మొక్కజొన్నను ఒకే నేలలో పండించినప్పుడు రకరకాల తెగుళ్ళు ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. తెగుళ్ళ తీవ్రత నేల స్వభావం, పండించే రకం మరియు వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. రబీ మొక్కజొన్నలోని ముఖ్యమైన తెగుళ్ళు మరియు వాటి నివారణ గురించి తెలుసుకుందాం....

ఆకు ఎండు తెగుళ్ళు :

మొక్కజొన్నను ఆశించే తెగుళ్ళలో ముఖ్యమైనవి ఆకు ఎండు తెగుళ్ళు

ఇవి రెండు రకాలు :

మొదటి రకం :

1. తెగుళ్ళలో ఆకులపై మచ్చలు కోలగా ఉండి నీటితో తడిచినట్లుగా కనిపిస్తాయి.

2. క్రమంగా ఈ మచ్చల పరిణామం పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి.

3. ఎక్కువ తేమగల వాతావరణంలో మొక్కలు చనిపోతాయి.

మొదటి రకం :

1. ఎండు తెగులు ఆకులపై చిన్న చిన్న కోలగా ఉండే బూడిద (లేక) గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.

2. తరువాత ఈ మచ్చల పరిమాణం పెరిగి దీర్ఘచతురస్రాకారంగా మారతాయి.

3. వాతావరణంలో తేమ మరియు ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

నివారణ :

ఈ శిలీంద్రం పంట అవశేషాల్లో జొన్న మరియు సుడాన్‌ జాతి గడ్డి మొక్కలపై జీవిస్తుంది. కాబట్టి జొన్న మరియు సుడాన్‌ జాతి గడ్డి మొక్కలను నాశనం చేయాలి. అలాగే మొక్కజొన్న పైరు అవశేషాలను తీసివేయాలి.

తెగులును తట్టుకునే డి.హెచ్‌.యమ్‌ 115, 117, 119, 121 రకాలను రకాలను సాగు చేసుకోవాలి.

మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి ఆకు ఎండు తెగుళ్ళను నివారించుకొనవచ్చును.

బూజు తెగులు :

మొక్కజొన్న పంటను బూజు తెగులు ఆశించినట్లయితే ఆకులు వంకర తిరిగి ముడతలు పడటం వంటి లక్షణాలు గమనించవచ్చు.

ఇటువంటి మొక్కలలో పిలకలు ఎక్కువగా ఏర్పడి మొక్కలు గిడసబారిపోతాయి.

ఆకులపై పసుపు పచ్చని పట్టీలు ఏర్పడడమే కాకుండా పొడవుగా చీలిపోతాయి.

కొన్ని సార్లు తెగులు తీవ్రత వల్ల ఆకుల అడుగు భాగాన శిలీంద్రం యొక్క పెరుగుదలను కూడా గమనించవచ్చు.

పూత దశ కంటే ముందు తెగులు ఆశించినట్లయితే మొక్కలు పూర్తిగా చనిపోతాయి. వ్యాప్తి అధిక తేమ మరియు వాతావరణ ఉష్ణోగ్రత20-200 సెం. ఉన్నప్పుడు తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.

నివారణ :

మెటలాక్సిల్‌ 4 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

మొక్కలపై తెగుళ్ళ లక్షణాలు గమనించినప్పుడు మెటలాక్సిల్‌ 2 గ్రా. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

తుప్పు తెగులు :

పంట పెరిగిన కొలదీ ఈ పొక్కులు గోధుమ రంగు నుండి నలుపు వర్ణానికి మారతాయి. అధిక తేమ గల చల్లని వాతావరణంలో తుప్పు తెగులు ఉధృతి మరియు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

నివారణ :

తెగులును తట్టుకునే డి.హెచ్‌.యం 115 రకాన్ని సాగు చేయాలి.

మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు నీటిలో కలిపి తెగులు తీవ్రతను బట్టి ఒకటి లేక రెండు సార్లు పిచికారి చేయాలి.

పాము పొడ తెగులు :

నేలకు దగ్గరగా ఉండే కింది ఆకుపై బూడిత మరియు గోధుమ రంగు మచ్చలు ఒకదాని తరువాత ఒకటి ఏర్పడి చూడడానికి ''పాముపొడ'' మాదిరిగా కనిపిస్తాయి.

ఇవి ఆకుల నుండి కాండానికి వ్యాపిస్తాయి.

ఇలా కాండానికి సోకినప్పుడు కణుపుల వద్ద విరిగి మొక్క నేలపై పడిపోతుంది.

నివారణ :

తెగులు ఆశించే ప్రాంతాల్లో తెగులు సోకకముందే ప్రోపికొనజోల్‌ 1 మి.లీ. (లేదా) హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. వాలిడామైనిన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

నేలకు దగ్గరగా ఉన్న ఒకటి లేదా రెండు తెగులు సోకిన ఆకులను తీసివేయాలి.

శిలీంద్రం మొక్కజొన్న మొక్కల అవశేషాల్లా మరియు కలుపు మొక్కలపై జీవించి ఉంటుంది. కాబట్టి వెంటనే వాటిని నిర్మూలించాలి.

మసికుళ్ళు :

మసికుళ్ళు తెగులు వేడి వాతావరణంలో మొక్కజొన్న సాగు చేసే ప్రాంతాల్లో కనిపిస్తుంది.

పంటకోత సమయంలో ఈ తెగులు స్పష్టంగా కనిపిస్తుంది.

తెగులు సోకిన కణుపు మధ్య భాగాలు కుళ్ళి నలుపుగా మారి మొక్కలు ఎండిపోతాయి.

పంట కోతకు రాకముందే కాండం భాగం విరిగి నేలపై పడిపోతుంది.

కాండం చీల్చి గమనించినట్లయితే అనేకమైన స్కిరోషియా బీజాలు కణజాలంపైన మరియు బెండు కింది భాగంలో కనిపిస్తాయి.

ఈ తెగులు నేల పై భాగంలో ఒకటి (లేక) రెండు కణుపులకు మాత్రమే సోకుతుంది.

పూత దశ నుండి నీటి ఎద్దడి ఉన్న పైరులో ఈ తెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉంది.

కాండం కుళ్ళును కలిగించే శిలీంద్ర బీజాలు నేలలో మరియు మొక్కల అవశేషాల్లో జీవించి ఉండి నేలలో తేమశాతం తగ్గినప్పుడు మరియు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మొక్కజొన్న పంటను తీవ్రంగా ఆశిస్తాయి.

నివారణ :

పంట వేసే ముందు పచ్చిరొట్ట పంటలను పండించి నేలలో కలియదున్నాలి.

ట్రైకోడెర్మా శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి వరుసగా 3-4 సం|| భూమిలో కలపాలి.

మాంకోజెబ్‌ 2.5 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి.

ఎండాకాలంలో నేలను లోతుగా దున్నుకోవాలి.

పంట కోసిన తరువాత తెగులు ఆశించిన మొక్కల భాగాలను కాల్చివేయాలి.

తెగులును తట్టుకునే డి.హెచ్‌.యం 115, 121 రకాలను సాగు చేయాలి.

తెగుళ్ళు ఆశించినప్పుడు ఈ పంటలో దిగుబడులు గణనీయంగా తగ్గి రైతుకు అపారమైన నష్టం కలుగచేస్తాయి. కావున సరైన సమయంలో మొక్కజొన్నలో తెగుళ్ళను గుర్తిచి సస్యరక్షణ చర్యలు చేపట్టడం పంట మార్పిడి పాటించడం వల్ల రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు.

డా|| ఎ. విజయభాస్కర్‌, డా|| మంజులత,

డా|| రజనీకాంత్‌, డా|| ఉష శ్రీ, డా|| శ్రావణి,

వ్యవసాయ పరిశోధనా స్థానం, కరీంనగర్‌,

పి.జె.టి.ఎస్‌.యు, ఫోన్‌ : 9849817896