లిల్లీ పూలను ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకలోని కొన్ని పట్టణాల పరిసరప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఈ పూలను అలంకరణలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

వాతావరణం :

లిల్లీ పూలను వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగుచేసినప్పటికీ మొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి తక్కువ ఉష్ణోగ్రత మరియు మంచి సూర్యరశ్మి అవసరం. వాతావరణంలో హెచ్చుతగ్గులు, అతివేడి, అతిచలి గల ప్రాంతాలు అంతగా అనుకూలం కాదు. అందవల్ల గ్రీనహౌస్‌లో సాగు చేయడం లాభదాయకం. పగటి ఉష్ణోగ్రత 18-220 సెం. మరియు రాత్రి ఉష్ణోగ్రత 10-150 సెం. ఉండాలి.

నేలలు :

లిల్లీ పూలసాగుకు నీరు ఇంకే సారవంతమైన నేలలు అనుకూలం. ఉదజని సూచిక 5.5 నుండి 6.5 మధ్య ఉండి ఎక్కువ సేంద్రియ పదార్ధం ఉన్న గుల్లబారు భూముల్లో దిగుబడి బాగా ఉంటుంది.

రకాలు :

లిల్లీపూలు వివిద రంగుల్లో లభ్యమవుతున్నప్పటికీ ముఖ్యంగా ఏషియాటిక్‌ రకాలు, ఓరియంటల్‌ రకాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఏషియాటిక్‌ రకాలు :

డ్రీమ్‌లాండ్‌ (పసుపు), నోవాలా (తెలుపు), ఎల్లోజేంట్‌ (పసుపు), బ్లాక్‌అవుట్‌ (ముదురు ఎరుపు)

ఓరియంటల్‌ రకాలు :

స్టార్‌గేజర్‌ (పింక్‌ మరియు తెలుపు), నీరోస్టార్‌, సైబేరియా

ప్రవర్ధనం :

లిల్లీపూలను వాణిజ్యపరంగా బల్బుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. తాజా బల్బుల్లో 2-3 నెలల వరకు నిద్రావస్థ ఉంటుంది. అందువల్ల భూమిలో నుండి తీసిన వెంటనే బల్బులు మొలకెత్తవు. కాబట్టి ఆరు వారాల పాటు తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం (20 సెం. నుండి 50 సెం. వరకు) ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. ఈ బల్బులను 200 సెం. ఉష్ణోగ్రత వద్ద ఒక సంవత్సరం పాటు నిల్వ చేయవచ్చు.

నాటడం :

20 * 15 సెం.మీ., 15 * 15 సెం.మీ., 15 * 10 సెం.మీ. దూరంలో బల్బులను నాటుకోవచ్చు. బల్బులను నాటుకునే ముందు మాంకోజబ్‌ 2 గ్రా. లేదా కార్బండిజమ్‌ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి బల్బులను ద్రావణంలో 15-20 నిమిషాలు ఉంచినట్లయితే బల్బుల ద్వారా వ్యాప్తి చెందే రోగాలను నిరోధించవచ్చు. (30 నుండి 60 మీ.) విస్తీర్ణంలో బల్బు పరిమాణం, రకాన్ని బట్టి ఉంటాయి.

ఎరువులు :

ఆఖరిదుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల నత్రజని, 35 కిలోల భాస్వరం మరియు 35 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులు అంటే 45 కిలోల యూరియా, 215 కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్ఫేట్‌ మరియు 60 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌పొటాష్‌ ఎరువులను వేయాలి.

పోషకం మోతాదు (గ్రా. / మీ. / వారం)
ఏషియాటిక్‌ ఓరియంటల్‌
కాల్షియంనైట్రేట్‌ 2.5 2.5
19 : 19 : 19 0.5 0.5
పొటాషియం నైట్రేట్‌ 2.2 2.3
మైక్రోన్యూట్రియం మిక్స్‌ 1.2 1.2

నీటియాజమాన్యం :

బల్బులను నాటే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి అన్ని బల్బులు మొలకెత్తే వరకు నీటి తడి ఇస్తూ ఉండాలి. మొక్క, మొగ్గదశలో ఉన్నప్పటి నుండి పువ్వు విచ్చుకునే సమయం వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.

పూల కోత :

ఏషియాటిక్‌ లిల్లీలు 8-10 వారాల్లో, ఓరియంటల్‌ లిల్లీలు 14-16 వారాల్లో పూలు కోతకు వస్తాయి. ఎప్పుడైతే చివరి మొగ్గ రంగు పూర్తిగా ఏర్పడి మొగ్గ విచ్చుకోకముందు కోయాలి. సాధారణంగా చల్లని సమయం అంటే ఉదయం లేదా సాయంత్రం వేళలో పూలను కోయాలి.

దిగుబడి :

సాధారణంగా ఒక మొక్క నుండి 30-40 పూల కాడలు 1 మీటరు విస్తీర్ణం నుండి వస్తాయి.

సస్యరక్షణ :

తామర పురుగులు : తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల నుండి రసాన్ని పీల్చి బలహీనపరుస్తాయి. నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌ 1 మి.లీ. / లీటరు నీటికి లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎర్రనల్లి : ఇవి మొక్క లేత దశలో ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పచ్చదనాన్ని కోల్పోతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు ఎండి రాలిపోతాయి. వీటి నివారణకు డైకోఫాల్‌ 3 మి.లీ. లేదా అబామెక్టిన్‌ 0.4 మి.లీ. లీటరు నీటికి పోపారగైట్‌ 2 మి.లీ. లేదా ఇథియాన్‌ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు మందులను మార్చుకుంటూ పిచికారి చేయాలి.

పేను బంక : పిల్ల మరియు పెద్ద పురుగులు ముఖ్యంగా ఎదుగుతున్న లేత మొగ్గలను ఆశించి రసాన్ని పీల్చుతాయి. నివారణకు డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మందులను మార్చుకుంటూ పిచికారి చేయాలి.

తెగుళ్ళు :

బల్బులు కుళ్ళు తెగులు : నేలలో ఉన్న బల్బులు పూర్తిగా కుళ్ళిపోతాయి. నివారణకు కార్బండిజమ్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పూర్తిగా తడపాలి.

మొక్క మరియు వేరు కుళ్లు తెగులు : మొక్క పూర్తిగా ఎండిపోతుంది. నేలలో ఉన్న మొక్క వేళ్ళు కుళ్ళిపోతాయి. నివారణకు మెటలాక్సిల్‌ 1 గ్రా. / లీటరు నీటికి కలిపి నేలను పూర్తిగా తడపాలి.

బోట్రెటిక్స్‌ తెగులు : మొక్క ఆకుల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు కార్బండిజమ్‌ 2 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ఎ. నిర్మల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఉద్యానపరిశోధనా విభాగం,

కె. అరుణ, వ్యవసాయ విస్తరణ విభాగం,

వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌, ఫోన్‌ : 8330940330