కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడిని నిజం చేస్తూ, గత దశాబ్దకాలానికి పైగా సంఘటితంగా, అంకిత భావంతో సిబ్బంది, యాజమాన్యం అచెంచల కార్యదీక్ష వల్ల ఒక చిన్న మొలకగా ప్రారంభమైన నోవా అగ్రిటెక్‌ ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా విస్తరించి, రోజు రోజుకూ తన ప్రాశస్త్యాన్ని చాటుకుంటున్నదని సంస్థ చైర్మన్‌ ఏలూరి సాంబశివరావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2019 జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా మేడ్చల్‌ సమీపంలోని సింగన్న గూడెం గ్రామంలో కర్మాగార ప్రాంగణంలో ఉత్సాహంగా జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకాలు, ఉపకరణ రంగాల్లో మేటి సంస్థగా ఈ గ్రూపు ఎదగడానికి అనేక దశల్లో చేదోడు వాదోడుగా నిలిచిన అన్ని శ్రేణుల సిబ్బంది, వర్తక వాణిజ్య సంస్థలు, రైతులు, శాస్త్రవేత్తలకు ఆయన హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.

సింగన్నగూడెం గ్రామంలోని కర్మాగార ప్రాంగణంలో అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగిన వేడుకలు, అంతకు ముందు రోజు న్యూ బోయనపల్లిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమాలు ఎంతో శోభను చేకూర్చాయి. వేడుకలను ప్రారంభించిన ఏలూరి గత దశాబ్ద కాలానికి పైగా ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్ల సమయంలో యాజమాన్యానికి మద్ధతుగా నిలిచిన యావత్‌ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం, విశ్వసనీయత నినాదంతో వాణిజ్యంలోకి అడుగుపెట్టిన సంస్థ పేరెన్నిక గన్న, తిరుగులేని ప్రమాణాలతో అటు రైతాంగ మద్ధతు ఇటు డీలర్ల సహకారం, సిబ్బంది అంకితభావంతో ఈ స్థితికి చేరుకోగలగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం వ్యాపార దృష్టితోనే చూడకుండా సంస్థకు జీవనాడిగా నిలిచే రైతుల ఆదరణను పొందగలగడం, సాధారణ విషయం కాదని, అదే సందర్భంలో కుటుంబ సభ్యులందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి సంస్థను అభివృద్ధి పథంలో పయనింపచేయడం విశేషమని సంతోషం వ్యక్తం చేశారు. మునుముందు మరిన్ని విజయాలు సాధించడానికి, సిబ్బంది, యాజమాన్యం మధ్య సుహృద్భావాన్ని పెంపొందించడానికి ఇటువంటి వేడుకలు తోడ్పడతాయని వెల్లడించారు.

గతంలో తాను అనేక సంస్థల్లో కీలకమైన స్థానాల్లో పనిచేసినప్పటికీ, ఈ నాటి వేడుకల అనుబంధం, ఆనందం లభించలేదని నోవా అగ్రిటెక్‌ కంపెనీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏటుకూరి కిరణ్‌ కుమార్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్న అందరికీ, ఆహూతులైన సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

నోవా కుటుంబ సభ్యులు భవిష్యత్‌లో మరింత సదవగాహన, సోదర భావాన్ని నింపుకొని కంపెనీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. గతంలో లభించిన విజయాలతో పొంగిపోకుండా, అనుభవాలను మరింత వినియోగించుకొని ద్విగుణీకృత ఉత్సాహంతో అందరం చేయీ చేయీ కలిపి పనిచేద్దామని సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యెనిగళ్ళ శ్రీకాంత్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఈ వేడుకలో అతిధిలుగా కంపెనీ నోవా అగ్రిసైన్సెస్‌ ఉపాధ్యక్షులు సయ్యద్‌ ఫాజిల్‌ అహ్మద్‌, సాంకేతిక నిర్ధేశకులు నాదెళ్ళ బసంత్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు రవిశంకర్‌ తదితర ప్రముఖులు వేదికను అలంకరించారు. నోవా మానవ వనరుల శాఖ మేనేజర్‌ రాటకొండ కిరణ్‌ అతిధులను, సిబ్బందిని వేడుకలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్‌, షటిల్‌ బాడ్‌మెంటన్‌, వాలిబాల్‌, త్రో బాల్‌, మ్యూజికల్‌ చైర్‌ తదితర క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగిన ఈ కార్యక్రమాలు పాల్గొన్నవారికి నూతన స్ఫూర్తినిచ్చాయి. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయి. - అగ్రిక్లినిక్‌ డెస్క్‌