బత్తాయి సాగులో మన రాష్ట్రం దేశం మొత్తంలో అగ్రస్థానంలో ఉంది. మన రాష్ట్రంలో బత్తాయి తోటలు ఎక్కువగా నల్గొండ, అనంతపురం, ప్రకాశం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో సాగులో ఉన్నాయి. ఇటీవల కాలంలో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గి సాగు నీరు, ఎరువుల వాడకం సక్రమంగా చేపట్టకపోవడం వల్ల వేరుకుళ్ళు, బంక తెగులు, సూక్ష్మపోషక లోపాలు ఎక్కువై తోటలు తొందరగా క్షీణించి పోతున్నాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే బత్తాయి తోటల్లో క్షీణింపు సమస్య నుండి చాలా వరకు బయటపడవచ్చు.

బత్తాయి తోటలు క్షీణించడానికి కారణాలు :

బత్తాయి చెట్లు త్వరగా క్షీణించడానికి ప్రధానంగా అనుకూలం గాని నేలల్లో తోటలు సాగు చేయడం, నాణ్యమైన అంట్లు నాటుకోకపోవడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వల్ల, వేరుకుళ్ళు, బంక తెగులు సమస్యలు ఎక్కువకావడంతో పాటు సూక్ష్మపోషకాలు, ఎరువుల యాజమాన్యం సరిగ్గా చేపట్టకపోవడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరగక తొందరగా చనిపోతాయి.

అనుకూలమైన నేలల్లో మాత్రమే సాగు చేపట్టాలి :

నేల యొక్క ఉదజని సూచిక 6.5-7.5 మధ్యలో ఉండి నీరు నిలువ ఉండకుండా ఉండే నేలల్లో సాగు చేసుకోవాలి. సేంద్రీయ పదార్ధం తక్కువగా ఉండి సున్నపురాయి ఎక్కువగా ఉండే నేలలు అనుకూలం కాదు. ఈ నేలల్లో సూక్ష్మపోషక లోపాలు ఎక్కువగా ఉండే నేలలు అనుకూలం కాదు. ఈ నేలల్లో సూక్ష్మపోషక లోపాలు ఎక్కువగా బహిర్గతమవుతున్నాయి. సాగు నీటిలో లవణ పరిమాణం తక్కువగా ఉదజని సూచిక 6-8 మధ్యలో ఉండాలి. సాగునీటి యొక్క ఇ.సి 0.50 డి.సైమన్‌/మీటరు మధ్య ఉండే నీటిని వాడవలసి వస్తే సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వేసుకోవాలి. 0.75 డె||సైమన్‌/మీటరు కన్నా ఎక్కువ ఇ.సి ఉండే సాగు నీరు అసలు అనుకూలం కాదు.

అంటు మొక్కల ఎంపిక :

మంచి ఆరోగ్యవంతమైన అంటు మొక్కలను నమ్మకమైన నర్సరీ నుండి మాత్రమే తెచ్చి నాటుకోవాలి. రంగపూరు నిమ్మ వేరుమూలంపై అంటుకట్టిన వైరస్‌ఫ్రీ అంట్లను మాత్రమే నాటుకోవాలి. అంటు మొక్క వయస్సు 6-10 నెలల వయస్సు ఉండి 15 సెం.మీ ఎత్తులో అంటు కట్టిన మొక్కలను ముదురు ఆకులు ఉన్నప్పుడు తెచ్చి నాటుకోవాలి. అంటు మొక్కపై ఎటువంటి వైరస్‌ వ్యాధి లక్షణాలు ఉండరాదు.

నీటి తడి ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు :

మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలచి ఉంటే వేరుకుళ్ళు, బంక తెగులు ఉధృతి పెరుగుతుంది. కాబట్టి మొదలు దగ్గర ఎక్కువ రోజుల పాటు తేమ లేకుండా జాగ్రత్త పడాలి. నీటిని పారించేటప్పుడు 'డబుల్‌రింగ్‌' పద్ధతిలో అంటే మొదలుకు అడుగుదూరంలో పిల్లపాది చేసి బయటవైపు మరోపాది చేసి రెండింటికి మధ్యలో నీటిని పారించాలి. నీటిని ఒక చెట్టు నుండి ఇంకో చెట్టుకు పారించకుండా విడివిడిగా కాలువ ద్వారా అందించాలి. అయితే డ్రిప్‌ ద్వారా నీటిని పారించుకోవడం చాలా మంచిది. డ్రిప్‌ ద్వారా నీటిని అందించేటప్పుడు మొక్క వయస్సును బట్టి 1-2 సం|| వయస్సు చెట్లకు రోజుకు 10-20 లీటర్లు, 3-5 సం|| చెట్లకు రోజుకు 35-100 లీటర్లు, పెద్ద చెట్లకు 60-165 లీటర్లు సీజను బట్టి ఇవ్వాలి. డ్రిప్పర్లను మొదలు నుండి మీటరు మీటరున్నర దూరంలో అమర్చుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :

మొక్క వయస్సును బట్టి ఎరువులను కింది విధంగా అందించాలి.

వయస్సు పశువుల ఎరువు పిండి ఎరువులు, యూరియా సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌
1 సం|| 20 కి. 2.0 కి. 325గ్రా. 435గ్రా. 160గ్రా.
2 సం|| 40 కి. 4.0 కి. 650గ్రా. 870గ్రా. 320గ్రా.
3 సం|| 60 కి. 6.0 కి. 975గ్రా. 1305గ్రా. 480గ్రా.
4 సం|| 80 కి. 8.0 కి. 1300గ్రా. 1740గ్రా. 640గ్రా.
5 సం|| 100 కి. 100 కి. 1625గ్రా. 2175గ్రా. 800గ్రా.

పై ఎరువుల్లో సేంద్రీయ ఎరువులు, సూపర్‌ పాస్ఫేట్ల మొత్తం మోతాదును యూరియా, పొటాష్‌లలో 50 శాతం ఎరువును వర్షాకాలం ప్రారంభంలో అనగా జులై-ఆగస్టు నెలల్లో వేసుకోవాలి. మిగిలిన 50 శాతం యూరియా, పొటాష్‌ ఎరువులను వండ్రు పెట్టిన తరువాత నీటితడి ఇచ్చే ముందు పాదుల్లో వేసుకోవాలి. మొక్క వయసును బట్టి మొదలు నుండి, అడుగు నుండి మీటరు దూరంలో పళ్ళెం చేసి ఎరువును వేసి మట్టితో కప్పాలి. తరువాత తేలికపాటి తడి ఇవ్వాలి. పై రసాయనిక ఎరువులను నీటిలో కరిగే ఎరువుల రూపంలో డ్రిప్‌ ద్వారా కూడా అందించవచ్చు.

సూక్ష్మ పోషక లోపాలు - సవరణ :

జింకు ధాతు లోపం ఉంటే ఆకులు చిన్నవిగా అయిపోయి ఈనెలు ఆకుపచ్చగా ఉండి మిగతా ఆకు పసుపు రంగుకు మారుతుంది. ఇనుపధాతు లోపం ఉంటే ఆకు మొత్తం పాలిపోయి పసుపు రంగుకు మారుతుంది. బోరాన్‌ లోపిస్తే ఆకులు గిడసబారి ముడుచుకుపోయి కాయలు పగులుతాయి. మాంగనీసు లోపం వల్ల ఈనెలు 'హ' ఆకారంలో ఉండి మొత్తం పసుపు రంగుగా మారుతుంది. ఈ లోప లక్షణాలన్నీ ఒకే మొక్కపై ఉంటే దాన్ని పల్లాకు తెగులు అంటారు. ఈ లోపాలు కనిపించకుండా ప్రతి సంవత్సర వర్షాకాలంలో ఫార్ములా-7 సూక్ష్మధాతు మిశ్రమాన్ని ఎదిగిన మొక్కలకు ఒక్కింటికి 100 గ్రా.-150 గ్రా. చొప్పున పశువుల ఎరువుతో కలిపి పాదుల్లో వేసుకోవాలి. లోపలక్షణాలు కనిపించిన వెంటనే ఫార్ములా-4 సూక్ష్మధాతు మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రా. చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారి చేసుకోవాలి.

పిందె రాలటం నివారణ :

ముందుగా నీటి తడులు సక్రమంగా ఇస్తూ నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. అదే విధంగా మొక్కలకు అవసరమైన పోషకాలను సకాలంలో అందించాలి. అయినప్పటికీ పిందెరాలడం గానీ గమనించినట్లయితే 2 మి.లీ ప్లానోఫిక్స్‌ మందును 9 లీటర్ల నీటిలో లేదా ఆల్కహాలులో కరిగించి తరువాత 100 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో ఒకసారి మరలా పిందె బఠాని గింజ సైజులో ఉన్నప్పుడు మరోసారి పిచికారి చేసుకోవాలి. చెట్లు పూత, పిందె మీద ఉన్నప్పుడు పాదులు తవ్వడం, వేర్లను కదిలించడం వంటివి చేయకూడదు.

వేరుకుళ్ళు తెగులు - యాజమాన్యం :

బత్తాయి తోటలకు ఎక్కువ నష్టం చేకూర్చే వాటిలో ప్రధానమైనది వేరుకుళ్ళు. ఈ తెగులు సోకిన చెట్లు నీటి తడి ఇచ్చిన తరువాత రోజే వడబడినట్లు కనిపిస్తాయి. ఆకులు పసుపుగా మారి, పూత పిందె విపరీతంగా రాలి, చెట్లు నిలువుగా ఎండిపోతాయి. ఈ చెట్ల వేర్లు తీసి చూసినప్పుడు వేర్లు కుళ్ళి, ముదురు గోధుమ రంగుకు మారి దుర్వాసన వెదజల్లు తుంటాయి. దీని నివారణకు ముందుగా రంగపూరు నిమ్మపై అంటు కట్టిన ఆరోగ్యవంతమైన అంటు మొక్కలను నాటుకోవాలి. సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను ఎక్కువగా వేసుకోవాలి. ప్రతి సంవత్సరం ట్రైకోడెర్మా జీవనియంత్రక మందును ముందుగా పశువుల ఎరువు, వేపపిండి కలిపిన మిశ్రమంలో అభివృద్ధి పరచి తరువాత చెట్టు ఒక్కింటికీ 5-10 కిలోల మిశ్రమాన్ని వర్షాకాలంలో పాదుల్లో వేసుకోవాలి. తెగులు సోకిన చెట్లను తొలిదశలోనే గుర్తించి లీటరు నీటికి 2 గ్రా. కార్బండిజమ్‌ లేదా ఒక శాతం బోర్డో మిశ్రమాన్ని పాదంతా తడిచే విధంగా పోయాలి.

బంక తెగులు :

బంక తెగులు ఆశించిన చెట్ల మొదళ్ళ వద్ద కొమ్మల పంగల్లో బంక కారుతుంది. బంక కారే కొమ్మల పైభాగం క్రమేపి ఎండిపోతుంది. దీని నివారణకు ముందుగా తెగులు ఆశించి ఎండిన కొమ్మలను కత్తిరించి తగుల బెట్టాలి. బంక కారే ప్రదేశంలోని బంకను కత్తితో పలుచగా చెక్కి బోర్డోపేస్టు లేదా కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందును చిక్కగా కలిపి పూయాలి. కార్బండజిమ్‌ మందును లీటరు నీటికి ఒక గ్రా. చొప్పున కలిపి కొమ్మలు తడిచే విధంగా పిచికారి చేయాలి.

ఎం. రవీంద్రబాబు, డా|| పి. రమాదేవి, ఎ. కిరీటి, ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా, ఫోన్‌ : 9849733741