ఆర్కిడ్స్‌ ముఖ్యంగా డెండ్రోబియం జాతికి చెందినవి రాష్ట్రంలో సాగులో లేవనే చెప్పవచ్చు. ఇందులో కూడా జాతులు, ప్రజాతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి పెరిగే స్వభావాన్ని బట్టి వాటిని ''సింపోడియల్స్‌'' అంటారు. ఈ ఆర్కిడ్స్‌ ఎక్కువగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలలో సాగు చేస్తున్నారు.

డెండ్రోబియం ఆర్కిడ్‌ రకాలు :

న్యూపింక్‌, హింగ్‌ బ్యూటి, ఎమ్మావైట్‌, కాశెం వైట్‌ , సోనియా-28, సోనియా-17, సబైన్‌, ప్రమోట్‌-11, కాండీ స్ట్రెప్‌, సకూర పింక్‌, బన్వాట్‌ పింక్‌ , పింక్‌ టిప్స్‌, మేడమ్‌ విపర్‌ మరియు డెండ్రోబియం ఇర్సాకుల్‌ వంటి కొన్ని రకాలు కేరళ వ్యవసాయ విశ్వ విద్యాలయం, త్రిచూర్‌ మరియు ప్రైవేటు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. వాళ్ల వద్ద లేనిఎడల సింగపూర్‌, థాయ్‌లాండ్‌, మలేషియా నుండి టిష్యూకల్చర్‌ మొక్కలు తెప్పించి అందచేస్తారు.

డెండ్రోబియం ఆర్కిడ్‌ మొక్కలను పెంచుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నా కేవలం టిష్యూకల్చర్‌ ద్వారా పెంచిన నాణ్యమైన, ఆరోగ్యమైన మొక్కలు వాణిజ్య సరళిలో పెంచుకోవాలి.

అనుకూలమైన వాతావరణ పరిస్థితులు :

మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటుగా రాయలసీమలోని జిల్లాల్లో కూడా సాగు చేయవచ్చు. రైతులు తమ ఆర్థిక పరిస్థితులను బట్టి షేడ్‌నెట్‌హౌస్‌ మరియు టాప్‌వెంటిలేటెడ్‌ పాలిహౌస్‌ల్లో సాగుచేయవచ్చు. సాగుచేసే చోట వాతావరణ పరిస్థితులను బట్టి పాలిహౌస్‌ మరియు షేడ్‌నెట్‌ లోపల ఆకుపచ్చ మరియు తెలుపు అగ్రోషేడ్‌నెట్‌లను (25-50 శాతం) పంట పెరుగుదలను బట్టిమార్చుకోవాలి. ఆర్కిడ్‌ మొక్కల సాగుకు మిగతా వాటి కంటే అనుకూల వాతావరణం లేని యెడల మొక్కలు పెరగవు. కావున ముందుగా అనుకూలమైన ఉష్ణోగ్రత, తేమ, కాంతి, గాలి ప్రసరణ మరియు కార్బన్‌డైఆక్సైడ్‌ ఎంతెంత కావాలి అని బాగా తెలుసుకోవాలి.

పాలిహౌస్‌లో వాతావరణంలో ఎక్కువ మార్పులు ఉంటే ఈ పంట ఎందుకూపనికి రాదు. రైతులు నిపుణులను కలిసి దాన్ని గురించి క్షుణంగా తెలుసుకోవాలి. రైతులు 'ధర్మో హైగ్రోమీటర్‌' వాడి ఉష్ణోగ్రత, తేమ మరియు లక్స్‌ మీటరు ద్వారా ఎంత కాంతి మొక్కలకు అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు.

