రాబోయే రబీ కాలంలో కూడా సాగునీటి ఎద్దడి దృష్ట్యా వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం కలదు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నీటి పారుదల సౌకర్యాలు కలిగి ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. అధిక దిగుబడులు పొందడానికి ముఖ్యమైనది నారుమడి యాజమాన్యం. కావున రైతులు నారుమడి యాజమాన్యంలో మంచి మెళకువలు పాటించి, అధిక ఉత్పత్తిని సాధించాలి.

నారుమడి తయారీకి 2-3 వారాల ముందు బాగా చివికిన 500 కిలోల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. తరువాత నారుమడిలో నీరుపెట్టి 3-4 సార్లు 10-12 రోజుల కాల వ్యవధిలో దమ్ము చేసి చదును చేయాలి. నారుమడికి నీరు పెట్టడానికి మరియు తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. యాసంగిలో వరి రకాలైన తెలంగాణ సోనా, బతుకమ్మ, కూనారం సన్నాలు, జగిత్యాల సాంబ వంటి రకాలను ఎంపిక చేసుకొని అధిక దిగుబడులను సాధించవచ్చు.

ఒక ఎకరానికి సరిపడే నారు వేయడానికి 5 సెంట్ల (200 చ.సెం.మీ) నారుమడి అవసరమవుతుంది. విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి పంటను కాపాడుకోవడానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. పొడి మందు పద్ధతిలో కిలో విత్తనానికి 3 గ్రా. ల కార్బండిజమ్‌ను కలిపి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి. లీటరు నీటికి 1 గ్రా. కార్బండిజమ్‌ కలిపిన ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 48 గంటలు మండెగట్టాలి. నిద్రావస్థను తొలగించడానికి లీటరు నీటికి 7 మి.లీ. గాఢ నత్రికామ్లం కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 48 గంటలు మండెకట్టాలి. మొలకెత్తిన విత్తనాలను 25 కిలోల చొప్పున చ.మీ. నారుమడిలో పలుచగా చల్లుకోవాలి.

నారుమడిలో 2 కిలోల నత్రజని, కిలో భాస్వరం మరియు ఒక కిలో పొటాష్‌లను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భాస్వరాన్ని రెండు రెట్లు పెంచి వేసుకోవాలి. విత్తనం చల్లే ముందు 2 కిలోల యూరియా, విత్తిన 12-14 రోజుల లోపు మరో 2 కిలోల యూరియాను పైపాటుగా వేయాలి.

యాసంగిలో ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గించడం వల్ల వరి నారు సరిగా ఎదగక ఎర్రబడి చనిపోతుంది. దీన్ని అధిగమించేందుకు వీలుగా వరి మళ్ళపై పలుచని పాలిథీన్‌ షీట్లని సాయంత్రం వేళలో కప్పి ఉంచి ఉదయాన్నే తీసివేయాలి. దీనివల్ల నారు ఆరోగ్యంగా పెరిగి 25-30 రోజులకు నాటు వేయుటకు వీలవుతుంది.

యాసంగిలో చలి ప్రభావం వల్ల నారుమడిలో జింక్‌ లోప లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. జింక్‌ లోప సవరణకు లీటరు నీటికి 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలి.

నారుమడిలో విత్తనం చల్లిన 10 రోజులకు కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు 200 చ.మీ. నారుమడిలో 800 గ్రా. చొప్పున వేయాలి. లేదా విత్తిన 10 రోజులకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా 2 మి.లీ. క్లోరిఫైరిఫాస్‌ పిచికారి చేసి మళ్ళీ 17 రోజుల తరువాత ఒకసారి వీటినే పిచికారి చేయాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు 200 చ.మీ నారుమడిలో 800 గ్రా. కార్భోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేయాలి. పై విధమైన మెళకువలు రైతులు పాటించి రాబోయే రబీకాలంలో వరి పంటలో అధిక దిగుబడులను పొందవచ్చు.

ఎన్‌. నవత, సేద్య విభాగ శాస్త్రవేత్త, బి. మాధవి, సేద్య విజ్ఞాన విభాగ శాస్త్రవేత్త, పి. మధుకర్‌ రావు, సేద్య విభాగశాస్త్రవేత్త,

ఆర్‌. ఉమారెడ్డి, సహపరిశోధనా సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, జగిత్యాల, పొలాస