మనిషి వ్యాపకం వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా తన సంతతి జీవితాలు సుఖప్రధానంగా కొనసాగడానికి అవసరమైన సంపాదన సమకూర్చడం కోసమే. సాగు ఖర్చులు గణనీయంగా పెరగడం, గిట్టుబాటు ధరలు లభించలేకపోవడం వల్ల రైతు నిత్యం కష్టాలతోనే కుస్తీపడుతున్నారు. అయినా సాగుకు దూరమవ్వకుండా ఆదాయం పెంచుకునేందుకు రైతులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఖర్చులు తగ్గించి ఆదాయం పొందే పంటలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది. నేడు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించే పంట శ్రీగంధం సాగు రైతులకు లాభాలనిచ్చే పంట.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన హర గోవిందరావు విజయగాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదే జిల్లాలోని గంపలగూడెం మండలం మెట్టుగూడెంలో మొదట 7 ఎకరాల మెట్ట పొలంలో మామిడి, బత్తాయి చెట్లను ఆయన నాటారు. ఎంతో సారవంతమై ఎర్రగరప నేల అయినప్పటికీ రాళ్ళు, రప్పలతో నిండి ఉండడం వల్ల చెట్లు ఏపుగా పెరగకపోవడంతో యంత్రాల సహాయంతో నేలను కుళ్ళగించి, పెద్ద పెద్ద బండ రాళ్ళను పొలం గట్లకు తరలించి రక్షణ వలయంగా ఏర్పరచారు. పశువులు, ఇతర చొరబాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకొని ఇక నీటి వనరులకోసం భగీరథ ప్రయత్నమే చేశారు.

రాళ్ళు, రప్పలతో కఠిన శిలావృతంగా ఉన్న భూమిలో నుండి జలాలను వెలికి తీసేందుకు, వాటిని సక్రమంగా మొక్కల మొదళ్ళకు పంపిణీ చేసేందుకు బిందు సేద్య పద్ధతిలో సాగు ప్రారంభించారు. వేసిన 10 బోర్లలో రెండిండిలో మాత్రమే నీరు లభించడం వాటిని సక్రమంగా వినియోగించుకునేందుకు డ్రిప్‌ను ఏర్పాటు చేశారు. అయినా మామిడి, బత్తాయి పంటలపై ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో ఆ దుస్థితి నుండి బయటపడేందుకు తీవ్రంగా ఆలోచించిన గోవిందరావు నిరుత్సాహపడకుండా చనిపోయిన బత్తాయి మొక్కల స్థానంలో మరికొన్నింటిని నాటి కొంత కాలానికి ఆశించిన ఫలసాయం రావచ్చుననే ఆశపడ్డారు. కానీ ఆశ నెరవేరలేదు. ప్రత్యామ్నాయ పంటల దిశగా ఆలోచిస్తున్న గోవిందరావుకు అప్పుడే ఆశాజనకంగా ఉన్నదని ఆనోటా, ఈనోటా విని శ్రీగంధం కలప పంటను సాగు చేయడం ప్రారంభించారు.

2011 సం||లో మామిడితో పాటు విస్తారంగా శ్రీగంధం మొక్కలు నాటి జీవిత చరమాంకంలోనైనా తగిన ఆదాయం లభించి ఫలితాన్ని పొందవచ్చునని ఆశతో సాగు ప్రారంభించారు. మామిడి పంట ద్వారా ప్రతి సంవత్సరం కొంత ఆదాయాన్ని కళ్ళ చూస్తూనే దశాబ్దాల ఎదుగుదలతో శ్రీగంధం ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టగలదని ఆయన ఆశ నెరవేరే సూచనలు ఆశాజనకంగా కనిపించాయి. నేడు మొక్కలతో పాటు గోవిందరావు ఆశలు కూడా చిగురించి ధరలు కూడా పెరగడం ప్రారంభించాయి. 2011లో శ్రీగంధం చావ విలువ కిలోకు రూ.2-3 వేలు పలకగా 2015 నాటికి ఆ ధర కిలోకు రూ.6 వేలు, ప్రస్తుతం రూ. 10 వేలకు పెరగడంతో శ్రీగంధం సంపదల సుగంధంగా మారి రైతు గోవిందరావును సంతోషానికి గురిచేసింది.

