జనాభా అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను ఉత్పత్తి చేయవలసి ఉంది. రోజు రోజుకూ దేశ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ వస్తుంది. 2050 నాటికి సుమారు ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. భారత జనాభా 150 కోట్లు దాటనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆహార భద్రత లక్ష్యాలను చేరవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. దీనితోపాటు మానవుడి మనుగడకు కావలసిన సహజ అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వంటి అవసరాలను ప్రజలందరికీ అందించాల్సిన బాధ్యత రోజు రోజుకూ బరువెక్కుతున్న స్థితి దాపురించి ఉంది. ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు చైనా దేశంలో వ్యవసాయ రంగాన్ని శాస్త్ర, సాంకేతికతతో అనుసంధానం చేసి ఆ దేశ జనాభాకు సరిపడా ఉత్పత్తులను అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు సైతం చైనా తన ఉత్పత్తులను ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్‌లోకి చేరుతుంది. వ్యవసాయ రంగంలో ముందంజలో ఉండడం వల్ల ఎక్కువ జనాభా వ్యవసాయంపైనే ఆధారపడుతూ నూతన పద్ధతుల్లో సేద్యం చేపడుతుంది. ఈ విధానం నేడు ఇతర దేశాల వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తూ వస్తుంది.

పట్టు ఉత్పత్తికి పుట్టినిల్లయిన చైనాలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మల్బరీ సాగు, పట్టు ఉత్పత్తిని పెంచడంపై పట్టు పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ప్రభుత్వం చైనా పరిజ్ఞానాన్ని అధ్యయనం చేసింది. చైనా తరహాలో ఆధునిక పరిజ్ఞానం జోడిండి మంచి లాభాలు ఆర్జించే విధంగా చైనా తరహా విధానాన్ని అమలుచేసేందుకు కమీషనర్‌ లోకా వెంకట్రామారెడ్డి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు చైనాలో పట్టుపరిశ్రమలపై అధ్యయనం చేపట్టడం జరిగింది.

పట్టుచరిత్రను పరిశీలిస్తే క్రీస్తుపూర్వం 2700 శతాబ్దంలో తొలిసారిగా చైనాలో ఈ పట్టు ఆవిర్భవించినట్లు చారిత్రక కథనాలున్నాయి. సీలింగ్‌-ఛీ అనే చైనా దేశపు మహారాణి దీన్ని కనుగొన్నట్లు చరిత్రకారులు చెబుతారు. ఒకనాడు మలబారు చెట్టుకింద తేనీరు సేవిస్తున్న రాజ దంపతులకు కొద్దిదూరంలో ఒక కాయ పడినట్లు కనుగొన్నారు. ఆ కాయను విప్పిచూడగా అందమైన దారాలు కనిపించి, ఆ కాయ వెనుక ఉన్న పట్టు చరిత్రను లోతుగా అధ్యయనం చేసి పట్టు పరిశ్రమ ఆవిర్భావానికి వారు శ్రీకారం చుట్టినట్లు పట్టుకథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే సీలింగ్‌-చీ మహారాణిని మదర్‌ఆఫ్‌ సిల్క్‌గా అభివర్ణించడం కూడా జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా రహస్యంగా చైనాలోనే ఉండిపోయిన ఈ పట్టు సంస్కృతి అనంతరం భారతదేశానికి వ్యాపించింది. ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించడానికి ముందు అగ్గిపెట్టెలో భద్రపరచుకునే విధంగా అత్యద్భుత ప్రావీణ్యంతో పట్టు చీరలను భారత నేతగాళ్ళు నేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేవారని ప్రతీతి.

రాష్ట్రంలో పట్టుపరిశ్రమ అభివృద్ధికి చైనా సాంకేతిక సహాయం తీసుకోవాలని ఉద్యానశాఖ పట్టు పరిశ్రమ రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలను రూపొందించింది. వారం రోజుల పాటు ఉద్యాశాఖ అధ్యయన బృదం చైనాలో పర్యటించి షాంఘై సహా పలు పట్టణాలు, గ్రామాలను సందర్శించారు. అక్కడ విశేషాలను కమీషనర్‌ వెంకట్రామిరెడ్డి అగ్రిక్లినిక్‌ ప్రతినిధికి వివరించారు. టిఎస్‌ ఐ పాస్‌ ద్వారా ఆటోమేటిక్‌ రీరింగ్‌ మిషన్ల అధునాతన పరిశ్రమలను నెలకొల్పాలని చైనా ఉద్యాన అధికారులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో పట్టుపరిశ్రమ అభివృద్ధి పథంలో సాగుతుందని 3 వేల ఎకరాల నుండి 10 వేల ఎకరాలకు మల్బరీసాగు పెరిగిందని తెలిపారు. చైనాలో పట్టుపరిశ్రమ తగ్గిపోతుందని అక్కడ ప్రత్యామ్నాయ ఆదాయవనరులపై రైతులు దృష్టి సారిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో పట్టుపరిశ్రమ అభివృద్ధికి మెరుగ్గా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి విదేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని వివరించారు.

చైనాలో ఎకరాకు 45 క్వింటాళ్ళ వరి దిగుబడి :

చైనాలో కాంట్రాక్టు వ్యవసాయం అధికమని తెలిపారు. సాగుకు నీటి సదుపాయం ఎక్కువగా ఉండడంతో పంటలు విరివిగా పండుతున్నాయని కూలీల కొరత కారణంగా ఆ దేశంలో నూరు శాతం యాంత్రీకరణతోనే వ్యవసాయ పనులు కొనసాగిస్తున్నారని వెల్లడించారు. అక్కడ విశ్వ విద్యాలయాల పరిశోధనల ఫలితంగా అనేక కొత్త రకాలు ఉద్భవిస్తున్నాయని తెలిపారు. మన దేశంలో వరి ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంటే చైనాలో 45-50 క్వింటాళ్ళు, సోయాబీన్‌ 25-30 క్వింటాళ్ళు, మొక్కజొన్న 40-45 క్వింటాళ్ళు మేర దిగుబడి వస్తుందని కూరగాయల సాగంతా పాలిహౌస్‌, గ్రీన్‌హౌస్‌, నెట్‌ హౌస్‌ వంటి అత్యాధునిక పద్ధతుల్లో కొనసాగుతుందని ప్రతి మొక్క ఎకౌంటబుల్‌గా ఉంటుందని రైతు ఏ కొద్ది స్థలంలోనైనా ఉపయోగపడే మొక్కలనే పెంచుతున్నారని చేల గట్ల మీద, రోడ్లకు ఇరువైపులా కూరగాయలు పండిస్తున్నారని ఆయన వెల్లడించారు. చిన్న సన్నకారు రైతులు చైనాలో కూడా ఉన్నారని ఒక్కొక్క రైతుకు ఒక హెక్టారు వరకే భూములున్నాయని, కాంట్రాక్టు సేద్యం విరివిగా ఉందని అన్నారు.

100-200 ఎకరాకు సాగు చేస్తున్నారని వీరు వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలు సమకూర్చుకున్నారని నిత్యం పని ఉంటుందని అన్నారు. రైతు పండించిన పంటను తానే నిల్వ చేసుకొని మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా అమ్మకాలు చేపడుతున్నారు. చైనా రాజులు పట్టుదారానికి ప్రాధాన్యత ఇచ్చారని పట్టు దేశ సంపదగా వారు పాటిస్తున్నారు. అక్కడ ప్రతి గ్రామంలో ఇళ్ళ వద్దే పటు ్టపరిశ్రమ ఉంటుంది. నిత్యం పట్టు పరిశ్రమలో పనిచేస్తూనే ఉంటున్నారు. చైనాలో పట్టు పరిశ్రమకి మంచి ప్రాధాన్యత ఉంది. అక్కడి ప్రభుత్వం పట్టు పరిశ్రమ రైతులకు సబ్సిడీ తక్కువగా ఇస్తున్నారు. ప్రతి రైతూ వ్యవసాయంతో పాటు ఆర్థికంగా సమకూర్చే ఇతర పనులను సైతం చేపట్టడం వల్ల వ్యవసాయంలో నష్టాలు వచ్చినా పెద్దగా ఆర్థిక ఇబ్బందులు పొడచూపడం లేదు. తెలంగాణ ప్రాంతంలో మల్బరీ సాగు అప్పటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పట్టుపరిశ్రమను పూర్తిగా అనంతపురం, చిత్తూరు జిల్లాలకే పరిమితం చేశారు. నేడు పట్టు పరిశ్రమను తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిందని చైనా తరహలో మల్బరీ పట్టు పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తుందని రానున్న రోజుల్లో టిఎస్‌ ఐ పాస్‌ ద్వారా చైనా యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

1000 మంది జనాభాలో ఇద్దరు మాత్రమే పట్టు వస్త్రాలు ధరిస్తున్నారు. 10 మంది పట్టు వస్త్రాలు ధరిస్తే పట్టు ఉత్పత్తి చాలా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. చైనాలో లక్షా 50 వేల మెట్రిక్‌ టన్నుల సిల్కును ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందిస్తున్నారని తెలిపారు. కష్టపడే గుణం చైనీయులకు ఎక్కువగా ఉందని 10 సంవత్సరాల వయసు నుండి 90 సంవత్సరాల వయస్సు గల వారు సైతం వ్యవసాయ పనులు చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ యంత్రాల ద్వారానే తమ పనులు చేస్తున్నారని, యాంత్రీకరణను 70 సంవత్సరాల క్రితమే వారు వ్యవసాయ రంగంలోకి తీసుకువచ్చారని తద్వారా నేడు చైనా వ్యవసాయ రంగం ప్రపంచ దేశాల్లో దూసుకుపోతుందని అన్నారు.

తెలంగాణలో పంటకు అనుకూలం :

అటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలను దిగుమతి చేసుకోవాలని ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర పట్టు పరిశ్రమల శాఖ కమీషనర్‌ ఎల్‌. వెంకట్రామారెడ్డి నేతృత్వంలో చైనాలోని షాంఘై, సుజాన్‌, డానియంగ్‌, జోంకింగ్‌, ఎర్లింగ్‌, జీ, జోక్సన్‌ తదితర ప్రాంతాల్లో వారం రోజుల పాటు పర్యటించిన అధికారుల బృందం తెలంగాణలో చైనా అనుసరిస్తున్న విధానాలను అమలు చేసేందుకు అధ్యయన నివేదికను తయారు చేస్తుంది.

మన భాగ్యనగర సమీపంలోని పోచంపల్లి ఒకప్పుడు ''పట్టు పట్టణంగా'' వ్యవహరించబడేది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ధర్మవరం పట్టణం పట్టుచీరల ఉత్పత్తికి, నాణ్యతకు పేరుగించింది. గ్రామీణ ఉపాదికి, తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయాన్ని సాధించేందుకు అనువైన మెట్ట ప్రాంతాల్లో అనువైన మల్బరీ తోటల్లో పట్టు పురుగుల పెంపకాన్ని ప్రారంభించి రైతులు రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మంచి దిగుబడులను సాధించి నిలదొక్కుకుంటున్నారు. వ్యవసాయం దండగని ఇతర వృత్తులకు తరలి వెళ్ళిపోయిన కుటుంబాలు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రోత్సాహకాలతో పట్టుసాగుకు ముందుకువస్తున్నారు.

మల్బరీ సాగుకు తెలంగాణ రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నందున ఏటా ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. నాలుగేళ్ళ కిందట 3.144 ఎకరాల్లో మల్బరీసాగు చేయగా ఇప్పుడు అది 10 వేల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 2,800 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి కాగా 1.106 మెట్రిక్‌ టన్నులను ఇక్కడ వినియోగించారు. రీలింగ్‌ యూనిట్లు లేకపోవడంతో 1.634 మెట్రిక్‌ టన్నులు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకకు పంపించాల్సి వచ్చింది. పట్టుదారం వినియోగం రోజు రోజుకూ పెరగడంతో పోచంపల్లి, నారాయణపేట, గద్వాల, కొత్తకోట, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది.

ఒక్క పోచంపల్లిలోనే రోజుకు 100 కిలోల పట్టుదారం అవసరమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో పట్టుదారం తయారు చేసే ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలు లేకపోవడంతో పట్టుదారం తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆటోమేటిక్‌ రీలింగ్‌ యంత్రాలను తెలంగాణ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తే పట్టుదారం త్వరితగతిన తయారుచేసుకోవచ్చు.

ఇటీవల కాలంలో సుర్యాపేట, షాద్‌నగర్‌, జనగాం, వరంగల్‌లో నూతనంగా నాలుగు ఆటోమేటిక్‌ రీలింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేశారు. పట్టుపరిశ్రమకు తెలంగాణ ప్రాంతంలో పూర్వవైభవం తీసుకురావాలంటే ఆటోమేటిక్‌ రీలింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడున్న రీలింగ్‌ యూనిట్లు ఏమాత్రం సరిపడడంలేదు. ఇంకా వేగవంతంగా పనులు జరగాలంటే చైనా దేశం నుండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఆటోమేటిక్‌ రీలింగ్‌ యూనిట్లను దిగుమతి చేసుకున్నట్లయితే ఆశించిన దాని కంటే ఎక్కువ ఉత్పత్తి సాధించే అవకాశం మెండుగా ఉంటుంది. ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో మల్బరీ తోటల పెంపకాన్ని, రైతులకు అధునాతన పరిజ్ఞానాన్ని అందించినట్లయితే పట్టు పరిశ్రమల అభివృద్ధి ఆశాజనకంగానే ఉంటుంది.

చైనా వంటి దేశాల్లో పట్టు పరిశ్రమకు 100 శాతం టెక్నాలజీ వినియోగించడం వల్ల పట్టు పరిశ్రమ అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రపంచంలో పట్టు ఉత్పత్తులలో మొదటిస్థానంలో జపాన్‌, రెండో స్థానం చైనా, మూడో స్థానంలో ఇండియా ఉండేవి. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడంతోనే చైనా పట్టు ఉత్పత్తుల్లో నేడు మొదటిస్థాంలో నిలిచింది. చైనాకు ధీటుగా రాష్ట్రంలో మల్బరీ సాగు, పట్టుదారం ఉత్పత్తికి తెలంగాణ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర పట్టు పరిశ్రమలకు ఒకప్పుడు ఇవి కేంద్రాలుగా ఉండేవి. అర్బనైజేషన్‌ ప్రోత్సాహకాల తగ్గింపుతో ఆయా రాష్ట్రాలు వెనుకబడ్డాయి. రాష్ట్రంలో పట్టుసాగు చేసే రైతులకు ఇక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో పట్టు ఉత్పత్తి విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. కిలోకి 75 చొప్పున ఇన్‌సెంటీవ్‌ పంపిణీ చేస్తున్నారు. చైనాలో మ్యాన్‌పవర్‌ ఖర్చు రూ. 700 ఉంటే తెలంగాణలో రూ. 300 ఉంటుంది. ఉత్పత్తి విలువ తక్కువగా ఉంది. చైనాలో 100 గుడ్ల నుండి 50-60 కిలోలు పట్టుతీస్తుంటే తెలంగాణలో 70-80 కిలోల పట్టు నేటికీ తీస్తున్నారు. నష్టశాతం కూడా తక్కువగానే ఉంటుంది. పట్టు ఉత్పత్తి వ్యయంలో కిలోకు రూ. 450 ఉంటే అదే చైనాలో రూ. 650 అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పట్టుపరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఇండస్ట్రీయల్‌ పాలసీ దోహదపడుతుందని చైనా పట్టును ఎగుమతి చేసే అమెరికా, జర్మనీ, ఇటలీతో పాటు కొనుగోలు సామర్ధ్యం ఎక్కువగా ఉన్న ఐరోపా దేశాల మార్కెటింగ్‌పై దృష్టి సారించనున్నట్లు పట్టుపరిశ్రమ కమీషనర్‌ తెలిపారు.

- ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి,

ఫోన్‌ : 9949285691