ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లా కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నాలుగు రోజుల పాటు వ్యవసాయ సాంకేతిక వారోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగినది. ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ కింద జిల్లాలో ఉన్న చిన్న సన్నకారు గిరిజన రైతు సోదరులను ఆహ్వానించి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయం మరియు అనుబంధ శాఖల యొక్క ప్రాముఖ్యతను రైతు సోదరులకు వివరించడం జరిగినది.

ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు 35 శాతం గిరిజన రైతులు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయంలో వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు గాని కొత్త వంగడాలు, సాంకేతికంగా వెనుకబడి ఉండడం వల్ల వారిని అభివద్ధి పధంలోకి తీసుకు రావడం కోసం ఐ సి ఆర్‌ ప్రతి సంవత్సరం ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ కింద ప్రత్యేక నిధులు కేటాయించి జిల్లాలోని గిరిజన రైతులకు కావలసిన నూతన వంగడాలు, వ్యవసాయ యంత్ర పనిముట్లు మరియు పోషకాహార లోపాలను అధిగమించడానికి పెరటి తోటల పెంపకాన్ని, పెరటి కోళ్ల పెంపకం, విలువ ఆదారిత ఉత్పత్తులు తయారీ చేయడం మరియు జీవనోపాధి కోసం మేకల పెంపకం, కుట్టుమిషన్లు అందిచడంతో పాటు వివిధ శిక్షణాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నలుమూలల నుండి ప్రతిరోజు సుమారు 100 మంది గిరిజన రైతులకు వివిధ వ్యవసాయ సాంకేతిక అంశాల పైన శాస్త్రవేత్తలు రోజువారీగా శిక్షణ కార్యక్రమాలను, ప్రదర్శనను మరియు క్షేత్ర ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరిగింది.

దశ్యమాలిక ద్వారా దేశంలో మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన వ్యవసాయ పద్ధతులు మరియు నూతన వంగడాలు, వాటిని వినియోగించే విధానం మరియు రైతు ఆదాయం రెట్టింపు చేయడంలో వాటి అవసరం గురించి శాస్త్రవేత్తలు చాలా క్లుప్తంగా వివరించారు. పంట విత్తిన నాటి నుండి పంట కోసే వరకు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులను గురించి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ గారు వివరించడం జరిగింది. ప్రవీణ్‌ కుమార్‌ గారు మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన రైతులకు ఉచితంగా భూసార పరీక్ష జరిపి నేలకు అనువైనటువంటి పంటలను బట్టి ఎరువుల వాడకాన్ని రైతులకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. భూసార పరీక్షలు మరియు భూసార పరీక్షా పత్రం ద్వారా రైతులు జిల్లా వ్యవసాయ అధికారులు గాని మరియు శాస్త్రవేత్తల యొక్క సలహాలను పాటించి అధిక దిగుబడులు సాధించాలని రైతు సోదరులను మరోసారి కోరడం జరిగినది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గులాబీ రంగు పురుగు యొక్క ఉధతి జిల్లాలో మనం గణనీయంగా తగ్గించడం జరిగినది అని అన్నారు. ముఖ్యంగా జిల్లాలో రైతులందరూ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా వేప నూనె లింగాకర్షక బుట్టలు సామూహికంగా రైతులందరూ వినియోగించడం వల్ల పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధతిని తగ్గించగలిగారు అని అభినందించారు. ముఖ్యంగా రైతులు అందరూ సామూహికంగా వివిధ పంటల్లో శాస్త్రవేత్తలు చెప్పినట్లు సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే పంట నష్ట పోకుండా అధిక దిగుబడులను సాధించవచ్చు అని రైతులకు ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ప్రవీణ్‌ కుమార్‌ గారు తెలియజేయడం జరిగింది.

