ఉష్ణ మండలంలో పండించే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. భారతదేశం అరటిపంట విస్తీర్ణంలోనూ, దిగుబడిలోనూ ప్రపంచంలో రెండవ స్థానం ఆక్రమించింది. ఆంధ్రరాష్ట్రంలో అరటి దాదాపు 65 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, మామిడి నిమ్మజాతుల తరువాత మూడవస్థానం ఆక్ర్రమించుకొని ఉన్నది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటిసాగులో ఉన్నప్పటికీ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, గుంటూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అధికంగా పండిస్తున్నారు. అరటి ఉష్ణమండలపు పంట. సరాసరి 250-300 సెంటిగ్రేడ్‌ మిక్కిలి అనుకూలం. శీతాకాలంలో ఉష్ణోగ్రత 150 సెంటిగ్రేడ్‌ కన్నా తక్కువ ఉండకూడదు. వేసవి ఉష్ణోగ్రతలు 450 సెల్సియస్‌కు మించి, వడగాలులు కూడా వీచినప్పుడు అన్ని రకాల అరటి తోటలు ఎక్కువ శాతం నష్టానికి గురవుతాయి.

వేసవి తీవ్రతకు పచ్చ అరటి రకాలు :

గ్రాండ్‌నైన్‌, రొబస్టా త్వరగా నష్టానికి గురవుతాయి. పొట్టి పచ్చ అరటి (వామనకేళి), కర్పూర చక్కెరకేళి, కె.బి.యస్‌-8 అధిక ఉష్ణోగ్రతలను కొంత వరకు తట్టుకోగలవు. వేసవికాలంలో తేలిక నేలల్లో ప్రతి రెండు రోజులకు, బరువు నేలల్లో ప్రతి నాలుగు రోజులకు నీటి తడులు ఇచ్చినట్లయితే వేడిని చాలా వరకు తట్టుకోగలవు. అధిక ఉష్ణోగ్రతల తాకిడికి ముందుగా లేత ఆకులు తరువాత ముదురు ఆకులు ఎండిపోతాయి. లేత గెలలు నల్లగా మాడిపోతాయి. కోసిన గెలలోని కాయలు త్వరగా పండుబారతాయి. పండ్లు ఉడికించినట్లుగా మెత్తబడి నీరుకారి సాధారణ రుచి, నిల్వ సామర్ధ్యాలను కోల్పోతాయి. వేసవికి దెబ్బతిన్న గెలలు అమ్మకానికి పనికిరావు.

తోట వయసును బట్టి వేసవిలో కలిగే నష్టం-నివారణ పద్ధతులు :

వేసవిలో నాలుగు మాసాలలోపు తోటల ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. తడులు మూడు రోజులకొకసారి అందించలేని పరిస్థితుల్లో కాండం, దుంప కూడా ఎండి, కుళ్ళిపోతుంది. ఎండలు తగ్గిన తరువాత చెట్లు చిగురించి మామూలు ఎదుగుదలకు ప్రతి 3 - 4 రోజులకొకసారి నీటి తడి తప్పని సరిగా ఇవ్వాలి. ఎరువును తక్కువ మోతాదులో దగ్గర దగ్గరగా ఎక్కువసార్లు అందివ్వాలి. ఒకటి లేక రెండు మాసాల వయసు గల తోటల్లో ఎక్కువ శాతం మొక్కలు చనిపోతే వాటిని దున్ని మరలా జూన్‌-జులై నెలల్లో నాటుకోవాలి.

వేసవిలో ఐదు మాసాలపైబడిన తోటల ఆకులు ఎండిపోతాయి. దుంపకు, కాండానికి తక్కువ నష్టం కలుగుతుంది. ఈ వయసు తోటలు తేలికగా తేరుకుంటాయి. గెలవేయడానికి గల సమయం తక్కువగా ఉన్నందున చిన్న గెలలు వేస్తాయి. పెద్దగెలలు వేసినా సరిగా పక్వానికి రావు. పచ్చ అరటి రకాల్లో పక్వానికి రాని గెలలు చెట్టు నుండి రాలి పడిపోతాయి. ఇటువంటి తోటలకు ప్రతి మూడు లేక నాలుగు రోజులకు తప్పనిసరిగా తడి ఇవ్వాలి. ఎరువులను సిఫార్సు చేసిన మోతాదుకన్నా 50 శాతం అదనంగా ఇవ్వాలి. గెల వేసే సమయంలో గెలలో పండ్ల ఎదుగుదల ఆధారంగా లీటరు నీటికి 5 గ్రా. పొటాషియం నైట్రేట్‌, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను మార్చి మార్చి జిగురుతో మందు కలిపి వారం రోజుల వ్యవధితో నాలుగుసార్లు ఆకులు, గెలలు పూర్తిగా తడిసే విధంగా పిచికారి చేయాలి.

