అకాల వర్షం రైతుల పాలిట శాపంలా మారింది. ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతన్న గుండెలు గుబేలుమనే విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన పంటను కపాడుకునే సమయంలోనే కారు మబ్బులతో కూడిన చీకటి అలుముకొని పంటను ముద్ద చేసింది. కల్లాల్లో ఉన్న పంటతో పాటు మార్కెట్‌ యార్డులో అమ్మకానికి ఉంచిన పంట సైతం అకాల వర్షానికి తడిసిన పంటలు. అరకొర కాలంతో సాగుచేస్తున్న రైతుకు తీరని నష్టం చేకూరింది. ఎంతో కష్టపడి పంటను తెచ్చిన మార్కెట్‌లోని పంట సైతం వర్షం తాకిడికి గురైంది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4 వేల ఎకరాల్లో అకాల వర్షానికి వివిధ రకాల పంటలు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.

పూర్తి స్థాయిలో చేతికి అందిన 700 ఎకరాల్లోని పంటలు వర్షం తాకిడికి నష్టం ఏర్పడినట్లు వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనా వేసింది. కరీంనగర్‌, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కలంలో వరి నాట్లు వేయడం వల్ల పెద్దగా వరి పంటపై నష్టం జరుగలేదు. మొక్కజొన్న పంటలు మాత్రం వర్షం తీవ్రతకు లేత కంకులు ఇరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు.

వాణిజ్య పంటైన మిర్చి కల్లాల్లో తడిసింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాలోని కొన్ని చోట్ల కల్లాల్లోని మిర్చి వర్షపు నీటికి కొట్టుకుపోయింది. మార్కెట్‌ యార్డులలో విక్రయానికి తీసుకువచ్చిన కందులు, వేరుశనగ పంట ఉత్పత్తులు కూడా తడిసిపోయాయి. కంది పంట వర్షం తాకిడికి దెబ్బతిన్నాయిని వ్యవసాయ అధికారులు వెల్లడించారు. చివరి తీతలో ఉన్న పత్తి పంట కూడా అకాల వర్షానికి దెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచనా వేశారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 14 మండలాల్లో 107 గ్రామాల్లోని 2 వేల 77 మంది రైతులకు అకాల వర్షం నష్టాన్ని మిగిల్చాయి. కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు మండలాల్లో 16 గ్రామాల్లో 173.40 హెక్టార్లలో, పెదపల్లి జిల్లాల్లోని 7 మండలాల పరిధిలోని 23 గ్రామాల్లో 67.28 హెక్టార్లలో, వనపర్తి జిల్లాలోని 62 గ్రామాల్లో 1.266.60 హెక్టార్లు పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాధమిక అంచనావేశారు.

వివిధ జిల్లాలో మిర్చికి భారీ నష్టం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని, చండ్రుగొండ మండలం, తిప్పనపల్లి, రాయగూడెం, రవికంపాడు, పోకల గూడెం, వెంకటియా తండా, బెండాల పాడు, చండ్రుగొండ గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల మిర్చి పంట దెబ్బతిన్నదని అధికారులు క్షేత్రస్థాయి పరిశోధనలో వెల్లడించారు. 40 వేల క్వింటాళ్ళ మిర్చి నీటిపాలైంది. పినపాక మండలం, ఏడూళ్ళ బయ్యారం, వెంకట్రావుపేట, చింతలబయ్యారం, సింగిరెడ్డి పల్లి, భూపతిరావు పేట, చర్ల మండలంలోని పలు గ్రామాల్లో మిర్చి పంట దెబ్బతింది. ఇటీవల కాలంలో మిర్చి రేటు బాగా ఉందని ఆశించి ఈ ఏడాది రైతులు మిర్చి పంట పండిస్తే రైతులకు అకాల వర్షం నష్టాన్ని చేకూర్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల వ్యాప్తంగా పూత, పిందె దశలో ఉన్న మామిడి తోటలు సైతం ఈ వర్షం తాకిడికి నష్టపోవాల్సి వచ్చింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని బిజనేపల్ల మండలం మహాదేవుని పేట, పోలేపల్లి గ్రామంలో 20 ఎకరాల్లో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. తెలంగాణ వ్యాప్తంగా ఈ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో ప్రకృతి రైతన్నను వెంటాడుతూనే వస్తుంది. ఈ ఏడాది ఎటువంటి నష్టం జరుగకుండా గట్టెక్కుతాము అనుకుంటున్న రైతన్నలకు నిరాశను కలిగించింది. 700 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. 500 ఎకరాల మొక్కజొన్న, వరి 120 ఎకరాలు, మిగతా పంటలు 80 ఎకరాల్లో వర్షాలకు దెబ్బతిన్నట్లు ఆయా జిల్లా వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదించారని వ్యవసాయ, ఉద్యాన వన శాఖ కార్యదర్శి పార్థసారధి పేర్కొన్నారు. అంతంతమాత్రంగా పండిన పంటలు చేతికి అందే సమయంలోనే ఆకాల వర్షం రైతుకు తీరని నష్టాన్ని చేకూర్చింది.

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధర రైతులకు అందే విధంగా కొనుగోలు జరుగడం లేదు. ప్రస్తుతం తడిచిన మిర్చి కొనాలంటే మరో నాలుగు రోజులపాటు మార్కెట్‌లో ఉండాల్సిందేనని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండలో ఆరబెట్టి అమ్మితే సగానికి సగం ధర కూడా రాదని రైతులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి మిర్చి రైతులను ఆదుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

ఎకరాకి 20 వేల నష్టపరిహారాన్ని అందించాలి :

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన ఎకరానికి రూ. 20 వేలు నష్టపరిహారం చెల్లించాలని తడిసిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర చెల్లించాలని వివిధ రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. మార్కెట్‌ యార్డులలో అమ్మడానికి తెచ్చిన ధాన్యాలను కొనేందుకు వ్యాపారులు, ప్రభుత్వ కొనుగోలు సంస్థలు నిరాకరిస్తున్నాయని దీంతో రైతులు, కౌలు రైతులు పంటలపై పెట్టిన పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు సందర్శించి రైతు సహాయక చర్యలు చేపట్టి నష్ట పరిహారాన్ని బాధిత రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

- ఎ. రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి