మన దేశంలో పంటల్లో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కలు మరియు పక్షుల వల్ల జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, నీల్‌ గాయ్‌లు, అడవి పందులు మొదలగునవి. వీటి తరువాత స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా అడవి పందుల వల్ల పంటలకు చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లుతుంది. విత్తనం నాటినప్పటి నుండి మొలకెత్తి పక్వానికి వచ్చే వరకు వివిధ దశల్లో వీటి వల్ల నష్టం వాటిల్లుతున్నది. దీనికి గల కారణాలను గమనించినట్లయితే అడవి పందుల అవాస ప్రాంతాలైన అడవుల విస్తీర్ణం తగ్గడం, తద్వారా వాటికి కావలసిన ఆహార కొరత ఏర్పడుట, మరియు అడవిపందులను వేటాడే జంతువులు అంతరించిపోవడం వంటి కారణాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అడవిపందుల సంఖ్య గణనీయంగా పెరిగి ఆహారం కొరకు సమీపంలోని పంటపొలాలపై ఆధారపడుతున్నాయి. ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, నూనెగింజల పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, మరియు పండ్ల జాతికి చెందిన జామ, దానిమ్మ, ద్రాక్ష, మరియు కూరగాయల పంటలపై అడవి పందులు దాడి చేసి తినటం ద్వారా, పంట నష్టం సంభవిస్తుంది. అడవి పందులు తినడం ద్వారా చేసే పంటనష్టం కన్నా అవి విస్తతంగా సంచరించటం ద్వారా పంట మొక్కలు ధ్వంసం చేయబడి నష్ట శాతం పెరుగుచున్నది.

వ్యవసాయ రంగంలో వివిధ జంతు జాతుల యాజమాన్య పద్ధతులననుసరించి మేలు రకాల జంతు జాతుల సంరక్షణ, వ్యవసాయ హానికర జంతు జాతుల నియంత్రణ ద్వారా పంట దిగుబడిని పెంచి, రైతుల సామర్ధ్యాన్ని పెంపొందించే ఆధునిక పద్ధతులను అందించే ప్రధాన లక్ష్యాలతో ఏర్పాటైన అఖిలభారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం పంటలకు ప్రధానంగా నష్టం కలిగించే జీవులైన పక్షులు, రోడెంట్స్‌ (కొరికి తినే ఎలుక జాతి జంతువులు) మొదలగు వాటితో పాటు ఇతర నష్టం కలిగించే జంతుజాతుల యాజమాన్య పద్ధతులను రూపొందించింది. ఈ మధ్య కాలంలో అడవి పందుల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండటం వల్ల, అఖిలభారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం, నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రదేశాల్లో రైతులను చైతన్య వంతం చేయుటకు నడుం బిగించింది. దానిలో భాగంగానే అనేక ఆధునిక పద్ధతులతోపాటు, రైతులకు అందు బాటులో ఉండే సాంప్రదాయక పద్ధతులను కూడా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే దిశలో తీవ్రంగా కషి చేస్తుంది.

ఆహారపుటలవాట్లు :

ఇవి మిశ్రమ భక్షణ రకానికి చెందిన జంతువులు ముఖ్యంగా మాంసాహారం మరియు శాఖాహారం రెండింటిని భుజిస్తాయి. వీటి శాఖాహారంలో ప్రధానంగా పంట మొక్కల వేర్లు, దుంపలు, వివిధ రకాల గడ్డలను తింటాయి. మాంసాహారంలో భాగంగా కీటకాలు, పాములు, పాడైపోయిన జంతు కళేబరాలు మొదలగునవి ఉంటాయి. పంటలపై దాడి చేయుటకు అడవి పందులకు వివిధ అనుకూల సాధనాలు ఉన్నాయి.

అడవులకు సమీపంలో ఉన్న వ్యవసాయక సాగు ప్రాంతాల్లో అడవి పందుల సంచారం అధికంగా ఉండటం వల్ల నష్ట శాతం ఈ ప్రాంతాలో ్ల ఎక్కువగా ఉంటుంది. అడవి పందుల్లో వాసన పసిగట్టే గుణం చాలా అధికంగా ఉండటం వల్ల వివిధ పంట మొక్కల యొక్క ఉనికిని దూరం నుంచే పసిగడతాయి. ఆహార సేకరణ కొరకు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఒక్కొక్క గుంపులో సుమారు 15-35 వరకు అడవి పందులుంటాయి. అందువల్ల అవి పంట పొలాలపై సమర్ధవంతంగా దాడిచేసి ఆహారాన్ని పొందుతాయి. ముఖ్యంగా ఇవి ప్రాతఃకాల సమయంలో మరియు రాత్రివేళల్లో మాత్రమే ఆహారాన్ని వెదుకుతాయి. కాబట్టి ఆ సమయాలో పంటపొలాలపై దాడిచేస్తాయి. వీటికి వినికిడి శక్తి మరియు చూపు మాత్రం చాలా తక్కువగా అభివద్ధి చెందాయి.

వీటి ఆహార సేకరణ పద్ధతి వల్ల పంటపొలాలకు కొంతమేర ఉపయోగం కలుగుతుంది. అడవి పందుల నోటి పైభాగం (ముట్టె) చాలా ఉండి భూమిని తవ్వుటకు అనుకూలంగా ఉండును, అందువల్ల ఇవి వేర్ల కొరకు భూమిలో గుంతలు పెడతాయి. అప్పుడు భూమి గుల్ల పరచబడి గాలి ప్రసారం బాగా జరుగుతుంది. మరియు వర్షపు నీరు సులభంగా భూమిలోపలికి ఇంకుతుంది. ఈ ప్రక్రియలో రాలిపోయిన ఆకులు, చెత్త మొదలగు వ్యర్థ పదార్థాలు భూమి లోపలికి చేరి కుళ్ళి పోయి ఎరువులుగా మారి భూసారాన్ని పెంచుతాయి. భూమిలోపలికి తవ్వడం మూలంగా వేరు పురుగులను తింటాయి. దానివల్ల వేరు పురుగుల సమస్య కొంత వరకు నివారించబడుతుంది. పంట మొక్కలపై అడవి పందుల దాడి తత్ఫలితంగా వాటిల్లుతున్న నష్టాలను నివారించడానికి సమగ్ర విశ్లేషణ ద్వారా అఖిల భారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం, రైతులకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అదే విధంగా ఈ పద్ధతులు సమర్థవంతంగా అమలు జరిగే విధంగా రైతులను జాగతం చేసే కార్యక్రమాలను రూపొందిస్తుంది. అడవి పందుల దాడిని ఎదుర్కొనుటకు గాను అఖిల భారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం సూచించిన సస్యరక్షణ పద్ధతులు. భౌతికంగా ఏర్పాటు చేయు ప్రహారీలు ఇనుప ముళ్ళ తీగె కంచె (బార్బడ్‌ వైర్‌ ఫెన్స్‌)

పంట పొలం గట్టు వెంబడి ఒక అడుగు దూరంలో ముళ్ళను కలిగి ఉన్న ఇనుప తీగెను పంట పొలం చుట్టూ కర్రల సహాయంతో ఒక అడుగు ఎత్తులో 3 వరుసల్లో బిగించి కట్టినట్లైతే అడవి పందుల రాకను ఈ ముళ్ళకంచె నిరోధిస్తుంది. ఇనుప ముళ్ళ తీగె కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) ఇనుప ముళ్ళ తీగె చుట్ట వెల రూ. 6,855 నుండి రూ. 7,000/-, మూడు వరుసల్లో తీగెను బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ. 1,000/- మొత్తం ఒక ఎకరానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ.8,000/-

నివారించే పద్ధతులు :

వలయాకార ముళ్ళకంచె పద్ధతి (రేజర్‌ ఫెన్స్‌)

ఇనుపవల కంచె (చైన్‌ లింక్‌ ఫెన్స్‌)

సౌరశక్తి కంచె (సోలార్‌ ఫెన్స్‌)

జి.ఐ. తీగెకంచె

కందకం తవ్వే పద్ధతి

జీవ కంచెలు

పొలం చుట్టూ కుసుమ పంటను 4 వరుసల్లో నాటడం

పొలం చుట్టూ ఆముదపు పంటను 4 వరుసల్లో నాటడం

పదునైనముళ్ళతో కూడిన మొక్కలు/ఎడారి మొక్కలు పొలం చుట్టూ నాటడం.

వాక్కాయ చెట్లను పొలం చుట్టూ నాటడం

రసాయనిక పద్ధతులు

ఫోరేట్‌ గుళికల పద్ధతి

కుళ్ళిన కోడి గ్రుడ్ల ద్రావణం పంట పొలం చుట్టూ పిచికారి చేయు పద్ధతి

కిరోసిన్‌ ద్రావణంలో ముంచిన కాటన్‌ నవారులను పంట చుట్టూ 3 వరుసల్లో కట్టడం.

సాంప్రదాయ పద్ధతులు

ఊర పందుల పెంట మిశ్రమం పిచికారి విధానం.

వెంట్రుకలు వెదజల్లు పద్ధతి

చీరల పద్ధతి

పొగపెట్టు పద్ధతి

రాత్రి వేళల్లో టపాకాయలు పేల్చుట

వేట కుక్కలతో తరిమే పద్ధతి

పులిబొమ్మల ఏర్పాటు

పక్షుల నియంత్రణ పద్ధతులు

రిబ్బన్‌ పద్ధతి

ఆకుచుట్టూ పద్ధతి

అర్తనాద పద్ధతి

వేప గింజల కషాయం తయారీ

కోడి గ్రుడ్డు ద్రావణం పిచికారీ

కాగితపు ప్లేట్ల పద్ధతి

వలయాకార ముళ్ళకంచె పద్ధతి (రేజర్‌ ఫెన్స్‌) :

ఈ పద్ధతిలో వలయాకరంలో ఉన్న ఇనుప కంచెను పొలం గట్ల వెంబడి పంటకు ఒక అడుగు దూరం నుండి అమర్చినట్లైతే అడవి పందులు ఈ కంచెను దాటుటకు ప్రయత్నించినప్పుడు, ఈ కంచెకు ఉండే చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మాణాలు అడవి పందుల దేహానికి తీవ్రమైన గాయాలను కలుగజేస్తాయి. గాయాలతో అవి అరుస్తూ పారిపోయినప్పుడు మిగతా పందులు ఏదో ఆపదఉందని భయపడి వెనుకకు వెళ్ళిపోతాయి. ఈ పద్ధతి చాలా సమర్థవంతంగా అడవి పందులను ఎదుర్కొంటుంది.

వలయాకార రక్షణ కంచెను పంటపొలం చుట్టూ బిగించి కట్టినట్లైతే అడవి పందులు రాకను ఈ ముళ్ళకంచె సమర్థవంతంగా నిరోధిస్తుంది. వలయాకార రక్షణ కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) ఒక ఎకరానికి చుట్టూ ఏర్పాటు చేయవలసిన వలయాకార రక్షణ కంచె చుట్ట వెల రూ. 18,000/, ఒక వరుసలో వలయాకార రక్షణ కంచె బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ.1,000/, మొత్తం ఒక ఎకరానికి అయ్యే ఖర్చు రూ.19,000/, నుండి రూ.20,000/

ఇనుప వల కంచె (చైన్‌ లింక్‌ ఫెన్స్‌) :

పంటపొలం నుండి ఒక అడుగు దూరంలో, ఇనుపవల కంచెను 3 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థవంతంగా అడవి పందులు ప్రవేశాన్ని నిరోధించును. ఇనుపవల కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) ఇనుప వల కంచె చుట్ట వెల రూ. 10,020/- నుండి రూ. 10,500/-, భూమి నుండి 3 అడుగుల ఎత్తు వరకు ఇనుప వలను బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ.1,000/-, మొత్తం ఒక ఎకరానికి ఇనుప వలను బిగించడానికి అయ్యే ఖర్చు రూ. 11,500/-నుండి సుమారుగా రూ.12,000/-.

సౌరశక్తి కంచె (సోలార్‌ ఫెన్స్‌) :

ఈ మధ్య కాలంలో సోలార్‌ ఫెన్సింగ్‌ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తూ ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఇందులో సోలార్‌ ప్లేట్ల ద్వారా 12 వోల్టులు విద్యుత్‌ ఉత్పత్తి చేయబడి స్వల్ప మోతాదులో వైర్ల ద్వారా ప్రసారం జరిగి అడవి పందులకు షాక్‌ తగిలి పంట పొలాలవైపు రావడానికి జంకుతాయి. జీవ వైవిధ్య సంరక్షణా చట్టం 1972 ప్రకారం వన్య ప్రాణులను సంహరించుట నేరం కావున సోలార్‌ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడు విద్యుత్తు అడవి పందులకు ప్రాణహాని జరగకుండా కేవలం షాక్‌ ను మాత్రమే కలిగించుట, ఈ షాక్‌ తగిలి అరుస్తూ పారిపోవునప్పుడు మిగతా పందులు ఏదో ఆపద వున్నదని భయపడి వెనుకకు వెళ్ళిపోతాయి. ఈ పద్ధతి చాలా సమర్థవంతంగా అడవి పందుల బెడదను తగ్గిస్తుంది. పొలం చుట్టూ సౌరశక్తి కంచెను 3 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థవంతంగా అడవి పందుల ప్రవేశాన్ని నిరోధించును.

సౌరశక్తి కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు...సౌరశక్తి కంచె ఒక అడుగు వెల రూ.100/-, నుండి 120/-, ఒక ఎకరానికి సౌరశక్తి కంచెకు అయ్యే ఖర్చు రూ, 83,400/-, భూమి నుండి 3 అడుగుల ఎత్తు వరకు సౌరశక్తి కంచె బిగించుటకు ఇనుప పైపులు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ.3,000/-, మొత్తం ఒక ఎకరానికి సౌరశక్తి కంచెకు అయ్యే ఖర్చు రూ.86,400/- నుండి సుమారుగా రూ. 90,000/-

జి.ఐ.తీగెకంచె :

పంటపొలం చుట్టూ ఒక అడుగు దూరంలో జి.ఐ.తీగను భూమికి ఒక అడుగు ఎత్తులో 3 వరుసలలో బిగించి కట్టినట్లైతే కంచెలాగ ఉండి అడవి పందులు పంటపొలం లోనికి వెళ్ళకుండా నిరోధిస్తాయి. ఈ జి.ఐ.తీగ ప్రహారీకి అక్కడక్కడ గుండ్రటి ఉచ్ఛులను ఏర్పాటు చేసినట్లైతే అడవి పందులు వాటిలో చిక్కుకుని పంట పొలాల లోనికి వెళ్ళలేవు.

జి.ఐ. తీగె కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) జి.ఐ.తీగె వెల రూ.950/-, భూమి నుండి 3 అడుగుల ఎత్తు వరకు మూడు వరుసలలో జి.ఐ.తీగెను బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ,1,000/- మొత్తం ఒక ఎకరానికి జి.ఐ.తీగను బిగించడానికి అయ్యే ఖర్చు రూ,1900/- నుండి రూ.2000/-

కందకం తవ్వే పద్ధతి :

పంటపొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్లవెంబడి రెండు అడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగుల లోతైన కంద కాలను (ట్రెంచ్స్‌ను) ఏర్పాటు చేసినట్లైతే అడవి పందులు పొలం లోపలికిప్రవేశించలేవు. ఈ పద్ధతి ఒక్క అడవి పందుల నివారణ మాత్రమే కాకుండా వర్షాభావ ప్రాంతాల్లో నేలలోని తేమను వద్ధి చేయడానికి, ఒక పొలం నుండి ఇంకో పొలంనకు సోకే పురుగుల తాకిడిని తగ్గించడానికి కూడ తోడ్పడును.

పొలం చుట్టూ 2 అడుగుల వెడల్పు ఒకటిన్నర అడుగుల లోతు కందకాన్ని తవ్వడానికి అయ్యే ఖర్చు వివరాలు...కందకాన్ని తీయడానికి (జె.సి.బి.ద్వారా) గంటకు వెల రూ. 500/- చొప్పున ఒక ఎకరా పొలానికి 15 గంటలు పడుతుంది. దానికి గాను అయ్యే ఖర్చు సుమారుగా రూ.7,500/-

జీవకంచెలు :

పొలం చుట్టూ కుసుమ పంటను 4 వరుసల్లో నాటడం..

వేరుశనగ పంట పొలాల చుట్టూ 4-5 వరుసలు కుసుమ పంటను దగ్గరగా వేసినచో వాటికి సన్ననిముళ్ళు ఉండటం మూలాన అడవి పందులు వచ్చి ముట్టెతో భూమిని తవ్వడానికి ప్రయత్నించినప్పుడు ఆ ముళ్ళు ముట్టెపై చర్మానికి గుచ్చుకొని తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మరియు కుసుమ పంట వాసన, వేరు శనగ పంట వాసన కన్నా ఘాటుగా ఉండి సులభంగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు వేరు శనగ వాసనను పసిగట్టలేక, లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి. కుసుమ పంట వల్ల రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.

పొలం చుట్టూ ఆముదపు పంటను 4 వరుసల్లో నాటడం

మొక్కజొన్న పంటపొలాల చుట్టూ 4 నుండి 5 వరుసలు ఆముదపు పంటను దగ్గరగా వేసినట్లయితే మొక్కజొన్న పంట వాసన కన్నా ఆముదపు పంట వాసన ఘాటుగా ఉండి త్వరగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు మొక్కజొన్న వాసనను పసిగట్ట లేక, లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి. ఆముదపు పంటను అడవి పందులు తినడానికి ఇష్టపడవు. ఫలితంగా పంట రక్షింపబడుతుంది. అదే విధంగా రైతులకు ఆముదం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.

పదునైనముళ్ళతో కూడిన మొక్కలు/ఎడారి మొక్కలు పొలం చుట్టూ నాటడం :

వివిధ ముళ్ళపొదలు (రేగిజాతులు), అగేవ్‌ జాతి మొక్కలు, జిజిఫస్‌ జాతులు, కాక్టస్‌ జాతులు, ఒపన్షియా మొదలగు ఎడారి జాతి మొక్కలు మరియు గచ్చ పొదలను, గట్లవెంబడిపెంచినట్లైతే వాటి యొక్క ముళ్ళు అడవి పందులకు గాయాలను కలగజేస్తాయి.

