ప్రపంచంలో మిరప పంట సాగు విస్తీర్ణంలో బారత్‌కు ప్రముఖస్థానం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కార్ణటక, తమిళనాడు మరియు ఒరిస్తా రాష్ట్రాల్లో ప్రముఖంగా సాగులో ఉంది. వాణిజ్య పంటల్లో మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. అంధ్రప్రదేశ్‌లో మిరప 3.53 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ 5.14 లక్షల టన్నుల దిగుబడినిస్తుంది.

ప్రస్తుతం మిరప సాగులో ఈ మధ్య కాలంలో పూత ఈగ తీవ్రత గమనించడం జరుగుతూ ఉంది. ఈ పురుగు సంక్రమణకి నివారణ కంటి ముందు జాగ్రత్తలు గమనించిన తొలిదశల్లో అరికడితే నష్ట తీవ్రత తగ్గించవచ్చు.

ప్రస్తుత కాలంలో మిరపసాగులో పూత ఈగ, పూత, కాత దశల్లో సంక్రమించడం ద్వారా నష్టపరచే అవకాశం ఉంది. పూత ఈగను మిడ్జ్‌ అని కూడా అంటారు. ఈ ఈగ సంక్రమించినప్పుడు పూత, కాతకు నష్టం జరుగుతుంది. సంక్రమణ తీవ్రత ఎక్కువైతే నివారించడం కష్టమవుతుంది. కాబట్టి తొలిదశల్లోనే లక్షణాలు గమనించి తగు నివారణ చర్యలు తీసుకోవడం మంచిది.

ముఖ్యంగా నీటిపారుదల కింద సాగుచేసే మిరప పొలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వర్షాధార పంటల్లో సంక్రమణ అవకాశం తక్కువనే చెప్పాలి.

పూత ఈగను శాస్త్రీయంగా ఎస్‌పెండిలియా కాప్సిసి అని సాధారణంగా మిడ్జ్‌ ఈగ అని పిలుస్తుంటారు. ఈగ తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి చూడడానికి దోమల్లాగా కన్పిస్తాయి. ఇవి మిరపలో ముఖ్యంగా అండాశయం పూత పెద్దగా ఉన్న రకాలపై పూత, పిందెలో దశల్లో ఆశించి నష్టం కలుగ చేస్తాయి. తల్లి పురుగులు తనగుడ్లను పూమొగ్గలపై పెడతాయి. ఆ తరువాత ఈ గుడ్ల నుండి బయటికి వచ్చిన పిల్ల పురుగులు పసుపు రంగులో ఉండి అండాశయంలోనికి చొచ్చుకొనిపోయి అక్కడే ఉండి తింటూ ప్యూపా దశ అంటే సుప్తావస్థ దశ అండాశయంలోనే పూర్తి చేసుకుంటాయి.

ఈ పురుగు అండాశయంకి చేసే నష్టతీవ్రతను బట్టి అండాశయం ఉబ్బడం, తద్వారా పువ్వు విప్పారడం సరిగా ఉండదు. ఒకవేళ అండాశయానికి సంక్రమణ తక్కువగా ఉండే బుడ్డకాయలు ఏర్పడడం ఒక్కసారి పూత వస్తే రాలడం ఎండిపోవడం జరుగుతుంది.

ఆడపురుగు పసుపురంగు గుడ్డని విడివిడిగా ఆకు కింద ఉంచుతాయి. ఈ పిల్ల పురుగులు పూ మొగ్గలు పూలు, పిందెల్లోకి చేరి తీవ్రనష్ట కలుగచేసే అవకాశం ఎక్కువ. సంక్రమణ పిందెదశల్లో ఆశిస్తే, పిందెసరిగ్గా పెరగక, గిడసబారి, అదే సైజు అంటే తక్కువ సైజులోనే పిందె ఎర్రబడటం జరుగుతుంది. ఈ సంక్రమణ వంకర టింకర, కాయలు కన్పిస్తాయి. ఇలా ఏర్పడే కాయలు ఒక్కోసారి గింజలు కనపడవు. ఇటువంటి స్థితిలో మిరపకాయను తెరచి చూస్తే అందులో సుప్తావస్థలోని ప్యూపాలు ఒక్కోసారి లార్వాలను చూడవచ్చు.

పూత ఈగ జీవిత చరిత్ర :

పువ్వు ఈగ మొగ్గపై తల్లి పురుగులు పెట్టిన గుడ్ల నుండి 3-4 రోజుల్లో వెలువడిన పిల్లపురుగులు అండాశయం చేరడం, అక్కడే ఉన్న కణజాలాన్ని తొలచి తింటూ 14-17 రోజుల్లో అభివృద్ధి చెంది ఆ తరువాత సుప్తావస్థ దశ కూడా అండాశయంలోనే పూర్తి చేసుకుంటాయి.

నివారణ చర్యలు :

మిరప పొలంలో రాలిన పూత లేదా ఎండిన పూత లేదా బుడ్డకాయలు లేదా వంకర టింకర కాయలు లేదా రింగుల వంటి కాయలు గమనించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాలి.

పూత ఈగ ఉధృతి ఎక్కువైనప్పుడు నిరారణ చర్యలు చేపట్టినా అంతగా ఫలితం ఉండకపోవచ్చు. ముఖ్యంగా తల్లి పురుగులు పూ మొగ్గల్లో ఉండే లార్వాలు అండాశయం చేరకముందే నివారణ చర్యలు చేపడితే మంచిది.

పూత ఈగ సోకిన లేదా సంక్రమించిన కాయలను పీకి, ఏరి వీటిని నాశనం చేయాలి.

పొలాన్ని శుభ్రంగా ఉంచాలి. కలుపును సమూలంగా నివారించాలి.

పేనుబంక, తామర పురుగు, తెల్లదోమ వంటి వాటిని తగ్గించి అంతర్వాహిక మందును ఉపయోగించాలి.

నివారణకు ట్రైజోఫాస్‌ను లీటరు నీటికి 2.0 నుండి 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ లేదా కార్బోసల్ఫాన్‌ 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పూత దశలో 5 శాతం వేపగింజల కషాయం లేదా 5 మి.లీ. (1500 PPM ) వేపనూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

సమగ్ర యాజమాన్య చర్యలు పాటించడం ద్వారా మిగతా వ్యాధి పురుగుకు సోకకుండా అరికట్టి నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు.

- డా|| శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా|| వై. మాధవి,

మహానంది, ఫోన్‌ : 9542764073