గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, విజయాలకు చిహ్నంగా అతికన్నుల పండుగగా హైదరాబాద్‌ నగరంలో ఆగష్టు 15, జనవరి 26వ తేదీల సమయంలో ఉద్యాన ప్రదర్శన ఘనంగా జరిగేది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి, వినూత్న వ్యవసాయ పద్ధతులను, ఉద్యాన వైభవాన్ని గుర్తుకు తెచ్చే విధంగా నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించే ప్రదర్శన కన్నుల పండుగగా జరిగేది. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది జనం ఈ వేదికను ఉపయోగించుకొని వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి దిక్సూచిగా భావించేవారు.

ప్రత్యేక కారణాలతో 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడి ఎవరి ఉనికిని వారు చాటుకోవడానికి పోటీపడుతున్న సమయంలో విజయవాడ, గుంటూరు నగరాల్లో వ్యవసాయ ఉద్యాన ప్రదర్శనలకు అక్కడి ప్రభుత్వం మంచి ప్రోత్సాహాన్ని అందించి ఎక్కడికక్కడ వేదికలు నిర్వహించి రైతులను ఉత్సాహపరచే కార్యక్రమం దిగ్విజయంగా ప్రారంభమైంది. ముఖ్యంగా సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం రైతాంగానికి కొత్త స్పూర్తిగా నిలబడడంతో ఈ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి.

విజయవాడలోని స్వరాజ్య మైదానంలో గత మూడు సంవత్సరాలుగా అత్యంత ఉత్సాహభరితమైన పండ్లు, ఫల ప్రదర్శన ఈ సారి వైభవోపేతంగా కన్నుల పండుగగా జరిగింది. హరితప్రియ, విజయవాడ రోజ్‌ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల మేళ జనవరి 27న ఘనంగా ముగిసింది. 25వ తేదీన రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వెనుకబడిన వర్గాల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావుల నేతృత్వంలో ప్రారంభమైన ఫల, పుష్ప ప్రదర్శనకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

విజయవాడ మేయర్‌ కోనేటి శ్రీదర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గద్దె అనూరాధ, ఎంపి కేసినేని నాని, మహిళా కమీషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, శాసన సభ్యులు గద్దె రాంమోహన్‌ రావు, బోండా ఉమా మహేశ్వరరావు, బోడె ప్రసాద్‌, కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి. లక్ష్మీకాంతం, మున్సిపల్‌ కమీషనర్‌ జె. నావస్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్తొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌, బ్యూటిఫికేషన్‌ కార్పోరేషన్‌ మరియు విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ వారు అండగా నిలిచి హరితప్రియ ప్లాంట్‌ లవర్స్‌ సొసైటీ, రోజ్‌ సొసైటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అగ్రి హర్టికల్చర్‌ షో ఈసారి అత్యద్భుతంగా విజయవంతమైనదని, ప్రభుత్వ సహకారంతో మూడవ వార్షిక గులాబి ప్రదర్శన, సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శన, లక్ష బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని హరిత ప్రియ సొసైటీ అధ్యక్షురాలు తోటకూర అఖిలాండేశ్వరి, రోజ్‌ సొసైటీ అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి అగ్రిక్లినిక్‌ ప్రతినిధికి తెలిపారు.

అమరావతి కేంద్రంగా ప్రతిష్టాకరంగా నిర్మిస్తున్న నూతన రాజధానిని హరిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో నిర్మిస్తున్న ప్రతిష్టాకరమైన ప్రపంచ రాజధాని నిర్మాణంలో హరిత వైభవాన్ని చాటిచెప్పేందుకు ఇంటి చుట్టూ మొక్కలు కాకుండా, మొక్కల మధ్యే ఇళ్ళ నిర్మాణం ధ్యేయంగా ఇటువంటి ప్రదర్శనల ద్వారా తాము ఉద్యమ స్పూర్తిగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా వారు తెలిపారు.

13 జిల్లాల నుండి సుమారు 100కు పైగా ప్రదర్శకులు ఈ షోలో పాల్గొన్నారని వివరించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, రాజధానికి చుట్టు పక్కల గల గ్రామాలు, పట్టణాల్లో పెరటిసాగుకు, అంతస్తుల పై సాగుకు ప్రజలు విస్తారంగా ముందుకు వస్తుండడంతో రసాయన రహిత ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్ల ఉత్పత్తి ప్రాధాన్యత సంతరించుకుందని దాని ఫలితమే ఈ ప్రదర్శన విజయవంతం కావడానికి దోహదపడిందని వారు వివరించారు.

పర్యావరణ పరిరక్షణ కొరకు, పట్టణ వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా మూడేళ్ళుగా నారా చంద్రబాబు నాయుడి గారి నాయకత్వంలో తమకు లభిస్తున్న విశేష ప్రోత్సాహాన్ని మహిళలు ప్రశంసించారు. 150 మంది మహిళా పెరటితోటల పెంపక రైతులు సభ్యులుగా ఉన్న ఈ సొసైటీలకు తోడుగా అమరావతి బోన్సాయి సొసైటీ కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకుంది. దానికి తోడు సేంద్రీయ రైతులు, రైతు సంఘాల, ప్రకృతి వ్యవసాయ రైతులు స్టాల్సు నిర్వహించి ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. పట్టణ వ్యవసాయానికి తోడుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకు వచ్చిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలు పాల్గొన్నాయి. సేంద్రీయ ఉత్పత్తి దారులు, చిరు ధాన్యాల ఉత్పత్తి దారులు, పొదుపు సంఘాలు, డ్వాక్రా మహిళా ఉత్పత్తి దారులు, గో ఆధారిత ఉత్పత్తులు అన్నింటికీ ప్రదర్శనలో చోటు లభించింది.

ప్రదర్శనలో వివిధ రకాల గులాబీలు సందడి చేశాయి. రంగు రంగుల బంతి పూలు, చేమంతుల సోయగాలు, అడుగడుగునా తమ అందాలను ఆరబోశాయి. ఇళ్ళలో పెరిగే ఆక్సిజన్‌ ఇచ్చే మొక్కలు, ఇంటిగోడలపై పాకి పచ్చదనాన్ని పరవశింపచేసే పూ పొదరిళ్ళను సందర్శకులు ఆసక్తికరంగా వీక్షించారు.

ద్వారాలకు అందంగా అల్లుకుపోయి, బాల్కనీలను సుందరీకరించే వేలాడే హ్యాంగింగ్స్‌, ఇంకా అనేక రకాల మొక్కలతో పాటు, ఉద్యాన వికాసానికి అవసరమైన పనిముట్లు, తొట్టెలు, కుండీలు, ఇతర పరికరాలు ప్రదర్శనలో నిలిచాయి. వాటితోపాటు నాలుగురోజుల పాటు సందర్శకులకు మంచి చిరుధాన్యాల ఆహారాన్ని అందచేశారు.

గణతంత్ర దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌ గడ్డపై ఆవిర్భవించిన తొలి శాటిలైట్‌ ఛానల్‌ 24I7 నిర్వహించిన జండా పండుగ విశేషంగా ఆహూతులను ఆకర్షించింది. చానల్‌ చైర్మన్‌ మురళీకృష్ణం రాజు, ఇతర అధినేతలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ప్రదర్శనకు స్ఫూర్తినిచ్చారు. దేశ భక్తి గేయాలతో స్థానిక కళాకారులచే రూపొందించిన వీడియో, ఆడియో క్యాసెట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. చానల్‌ సిఇఓ పర్వతనేని వెంకట కృష్ణ, మహిళా కమీషన్‌ చైర్‌పర్శన్‌ నన్నపనేని రాజకుమారి చేసిన ప్రసంగాలు స్ఫూర్తి కలిగించాయి. ప్రదర్శనలో బాలబాలికలకు డ్రాయింగ్‌, వక్తృత్వపు పోటీలను నిర్వహించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా శనివారం నాడు, ఆదివారం వేలాది మంది ప్రజలు ఈ ప్రదర్శనకు హాజరై స్ఫూర్తిని పొందారు.

వ్యవసాయం పండుగని నిరూపించిన ప్రదర్శన - వెంకట కృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డున తొలిసారిగా విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన 24I7 టివి చానల్‌ సామాజిక బాధ్యతతో నిర్వహించిన రైతు రథం వ్యవసాయ ప్రదర్శన దిగ్విజయంగా జరుగడం పట్ల ఆ సంస్థ కార్యనిర్వాహణాధికారి పర్వతనేని వెంకటకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. జనవరి 24, 25, 26 తేదీల్లో విజయవాడ లబ్బీపేటలోని యస్‌యస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరిగిన రైతు రథం వ్యవసాయ ప్రదర్శన ముగింపు ఉత్సవంలో ఆయన ప్రసంగిస్తూ వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా రైతాంగంలో ఏర్పడిన నిరాశ, నిస్పృహల నుండి వారిని విముక్తి చేసేందుకు, తరువాత తరం వారు ఈ పవిత్రవృత్తిని కొనసాగించేందుకు తాము సామాజిక బాధ్యతగా తమ టివి చానల్‌ వేదికగా ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 13 జిల్లాల నుండి రైతులు, వ్యవసాయ వాణిజ్య వేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొని దిగ్విజయంగా దీన్ని ఫల ప్రదం చేయడం సంతోషమని తెలిపారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో యువ రైతులు పాల్గొనడం, ప్రకృతి, సహజ వ్యవసాయంతో అనుభవాలతో పాటు, ఈ రంగంలో నూతన ఆవిష్కరణలను తోటి రైతులకు వివరించడంలో చూపిన ఉత్సాహాన్ని ఆయన ప్రశంసించారు. ప్రదర్శనలో పాల్గొన్న ఎగ్జిబిటర్లకు చైర్మన్‌ మురళీకృష్ణం రాజు డైరెక్టర్‌ సుమన్‌ జ్ఞాపికలను అందచేసి సత్కరించారు.

జనవరి 24వ తేదీన రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు దేవినేని ఉమామహేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, వెనుకబడిన వర్గాల శాఖా మంత్రి కొల్లు రవీందర్‌, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, తదితరులు హాజరై ప్రదర్శనను ఆసాంతం తిలకించారు. 3 రోజుల పాటు రైతు రథం బ్యూరోచీఫ్‌ సలీమ్‌ షేక్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, సంబంధిత వర్గాల ప్రతినిధులతో వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, సాగు పద్ధతులు, వివిధ పంటల తీరు, తెగుళ్ళు, పురుగుల నివారణ, రసాయన రహిత సేంద్రీయ సహజ వ్యవసాయం తదితర అంశాలపై చర్చా గోష్టులు నిర్వహించారు. వీటికి మంచి స్పందన లభించింది.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