వాక్కాయ చెట్లను పొలం చుట్టూ నాటడం :

వాక్కాయ చెట్లను గట్ల వెంబడి పెంచడం మూలానా వాటి పదునైనముళ్ళ వల్ల అడవి పందుల దేహం గాయపడి అడవి పందులు అరుస్తూ పారిపోతాయి. వాక్కాయ గింజలను చింత పండుకు ప్రత్యామ్నాయంగా ఉప యోగిస్తారు. జాములు, పచ్చళ్ళు మరియు పళ్ళరసాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వాక్కాయ ఉత్పత్తులకు మార్కెట్‌ లో అధిక ప్రాముఖ్యత ఉండడం వలన ఈ ఉత్పత్తుల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

రసాయనిక పద్ధతులు :

ఫోరేట్‌ గుళికల పద్ధతి

200 గ్రా. ఫోరేట్‌ గుళికలు/థిమ్మెట్‌ గుళికలు ఒక కిలో ఇసుకలో కలిపి గుడ్డ సంచిలో కాని ప్లాస్టిక్‌ సంచిలో కాని మూటగా కట్టి, చిన్న రంధ్రాలు చేసి పంట చుట్టూ ఒక అడుగు దూరంలో కర్రలు 3 మీటర్లకు ఒకటి చొప్పున పాతి 60-100 సెం.మీ.ల ఎత్తులో ఈ సంచులు వాటికి కట్టాలి. గాలి ద్వారా ఫోరేట్‌ / థిమ్మెట్‌ గుళికల వాసన పంట వాసన కన్నా ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించి, పందులను పంట వాసన పసిగట్టకుండా చేయడం వలన పందులు దూరం నుండేవెనకకు వెళ్ళిపోతాయి. తద్వారా పందుల బెడద గణనీయంగా తగ్గుతుంది.

క్రుళ్ళిన కోడి గ్రుడ్ల ద్రావణం పంట పొలం చుట్టూ పిచికారి చేయు పద్ధతి :

కుళ్ళిన లేదా మామూలు కోడి గుడ్లను సేకరించి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ ద్రావణం 20 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పంట పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పులో చదును చేసిన తడి భూమిపై పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఘాటైన వాసన వెలువడుతుంది.

ఈ వాసన పంట వాసన కంటే ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించి పందులను పంట వాసన పసిగట్టకుండా చేయడం వల్ల పందులు దూరంనుండే వెనుకకు వెళ్ళిపోతాయి. అందువల్ల అవి పంట పొలాలవైపుకు రావడానికి సుముఖత చూపవు. వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒక మారు 50-70లీ.ల నీటికి 40-50 కోడి గుడ్లును కలిపి తరచుగా పిచికారి చేసుకోవాలి.

ఈ కోడి గుడ్ల ద్రావణం పర్యావరణానికి హాని చేయదు మరియు పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ పద్ధతికి అయ్యే ఖర్చు ఒక ఎకరానికి సుమారుగా రూ. 300/-

కిరోసిన్‌ ద్రావణంలో ముంచిన కాటన్‌ నవారును పంట చుట్టూ 3 వరుసల్లో కట్టడం :

ఈ పద్ధతిలో మంచాలకు ఉపయోగించే బట్ట నవారునుకిరోసిన్‌ ద్రావణంలో నానబెట్టి 2 గంటల తరువాత తీసి ఆర బెట్టాలి. ఇలా ఆరబెట్టిన నవారును పంట పొలం చుట్టూ కర్ర దుంగలు పాతి 3 వరుసలుగా చుట్టుకోవాలి, ఇలా చుట్టిన నవారు నుండి ఘాటైన కిరోసిన్‌ వాసన వెలువడుతుంది. ఫలితంగా అడవి పందులు ఆ ప్రాంతానికి రావడానికి విముఖత చూపుతాయి. తద్వారా పంట రక్షింపబడుటయే కాకుండా ఈ పద్దతికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.

గంధకం పందికొవ్వు నూనె మిశ్రమాన్ని 3 వరుసల కొబ్బరి తాడుకు పూయడం :

పందికొవ్వు నూనెను సేకరించి దానికి తగినంత గంధకపు పొడిని కలిపి, మిశ్రమంగా తయారు చేసి ఉంచుకోవాలి. పంట పొలం గట్టు చుట్టూ 3మీ.ల ఎడంతో కర్ర దుంగలు పాతుకోవాలి. ఈ కర్ర దుంగలకు కొబ్బరి తాడును భూమికి ఒక అడుగు ఎత్తులో మొదలు పెట్టి మధ్య ఒక అడుగు స్థలం ఉండేటట్లు చూసుకొని 3 వరుసలు బిగుతుగా లాగి కట్టుకోవాలి. ఇలా తాడుకు ముందుగా తయారు చేసుకున్న పంది క్రొవ్వు మరియు గంధకపు మిశ్రమాన్ని దట్టంగా పూయాలి.ఈ మిశ్రమం నుండి వెలువడు ఘాటైన వాసనలు చాలా రోజుల వరకు ఉండి రాత్రి వేళ్ళల్లో సంచరించు అడవి పందులకు శ్వాసపరమైన ఇబ్బందులు కలుగజేయును. ఈ వాసన పంట వాసన కన్నా ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించి పందులను పంట వాసన పసిగట్ట కుండా చేయడం వల్ల పందులు దూరంనుండే వెనకకు వెళ్ళి పోతాయి. వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని తాడుకు పూయాలి. తత్ఫలితంగా పందులు పంట పొలాల సమీపం నుండి దూరంగా వెళ్ళి పోతాయి. పంటలు రక్షింపబడుతాయి.

సాంప్రదాయ పద్ధతులు :

ఊర పందుల పెంట మిశ్రమం పిచికారి విధానం.

దీనికి గాను ఊర పందుల పెంటను సేకరించి తగినంత నీటితో ద్రావణంగా తయారు చేసి వడ గట్టుకోవాలి. ముందే పంటపొలం చుట్టూ 1 అడుగు వెడల్పు ప్రాంతాన్ని చదును చేసి, నీటితో తడపాలి. ఈ వడగట్టిన ద్రావణాన్ని తడిచేసిన ప్రాంతంలో పిచికారి చేసినట్లైతే ఒక విధమైన వాసన వస్తుంది. ఈ వాసన గ్రహించిన అడవి పందులు ఆ ప్రాంతంలో వేరే పందులు సంచరిస్తున్నాయని భ్రమపడి దూరంగా వెళ్ళి పోతాయి.

ఈ వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 7 రోజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని పిచికారి చేయాలి. తత్ఫలితంగా పందులు పంటపొలాల సమీపంలోకి రాకుండా దూరంగా పారి పోయి పంటలు రక్షించబడతాయి.

వెంట్రుకలు వెదజల్లు పద్ధతి :

క్షౌరశాలలో దొరికే వ్యర్ధమైన వెంట్రుకలను సేకరించి పంట పొలాల గట్ల చుట్టూ ఒక అడుగు వెడల్పు ప్రాంతాన్ని చదును చేసి వెంట్రుకలను పలుచగా చల్లాలి. అడవి పందుల నేలను తవ్వే అలవాటు, వాసన చూసే అలవాటు ప్రకారం అవి నేలమీద తమ ముట్టే భాగాన్ని ఉంచి గాలిపీల్చడం వలన ఈ వెంట్రుకలు వాటి ముక్కులోనికి ప్రవేశించి శ్వాస పరంగా తీవ్ర ఇబ్బందికి గురై తిరిగి వెనకకు వెళ్ళిపోతాయి. తద్వారా పంటలు రక్షింపబడుతాయి

చీరల పద్ధతి :

పంట పొలాల చుట్టూ చీరలను కర్రలను పాతి గోడల వలె కట్టినట్లైతే, అడవి పందులు రాత్రి సమయాలలో దాడిచేసినప్పుడు ఆ చీరల స్పర్శతో మనుషులు ఉన్నట్లుగా భ్రమపడి అరుస్తూ దూరంగా పారిపోతాయి. ఈ శబ్ధాలను విన్న మిగతా పందులు భయపడి దూరం నుండే వెనుదిరుగుతాయి. మరియు పంటలు రక్షింపబడుతాయి.

పొగపెట్టు పద్ధతి :

ఈ పద్ధతిలో ఊర పందులు పేడ పిడకలను సేకరించి మట్టి కుండల్లో ఉంచి కాల్చడం ద్వారా పొగ వచ్చేటట్టు చేయాలి. ఈ కుండలను రాత్రి సమయాలలో పొలం చుట్టూ అక్కడక్కడ ఉంచాలి. ఫలితంగా వెలువడు వాసన ద్వారా ముందే అక్కడ మరొక పందుల గుంపు సంచరిస్తుందని భ్రమించి దూరంనుండే వెనుదిరుగుతాయి. ఈ వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 2 రోజులకు ఒక మారు పందుల పిడకలను కాల్చి పొగ వచ్చునట్లు చేయాలి. తత్ఫలితంగా పందులు పంటపొలాల సమీపం నుండి దూరంగా పారిపోయి పంటలు రక్షించబడతాయి.

రాత్రి వేళల్లో టపాకాయలు పేల్చుట :

అడవిపందుల బెడద ఎక్కువగా ఉన్న పంట పొలాల ప్రాంతాల్లో రైతులు, రాత్రివేళల్లో శబ్దా ప్రయోగాలు (పటాసులు కాల్చడం,కేకలు వేయడం, ఖాళీడబ్బాలతో శబ్దాలు చేయడం) చేయాలి. అందువల్ల అవి భయభ్రాంతులకు గురై పంటపొలాల సమీపానికి రావు.

బ్యాటరీలను ఉపయోగించి సెల్‌ఫోన్‌ల ద్వారా శబ్దాలను ఇత్పత్తి చేయటం ద్వారా కూడా అవి మనుఘలున్నారని భ్రమించి దూరం నుండే పారిపోతాయి. ఇవేకాక పంటపొలం చుట్టూ మంటలు పెట్టడం వల్ల కూడా అడవి పందులు భయపడి దూరం నుండే పారిపొతాయి.

వేట కుక్కలతో తరిమే పద్ధతి :

ఈ పద్ధతిలో తర్ఫీదు పొందిన వేట కుక్కలను పందులు దాడి చేసే సమయాల్లో దూరంగా తరిమేస్తాయి. వేట కుక్కలకు భయపడి అడవిపందులు పంట పొలాల వైపుకు రావడానికి జంకుతాయి. ఇది అడవి పందులను ఎదుర్కొనటంలో సమర్ధవంతమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు.

పులి బొమ్మల ఏర్పాటు :?

పెద్ద సైజులో ఉండే పులి బొమ్మలను ఏర్పాటు చేసి, వాటి దగ్గర పులి అరిచే శబ్ధాలను రికార్డు చేసి పెట్టడం ద్వార జింకలను మరియు అడవి పందులను రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చును.

వివిధ దేశాల్లో అడవి పందులను అదుపు చేయుటకు రకరకాల పద్ధతులు అమలులో ఉన్నాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ్యవసాయ ప్రాంతాలలో అడవిపందులను వేటాడుట, బోనుల ద్వారా బంధించి తుపాకితో కాల్చి వేయుట ద్వారా అదుపుచేస్తున్నారు.

పాకిస్థాన్‌లో విషపుఎర పద్ధతులద్వారా పెద్ద ఎత్తిన అడవిపందుల సంఖ్య అదుపులో ఉంచబడింది.

భూటాన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక రైతు బందాలను ఏర్పరచి అడవి పందులను వేటాడి చంపుట ద్వారా అదుపులోకి తెస్తున్నారు.

ఇటలీలో విషపు ఎరల ద్వారా బంధించి చంపుట ద్వారా అదుపు చేస్తున్నారు.

సోడియం మోనోఫ్లోరో అసుటేట్‌ను సాధారణంగా ఉపయోగిస్తారు. ఇదే కాకుండా వార్‌ ఫెరిన్‌ను (1080) గూడా ఉపయోగించి అడవి పందులను అదుపు చేస్తున్నారు.

కుక్కలతో వేటాడి కూడా అదుపుచేస్తున్నారు.

ఇనుప కంచె పంటపొలాల చుట్టూ ఏర్పాటు చేసి, విద్యుత్‌ ప్రసారం చేసి అడవి పందులను రాకుండా చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ ఆహారపు పంటలు స్వల్ప విస్తీర్ణంలో అడవీ ప్రాంతాలలో సాగుచేయుట ద్వారా అవి వ్యవసాయ సాగు ప్రాంతాలలోనికి రాకుండా నిరోధిస్తున్నారు.

వన్యప్రాణి సంరక్షణా చట్టం, జీవ వైవిధ్య సంరక్షణ చట్టం ప్రకారం వన్యప్రాణులను వేటాడుట నేరం కాబట్టి నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వీటిని అదుపు చేయుటకు గాను, ప్రభుత్వం, అటవీ శాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించడం మరియు వంట నష్ట తీవ్రత హెచ్చిన పరిస్థితులలో, అటవీ శాఖాధికారుల అనుమతిలో వేటాడాలి.

పక్షుల నియంత్రణా పద్ధతులు :

రిబ్బన్‌ పద్ధతి :

పంట ఎత్తుకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కర్రలను ఉత్తర దక్షిణదిశలలో నాటవలెను. ఒక ప్రక్క ఎరుపు రంగు మరొక ప్రక్క తెలుపు రంగు కల్గి అర అంగుళం వెడల్పు 30 అడుగుల పొడవు గల రిబ్బన్‌ 3 లేదా 4 మెలికలను తిప్పి కర్రలను 10 మీ. దూరంలో నాటి కట్టవలెను. పక్షుల ఉధతి ఎక్కువగా ఉన్న ఎడల కర్రల మధ్య దూరం 5మీ. తగ్గించి కట్టాలి. సూర్యరశ్మి రిబ్బన్‌ పైబడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పుడు ఒకరకమైన శబ్దం చేస్తూ పంట దశ పక్షుల కంట పడకుండా చేస్తుంది. రిబ్బన్‌ పద్ధతిలో అన్ని రకాలైన ఆహారధాన్యాల, పప్పుధాన్యాల, నూనెగింజల పంటలు మరియు పండ్లతోటలను పక్షుల బారి నుండి కాపాడవచ్చును.

ఆకుచుట్టు పద్ధతి :

మొక్కజొన్న ఆకులను, గింజలను పాలుపోసుకొను దశలో కంకి చుట్టచుట్టి పక్షుల మరల్చ వచ్చును. గట్ల నుండి 3లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దష్టిని మరల్చి పంటలను రక్షించవచ్చును. తక్కువ విస్తీర్ణం కలిగిన పంటలకు ఇది అనువైన పద్ధతి.