సాధారణంగా 260 సెం.-350 సెం., ఉష్ణోగ్రత 50 శాతం తేమ, 40-50 శాతం నీడ, చక్కటి గాలి ప్రసరణ వంటి పరిస్థితులు డెండ్రోబియం ఆర్కిడ్‌ సాగుకు అనుకూలం. పాలిహౌస్‌లో 50 శాతం తేమను వివిధ పద్ధతులను అనుసరించి నిలపవచ్చు. అనుకూలమైన తేమ కొరకు షేడ్‌నెట్‌ మరియు పాలిహౌస్‌లో కింది భాగాన 5 (ఇంచెలు) ఇసుకపోసుకొని వాతావరణాన్ని బట్టి తడుపుతూ ఉండాలి. నాలుగు అంచుల్లో 4 సిమెంట్‌ తొట్టెలను తీసుకొని వాటికి సున్నం పూసి వాటి నిండా నీరు పోసి ఉంచాలి. దీనివల్ల తేమ పెరుగుతుంది.

ఉష్ణోగ్రత, కాంతి తీవ్రతను బట్టి పాలిహౌస్‌లలో శీతాకాలం, వేసవికాలంలో అగ్రోషెడ్‌ నెట్‌లను మార్పులు, చేర్పులు తప్పనిసరిగా చేయాలి. వాతావరణ అంశాలు లోపల మారితే ఆర్కిడ్‌ ఆకులు లేత పసుపు రంగులోకి మారడం, మెత్తబడడం తద్వారా తెగుళ్ళు రావడం, పూల కాడ పెరుగుదల లోపించడం జరుగుతుంది. పాలిహౌస్‌లో వాతావరణాన్ని బట్టి పాగర్స్‌/ మిస్టర్స్‌ అమర్చుకోవాలి. లక్స్‌ మీటరు ద్వారా కాంతి ఎంత ఉంది అని చూసినప్పుడు మొక్క జాతిని బట్టి 24 వేల నుండి 32 వేల 'లక్స్‌' ఉండాలి. దీనితోపాటుగా నీడను శాస్త్రీయంగా అనుకూలంగా ఉండేటట్లు చూడాలి.

విద్యుత్‌ లేకున్నా పాలిహౌస్‌లలో వాతావరణ పరిస్థితులను అనుకూలంగా మలచుటకు వీలవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షపాతం ఎక్కువగా లేని ప్రాంతాల్లో షేడ్‌నెట్‌ హౌస్‌పై భాగాన్ని పాలిఫిల్మ్‌తో నిర్మించి ప్రక్కలు షేడ్‌నెట్‌ 50 శాతం కప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఆర్కిడ్‌ మొక్కలు నాటడానికి కావలసిన వస్తువులు :

1. 2.50 మీ. పొడవు + 1.00 మీ. వెడల్పు+80 సెం.మీ. ఎత్తు కలిగిన ఇనుప బెంచులు (మద్యలో ఖాళీలు ఉండాలి) షేడ్‌నెట్‌లు మరియు పాలిహౌస్‌లలో ఉంచాలి. థర్మోహైగ్రోమీటర్‌ను పాలిహౌస్‌, షేడ్‌నెట్‌ హౌస్‌ లోపల మధ్యలో వేలాడదీయాలి. కింద వేసిన ఇసుక మీద టార్పాలిన్‌ షీటు వేయరాదు.

మట్టి కుండలు, ప్లాస్టిక్‌ కుండీలు (16.0 సెం.మీ. పొడవు + 13.0 సెం.మీ. వెడల్పు ఉండి కుండీల కింద 1-2, కుండీ నాలుగు వైపులా అక్కడక్కడా పెద్ద రంద్రాలు ఉండాలి) మొక్కలు నాటడానికి వాడాలి. ప్లాస్టిక్‌ కుండీలు తీసుకొని వాటికి మనమే రంద్రాలు చేసుకోవాలి. ప్లాస్టిక్‌ కుండీలు తక్కువ ఖర్చులో దొరుకుతాయి.

