తెలంగాణ వ్యాప్తంగా మిర్చి ధర ఒక్కసారిగా పతనమవ్వడంతో రైతుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకొని ఉద్యమ రూపం దాల్చింది. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే మిర్చి, పసుపు, ఎర్రజొన్న రైతులు ఉద్యమ బాట పట్టారు. ప్రధాన రోడ్లపై రాస్తారోకోలు చేపట్టారు. రైతుల సమస్యను పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతన్న స్వచ్ఛందంగానే ఆయా మార్కెట్‌ యార్డుల వద్ద ఉద్యమాలకు సిద్ధమైనారు. రోజు రోజుకూ పతనమవుతున్న క్వింటాళ్ళ ధరను పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో తెచ్చిన పంటకు సరైన రేటు రాక మార్కెట్‌ యార్డుల్లో రోజులు తరబడి కాలం గడుపుతున్నారు.

రైతుల్లో ఉన్న ఆవేశం ఉగ్రరూపం దాల్చకముందే ప్రభుత్వం రైతులు పండించిన పంటకు మద్ధతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గడచిన సంవత్సరంలో రైతులు చేసిన ఆందోళనలో అనేక పరిణామాలను చవిచూడాల్సి వచ్చింది. రైతుల్లో ఉద్రేకం ఉదృత రూపం దాల్చకముందే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఇటీవల కాలంలో భారీగా మద్దతు ధర పడిపోవడంతో అన్నదాతలు నష్టాల పాలవుతామనే ఆందోళన రైతుల్లో నెలకొంది.

గత సంవత్సరం దేశవ్యాప్తంగా మిర్చి పంట సాగు దిగుబడి నామమాత్రంగా ఉండడంతో రైతులకు కనీస మద్దతు ధరకు మించి గిట్టుబాటు ధర వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో మిర్చి పంట సాగు చేశారు. జాతీయ స్థాయిలో పంట విస్తీర్ణం పెరగడంతో అవసరానికి మించిన మిర్చి నిల్వలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఒక్క వరంగల్‌ జిల్లాలోనే 46 వేల హెక్టార్లలో మిర్చి పంటను సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది లక్షన్నర మెట్రిక్‌ టన్నుల వరకు మిర్చి బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతుండగా ఈ ఏడాది నాలుగున్నర లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా గణనీయమైన దిగుబడి రావడంతో మార్కెట్‌లో రైతుకు ధర ఆశించినట్లుగా ఉండడంలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన దళారులు వ్యాపారులతో కుమ్మకై రైతుల వద్ద నుండి పంటలను అతి తక్కువకు కొనుగోలు చేసేందుకు సిద్దపడుతున్నారు. మార్కెట్‌ యార్డుల్లో దళారులను, వ్యాపారులను నియంత్రించే వ్యవస్థ లేకపోవడంతో మిర్చి రైతులు ఎక్కువగా నష్టాలపాలౌతున్నారు. ఏదో ఒక సాకు చూపి కీలకమైన సమయంలో ధరలను తగ్గిస్తున్నారు. దీనికి మార్కెట్‌ అధికారులు సైతం వంత పలకడంతో దళారుల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు దళారుల ఆగడాల అన్యాయాలను అడ్డుకొనే స్థితిలో కూడా లేరనే విమర్శలు ఉన్నాయి.

వరంగల్‌ జిల్లాలో ఇటీవల రైతులు ఆందోళన చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో క్వింటాలు మిర్చికి రూ. 15 వందల వరకు బోనస్‌ ప్రకటించి నేటికీ అమలు చేయకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఏ మాత్రం బోనస్‌పై ఎటువంటి ఆలోచనా చేయడంలేదు. ఇతర పంటలకు బోనస్‌ ఇస్తున్నప్పటికీ మిర్చికి మాత్రం ఆ సదుపాయం లేకుండా చేశారు. ప్రభుత్వం మిర్చిని కొనేందుకు ముందుకు రాకపోవడంతో తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇటువంటి సమయంలో మిర్చి రేటు అమాంతం తగ్గడంతో రైతుల్లో ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు కల్పించి రైతులను ఆదుకోవాలి. పసుపు, ఎర్రజొన్నలు సైతం గిట్టుబాటు ధర కోసం రాస్తారోకలు నిర్వహించారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

తెలంగాణలో మిర్చి సాగు విస్తీర్ణం :

తెలంగాణ వ్యాప్తంగా 2018-19 సీజన్‌లో మిర్చి 2 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అత్యధికంగా ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో 45.025 ఎకరాలు, మహబూబాబాద్‌ 26.895 ఎకరాలు, గద్వాల్‌లో 15.722, వరంగల్‌ రూరల్‌లో 4.485 ఎకరాలల్లో సాగయ్యింది. దేశంలో మిర్చి ఎక్కువగా ఎపి. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మద్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాగవుతుంది. ఈసారి తెలంగాణలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల మిర్చి ఉత్పత్తవుతుందని అంచనా. ఖమ్మం, మహబూబాబాద్‌ ప్రాంతాల్లో తేజా రకం మిర్చిని అధికంగా పండిస్తున్నారు. ఈ మిర్చి నుండి నూనెను తీసి వివిధ రకాలుగా వినియోగిస్తుంటారు. చైనా, మలేషియా, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో ఈ ఆయిల్‌ను కారంగా ఉపయోగిస్తారు. ఈ ప్రాంతంలో పండించే తేజా రకం మిర్చి ఆధారంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చైనీయులు ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేశారు. తేజా రకం మిర్చికి జాతీయం, అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పంట ఉత్పత్తి సమయాల్లోనే దళారులు ధరను తగ్గించడం శోచనీయం. జనవరిలో కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల మిర్చి పంటకు వైరస్‌ సోకడంతో ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఎకరాకు 35-40 క్వింటాళ్ళ మధ్య పంట ఉత్పత్తి అయ్యేదని నేడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎకరాకు 20-25 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట ఆశాజనకంగా లేకపోవడం దీనికి తోడు మార్కెట్‌లో ధర పడిపోవడం రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.

తగ్గుతున్న ధరలు :

2 నెలల క్రితం రూ. 11.900 మిర్చి ధర ఉంది. ఇప్పుడు రూ. 5 వేలకు మించడం లేదు. కొన్ని మార్కెట్‌లలో రూ. 7 వేలకు కొంటున్నారు. మార్కెట్‌లోకి సరుకు ఎక్కువగా వచ్చిందంటే చాలు వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను అమాంతం పతనం చేస్తున్నారు. వర్షాలకు మిర్చి తడిసిందని దళారులు కారణాలు చెబుతూ ధరను తగ్గిస్తున్నారు. ఈ ఏడాది మిర్చికి సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో తెగుళ్ళు ఆశించడంతో రైతుకు పెట్టుబడి భారం పెరిగింది. దీనికి తోడు దిగుబడి తగ్గింది. మార్కెట్‌లో రైతుకు 10-12 వేలు మధ్య ధర ఉంటేనే కనీసం గిట్టుబాటు అవుతదని రైతులు విలపిస్తున్నారు. నేడు మార్కెట్‌లో మిర్చికి రూ. 5-6 వేలు వరకు మాత్రమే ధర వస్తుందని అది కూడా కొందరికే వస్తుందని మిగతా రైతులకు ఆ ధర రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

నాణ్యత లోపంతో తగ్గించిన ధరలు :

మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోవడంతో ధర తగ్గుతుందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయంగా మిర్చి ఎగుమతులు లేకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని అంటున్నారు. ఎగుమతులు నిలిచినందున పంట కొనుగోలు చేసేవారు ఆసక్తి కనబరచడంలేదని వ్యాపారస్తులు అంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తమిళనాడుకు చెందిన దళారులు రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ల నుండి మిర్చి కొనుగోలు చేస్తుంటారు. ఉత్పత్తి లేని అక్టోబరు, నవంబరులో మిర్చి ధర రూ. 12 వేలకు చేరింది. 2 ఏళ్ళ క్రితం గరిష్టంగా 16 వేలకు అమ్ముడైంది. ఈ ధరలను పోల్చుకొని రైతులు అత్యధిక విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు. పంట చేతికి అందే సమయానికి మిర్చికి రూ. 10 వేలైనా ధర వస్తుందని రైతులు భావించారు. కానీ ఆశలు అడియాశలైనాయి. రైతుల అవసరాలను ఆసరా చేసుకొని చేసే వ్యాపారాలు ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయించుకుంటున్నారు. కూలీలు ఇతర ఖర్చులకు తెచ్చిన పెట్టుబడులు తీర్చేందుకు రైతులు పంటను తెగనమ్ముకోక తప్పడంలేదు. దీన్ని అదునుగా భావించిన వ్యాపారులు ఇచ్చే ధరల్లో సైతం కోత పెడుతున్నారు. పంట తేమగా ఉందని, రంగు మారిందని కాణాలు చెబుతూ నాణ్యతాప్రమాణాల్లో సరుకు లేదంటూ ధరలను అమాంతం తగ్గించి రైతులను దోపిడీ చేస్తున్నారు.

కోల్డ్‌స్టోరేజిల్లో మాయాజాలం :

మార్కెట్‌ యార్డులలో రైతులు తెచ్చిన మిర్చి పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో ధర వచ్చినప్పుడే అమ్ముకునేందుకు పంటలు నిల్వ చేసుకునేందుకు సైతం ధరలు అందుబాటులో లేకుండాపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో కోల్డ్‌స్టోరేజిల్లో నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కూడా మోసాలే జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం రూ. 120లకే బస్తా చొప్పున 6 నెలల పాటు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ యాజమాన్యాలు రూ. 200 లకు పైగా ధరను పెంచేశారు. ఇదేంటని రైతులు నిలదీస్తే మావద్ద నిల్వకు అవకాశం లేదని తెగేసి చెబుతున్నారు. వరంగల్‌ మార్కెట్‌ యార్డు పరిసర ప్రాంతాల్లో సుమారు 50కి పైగా కోల్డ్‌ స్టోరేజిలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అవన్నీ నిండిపోయాయని రైతులను తిరిగి పంపుతున్నారు. తెచ్చిన పంటను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే అదనపు రవాణా చార్జీలు భరించక తప్పడం లేదు.

ఇప్పటికే రైతు తన ఊళ్ళలో నుండి మార్కెట్‌కు తీసుకురావడం ఒకెత్తయితే ఆ పంటను అమ్ముడుపోక కోల్డ్‌స్టోరేజిలకు తీసుకువెళ్ళడం మరోఎత్తుగా రెట్టింపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. ప్రభుత్వ సహకారంతో నిర్మించిన కోల్టుస్టోరేజిలు రైతులకు మాత్రం ఏ మాత్రం ఉపయోగపడలేకపోతున్నాయి. ధరలు లేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ట్రాన్సుపోర్టు చేసే లారీలు, ట్రాక్టర్ల యజమానులు కూడా రైతుల వద్ద నుండి ముందు డబ్బులిస్తేనే ట్రాన్స్‌పోర్టు చేస్తామని డిమాండ్‌ చేస్తున్నారు. గత్యతరం లేని పరిస్థితుల్లో కొత్త అప్పులు చేయక తప్పడం లేదు. ఒక్కొక్క కోల్డ్‌స్టోరేజిల్లో లక్ష బస్తాలు చొప్పున నిల్వ చేసే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ వాటిలో సామర్ధ్యం దాటి నిల్వ చేశామని కోల్డ్‌స్టోరేజిల యాజమాన్యాలు తెలుపుతున్నారు.

సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడులు పెట్టి స్టోరేజి చేసుకునే స్తోమత లేక మార్కెట్‌ యార్డుల్లో రోడ్ల పక్కన నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణం సహకరించక పంట రంగు మారిపోతుంది. దీనితో పంట నాణ్యత లేదన్న సాకుతో వ్యాపారులు ధరలను అమాంతం తగ్గిస్తున్నారు. కొన్ని చోట్ల కోల్డ్‌స్టోరేజిల్లో నిల్వ అవకాశం ఉన్నప్పటికీ నేరుగా రైతులు వెళ్లి అడిగితే లేదని యాజమాన్యాలే దళారులను ఏర్పాటు చేసుకొని రైతు వద్ద బేరమాడుతున్నారు. రెట్టింపు ధరలు ఇస్తామంటే నిల్వ చేసే అవకాశం ఇస్తున్నారు.

వర్షాలతో నాణ్యత తగ్గింది :

రైతులు పండించే పంట కీలకమైన సమయంలోనే వర్షాలు రావడంతో మిర్చి నాణ్యత తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ధరల్లో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. సీజన్‌లో ఎంతైనా రూ 7 వేల కంటే తగ్గదని అంటున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధర రూ. 8 వేల కన్నా ఎక్కువ ధరే ఉంది.

- లక్ష్మీభాయ్‌, డైరెక్టర్‌ మార్కెటింగ్‌ శాఖ

ఉత్పత్తిని బట్టి ధర నిర్ణయం :

గత ఏడాది రైతులు చేసిన ఆందోళనతో సర్కారు క్వింటాలుకు రూ. 2,300/-తో కొనుగోలు చేసింది. అప్పుడు రూ. 1600 కూడా కొనేందుకు ముందుకు రాని వ్యాపారులు పెరిగిన ధరతో 50 వేల క్వింటాళ్ళ పంటను రైతులను బతిమలాడి తీసుకున్నారు. ప్రభుత్వం సరుకును మార్కెట్‌ చేసుకోవడంలో విఫలం చెందడం వల్ల సుమారు రూ. 50/- కోట్ల ఏర్పడింది. మళ్ళీ కొనాలంటే ప్రభుత్వం ససేమిరా అంటుంది. ఏటా రూ. 40/- వేల నుండి రూ. 50 /- వేల వరకు పంట సాగవతుంది. డిమాండ్‌కుపైబడి ఉత్పత్తి కావడంతో వ్యాపారులు ఢిల్లీ మార్కెట్‌కు అనుగుణంగా కమీషన్లు, ఖర్చులు మినహాయించుకొని ధరను నిర్ణయిస్తున్నారు. రూ. 1500 నుండి 1800 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌లో ఎర్రజొన్నటకు రూ. 2800 వరకు ధర ఉన్నట్లు తెలుస్తుంది. రైతులు మాత్రం తమ రూ. 3,500/- ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని 15 మండలాల్లో ఈ ఆందోళన ఉధృతంగా సాగుతుంది.

కన్నెర్ర చేసిన ఎర్రజొన్న రైతులు :

జాతీయ రహదారిపై వంట - వార్పు :

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు ప్రాంత రైతులు పండిస్తున్న పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకలు నిర్వహించారు. జాతీయ రహదారిపై బైటాయించిన రైతులు వంట- వార్పు చేపట్టారు. పసుపు క్వింటాలుకు రూ. 15 వేలు, ఎర్రజొన్నకు రూ. 3500 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున రైతులు నినదించారు. రైతులు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చారు. 8 నెలల పాటు రేయింబవళ్ళు కష్టపడి పండించిన పసుపు పంటకు సరైన రేటు కల్పించడం లేదని వ్యాపారులు, దళారులు కుమ్మకై క్వింటాలుకు రూ. 4-5 వేల వరకు చెల్లించుతున్నారని దీనితో పెట్టుబడి ఖర్చుల సైతం తమకు దక్కడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్మూరు డివిజన్‌లో వేల ఎకరాల్లో పండిస్తున్న ఎర్రజొన్నలకు గిట్టుబాటు కల్పించడంలేదని రైతులు క్వింటాకు 3,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ అధికారులు రైతు డిమాండ్లకు సానుకూల స్పందన చెప్పకపోవడంతో జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బందించి రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో ఆందోళణ విరమించారు. రైతు సంఘాల నాయకులను ముందు జాగ్రత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆమరణదీక్ష దిశగా రైతులు :

ఆర్మూరు కేంద్రంగా గతంలో రైతులు అనేక ఉద్యమాలు కొనసాగాయి. ఎర్రజొన్న ధర కోసం రైతులు ఉద్యమిస్తే ఏకంగా పోలీసు కాల్పుల వరకు వెళ్ళింది. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమ నాయకుల్లా ఉన్న కెసిఆర్‌ ఆ పోరాటానికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. అదే కోవలో ఉద్యమానికి అక్కడి రైతులు దీక్షలు చేపట్టేందుకు సిద్దమౌతున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు ప్రతి ఇంటి నుండి ఒక్కొక్క మహిళా రైతు ఆందోళనకు సిద్ధమవుతామని రైతులు పిలుపునిస్తున్నారు.

మద్ధతుకు పర్యవేక్షణ ఏది? :

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జులైలో 14 రకాల పంటలకు మద్ధతు ధర పెంచింది. వరికి రూ. 200, పత్తికి రూ. 1,130, కందులకు రూ. 225, మినుముకు రూ. 200, వేరుశనగకు రూ. 400, సజ్జకు రూ. 525, రాగులకు రూ. 997, పెసర్లకు రూ. 1400, నువ్వులకు రూ. 949, పొద్దుతిరుగుడుకు రూ. 1288, సోయాబీన్‌కు రూ. 349 చొప్పున ధరలు పెంచారు. ఈ ధరలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. పెరిగిన ధరలు, అటుంచి పాత ధరలు కూడా అందడం లేదు. కేంద్రం ప్రకటించిన ధరలు అమలవుతున్నాయా లేదా ప్రకటిత ధరలు రైతులకిస్తున్నారా అని పర్యవేక్షించే నాధులే కరువయ్యారు.

పంట ప్రభుత్వ మద్ధతు ధర మార్కెట్‌ ధర
పత్తి రూ. 5,450 రూ. 4,600 - 5000
పసుపు - రూ. 4,500 - 5000
కందులు రూ. 5,675 రూ. 5,000 - 5,200
మొక్కజొన్న రూ. 1,700 రూ. 1,900 - 2000
మినుములు రూ. 5,600 రూ. 5,000 - 5,200
పెసలు రూ. 6,975 రూ. 6,400 - 6,500
సోయాబీన్‌ రూ. 3,399 రూ. 2,900 - 3,000

-ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి