అప్పుడే వేసవి మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 37-380 సెం. స్థాయికి చేరినప్పుడు కోళ్ళకు ఇబ్బందులు మొదలవుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన కొలదీ కోళ్ళు ఒత్తిడికి గురౌతాయి. కోళ్ళ శరీరంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి దాణా తీసుకోవడం, దాణా వినియోగసామర్ధ్యం, వ్యాధి నిరోధకత క్షీణిస్తుంది. ఈ విధంగా కోళ్ళ పెంపకందారులకు నష్టాలు వస్తాయి. గుడ్లు పెట్టే కోళ్ళలో గుడ్లు ఉత్పత్తి, గుడ్డు నాణ్యత, పెంకు నాణ్యత తగ్గిపోతాయి. వేసవిని, వేసవి వేడిని ఆపడం మనక ఉసాధ్యం కాదు కాబట్టి వేరే ప్రత్యామ్నాయాలు పాటించక తప్పదు. దీనికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొదటిది వేసవి తీవ్రతకు కోళ్ళు గురికాకుండా కాపాడుకోవడం. రెండోది పెరిగిన వేడికి అనుగుణంగా కోళ్ళ శరీర వ్యవస్థలో అనకూల పరిస్థితులు కల్పించడం. ఉష్ణోగ్రత తీవ్రతను నియంత్రించేలా కోళ్ళకు ఇచ్చే మేత విషయంలో కొన్ని మెళకువలు పాటిస్తూ కోళ్ళ షెడ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే కొంత వరకు నష్టాలను అధిగమించవచ్చు.

అధిక ఉష్ణోగ్రత వల్ల ఏం జరుగుతుంది?

కోళ్ళ శరీరంలో మనలాగా స్వేధగ్రంధులు లేవు. సాధారణంగా వేడి ఎక్కువైనప్పుడు స్వేధగ్రంధుల ద్వారా చెమటను బయటకు పంపించి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. కాని కోళ్ళలో చెమట గ్రంధులు లేకపోవడం వల్ల అవి శ్వాస ద్వారా కాని, రెట్ట ద్వారా కాని శరీరంలో వేడిని బయటకు విడుదల చేస్తూ ఉంటాయి. అంతేగాక కోడి శరీరం ఈకలతో కప్పి ఉంటుంది. ఈ ఈకలు ఇన్సులేషన్‌గా పనిచేసి వాటి శరీరంలో ఉష్ణోగ్రతను మరింత పెంచుతాయి. కాకపోతే కోడి శరీరం నుండి బయటకు వెళ్ళే ఉష్ణోగ్రత కంటే ఉత్పత్తయిన ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు కోళ్ళు వడదెబ్బకు గురవుతాయి. ఉపశమనం కోసం రెక్కలు చాచి మెడ, వెంట్రుకలు నీళ్ళలో ముంచి నోరు తెరచుకుని చల్లదనం కోసం ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత 420 సెం. మించిపోతుందో అప్పుడు కోళ్ళ మరణాలు మొదలవుతాయి. వేడి ఒత్తిడిని గుర్తించే నిర్ధిష్టమైన లక్షణం పాంటింగ్‌ (నోరు తెరచి శ్వాసించడం) గొంతు, శ్వాస వ్యవస్థలను వినియోగించుకొని అవి తమని తాము చల్లబరచుకునే ప్రయత్నం చేస్తాయి. అత్యధికంగా పెరిగిన వేడిని బయటకు పంపడానికి ఇదొక్కటే ప్రభావంతమైన మార్గం. దురదృష్ఠం ఏమిటంటే పాంటింగ్‌ వల్ల ఎక్కువ శక్తి వినియోగించబడి ఫలితంగా శరీరంలో మరింత వేడిని పుట్టించడానికి కారణమవుతుంది.

ఇలా ఎండాకాలం వేడికి కోళ్ళు ప్రతిస్పందించడం వల్ల కార్బన్‌ డై ఆక్సైడ్‌, నీరు తగ్గి, కోళ్ళు డి హైడ్రేషన్‌కి, ఆల్కాలిసిస్‌కు గురవుతాయి. అందువల్ల కోళ్ళు బైకార్బోనేట్స్‌, పొటాషియంను విసర్జిస్తాయి. తద్వారా వాటి కొరత ఏర్పడి రక్తంలో ఆమ్ల-క్షారముల సమతుల్యత దెబ్బతిని కోళ్ళు చనిపోవడానికి కారణమవుతాయి. ఇంకో కారణం ఏమిటంటే వేడి ఒత్తిడుల వల్ల థైరాక్సిన్‌ ఉత్పత్తి అధికమై, బేసిక్‌ మెటబాలిక్‌ రేటు పెరుగుతుంది. అందువల్ల అడ్రినల్‌ గ్రంధుల నుండి గ్లూకో కార్డికాయిడ్స్‌ విడుదలవుతాయి. గ్లైకోజిన్‌ నుండి ఎక్కువ శక్తి విడుదలై కోళ్ళు బలహీనమై మరణాలకు గురౌతాయి.