అర్తనాద పద్ధతి :

పంట నష్ట పక్షుల ఆర్తనాదాన్ని ముందుగా రికార్డు చేసి క్యాసేట్‌ ద్వారా పంట ప్రాంతంలో ప్రయోగించవలెను. ఈ పద్ధతిని పండ్ల తోటలకు తక్కువ విస్తీర్ణం కల్గిన పంట ప్రాంతంలో మరియు విత్తనోత్పత్తి కేంద్రాలో ఉపయోగించవచ్చు. ఈ యంత్రం సోలార్‌ ద్వారా కూడా పనిచేస్తుంది.

వేప గింజల కషాయం తయారీ

తగిన మొత్తంలో వేప గింజలను సేకరించి ఎండబెట్టుకోవలెను. గింజలు బాగా ఎండిన తరువాత గింజ పై పొట్టును వేరుచేసి గింజలను తిరిగి ఒకరోజు ఎండ బెట్టాలి. తరువాత ఈ గింజలను బాగా పొడిగా చేసి తడిలేని డబ్బాల్లో పోసి నిల్వ ఉంచుకోవాలి. వేప గింజల కషాయం పిచికారి చేయడానికి, దానికి ముందురోజు ఈ గింజల పొడిని ఒక పలుచటి గుడ్డలో కట్టి, ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకొని గింజల పొడి ఉన్నమూట ఆ నీటిలో మునుగునట్లు ఉంచినట్లతే రాత్రి సమయం మొత్తం ఆ పొడి నీటిలో నాని చక్కటి కషాయం తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ మూటను పాత్రలో నీటిలో గట్టిగా పిండి పిప్పినివడపోసి, ఆ కషాయాన్ని తయారుచేసుకోవాలి. ఈ రకంగా తయారు చేసిన వేప ద్రావణాన్ని 15 మి.లీ/ 1 లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేసినచో పక్షులు గింజలను తినడానికి విముఖత చూపుతాయి. ఫలితంగా పక్షుల బారి నుండి పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చును. ఈ పద్ధతి ద్వారా 7 నుండి 10 రోజుల వరకు పక్షుల పంటను నష్టపరచకుండా కాపాడవచ్చు.

కోడి గుడ్డు ద్రావణం పిచికారి :

కుళ్ళిన కోడిగ్రుడ్లు సేకరించి వాటిని పగులగిట్టి ద్రావణాన్ని వేరుపర్చాలి. ఈ ద్రావణాన్ని 20 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి గింజ పాలుపోసుకొనే దశలో పంటపై పిచికారి చేసినట్లైతే ఆ వాసనలు పక్షులకు తీవ్రమైన చిరాకును కలుగచేయును. మరియు గింజలు రుచింపవు. అందువల్ల అవి పంట పొలాల వైపునకు రాకుండా దూరంగా పారిపోతాయి. దీని ద్వారా వచ్చే వాసన సుమారు 10-15 రోజుల వరకు పని చేసి పక్షులను రాకుండా చేస్తుంది. అవసరమైనచో రెండవ విడుత కూడా పిచికారీ చేసుకోవచ్చు.

ఈ పద్ధతికయ్యే ఖర్చు అతి స్వల్పం. ఒక ఎకరాకు 25 గుడ్లు అవసరం అవుతాయి. గుడ్డు ఒక్కింటికి రూ.3 చొప్పున 25I3= 75, ఒక కూలీ మనిషి ఒక రోజుకు రూ.150 మొత్తం ఒక ఎకరా పొలానికి అయ్యే ఖర్చు రూ.225

కాగితపు ప్లేట్‌ల పద్ధతి :

పొద్దుతిరుగుడు పంటలో గింజ పాలుపోసుకునే దశలో ఈ పద్ధతి సమర్ధవంతంగా పనిచేయును. ఇందులో ఒక వైపు వెండిపూతను పోలిన మెరుపు గల కాగితపు ప్లేట్లను తీసుకొని వెండిపూత పైవైపునకు వచ్చేటట్లు పువ్వుకాడకు అమర్చాలి. అప్పుడు సూర్యరశ్మి సోకినప్పుడు వెండిపూత తళతళ మెరిసి పక్షులు చూసుటకు తీవ్ర అసౌకర్యానికి గురవుతాయి. ఒకవేళ సూర్యరశ్మి లేకపోయిన పక్షులు వాలడానికి పేపర్‌ ప్లేట్‌లు ఆధారాన్నివ్వకుండా పువ్వులోని గింజలను తినకుండా చేస్తాయి. ఫలితంగా పువ్వుల్లో గింజ నష్టం అరికట్టబడుతుంది. ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నదైనప్పటికిని అనివార్యమైన పరిస్థితుల్లో ఈ పద్ధతి సమర్థవంతంగా పక్షుల బెడదను అరికట్టును. ఈ పేట్లు అన్ని కిరాణా షాపుల్లో లభిస్తాయి.

డా. ఎన్‌. కృష్ణ ప్రియ, సైంటిస్ట్‌, డా. ఎస్‌.ఎమ్‌.ఎమ్‌. మునీంద్ర నాయుడు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు