూరును మార్చాలి.

దీపపు ఎర ఎకరానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి.

డా|| ఎల్‌. రంజిత్‌ కుమార్‌, సైంటిస్టు (ఎంటమాలజీ), కృషీ విజ్ఞాన కేంద్రం, పెరియవరం, ఫోన్‌ : 7032913914