తెలంగాణ రాష్ట్రంలో పండించే నూనె గింజల పంటల్లో వేరుశనగ చాలా ప్రధానమైనది. రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 1.55 లక్షల టన్నుల కాయ ఉత్పత్తి మరియు 1.8 టన్నులు హెక్టారుకు ఉత్పాదకత కలిగిఉంది. ఖరీఫ్‌లో వర్షధారంగా, రబీ మరియు వేసవిలో నీటి పారుదల కింద సాగుచేయబడుచున్నది. వేరుశనగను గ్రౌండ్‌నట్‌, పీనట్‌, మంకీనట్‌, ఎర్త్‌నట్‌, పల్లికాయలు అని వివిధ పేర్లతో పిలుస్తారు.

వేరుశనగ పంటలో దిగుబడులు తగ్గటానికి ప్రధాన కారణాలు :

విత్తన శుద్ది పాటించక పోవడం

విత్తన మోతాదు తగ్గించి వాడడం

పాత విత్తనము వాడుకతో మొలక శాతము తగ్గడం

మొక్కల సంఖ్య తక్కువగా వుండడం

దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వడం

కలుపు నివారణ చేయకపోవడం

ఆకు మచ్చ, త్రుప్పు తెగుళ్ళను నివారించక పోవటముతో పైరు కాలపరిమితి కన్న ముందుగానే ఆకు రాల్చటముతో కాయలో గింజ నిండుగా లేక పోవటం.

విత్తే సమయం :

ఉత్తర తెలంగాణలో రబీలో సెప్టెంబర్‌ 15 నుండి అక్టోబరు 15 వరకు మరియు దక్షిణ తెలంగాణలో రబీలో అక్టోబరు15 నుండి నవంబరు 30 వరకు.

నేలలు :

ఇసుకతో కూడిన గరపనేలలు శ్రేష్ఠం. చల్కా, ఎర్ర గరప నేలలు కూడా అనుకూలం. సేంద్రీయ పదార్థం, ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 6.0-7.5 వరకు మధ్య గల నేలలు శ్రేష్ఠం. ఎక్కువ బంక మన్ను గల నల్లరేగడి నేలల్లో పంట వేయకూడదు.

రబీకి అనుకూలమైన రకాలు :

నీటి వసతి కింద :

వేమన, కదిరి- 4, కదిరి-5, కదిరి-6, కదిరి-9, తిరుపతి-4, నారాయణి, టి.ఎ.జి-24, టి.జి- 26, ఐ.సి.జి. ఎస్‌-11, 44, ధరణి.

వరికోత తరువాత :

కదిరి- 4, కదిరి-5, కదిరి-6, టి.ఎ.జి- 24.

లావు గింజ రకాలు:

కదిరి-7 బోల్డు, కదిరి-8 బోల్డు.

నేల తయారీ :

వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ళ ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేయాలి.

విత్తన మోతాదు :

గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. రబీలో 65-70 కిలోల గింజలు ఎకరానికి వాడుకోవచ్చు.

విత్తన శుద్ది :

కిలో విత్తనానికి 3గ్రాముల మాంకోజెబ్‌ లేక 2 గ్రాముల కార్బండిజమ్‌ పొడి మందును పట్టించాలి. కాండం కుళ్ళు, వైరస్‌ తెగులు ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 మి. లీ. ఇమిడాక్లోప్రిడ్‌ మందుతో విత్తనశుద్ధి చేయాలి. వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిపాస్‌ లేక 2 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ చొప్పున కలపి శుద్ధి చేయాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా సాగు చేసేటప్పుడు విత్తనానికి రైజోబియం కల్చరును పట్టించాలి. మెదలుకుళ్ళు, వేరుకుళ్ళు, కాండంకుళ్ళు, తెగుళ్ళు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో కిలో విత్తనానికి 4 గ్రా. ల ట్రైకోడెర్మా విరిడి పట్టించాలి. విత్తనాన్ని మొదట క్రిమి సంహరక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత శీలీంధ్రనాశినితో శుద్ధి చేయాలి.

నిద్రావస్థను దొలగించడం :

నిద్రావస్థ గల రకాల (కదిరి-7,8,9) విత్తనాన్ని 5 మి.లీ ఇథరిల్‌ (100 శాతం)ను 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో 12 గంటలు నానబెట్టిన తరువాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

విత్తే దూరం :

నీటి పారుదల క్రింద రబీ పంట కాలంలో గుత్తి రకాలకు 22.5 I 10 సెం. మీ. మరియు తీగ / పెద్ద గుత్తి రకాలకు 22.5 I 15 సెం. మీ. దూరంతో విత్తుకోవాలి.

విత్తడం :

విత్తనాన్ని గొర్రుతో గాని లేక నాగటి చాళ్ళలో గాని లేక ట్రాక్టర్‌తో నడిచే విత్తు యంత్రంతో గాని విత్తాలి. విత్తే సమయంలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెం.మీల లోతు మించుకుండా విత్తుకోవాలి. ట్రాక్టర్‌ డ్రిల్‌ను వాడినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవడమే గాక, ఖర్చును కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ఎరువులు ఎకరానికి కిలోల్లో :

భూసార పరీక్షననుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. సాధారణంగా వేరుశనగకు ఈ క్రింది మోతాదు ఎరువులు అవసరం.

సమతుల్య ఎరువుల వాడకం :

ఎకరాకు పశువుల ఎరువు 10 బండ్లు, వేపపిండి 150 కిలోలు చివరి దుక్కిలో వేయాలి. జింకులోపం సరిదిద్ధడానికి విడిగా 20 కిలోలు ఎకరాకు జింకు సల్షేట్‌ ఆఖరి దుక్కిలో వేయాలి. భూసార పరీక్షననుసరించి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించాలి. సాధారణంగా ఒక ఎకరా వేరుశనగ పైరుకు. నీటి పారుదల పంటకు ఎకరాకు 100 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మరియు 33 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఆఖరి దుక్కిలో వేయాలి, అలాగే 18 కిలోల యూరియాను విత్తే సమయంలో, 9 కిలోల యూరియాను 30 రోజుల తరువాత అంటే తోలి పూత దశలో వేసుకోవాలి. ఒక ఎకరాకు 200 కి.గ్రా. జిప్సంను తొలి పూత సమయంలో మొక్కల మొదల్ల దగ్గర చాళ్ళలో వేసి కలుపు తీసి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ అవసరం జిప్సంలోని కాల్షియం, సల్ఫర్‌ వల్ల గింజ బాగా ఊరడమే కాకుండా, నూనె శాతం కూడా పెరుగుతుంది.

కలుపు నివారణ, అంతర కృషి :

కలుపు మొలకెత్తక ముందే నశింపచేయగల కలుపు నాశినులయిన అలాక్లోర్‌ 50 శాతం ఎకరాకు ఒక లీటరు లేదా పెండిమిధాలిన్‌ 30 శాతం ఎకరాకు 1.3-1.6 లీ. చొప్పున ఏదో ఒక దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని లేదా 2-3 రోజులు లోపల నేలపై పిచికారీ చేయాలి.

విత్తిన 45 రోజులలోపు ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. 45 రోజుల తరువాత ఏ విధమైన అంతరకృషి చేయకూడదు లేనిచో ఊడలు దెబ్బతిని దిగుబడి తగ్గుతుంది.

నీటి యాజమాన్యం :

వేరుశనగకు 400 - 450 మి.మీ. నీరు అవసరం అవుతుంది. తేలిక నేలల్లో 8-9 తడులు పెడితే సరిపోతుంది. విత్తే ముందు నేల బాగా తడిసేట్లు నీరు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు విత్తనం వేయాలి. రెండవ తడిని విత్తిన 20-25 రోజులకు (మొదటి పూత దశలో) ఇవ్వాలి. తరువాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7-10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంటకోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి, ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు ( విత్తిన 45-50 రోజుల నుండి 85-90 రోజుల వరకు) సున్నితమైనది. కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టుకోవాలి. నీటిని తుంపర్ల ద్వారా ఇచ్చినట్లయితే 25 శాతం సాగు నీటి ఆదాతో పాటు దిగుబడి పెరుగుతుంది.

సస్యరక్షణ :

వేరు పురుగు :

వేరుపురుగు తల్లి పురుగులు (పెంకు పురుగులు) తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుండి బయటకు వచ్చి చుట్టు పక్కల ఉన్న వేప/రేగు చెట్లను ఆశిస్తాయి. ఆడ పురుగులు భూమిలో గుడ్లు పెడుతాయి. గొంగళిపురుగు తెల్లగా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన వేరుపురుగు 'జ' ఆకారంలో ఉండి మొక్క వేర్లు కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. వేరు పురుగు ఆశించిన మొక్కలు వాడి, ఎండి చనిపోతాయి మొక్కలను పీకితే సులువుగా ఊడి వస్తాయి. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.

నివారణ :

లోతుదుక్కి చేయడం వల్ల వేరు పురుగు కోశస్ధ దశలు బయటపడి పక్షుల బారినపడతాయి. లేక ఎండ వేడిమికి చనిపోతాయి. ఒక కిలో విత్తనానికి 6.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ మందును కలిపి విత్తుకోవాలి.

ఆకుమడత :

ఆకుముడత విత్తిన 15 రోజుల నుండి ఆశిస్తుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలిదశలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. వాటి లోపల ఆకు పచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు ఉంటాయి. ఇవి 2,3 ఆకులను కలిపి గూడు చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినివేయడం వల్ల ఆకులన్ని ఎండి, దూరం నుండి చూస్తే కాలినట్లు కనపడుతాయి. దీనినే రైతులు అగ్గితెగులు అని కూడా అంటారు.

దీని నివారణకు అంతర పంటలుగా జొన్న, సజ్జ 7:1 నిష్పత్తిలో వేయాలి. సోయాచిక్కుడు తరువాత వేరుశనగ వేయకూడదు. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి రెక్కలపురుగు ఉనికిని, ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్న జీవులు 50 శాతం పైగా ఉన్నప్పుడు క్రిమిసంహారక మందులు వాడవలసిన అవసరం లేదు. క్వినాల్‌ఫాస్‌ 400 మి.లీ. లేక మోనోక్రోటోఫాస్‌ 320 మి.లీ. లేక క్లోరిపైరిఫాస్‌ 500 మి.లీ. మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.

పొగాకు లద్దె పురుగు :

తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఆకుపైన, అడుగు భాగాన గుంపుగా గుడ్లు పెడతాయి. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తినివేసి, జల్లెడ ఆకుగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగుల ఆకులను తినివేస్తాయి పగటి వేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేక మట్టి పెళ్ళలు లేక రాల్ల క్రింది దాగి ఉండి రాత్రి పూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తిని వేస్తాయి.

నివారణ :

వేసవిలో లోతుగా దుక్కి చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగ రెక్క పురుగులను ఆకర్షించాలి. ఎకర వేరుశనగ పొలంలో 30-40 ఆముదం, పొద్దుతిరుగుడు మొక్కలు ఎర పంటలుగా ఉండేటట్లు చూడాలి. గుడ్ల సముదాయాన్ని, పిల్ల పురుగులను ఏరి వేయాలి. 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్‌.పి.వి. ద్రావణాన్ని ఒక ఎకరాకు చల్లాలి. 50 గ్రా. వేపగింజల పొడిని లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాలను విషపు ఎర తయారుచేసి వరి తవుడు 5 కిలోలు బెల్లం 1/2 కిలో మోనోక్రోటోఫాస్‌ లేక క్లోరిపైరిఫాస్‌ ఎకరా పొలంలో సాయంత్రం పూట చల్లాలి.

తెగుళ్ళు :

తిక్క ఆకు మచ్చ తెగులు :

త్వరగా వచ్చే ఆకు మచ్చ తెగులు, ఈ మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. ఆలస్యంగా వచ్చే ఆకు మచ్చ తెగులు చిన్నదిగా గుండ్రంగా ఉండి, ఆకు అడుగు, భాగాన నల్లని రంగు కల్గి ఉంటాయి. కాండం మీద, ఆకు, కాడల మీద, ఊడల మీద కూడ మచ్చలు ఏర్పడతాయి.

దీని నివారణకు తెగులును తట్టుకొనే రకాలను (వేమన, కదిరి-9 )సాగు చేసుకోవాలి. తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు మాంకోజెబ్‌ 400 గ్రాములు లేదా హెక్సాకోనజోల్‌ 400 మి.లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి, తరువాత 15 రోజులకు మరోసారి పిచికారీ చేయాలి.

తుప్పు లేదా కుంకమ తెగులు :

ఆకులు అడుగు భాగంలో ఎరుపు రంగు గల చిన్న పొక్కులు ఏర్పడి ఆకుపై భాగంలో పసుపు రంగు మచ్చలు కన్పిస్తాయి. దీని నివారణకు ఎకరాకు 400 గ్రాముల క్లోరోథలోనిల్‌ లేదా 400 గ్రాముల ట్రైడిమార్ఫ్‌ లేదా 400 గ్రాముల మాంకోజెట్‌ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేయాలి.

పి. మధుకర్‌ రావు, శాస్త్రవేత్త (ఆగ్రానమి), పి. గోన్యా నాయక్‌, శాస్త్రవేత్త (ప్లాంట్‌ బ్రీడింగ్‌), యస్‌. ఓంప్రకాశ్‌, శాస్త్రవేత్త (కీటక శాస్త్రవిభాగం),

యన్‌. నవత, శాస్త్రవేత్త (ఆగ్రానమి), బి.మాధవి, శాస్త్రవేత్త (ఆగ్రానమి), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల, ఫోన్‌ : 9505507995