గెలలు వేస్తున్న, గెలలు వేయడానికి సిద్ధంగా ఉన్న, లేత గెలల (సగం లోపు తయారైన)తో ఉన్న తోటల్లో తీవ్రమైన ఎండ, వడగాలులకు ఆకులు పూర్తిగా మాడి, ఎండిపోతాయి. పచ్చ అరటి రకాల్లో గెలలు కూడా రాలిపోతాయి. ఈ దశలో ఉన్న తోటలకు జరిగే నష్టం ఎక్కువ. తగిన సమయం లేనందున నష్టాన్ని పూరించడానికి అవకాశం లేదు. ఇటువంటి తోటలకు నీటి తడులు దగ్గర దగ్గరగా పెట్టాలి. తొండంతో సహా గెల మొత్తానికి ఎండు ఆకు చుట్టి ఎండ నుండి రక్షణ కల్పించాలి. ఎండలు తగ్గాక మొక్కలు 5-6 ఆరోగ్యవంతమైన ఆకులు నిలచి ఉన్నప్పుడు మాత్రమే అమ్ముకొనగలిగే గెలలు తయారవుతాయి. లీటరు నీటికి 5 గ్రా. పొటాషియం నైట్రేట్‌, సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను మార్చి మార్చి జిగురుతో కలిపి వారం రోజుల వ్యవధితో నాలుగుసార్లు ఆకులు, గెలలు పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేసి జరిగిన నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. చెట్ల ఆకులు పూర్తిగా మాడిన తోటల్లో ఆరోగ్యంగా ఉన్న పిలకలను కార్శితోటగా పెంచడం మంచిది.

వేసవిలో గెలలు సగం లేక ఆపైన తయారైన దశలో ఉన్న తోటల ఆకులు, గెలలు ఎండిపోతాయి. చెట్లు విరిగి పడిపోతాయి. గెలలు కోసిన తరువాత త్వరగా పండి, రుచి తగ్గి, నిల్వ సామర్ధ్యం కోల్పోతుంది. ఇటువంటి గెలల్లోని కాయలు ఉడికించినట్లుగా ఉండడంతో మార్కెట్‌లో మంచి ధర రాదు. ఇటువంటి చెట్ల గెలలకు ఎండు ఆకు చుట్టి ఎండ నుండి రక్షించాలి. పక్వానికి వచ్చిన గెలలను ఉదయం పూట చల్లని వాతావరణంలో మాత్రమే కోసి నీడవున్న (ఎండ, వేడి గాలులు తగలని) ప్రదేశంలో ఉంచాలి.

ముందు జాగ్రత్త చర్యలు :

2-3 నెలల వయసున్న సూది పిలకలను ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకుని అరటి తోటలకు నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 3-4 వరుసల్లో అరటితో పాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి. అరటి తోటను సిఫార్సు చేసిన సాంద్రతలోనే నాటుకొని తోటలోని మొక్కలన్నీ బతికి ఉండే విధంగా జాగ్రత్త పడాలి.

నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసవి కాలంలో తడులివ్వాలి. తేలిక నేలల్లో రెండు నుండి మూడు రోజులకు, బరువైన నేలల్లో నాలుగు నుండి ఐదు రోజులకు నీరు పెట్టాలి. మార్చి నెల నుండి 10-15 రోజులకొకసారి చొప్పున పొటాషియం సల్ఫేట్‌ (0.05 శాతం) మందు ద్రావణాన్ని జిగురు మందుతో కలిపి పైరు పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేసిన ఎడల అరటికి వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి కలుగుతుంది.

- జి. విద్య, కె. మదన్‌మోహన్‌ రెడ్డి, ఎమ్‌. హారిక,

వ్యవసాయ కళాశాల, ఆచార్య ఎన్‌.జి.రంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌, ఫోన్‌ : 7702502185