తీసుకోవలసిన జాగ్రత్తలు :

వేసవికాలంలో కోళ్ళను రక్షించుకోవాలంటే పైన తెలిపిన దుష్పలితాలకు కారణమైన వేడి తీవ్రతను తగ్గించుకునే విధంగా కోళ్ళ షెడ్‌ నిర్మాణంలో కొన్ని శాశ్వతమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖద్వారాలు తూర్పు, పడమర దిశగా ఉండేలా షెడ్స్‌ని నిర్మించాలి. గాలి ధారాళంగా ప్రసరించడానికి బ్రాయిలర్స్‌ షెడ్స్‌ వెడల్పు 30 అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎత్తు 12-15 అడుగులు ఉండాలి. షెడ్‌ పైకప్పు తెల్లరంగు కప్పులోపలి వైపు నల్లరంగు వేయించాలి. చూరు కనీసం నాలుగు అడుగులు ఉండాలి. వీటివల్ల వేడి తీవ్రతను చాలా వరకు తగ్గించవచ్చు. షెడ్‌కప్పుపైన వరిగడ్డి పరచుకుంటే మంచిది. దీనివల్ల రేకులు వేడెక్కకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల షెడ్‌లోపల ఉష్ణోగ్రత దాదాపు 20 సెం. వరకు తగ్గించుకోవచ్చు. షెడ్‌ పైన స్ప్రింకర్లను అమర్చుకోవాలి. కప్పు అంచుల నుండి గోనె సంచులు వేలాడదీసి వాటిపైన నీళ్ళు చల్లుతూ ఉండే వడగాల్పులు, వడదెబ్బ నుండి ఉమశమనం కలుగుతుంది.

లేయర్‌ షెడ్‌ల్లో, కేజెస్‌ పైన ఫాగర్స్‌ అమర్చుకోవాలి. ఉష్ణోగ్రత 1000 ఖీ కంటే ఎక్కువైనప్పుడు 5 నిమిషాల చొప్పున గంటకు రెండు, మూడు సార్లు ఫాగర్స్‌ ఉపయోగించాలి. ప్రతి 60 అడుగులకు ఒక ఫ్యాన్‌ అమర్చాలి. బ్రాయిలర్స్‌ అయినా లేయర్స్‌ అయినా షెడ్‌లో వాటికి కీటాయించే స్థలం. మామూలు కంటే వేసవికాలంలో 20 శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రాయిలర్స్‌లో జీప్‌ లిట్టర్‌ షెడ్‌లో లిట్టర్‌ మందం తగ్గించాలి.

షెడ్స్‌ నుండి వెలువడే వాసనలు, కార్బన్‌ డైఆక్సైడ్‌, అమ్మోనియా బయటకు వెళ్ళటానికి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ లోపలికి రావడానికి తగిన ఏర్పాటు చేసుకోవాలి. సైడ్స్‌కి కర్టెన్స్‌ కట్టినప్పుడు 2 అడుగులు పైన వదిలి కట్టాలి. దీనివల్ల గాలి ప్రసరించడానికి వీలవుతుంది. వేడి ఒత్తిడికి గురైతే గాలి పీల్చడం గాలి వదలడం నెమ్మదిగా దీర్ఘంగా కనిపిస్తాయి వేడి మరీ ఎక్కువగా ఉందనిపిస్తే కోళ్ళపైన నీళ్ళు చల్లాలి.

వేసవిలో కోళ్ళకి అందించే పోషక పదార్థాల్లో నీరు చాలా ముఖ్యమైనది. కోళ్ళు తినే ఆహారం జీర్ణం కావడానికి జీవనక్రియల్ని నిర్వర్తించడానికి, పెరుగుదలకు నీరు చాలా అవసరం కాబట్టి పరిశుభ్రమైన చల్లని నీళ్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. డీప్‌లిట్టర్‌ షెడ్స్‌లో మామూలుగా ఉంచే నీటి పాత్రల కంటే వేసవికాలంలో మరిన్ని ఎక్కువ నీటిపాత్రలు పెంచాలి. నిప్పల్‌ సిస్టం ద్వారా నీరు అందించేవారు.

నీళ్ళు వేడిగా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్ళ ట్యాంక్‌లోని నీళ్ళు వేడవ్వకుండా ట్యాంకుపైన పందిరిలాంటిది వేసి దానిపైన గడ్డి లేదా ఆకులు వేసి నీడ కల్పించాలి. ట్యాంక్‌కి తెలుపు రంగు వేయిస్తే మంచిది. ఇంకా శ్రద్ధ చూపగలిగితే నీళ్ళ ట్యాంక్‌ చుట్టూ గోనె సంచులు గానీవరి గడ్డి చుట్టి అప్పుడప్పుడు వాటిని తడుపుతూ ఉంటే ట్యాంక్‌లోని నీళ్ళు చల్లగా ఉంటాయి.

ట్యాంక్‌లో తక్కువ నీళ్ళు ఉన్నట్లయితే అవి తొందరగా వేడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ట్యాంక్‌ నిండుగా ఉండేలా కనీసం 80 శాతం నీళ్ళు ఉండేలా జాగ్రత్త వహించాలి. నీళ్ళ ట్యాంక్‌ నుండి షెడ్‌లోకి వచ్చే పైప్‌ లైన్లను భూమిలో పాతినట్లయితే అవి వేడెక్కకుండా ఉంటాయి. నీళ్ళ ట్యాంక్‌లో తరచుగా నీటిని మారుస్తూ ఉండాలి. మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాంక్‌లోని నీళ్ళలో ఐస్‌ గడ్డలు వేయాలి. కోళ్ళ శరీరంలో 10 శాతం నీరు తగ్గితే జీవన క్రియలకు అవాంతరం ఏర్పడి చివరికి కోళ్ళు మరణాలకు గురవుతాయి.

సాధారణంగా వేసవిలో మేత తక్కువగా తీసుకుంటాయి. వాతావరణం ఉష్ణోగ్రత 750 నుండి 1000 కు పెరిగినట్లయితే 50 శాతం దాణా వినియోగం తగ్గిపోతుంది. ప్రతి 2.50 ఉష్ణోగ్రతకు 1.5 శాతం చొప్పున దాణా వినియోగం తగ్గుతుంది. అందువల్ల వేసవిలో కోళ్ళకు ప్రత్యేక పోషక పదార్థాలు అందించాలి. ఉదయం 4-5 గంటల మధ్య, సాయంత్రం 6 గంటల తరువాత మేత ఇవ్వడం మంచిది. దాణాలో శక్తిని పెంచుకోవాలి. కొవ్వు పదార్థాలు ఉండే దాణా అధికంగా ఇస్తే కోళ్ళకు వేడి తాకిడి తగ్గుతుంది. అమైనో ఆమ్లాలు ముఖ్యంగా మిథియోనైన్‌, లైపిన్‌ల వినియోగం దాణాలో కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వేడిని నియంత్రించడంలో మినరల్స్‌ పాత్ర కూడా ముఖ్యమైనదే. వేడి తీవ్రత ఉన్నప్పుడు దాణాలో కాల్షియం, ఫాస్పరస్‌, మాంగనీస్‌ వినియోగం పెంచాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్‌-సి వినియోగం కూడా ఎక్కువ చేయాలి. నీటిలో కరిగే విటమిన్‌-సిని రోజువారి మేతలో కలిపి ఇవ్వాలి. ఇది సహజమైన యాంటిఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది.

సహజసిద్ధంగా లభించే ఆమ్లాల్లో కూడా అత్యధికంగా విటమిన్‌-సి ఉంటుంది. ఆమ్లా రసాన్ని కూడా నీటితో వాడవచ్చు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు సోడియం, పొటాషియం క్లోరైడ్‌, బైకార్బోనేట్‌ వంటి ఎలక్ట్రోలైట్స్‌ మధ్య అంతర్గత కణ సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి తాగే నీటిలో ఎలక్ట్రోలైట్‌ ద్రవాలను కలపడం ద్వారా పై మూలకాలను తిరిగి పొందడానికి వీలవుతుంది. అంతేగాక కోళ్ళకు నీటి ద్వారా లేదా మేత ద్వారా ఎలక్ట్రోలైట్స్‌ను ఇవ్వడం వల్ల కోళ్ళు ఎక్కువ నీటిని తాగుతాయి. అందువల్ల వాటి శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఒక లీటరు నీటిలో 2 గ్రా. ఉప్పు, ఒక మి.గ్రా. వెనిగార్‌, ఒక గ్రా. సోడియం కార్బోనేట్‌, 5 గ్రా. పొటాషియంక్లోరైడ్‌ కలిపి ఇవ్వవచ్చు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్‌-ఇ ఇవ్వడం వల్ల లేయర్లలో గుడ్ల నాణ్యత బాగా ఉంటుంది. వేడి ఒత్తిడి ఉన్నప్పుడు క్రోమియంను అందచేయడం ద్వారా కోళ్ళ బరువు పెరిగి, చురుకుగా ఉంటాయి. మరియు మేత కూడా ఎక్కువగా తింటాయి. లేయర్లలో గుడ్ల ఉత్పత్తి నాణ్యత పెరుగుతుంది.

పైన చెప్పిన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఈ వేసవిలో మన కోళ్ళను వడదెబ్బ నుండి రక్షించుకోవడమేకాక అధిక లాభాలను కూడా పొందవచ్చు.

డా|| గుర్రం శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, కోళ్ళ శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల, కరీంనగర్‌, ఫోన్‌ : 9491367458