ఆరోగ్యకరమైన కొబ్బరి డొక్కలను తీసుకొని మరీ పీచులుగా కాకుండా చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. కొబ్బరి పీచు ముక్కలతో పాటుగా బొగ్గు పెద్ద ముక్కలు + టైల్‌ ముక్కలు+ఇటుక చిన్న ముక్కలు తయారు చేసుకొని వాటిని అన్నింటినీ బాగా కలిపి, వాటిని పలుచగా సిమెంటు ఫ్లోర్‌లపై పరచి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. / మాంకోజెబ్‌ 2.5 గ్రా. / సాప్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి వాటిపై పిచికారి చేసి 1-2 రోజులు నీడలో వాటిని ఆరబెట్టాలి. తరువాత వాటిని సమానంగా కలుపుకోవాలి. మట్టిగాని, ఎరువులుగానీ కలుపరాదు. అన్నీ సమానంగా కలిపిన ముక్కల మిశ్రమాన్ని కుండీలలో పైన 5 సెం.మీ. వదలి పెట్టి మిగిలినది నింపుకోవాలి.

మిశ్రమం కుండీలలో వేయుటకు ముందు నాణ్యమైన ఇనుపరాడ్‌(చిన్నది, సన్నగా) తీసుకొని అడుగు భాగాన 5-7 సెం.మీ. వరకు నిఖకు ఆకారంలో వంచుకొని (రాడ్‌ పొడవు 40-50 సెం.మీ. ఉండాలి) దాన్ని కుండీల అడుగు భాగాన మధ్యలో నిటారుగా ఉంచి దానిపై ''ముక్కల మిశ్రమం'' వేయాలి. ఈ రాడ్‌ మొక్కలకు ఊతం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.

మట్టి, ప్లాస్టిక్‌ కుండీలను మిశ్రమంతో నింపిన తరువాత వాటిని పాలిహౌస్‌లోని బెంచ్‌ల మీద ఉంచాలి. క్రింద పెట్ట కూడదు. మొక్కలు నాటు ఒక రోజు ముందుగా పైపుతో కుండీలను బాగా తడపాలి. కుండీల్లో ఏ మాత్రం నీరు నిల్వ కూడదు.

ఆర్కిడ్‌ మొక్కలు నాటుట :

కుండీలను బెంచ్‌ల మీద ఉంచిన తరువాత ఆరోగ్యంగా ఉన్న టిష్యూకల్చర్‌ మొక్కలను ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క మొక్క వేర్లను కొంచెం వెడల్పు చేసి ''ముక్కల మిశ్రమం''లో కాకుండా వేర్లను పూర్తిగా కుండీ నాలుగు వైపులా చేసి మొక్కను నిటారుగా నిలబెట్టి వేర్లను కేవలం మిశ్రమం పై మాత్రమే ఉంచి మొక్క కాండం భాగానికి దారం, ప్లాస్టిక్‌ వైర్‌ సహాయంతో కుండీలోని ఇనుప సన్నని రాడ్‌కి కట్టి ఊతం ఇవ్వాలి. మొక్కలను నాటునప్పుడు మద్య మద్యలో ''ఇథనాల్‌''తో చేతులను శుభ్రపరచుకోవాలి. అన్ని మొక్కలను నాటిన తరువాత తటస్థ ఉదజనిసూచి (పి.హెచ్‌ 6-6.5) నాణ్యత కలిగిన నీటిని పైప్‌తో మొక్కలను మిశ్రమాన్ని బాగా తడపాలి. తరువాత నీటిలో కరిగే అమ్మోనియం నైట్రేట్‌ + ఆర్థో పాస్ఫారిక్‌ ఆమ్లం+పొటాషియం నైట్రేట్‌ల ఎరువుల మిశ్రమాన్ని 2-2.5 గ్రా. లీటరు నీటికి కలిపి వారానికి 2-3 సార్లు మొక్కలపై సాయంత్రం పూట పిచికారి చేయాలి.

డా|| ఎం. రాజా నాయక్‌, ఉద్యాన కళాశాల, అనంతరాజు పేట, కడప జిల్లా, ఫోన్‌ : 8897998978