రాగి పంటను వర్షాధార పరిస్థితుల్లో సాగు చేస్తున్నారు. తక్కువ లోతులో గల నేలలు, ఇసుక నేలలు సాగు చేయడానికి అనుకూలం. వెదజల్లడం, ముదురు నారుతో దగ్గరగా నాటే అలవాట్ల వల్ల రాగి దిగుబడి చాలా తక్కువగా వస్తుంది (ఎకరానికి 5-6 క్వింటాళ్లు). కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కొంత మంది రాగి పండించే సాంప్రదాయ ''గులి రాగి'' పద్ధతిని శ్రీవరి మూల సూత్రాలను ఉపయోగించి తయారు చేసిన దానిని ''శ్రీరాగి'' పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో రైతులువారి భూమిని బట్టి వర్షాధార వ్యవసాయంలో కూడా దిగుబడి పెంచుకోవచ్చు.

శ్రీరాగి పద్దతికి ప్రాథమిక సూత్రాలు :

లేత నారు నాటడం :

12-25 రోజుల వయసు గల లేత నారుతో నాట్లు వేయాలి. కుదురుకు ఒక మొక్క లేదా రెండు మొక్కలు నాటు వేస్తారు.

మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉంచడం :

కొయ్య ముక్కలు, తాడు సహాయంతో మొక్కకి, మొక్కకి మధ్య మరియు వరుసల మధ్య భూమిని బట్టి అడుగు దూరంలో (30I30 సెం.మీ.) మొక్కలు నాటుకునే విధంగా అచ్చులు (మార్కింగ్‌) వేస్తారు. మార్కింగ్‌ కోసం గుప్పెడు సేంద్రియ ఎరువును గుర్తుగా వేస్తారు.

వరుసల మధ్య మరియు మొక్కల మధ్య దూరం పెంచడం వల్ల అధిక సూర్యరశ్మి తగిలి మొక్క ఏపుగా పెరిగి చీడపీడల నుండి దూరంగా మరియు అంతరకృషి చేయుటకు అనువుగా ఉంటుంది.

నారుమడి తయారీ :

విత్తనశుద్ధి చేసిన విత్తనాలను ఇసుక, మట్టి, కంపోస్టు ఎరువులను 1:1:1 నిష్పత్తిలో కలపాలి. ఇలా చేస్తే విత్తనాలను వెదజల్లడం తేలిక అవుతుంది. ఎకరానికి సరిపడే నారును పెంచడానికి 40 చదరపు అడుగుల మడిని తయారు చేయాలి. లేదా నాలుగు మడులను 4I4I1 మీ. (పొడవుIవెడల్పుIఎత్తు) కొలతలతో తయారు చేసుకోవచ్చు. నారుమడుల తయారీలో 500 కిలోల చివికిన పశువుల ఎరువును కలపాలి. విత్తనాలను వెదజల్లిన వరుసల్లో వేసిన తరువాత నారుమడిపైన వానపాముల ఎరువును గాని బాగా చివికిన పశువుల ఎరువును గాని పలుచని పొర లాగా చల్లాలి. తీవ్రమైన ఎండ నుండి, పక్షుల నుండి రక్షించడానికి షేడ్‌నెట్‌ వాడవచ్చు.

అంతరకృషి :

వేర్లు బాగా పెరగడానికి, నేలను గుల్లబరచడానికి, కలుపు తీయడానికి అంతరకృషి చేయాలి. ఉత్తరాంధ్రలో వెదజల్లి పండించే రాగిలో కూలీలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. వరుసల్లో (చదరంలో) నాటితే ఎడ్లతో కాని సైకిల్‌ వీడర్‌ లాంటి పరికరాలతో తక్కువ ఖర్చుతో 2 నుండి 3 మంది కూలీలతో కలుపు తీయవచ్చు.

నాటిన 15, 25 రోజుల తరువాత ఎడ్ల గొర్రు / గుంటక లేదా సైకిల్‌ వీడర్‌తో లుపు తీయడం అలాగే తేలికపాటి కర్ర దుంగలను లాగడం వంటివి చేయాలి.

పిలకలు ఎక్కువగా రావడానికి తేలికపాటి కర్ర దుంగ లాగడం :

కంకులున్న పిలకలు ఎన్ని ఎక్కువ వస్తే దిగుబడి అంత పెరుగుతుంది. నాటిన లేత మొక్కకు ఎక్కువ పిలకలు వేయడానికి తేలికపాటి కర్ర దుంగను లాగే పద్ధతి కర్ణాటకలో ''గులిరాగి'' అని అంటారు.

కలుపు తీసిన తరువాత లేత మొక్కలపై నుండి తేలికపాటి దుంగను ఉపయోగించి తోలాలి. వీటిని తాడు సహాయంతో ఎద్దుల జతకు కట్టి, రైతు దుంగపై నిలబడి తోలతాడు. దీనివల్ల మొక్కవేర్లు, కాండం కలిసేచోట మొక్కలు వంగిపోతాయి. దీనివల్ల మొక్కల్లోని విభజన కణజాలం ప్రేరణ పొంది అధిక పిలకలు వేస్తాయి. నాటిన తరువాత 15-45 రోజుల మధ్యలో రెండు నుండి మూడు సార్లు ఇలా చేయాలి. పొలం అన్ని దిక్కుల నుండి అంటే తూర్పు నుండి పడమరకు, తిరిగి వెనకకు, ఉత్తరం నుండి దక్షిణానికి, తిరిగి వెనుకకు తోలాలి. ఎడ్లు లేకపోతే దుంగకి తాడు కట్టి కూడా లాగవచ్చు.

నీటి యాజమాన్యం :

పంట కొన్ని కీలక సమయాల్లో బెట్టరావడం వల్ల పంట నష్టం జరుగుతుంది. ప్రతి 5 ఎకరాల మధ్య 250 ఘనపు మీటర్లు (10I10I2.5 మీటర్లు) నీటి కుంటను ఏర్పాటు చేసుకుంటే పంటను కాపాడుకోవచ్చు. ఇది ఒకసారి నిండితే 3-5 ఎకరాలకు పంటను రక్షించుకోవడానికి ఒక రక్షక తడి ఇచ్చుకోవచ్చు.

పంట కోత :

రాగి పంటలో సరైన సమయంలో కోతను ప్రారంభించాలి. గింజలు గోధుమ రంగులో ఉన్నప్పుడు, వెన్ను ఆకు పండినట్లు ఉన్నప్పుడు పంటను కోయాలి. మొక్కకు ఎక్కువ పిలకలు ఉంటే 2,3 దఫాలుగా కూడా పంటను కోయాల్సివస్తుంది. బాగా ఆరిన వెన్నులను కర్రతో కొట్టి గాని, ట్రాక్టర్‌ నడిపి గాని గింజలను పొందవచ్చు.

ఈ క్రమంలో మట్టి బెడ్డలు, ఇసుక కలవకుండా టార్పాలిన్‌లను వాడితే నాణ్యత పెరుగుతుంది. పంట అమ్మే సమయంలో తేమ శాతం 12-14 వరకు ఉండేటట్లు చూడాలి.

ఎక్కువ సేంద్రియ ఎరువులు వాడడం

పై సూత్రాల ఆధారంగా రైతులు ''శ్రీరాగి'' పద్ధతిని పాటిస్తున్నారు.

పి. జోగారావు, శాస్త్రవేత్త, టి.ఎస్‌.ఎస్‌.కె పాత్రో, ప్రధాన శాస్త్రవేత్త,

యు. త్రివేణి, శాస్త్రవేత్త, ఎన్‌. అనూరాధ, శాస్త్రవేత్త