శ్రీగంధం మొక్కలు నాటి 12-13 సంవత్సరాలు ఓపికగా పెంచగలిగితే ఒక్కో చెట్టునుండి 40-75 కిలోల వరకు శ్రీగంధం చేవ లభించే అవకాశం ఉండడం, ధర అధికంగా ఉండడంతో గోవిందరావు కలలు విజయతీరానికి చేరుకున్నాయి. అంటే ఒక్కో చెట్టుకు కనీసం రూ. 2 లక్షలు ఆదాయం స్థిరపడిందన్నమాట. ఈ చెట్లు పెరిగే కాలంలో దశాబ్ధంన్నర కాలం పాటు అనేక అంతర పంటలు వేసుకొని తాత్కాలిక ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉండడం, పుష్కరకాలం పడిన శ్రమకు కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలగడంతో రైతు కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది. వ్యవసాయం దండగని, ఈ రంగంలో ఒడిదుడుకులను ఎదుర్కోలేక వృత్తిని విడిచివెళుతున్న వారికి ఇది దండగ కాదు, పండగని నిరూపించే అవకాశాన్ని దక్కించుకున్న గోవిందరావు అనుభవాలను ఇప్పుడు సోదాహరణంగా తీసుకుందాం...

ఈ కలప పంట సాగుకు పెట్టుబడి అతితక్కువే :

శ్రీ గంధం సాగులో రైతు పెద్దగా పెట్టుబడి పెట్టి మొక్కలను పెంచాల్సిన అవసరం ఉండదు. మంచి పదునైన భూమిలో, తగు మోతాదులో నీరు లభించేటట్లు భూగర్భ జలాలను వెలికి తీసి డ్రిప్‌తో సాగు చేసుకోవడం వల్ల సునాయాసంగా ఈ అటవీతరహా మొక్కలు వాటంతట అవే పెరుగుతాయి. ప్రాథమికంగా నర్సరీ నుండి మొక్కలను కొని గుంతలు తీసి వాటిని నాటడంతోనే సాగు ప్రారంభమౌతుంది. ఆ తరువాత మొక్కను నాణ్యంగా పెంచడానికి, ఫలసాయాన్ని అధికంగా రాబట్టుకోవడానికి, దానిలోని చేవ (చెట్టులోని నల్లటి భాగం) ఎక్కువగా ఉండడానికి కృషి చేయడం ఒక్కటే మార్గం. దీనికి గోవిందరావు చెప్పే సలహాకూడా మంచిగానే అనిపిస్తుంది. నర్సరీల నుండి కాక నేరుగా విత్తనాల నుండి మొలపించిన మొక్కలే చేలో పెరిగితే చేవ అధికంగా ఉంటుందని ఆయన తోటి రైతులకు సలహా ఇస్తున్నారు. మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, సుబాబుల్‌, మలబార్‌ వేప లాంటి సుమారు 20 రకాల చెట్లను అంతర పంటలుగా సాగు చేసి అధిక లాభాన్ని పొందవచ్చునని శాస్త్రవేత్తలు కూడా సూచిస్తున్నారు.

శ్రీ గంధం పెరిగి పెద్దదై, ఫలితాలను ఇచ్చే నాటికి ఈ అంతర పంటల ద్వారా దాని సాగుకయ్యే ఖర్చుల కంటే మిన్నగా ఆదాయాన్ని పొందే అవకాశం ఉన్నందున రైతులు నిరాశపడే పనేలేదు. ప్రస్తుతం ఉన్న ధర, మార్కెట్‌ అవకాశాలు, ప్రపంచ వ్యాప్తంగా భారత శ్రీగంధానికి ఉన్న డిమాండ్‌ ఇవన్నీ తోడై రైతు జీవితాల్లో వెలుగులు నింపడం ఖాయమని గోవిందరావు చెబుతున్నారు.

సేంద్రియ పద్ధతుల్లో శ్రీ గంధం సాగు :

సాధారణంగానే సహజ అడవుల్లో పెరిగే శ్రీ గంధం చెట్లు సాగుకు ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన పనిలేదు. సహజ సేంద్రియ పద్ధతుల్లో భూసారాన్ని పెంచి వాటి వేరు వ్యవస్థను బలం చేస్తే చాలు. గోవిందరావు తోటలో శ్రీ గంధంతో పాటు అంతర పంటగా మామిడి కొనసాగుతుంది. మామిడి మొక్కలను కూడా సేంద్రియ పద్ధతుల యాజమాన్యంతో పెంచడం వల్ల శ్రీగంధం చెట్లను అదనపు బలం, నాణ్యతలభిస్తుంది. రసాయ ఎరువులు, క్రిమిసంహారకాలు లేని సాగు వల్ల మంచి ఆరోగ్యకరమైన విష రసాయన అవశేష రహిత మామిడి పండ్ల దిగుబడితో పాటు, బహువార్షిక పంటైన శ్రీ గంధం సాగు సుగంధాలు వెదజల్లుతుంది. శ్రేష్టమైన ఆవుపేడను భూసార పెంపుకు వినియోగించడం, మామిడిలో చీడపీడల నివారణకు జీవామృతాన్ని తయారు చేయించి వినియోగించడం జరుగుతుంది. చెట్ల మొదళ్ళలో, డ్రిప్‌ ద్వారా వీటిని అందించడం వల్ల భూసారం పెరగడంతో పాటు కీటకాల నివారణతో పాటు, భూమి గుల్లగా మారడంతో సేంద్రియ కర్బనాలు అభివృద్ధి చెంది చెట్టు వేళ్ళు శ్రీఘ్రగతిని చొచ్చుకుపోయి విస్తరించే అవకాశం విసృతంగా ఏర్పడడంతో మామిడితో కూడిన శ్రీగందం సాగు వర్ధిల్లుతుంది.

శ్రీగంధం తోటలో అంతర కృషిని నిషేదించామంటున్నారు రైతు గోవిందరావు. అంతర కృషి వల్ల వేళ్ళు తెగిపోయి శ్రీ గంధం మొక్క అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఆయన అంటున్నారు. చెట్ల మొదళ్ళ చుట్టూ ఏపుగా పెరిగిన గడ్డిని నిర్మూలించి చుట్టూ పాదులు చేయించి, సేంద్రియ పదార్ధాలను వాటిలో వినియోగించడం వల్ల భూసారం పెరిగి వృక్షం తేజోవంతమవుతుందని గోవిందరావు భావన. సహజ ఎరువుల కొరకు గెర్రెలు, మేకలను మందవేయించడం, రాత్రిళ్ళు కూడా ఆ జీవాలను తోటలోనే ఉంచడం వల్ల వాటి మలమూత్రాదులతో నేల సారవంతంగా మారుతుందని తద్వారా చెట్లు ఏపుగా పెరుగుతున్నాయిని గోవింద రావు తెలిపారు.

శ్రీ గంధం పెంపు - అవరోధాలు :

శ్రీ గంధం పంటకు ఉన్న విలువ దృష్ట్యా, అటవీ శాఖ నిబంధనలు, కఠినతరమైన ప్రభుత్వ ఆంక్షలు ఉన్నందున వీటిని అమ్ముకోవడం కష్టతరంగా మారింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలానికి చెందిన ఇస్తారపు రెడ్డి అనే మాజీ సైనికుడు 2003లో మొక్కలు నాటగా 2014 నాటికి 18 చెట్లు పెద్దవై కోతకు వచ్చాయి. వాటిని అమ్ముకోవడం కొరకు అటవీశాఖాధికారుల చుట్టూ ఏడాదిన్నర కాళ్ళరిగేటట్లు తిరిగి విసిగివేసారిపోయి, చాలా ఏళ్ళ క్రితమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సంపాదించి అటవీ శాఖ అధికారులతో అతికష్టం మీద అనుమతి పొంది శ్రీ గంధం చెట్లను (18) నరికి 36 లక్షలకు విక్రయించాడు. ప్రభుత్వాధికారుల్లో శ్రీగంధంపై అవగాహన లేకపోవడం, నిరుత్సాహపరచడం వల్ల దీని సాగు విస్తరించడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిబంధనలను సడలించి దీన్ని ప్రోత్సహించే పథకాన్ని చాలా ఏళ్ళ క్రితమే ప్రారంభించింది. కొన్ని నిధులను కేటాయించి కేంద్ర ఔషద బోర్డు ద్వారా సాగును ప్రోత్సహిస్తుంది.

ఈ మేరకు అటవీశాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే శాఖల మధ్య సమన్వయం లేక సాధారణ రైతులు దీన్ని సాగుచేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఈ అన్ని అవరోధాలను అధిగమించి తెలుగు కాష్ట్రాల్లో ఇప్పుడు సుమారు 25 వేల ఎకరాల్లో శ్రీగంధం సాగవుతుంది. దీన్ని సాగు చేసి రైతులు కోటీశ్వరులవుతున్న దృష్టాంతాలు ఉన్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని సాగును ప్రోత్సహిస్తే ఈ పంట ద్వారా రైతే రాజు కాగలడనేది సాగుదారుల విశ్వాసం....

- దాసరి ఆళ్వారస్వామి, జర్నలిస్టు,

కుందేరు, ఫోన్‌ : 9393818199