మన తెలంగాణ రాష్ట్రంలో నిమ్మతోటలు 0.06 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 0.77 లక్షల టన్నుల దిగుబడిని ఇస్తుంది. మన రాష్ట్రంలో నల్గొండ, యాదాద్రి, సూర్యపేట మరియు మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగుచేయబడుతుంది. నిమ్మకాయ చెట్లు దాదాపుగా గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఇంటి పెరటితోటలో పెంచుకుంటున్నారు. ఇది ఒక అమృత ఫలం. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న అత్యధిక పోషకవిలువలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న పండు. సంవత్సరం పొడవునా అందరికీ అందుబాటులో ఉంటుంది.

దీనిలోని సుగుణాలు తెలియక చాలా మంది దిష్టి తీయడానికి మాత్రమే దీన్ని వాడతారు. మరికొందరు వేసవికాలంలో మాత్రమే దీన్ని తీసుకోవాలి. శరీరానికి చలువచేస్తుంది అని నమ్ముతున్నారు. కాని దీని ఆవశ్యకత, ఔషధ గుణాల విలువలు తెలుసుకుంటే చవుకగా దొరికే అత్యద్భుత ఫలం అంటారు.

కొందరికి చాలా అపోహలు నిమ్మరసంపై ఉంటాయి. అంటే చలికాలం, వర్షాకాలంలో తాగితే జలుబు చేస్తుంది. నిమ్మరసం తాగితే (పులుపు కాబట్టి) అల్సర్‌ వస్తుంది అని దీన్ని దూరం పెడతారు.

ప్రతిరోజు నిమ్మరసం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ క్రింద వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి నిమ్మపండు ప్రయోజనాలను పొందాలి.

ఉదయం పూట నిమ్మరసం త్రాగడం వల్ల కలిగే లాభాలు :

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనితో పాటు బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్ఫెక్షన్‌ల నుండి మనకు రక్షణ ఇస్తుంది. ప్రధానంగా జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరాలు తగ్గిపోతాయి.

శరీరంలో యాసిడ్‌ పరిణామాలు (ఆమ్ల పరిమాణాలు) సమతుల్యం అవుతాయి. ఇది సహజంగా ఆమ్ల గుణాలను కలిగి ఉంటుంది. కాబట్టి శరీర ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి.

వ్యర్థాలను తొలగిస్తుంది. అనగా శరీరంలో పేరుకుపోయిన విషపదార్ధాలు తొలగిపోతాయి. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. రోజంతటికీ కావలసిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.

యాంటి ఏజెంట్‌ అనగా వయసు మీద పడడం వల్ల వచ్చే (చర్మంపై) ముడతల తొలగిపోతాయి. అంటే వార్ధక్య ఛాయలను దూరం చేస్తుంది ఈ నిమ్మరసం. చర్మకాంతిని పెంచే ఔషధగుణాలు ఇందులో ఉంటాయి.

రక్తంలోని గ్లూకోజ్‌ పరిమాణంను నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిక్‌ నియంత్రణలోకి వస్తుంది. ఇతర జబ్బులు రాకుండా కూడా కాపాడును.

శరీరం ఐరన్‌ను గ్రహించేందుకు నిమ్మరసంలో ఉన్న విటమిన్‌ 'సి' తోడ్పడుతుంది. దీంతో రక్తహీనత వంటి జబ్బులు తగ్గుతాయి. మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

ఉదయాన్నే నిమ్మరసం తాగడంవల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్దకం పోతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు, అజీర్ణ సమస్యలు మాయమవుతాయి. జీర్ణాశయం పేగుల్లో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి.

కిడ్నీలలో రాళ్ళుపోవాలన్నా, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలన్నా నిత్యం నిమ్మరసం తాగాల్సందే.

పలురకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్‌ కణాల వృద్ధి ఆగిపోతుంది. యాంటి ఆక్సిడెంట్స్‌ ఈ నిమ్మ రసంలో పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్‌ కణాలు నాశనం అవుతాయి.

గమనిక :

నిమ్మరసాన్ని నీటితో కాని లేదా ఏదైనా పదార్థంలో కలుపుకొని మాత్రమే సేవించాలి.

నిమ్మరసం లేదా నిమ్మ పండుతో విలువ ఆధారిత ఉత్పత్తులు :

అల్లంతో కలిపిన నిల్వ నిమ్మ రసం (లెమెన్‌ స్క్వాష్‌)

తయారీకి కావలసిన పదార్థాలు :

నిమ్మ కాయలు   : 12 (పెద్ద సైజులో ఉన్నవి)

అల్లం     : 150 గ్రా.

పంచదార     : 4 కప్పులు (800 గ్రా.)

నీళ్ళు     :300 మి.గ్రా., (1 1/2 గ్లాసులు)

తయారీ విధానం :

ముందుగా నిమ్మ పండ్ల నుండి నిమ్మరసాన్ని తీయాలి. ఈ 12 నిమ్మ పండ్ల నుండి సుమారుగా 400 మి.లీ. (అనగా 2 కప్పుల రసం అవుతుంది) రసం వస్తుంది. దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. అల్లం పొట్టు తీసి ముక్కలు చేసి మిక్సీలో వేసి రుబ్బి వడపోసి రసం తీయాలి. ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్ళుపోసి, పంచదార వేసి కలపాలి. ఆ విధంగా మరగబెడుతూ చిక్కగా అయ్యే వరకు (గులాబ్‌జామ్‌ కోసం చేసే పంచదార పాకం లాగా రావాలి) మరిగించాలి.

బెల్లంతో తియ్యని నిమ్మకాయ పచ్చడి :

తయారీకి కావలసిన పదార్థాలు :

నిమ్మ కాయలు   : 500 గ్రా., (శుభ్రమైనవి)

ఉప్పు   : 60 గ్రా., (3 టేబుల్‌ స్పూన్‌)

బెల్లం   : 600 గ్రా

నీళ్లు   : 1/2 కప్పు

యాలులు   : 4

అల్లం పొడి   : 1 టీస్పూన్‌

నల్ల ఉప్పు   : 2 టీస్పూన్లు

గరం మసాలా   : 1 టీస్పూన్‌

కారం   : 1/2 టీ స్పూన్‌ (అవసరం అయితే)

తయారీ విధానం :

ముందుగా నిమ్మకాయలను కడిగి శుభ్రంగా తుడిచి పచ్చడికోసం ఉండే ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. గింజలను తీసివేయాలి. ఈ ముక్కలను ఒక గాజు గిన్నెలో వేసి అందులో 60 గ్రా. ఉప్పు వేసి కలిపి 15-20 రోజుల వరకు నిల్వ చేయాలి. ప్రతి రెండు రోజులకు ఒకసారి కలపాలి. తరువాత నిమ్మ ముక్కలు మెత్తగా తయారవుతాయి.

600 గ్రా. బెల్లాన్ని ఒక మూకుడులోకి తీసుకొని 1/2 కప్పు నీళ్ళు పోసి బాగా కలిపి ఇందులో నలకలు లేకుండా చూసుకోవాలి. ఈ బెల్లం ద్రావణాన్ని మరగబెడుతూ అందులో అల్లం ముద్ద, నల్ల ఉప్పు, గరం మసాలా వేయాలి. చివరిగా యాలుకల పొడిని వేయాలి. ఆ విధంగా మూడుతీగల పాకం వచ్చే వరకు బెల్లం పాకాన్ని మరగించాలి. ఆ తరువాత పూర్తిగా చల్లారిన తరువాత తడిలేని శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ తియ్యని నిమ్మ పచ్చడిని చపాతి లేదా పూరితో తినవచ్చు.

ఎ. ప్రశాంతి, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త, ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, కరీంనగర్‌, ఫోన్‌ : 9490111909