తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ఇంతింతై వటుడింతైనట్లుగా అంతర్జాతీయ స్థాయిలో విత్తన అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తుంది. గడిచిన 3 సంవత్సరాల నుండే విత్తన అభివృద్ధిలో పేరు ప్రఖ్యాతులను గావించి అంతర్జాతీయ సంస్థల సరసన చేరింది. ఇక్కడ విత్తనానికి మంచి డిమాండ్‌ ఉండడంతో ఖండాంతరాల్లో సైతం తన ప్రతిభను చాటుకుంది. నేడు అంతర్జాతీయ విత్తన సదస్సుకే తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలవబోతోంది. నూతన ఉత్సాహంతో కాలానుగుణంగా విత్తన తయారీలో కావల్సిన విషయ పరిజ్ఞానికి ఈ వేదిక ఎంతగానో దోహదపడనుంది. ఆసియా ఖండంలోనే తెలంగాణకి ఇంతటి సదావకాశం కలగడం అభినందనీయం.

ఈ సదస్సు ద్వారా విత్తనాభివృద్ధికి బాటలు పడనుంది. రైతాంగానికి ఈ వేదిక ద్వారా నూతన ఆలోచనలతో కూడిన వ్యవసాయ విధానాన్ని అందిపుచ్చుకున్నట్లు అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తూ రైతులను డ్రిప్‌ ఇరిగేషన్‌, పాలిహౌస్‌, షేడ్‌ నెట్ల ద్వారా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అయినా పూర్తి స్థాయిలో ఆధునిక విజ్ఞానాన్ని అందుకోవడంలో వెనుకబడే ఉన్నాం. ఇజ్రాయిల్‌ తరహా వ్యవసాయాన్ని అందిస్తే ఇక్కడి ప్రాంత ప్రజలకు అవసరమైన ఆహార ఉత్పత్తి చేసుకోగలం. ఈ ప్రాంత వ్యవసాయ రంగ అభివృద్ధికి మేథోమధనం జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. విత్తనాభివృద్ధి చేపట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నేడు విత్తన అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది.

వివిధ దేశాలలోని సంస్థలకు తెలంగాణ భూభాగం విత్తన అభివృద్ధికి మంచి అనువుగా నిలిచింది. ప్రభుత్వం కంపెనీలకు ఆతిధ్యం కల్పించి విత్తన ఉత్పత్తికి ఎంతో తోడ్పాడును అందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రమాణాలకు అణుగుణంగా తయారు చేయడంలో అనేక మైలు రాళ్ళను దాటుకుంటూ నేడు విత్తన రంగానికే తలమానికంగా నిలిచింది. అపరాలు, కూరగాయ గింజలు, వరి, పత్తి, మిర్చితో పాటు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జొన్న, సోయాబీన్‌, శనగతో పాటు మొక్కజొన్న విత్తనాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ ఆధ్వర్యంలో గోదావరి, లంక గ్రామాల్లో విరివిగా సాగు చేస్తున్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తాలో పెద్ద మొత్తంలో హైబ్రీడ్‌ మొక్కజొన్న విత్తనోత్పత్తిని చేపడుతున్నారు. పలు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న మొక్కజొన్న విత్తన అవసరాలను ఇక్కడి నుండే ఎగుమతి చేపడుతున్నారు. వివిధ దేశాలకు సైతం ఎగుమతి చేయడంతో ఇక్కడి రైతులకు ఆదాయం కూడా ఎక్కువగానే లభిస్తుంది. విత్తన కంపెనీలు సైతం మంచి లాభాలను పొందుతున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసే కంపెనీలకు దేశీయ విత్తన పరిశ్రమ దోహదపడడంతో పలు జిల్లాల్లోని రైతులు విత్తన అభివృద్ధి చేపట్టేందుకు సిద్దమౌతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంగనర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో మొక్కజొన్న పెద్ద మొత్తంలో సాగు చేయబడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా సీతానగర్‌ మండలం మునికోడలి లంక గ్రామాల్లో అంతర్జాతీయ విత్తన ధృవీకరణ కింద విత్తనోత్పత్తి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విత్తనాభివృద్ధికి ఇక్కడి భూములు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ దిగుబడి ఆశాజనకంగా లభించడంతో అంతర్జాతీయ విత్తనోత్పకి వేదికైంది.

తెలంగాణ నుండి అంతర్జాతీయ విత్తన ధృవీకరణ ద్వారా విత్తనాలను ఎగుమతి చేయడం, అదే విధంగా దేశంలో మొట్టమొదటి సారిగా ఆన్‌లైన్‌ విత్తన ధృవీకరణ పద్ధతిని అమలు పరచడం తెలంగాణలో ముఖ్య విత్తన రంగ సంస్థలైన విత్తనాభివృద్ధి సంస్థ, విత్తన ధృవీకరణలో నూతన విధానాల ద్వారా రైతులకు విత్తనాలు అందేలా చేశారని అదే విధంగా ఇతర దేశాల సంస్థలతో భాగస్వామ్య సభ్యులుగా ఉండి ఈస్ట్‌ ఆఫ్రికన్‌, సౌత్‌ ఆసియా దేశాల్లో విత్తన పద్ధతులపై అధ్యయనం చేసి విత్తన నిల్వలో అంతర్జాతీయంగా అంగీకరించిన వినూత్న సాధారణ విత్తన నిల్వ పద్ధతులను కనుగొనడం, విత్తన సాంకేతిక అనుభవం కలిగి ఉండడం ఎంతగానో దోహదపడింది.

రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ విజయాలు :

విత్తన ధృవీకరణ కింద విత్తనోత్పత్తికి 17.50 లక్షల క్వింటాళ్ళ నుండి 22 లక్షల క్వింటాళ్ళ వరకు పెరిగింది. నాలుగు సంవత్సరాలుగా దేశంలో 10 రాష్ట్రాలకు విత్తనాలను సరఫరా చేసి ఆన్‌లైన్‌ విత్తన ధృవీకరణను ప్రవేశపెట్టి దేశంలో ఒక మోడల్‌ విత్తన ధృవీకరణ సంస్థగా పేరుతెచ్చుకుంది. విత్తనోత్పత్తిలో అక్రమాలను అరికట్టి పారదర్శకతతో వేగవంతమైన సేవలు అందిస్తూ, నాణ్యమైన విత్తతనాలు రైతులకు అందించడంలో తెలంగాణ రాష్ట్రం విత్తన ధృవీకరణ సంస్థ 55 సంవత్సరాల భారత విత్తన ధృవీకరణలో నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది. విత్తన ధృవీకరణ కింద 720 టన్నుల వివిధ రకాల విత్తనాలను ఈజిప్టు, సుడాన్‌, ఫిలిప్పీన్స్‌, రష్యా మొదలగు దేశాలకు ఎగుమతి చేసి అంతర్జాతీయ విత్తన వాణిజ్య సంస్థగా పేరుగాంచింది.

అంతర్జాతీయ విత్తన సదస్సు ఆసియా ఖండంలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం 800 మంది అంతర్జాతీయ విత్తన ప్రముఖులు, విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వితత్తనోత్పత్తి 3.27 - 7.48 లక్షల క్వింటాళ్ళకు పెంచి తెలంగాణ విత్తన అవసరాలే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేయడం కార్పోరేషన్‌ ద్వారా వివిధ పంటల హైబ్రీడ్‌ విత్తనోత్పత్తి మొదలుపెట్టి అధునాతన విత్తన ప్రాసెసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల మధ్య విత్తనాల సరఫారను పెంపొందంచడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ విత్తన సంస్థలో అనేక నూతన మార్పులు చేపడుతూ నాణ్యమైన విత్తనాలు అందించడంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ అగ్రభాగాన నిలుస్తూ తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ అనేక విజయాలను తన సొంతం చేసుకుంది.

అంతర్జాతీయ సదస్సుపై ఛీఫ్‌ సెక్రటరీ యస్‌.కె జోష్‌ సమీక్ష :

జూన్‌ 26 నుండి జూలై 3 వరకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ విత్తన సంస్థ 2019 ఏర్పాట్లపై చీఫ్‌ సెక్రటరీ శైలేంద్ర కుమార్‌ జోషి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, అంతర్జాతీయ విత్తన సదస్సు మోడల్‌ ఆఫీసర్‌తో పాటు జారీబ్‌ స్విజ్జర్‌లాండ్‌ అధికారులు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సాంస్కృతిక శాఖ పౌరసంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 9 రోజుల పాటు హైదరాబాదులో జరుగనున్న అంతర్జాతీయ సమావేశ నిర్వహణ ఏర్పాట్లు వివిధ దేశాల, రాష్ట్రాల ప్రతినిధుల వసతి సౌకర్యాలు విత్తన రైతుల మీటింగ్‌ తదితర విషయాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌ సెక్రటరీ జోష్‌ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే మొదటి సారిగా తెలంగాణకు ఈ అరుదైన అవకాశం రావడం ఎంతో గర్వకారణమని విత్తనోత్పత్తిలో విత్తన దృవీకరణకు నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా వివిధ దేశాలకు విత్తనాలు ఎగుమతి చేయడం వల్ల దేశంలోనే ఒక మోడల్‌ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడడం ఎంతో అభినందనీయమని అన్నారు.

ఈ అవకాశాన్ని తెలంగాణకు రావడంలో కృషి చేసిన వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి, విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌ డా|| కేశవులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సదస్సును పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ విధిగా పనిచేయాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. అన్ని శాఖలను సమన్వయ పరచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల నుండి వస్తున్న ప్రతినిధులకు రాష్ట్రం తరుఫున ప్రత్యేక ఆహ్వానాన్ని పలుకుతూ వారికి సదుపాయాలు కల్పించాలని, పోలీస్‌ శాఖ ప్రతినిధులకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రతి రోజూ ఒక గంట చొప్పున భారత్‌, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి 60 దేశాల నుండి 400 మంది వివిధ రాష్ట్రాల నుండి 600 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. వీరితో పాటు విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు విధాన నిర్ణేతలు, విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు.

మారుతున్న ప్రపంచంలో విత్తన సాంకేతికత, నాణ్యత అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సదస్సులో ఒక రోజు 1000 మందితో సీడ్‌ ఫార్ములా మీటింగ్‌, 3 రోజుల పాటు అంతర్జాతీయ విత్తన ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్రిశాస్‌ సంస్థ ద్వారా ఆఫ్రికన్‌ దేశాల నుండి 50 మంది శాస్త్రవేత్తలు సదస్సుకు హాజరవుతున్నట్లు వివరించారు.

వెబ్‌సైట్‌లలో స్టాలు నమోదు :

అంతర్జాతీయ విత్తన సదస్సుకు సంబంధించిన రిజిస్ట్రేషను ప్రక్రియను చేపడుతున్నట్లు సదస్సు నోడల్‌ ఆఫీసర్‌ డా|| కేశవులు వివరించారు. ఆసక్తిగల కంపెనీలు తమ పేర్లను షషష.రవవస్‌వర్‌.శీతీస్త్ర వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. సీడ్‌ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి గల సంస్థలు తమ రిజిస్ట్రేషన్‌ను షషష.ఱర్‌aషశీఅస్త్రతీవరర2019.షశీఎ వెబ్‌సైట్‌లో పొందుపరచుకోవచ్చునని సూచించారు.

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిది, ఫోన్‌ : 9949285691