సాంకేతిక వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజున జిల్లా రైతాంగానికి ఉపయోగపడే నూతన వ్యవసాయ పద్ధతులు మరియు రకాల గురించి పంటల ఉత్పత్తి విభాగ శాస్త్రవేత్త డా|| రఘువీర్‌ గారు వివరించడం జరిగినది. డా|| రఘువీర్‌ గారు రైతులకు దశ్యమాలిక మరియు క్షేత్ర ప్రదర్శనల ద్వారా పత్తి, కందులు, సోయాబీన్‌, పెసర, పసుపు పంటల్లో అధిక దిగుబడులు మరియు కొత్త వంగడాలను వినియోగించే విధానాన్ని రైతులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా కందులు, శనగలు, సోయాబీన్‌ సాగులో దుక్కి దున్ని నుండి పంటకోత వరకు వివిధ యంత్రాలను వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తులను సాధించవచ్చు అని అన్నారు. రైతులు ఖర్చు తగ్గించడం కొరకు యంత్ర పరికరాలతో పాటు శాస్త్రవేత్తలు చెప్పినట్టు సస్యరక్షణ చర్యలు, భూసార పరీక్ష ఫలితాల ప్రకారం ఎరువులను వాడినట్లయితే ఖర్చులు 20-30 శాతం వరకు తగ్గించుకోవచ్చు అని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వేపనూనె, లింగాకర్షక బుట్టలు, వివిధ జిగురు అట్టలు రైతులు వినియోగించడం ఆనందంగా ఉంది అని అన్నారు. రైతులకు కషీ విజ్ఞాన కేంద్రంలో ఉన్న వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలు మరియు ఇతర ప్రాసెసింగ్‌ మిషన్లను చూపించి వాటిని వాడే విధానాన్ని వివరించడం జరిగినది.

సాంకేతిక వారోత్సవాల్లో భాగంగా రెండో రోజున జిల్లాలో పండిస్తున్న ముఖ్యమైన పంటలు పత్తి, కంది, పెసర, శనగలు సోయాబీన్‌లో ఆశించే వివిధ రకాల చీడపీడల గురించి సస్యరక్షణ శాస్త్రవేత్త డా. రమాదేవి గారు రైతులకు వివరించడం జరిగినది. తక్కువ ఖర్చుతో సమగ్ర వ్యవసాయ విధానాలు, సమగ్ర సస్యరక్షణ పాటించినట్లయితే రైతులు లాభం పొందవచ్చు అని దశ్యమాలిక ద్వారా వివరించడం జరిగింది. రైతులకు వివిధ పంటల లోని మిత్ర పురుగులు మరియు చీడపురుగుల గురించి వివరించడం జరిగినది. పంట కోత అనంతరం ధాన్యం నిలువ లో మెలకువలను వివరించడం జరిగినది. ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ ద్వారా లబ్ధి పొందిన గిరిజన రైతులకు వ్యవసాయ యాంత్రికరణ పరికరాల వాడకం దశ్యరూప మాలిక ద్వారా వివరించడం జరిగింది.

సాంకేతిక వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజున రైతులకు ముఖ్యంగా చిరుధాన్యాల సాగు యాజమాన్య పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్త డా|| రఘువీర్‌, డా|| రమాదేవి రైతులకు వివరించడం జరిగినది. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల ఈరోజు ప్రజలు పట్టణ మరియు గ్రామాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీన్ని దష్టిలో ఉంచుకొని ప్రజలు ముఖ్యంగా గిరిజన రైతులు వారి యొక్క సంప్రదాయ ఆహారపు అలవాట్లు అయిన చిరుధాన్యాలు, జొన్నతో చేసిన ఆహారాలను వారి రోజువారి ఆహారంలో తప్పని సరిగా ఉండటం కోసం రైతులకు చిరుధాన్యాల యొక్క విలువ ఆధారిత పదార్థాల తయారీ విధానాలు మరియు వాటికి ఉన్న పోషక విలువల ప్రాముఖ్యతను శాస్త్రవేత్త పోషాద్రి దశ్యరూప మాలికతో పాటు, మిల్లెట్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాల మరియు చిరుధాన్యాలను ప్రాసెస్‌ చేయడానికి ఉపయోగించే యంత్రాన్ని ప్రదర్శనలో రైతులకు చూపించి వినియోగించే విధానాన్ని వివరించడం జరిగినది. శాస్త్రవేత్త డా|| పోషాద్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే మూడు గిరిజన గూడాలలో మిల్లెట్స్‌ను ప్రాసెస్‌ చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసి రైతు సోదరులకు శిక్షణ కార్యక్రమాలను మరియు వివిధ ఆహార పదార్థాలను తయారు చేసే విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. అంతే కాకుండా 2018-19 ఆర్థిక సంవత్సరంలో మరో పది గిరిజన గూడేల్లో ఈ మిల్లెట్స్‌ ప్రాసెస్‌ చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులు వారికున్న భూమిలో కొద్ది భాగంలో చిరుధాన్యాలను పండించి గహ అవసరాలతో పాటు మార్కెట్లో వాటికి ఉన్న విలువను రైతులు వినియోగించుకొని లాభం పొందాలని సూచించారు.

వ్యవసాయ సాంకేతిక వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున గిరిజన రైతులకు ఉద్యాన పంటల సాగు పైన శిక్షణ కార్యక్రమం మరియు వివిధ అధిక దిగుబడిని ఇచ్చే పండ్లు మరియు కూరగాయల మొక్కల ప్రదర్శనను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న సహజ వనరులు ముఖ్యముగా సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం మరియు కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహా సూచనలు వినియోగించుకొని జిల్లాలోని రైతు సోదరులందరూ ఉద్యాన పంటలు సాగు చేసి అధిక దిగుబడి సాధించి లాభాల బాటలో ప్రయాణించాలని ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన కేంద్రం సహాయ సంచాలకులు డా|| ఉమా రెడ్డి గారు కోరారు. జిల్లాలో సాగుకు అనువైన వివిధ ఉద్యాన పంటలు, వాటి రకాలు మరియు యజమాన్య పద్ధ్దతులు పైన కషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా|| సునీల్‌ కుమార్‌ గారు దశ్యరూప మాలిక మరియు క్షేత్ర పరిశోధన ప్రదర్శన ద్వారా రైతులకు వివరించడం జరిగింది. డా|| సునీల్‌ కుమార్‌ గారు మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో వచ్చిన ఆధునిక మెలకువలు అయిన ఎత్తు మోడల పద్ధతిలో సాగు, డిప్‌ సిస్టం ద్వారా నీటిని అందించడం, ఎడ్యుకేషన్‌ ద్వారా ఎరువులను అందించడం, మల్చింగ్‌ పద్ధతిలో నేలలోని తేమ నిల్వ చేయడం మరియు కలుపు నివారణ, టమాటాలో త్రేల్లీస్‌ విధానంలో సాగు చేయడం, కూరగాయ పంటల్లో నాణ్యమైన నారు పెంపకం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగులో వివిధ రకాల సబ్సిడీలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గిరిజన రైతులు సబ్సిడీని వినియోగించుకుని పాలీహౌస్‌లో నిర్మించుకొని తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులను ఉద్యాన పంటల్లో సాధించవచ్చని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వేసవిలో కూరగాయల సాగులో తీసుకోవాల్సిన విలువలను కూడా రైతులకు వివరించడం జరిగినది.

చివరిరోజు కార్యక్రమంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సంఘ సభ్యులు గోవర్ధన్‌ యాదవ్‌ గారు, వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా|| శ్రీధర్‌ మరియు శాస్త్రవేత్తలు డా|| రాజేందర్‌ రెడ్డి, డా|| మోహన్‌ దాస్‌, రాజశేఖర్‌ మరియు జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సుధాంశు, రిటైర్డ్‌ ఏ డి ఏ నర్సింగ్‌, నాబార్డు ఎజిఎం పురోహిథ్‌, మరియు ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త ప్రీతం గౌడ్‌ మరియు రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వై. ప్రవీణ్‌ కుమార్‌, ఎ. పోశాద్రి, ఎం. సునీల్‌ కుమార్‌, జి. శివచరణ్‌, ఎం. రఘువీర్‌, ఎ. రమాదేవి,

కృషి విజ్ఞాన కేంద్రం, రాంనగర్‌, ఆదిలాబాద్‌, ఫోన్‌ : 9989623829