భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువులను సమగ్రమైన రీతిలో సమతుల్యంగా వాడుకోవడం ద్వారా భూమి నిస్సారం కాకుండా, నేల ఆరోగ్యం క్షీణించకుండా వరిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. సమగ్ర ఎరువుల యాజమాన్యంతో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువుల వాడకం ముఖ్యమైనది. అంటే పంటకు కావలసిన పోషకాలలో 75 శాతం రసాయనిక ఎరువుల ద్వారా, 25 శాతం సేంద్రీయ, జీవన ఎరువుల ద్వారా అందించినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు.

సేంద్రీయ ఎరువులు :

సేంద్రీయ ఎరువుల్లో చీకిన పశువుల ఎరువు (కంపోస్ట్‌) మరియు పచ్చిరొట్టె ఎరువులు ముఖ్యమైనవి. పశువుల ఎరువు లేదా పచ్చిరొట్టె ఎరువులను 10 టన్నుల చొప్పున వరి పైరు నాటడానికి 2,3 వారముల ముందు గానే పొలంలో వేసి దమ్ము చేయాలి.

జీవన ఎరువులు (అజొల్లా) :

వరి నాటిన వారం రోజుల్లో ఎకరానికి సుమారు 100 కిలోల అజొల్లా వేయాలి. 2-3 వారాలకు అది పెరిగి చాపవలే అల్లుకుంటుంది. పొలంలో నీటిని తీసి వేయడం వల్ల అది నేలకు అంటుకొని కుళ్లిపోతుంది. అజొల్లా స్థిరీకరించిన నత్రజని వరికి ఉపయోగపడుతుంది.

అజో స్పైరిల్లం:

1-2 కిలోల కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరా నేలపై వెదజల్లాలి. ఇది 8-16 కిలోల నత్రజని ఒక ఎకరానికి అందిస్తుంది.

అజటోబ్యాక్టర్‌ :

1-2 కిలోల కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరా నేలపై వెదజల్లాలి. ఇది 8-16 కిలోల నత్రజని ఒక ఎకరానికి అందిస్తుంది.

ఫాస్ఫో బాక్టీరియా :

ఇది భాస్వర సంబంధిత జీవన ఎరువు. 1-2 కిలోల కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరా నేలలో దుక్కిలో వేయవచ్చు. ఇది 10-12 కిలోల భాస్వరం ఎకరానికి అందిస్తుంది.

రసాయనిక ఎరువుల వాడకం:

నత్రజని ఎరువులు :

నత్రజని ఎరువుల వాడకంలో చాలా జాగ్రత్త వహించాల్సి వుంటుంది. ఎందుకంటే ఎరువులలోని నత్రజని నాలుగు విధాలుగా నష్ట మవుతుంది. అవి 1. నీటిలో కరిగి కొట్టుకొని పోవడం 2. ఆవిరైపోవడం 3. భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోవడం 4. నత్రజని వాయు రూపంలోకి మారి వాతావరణంలోకి కలిసి పోవడం.

సాధారణ నేలలలో దీర్గకాలిక రకాలకు హెక్టారుకు 80 కిలోల నత్రజని, మధ్య, స్వల్ప కాలిక రకాలకు 120 కిలోల నత్రజని వాడవలసి ఉంటుంది.

వరి పైరుకు నత్రజనిని అమ్మోనియా రూపంలో ఎక్కువగా తీసుకుంటుంది. కాబట్టి వరి పైరుకు వేసే నత్రజని ఎరువులలో యూరియా, అమ్మోనియం సల్ఫేట్‌ ముఖ్యమైనవి. వరి పైరుకు నత్రజనిని ముఖ్యంగా మూడు దశలలో అవసరమౌతుంది. అవి నాట్లు వేసేటప్పుడు, పిలకలు పెట్టే సమయంలో మరియు చిరు పొట్టదశలో. నత్రజనిని వేయవలసిన దానికన్నా అధికంగా వేసినప్పుడు చీడపీడలు సమస్య కూడా ఎక్కువవుతుంది.

భాస్వరపు ఎరువులు:

భాస్వరపు ఎరువును మొత్తం ఆకరి దమ్ములో వేసుకోవాలి. ఆకరి దమ్ములో భాస్వరం వేయడం వల్ల ఎరువు వేళ్ళకు దగ్గరగా ఉండి మొక్కలు గ్రహించుటకు అనువుగా ఉంటుంది. దీని వల్ల వేళ్ళ పెరుగుదల బాగుండి మొక్కలు పోషక పదార్థాలను బాగా గ్రహించగలుగుతాయి. భాస్వరం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం కుడా పెరుగుతుంది. హెక్టారుకు 60 కిలోల భాస్వరం నిచ్చు ఎరువును వాడుట మంచిది.

పొటాష్‌ ఎరువులు :

వరి పైరుకు హెక్టారుకు 40 కిలోల పొటాష్‌ నిచ్చు ఎరువులను వేసుకోవాలి. దీన్ని బరువు నేలల్లో ఆఖరి దుక్కిలో ఒకసారి వేసుకుంటే చాలు. అదే తేలిక నేలల్లో రెండు సమభాగాలుగా చేసి సగభాగం ఆకరి దమ్ములో ఒకసారి మరియు మిగతా సగం చిరు పొట్టదశలో వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు పొందవచ్చు. పొటాష్‌ ఎరువు గింజ నాణ్యతను పెంచడమే కాక పైరు చీడ పీడలు, బెట్టను తట్టుకునేలా చేస్తుంది. వరి పైరుకు వేసే పొటాష్‌ ఎరువులలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ముఖ్యమైనది.

జింకు లోపం:

వరి పైరులో జింకు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపించినప్పుడు పై నుండి మూడు లేక నాల్గవ ఆకు మధ్య ఈనె పసుపు పచ్చగా మారిపోతుంది. ముదురు ఆకు చివర తుప్పు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు చిన్నవిగా ఉండి పెళుసుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్‌ కలిపి పిచికారి చేసుకోవాలి. తీవ్రతను బట్టి 5-6 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని సవరించవచ్చు.

- యస్‌. నజ్మ, రీసర్చ్‌ అసోసియేట్‌ (క్రాప్‌ ప్రొడక్షన్‌)

బి. షైని ప్రియాంక, రీసర్చ్‌ అసోసియేట్‌ (ప్లాంట్‌ ప్రొటెక్షన్‌)

జి. ప్రసాద్‌ బాబు (కో-ఆర్డినేటర్‌)

కె. రాఘవేంద్ర చౌదరి (ఎస్‌.ఎం.ఎస్‌ ఎక్సెటెన్షన్‌)

ఏరువాక కేంద్రం, బనవాసి, ఫోన్‌ : 9989623810