ఆంధ్రప్రదేశ్‌ లో ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పంట వాము. సాగు మరియు మార్కెట్లో సాగులో సమస్యలు తక్కువగా ఉండటం వల్ల వాము సాగు బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీన్ని మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను పండించవచ్చు. ర్నూల్‌ జిల్లా రైతులు వామును సాగు చేసి లాభాలు గడిస్తున్నారు.

వాతావరణం :

చల్లని వాతావరణం, మంచు ఈ పంట పెరుగుదలకు అనుకూలం.

నేలలు :

ఈ పంటని వర్షాధారం క్రింద సాగు చేయదలిస్తే నల్లరేగడి నేలలు అనుకూలం. నీటిపారుదల కింద సాగు చేయదలిస్తే తేలికపాటి నేలలు కూడా అనుకూలం. అధిక ఆమ్ల, క్షార నేలలు, నీరు నిలువ ఉండే నేలలు అనుకూలం కావు.

విత్తే కాలం :

వర్షాధారంగా ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. నీటిపారుదల క్రింద సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు ద్వితీయ పక్షం వరకు విత్తుకోవచ్చు.

రకాలు :

లాం సెలక్షన్‌-1 : 150-160 రోజుల్లో పంటకు వస్తుంది. నూనె శాతం 3 శాతం ఎకరాకు సుమారు 5 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.

లాం అజోవాన్‌ -2 (ఎల్‌.టి.ఏ.-26) : 145 -160 రోజుల్లో కోతకు వస్తుంది. నూనె శాతం 4 శాతం విడుదలకు సిద్ధంగా ఉన్న అధిక దిగుబడినిచ్చే వంగడం. ఎకరాకు 5-6 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.

నేల తయారీ :

మెత్తని పదును వచ్చేవరకు 2-3 సార్లు దుక్కి దున్నాలి. ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు వేయాలి. పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు పెంచి దున్నడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

విత్తుట :

ఎకరాకు కిలో విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనానికి 1 గ్రా. కార్భండిజమ్‌ విత్తనశుద్ది చేసుకోవాలి. విత్తనాన్ని 1:5 నిష్పత్తిలో ఇసుకతో కలిపి గొర్రుతో 3-4 సెం.మీ.ల లోతులో ఎద పెట్టాలి. సాలుకి సాలుకి మధ్య 45-60 సెం.మీ. ఎడం ఉండేట్లు విత్తుకోవాలి. మొలక రావడానికి రెండు వారాలు పడుతుంది. కాబట్టి అవసరాన్ని బట్టి తేలికపాటి తడి ఇచ్చి మొలక సరిగా వచ్చేట్లు చూసుకోవాలి. మొక్కలు మొలిచిన తరువాత రెండు మూడు ఆకుల దశలో చాళ్ళలో మొక్కల మధ్య 20 సెం.మీ. ఉండేట్లుగా ఎడం (థిన్నింగ్‌) తీసుకోవాలి.

ఎరువులు, అంతరకృషి :

ఆఖరి దుక్కిలో ఎకరాకు 15 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 15 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను వేసుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే విత్తిన 35-40 రోజులకు 15 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన తరువాత మొదటి 100-110 రోజుల్లో 2-3 సార్లు కలుపు తీసి, గొర్రుతో అంతరకషి చేసి గుంటక తోలాలి. నీటిపారుదల కింద 20-25 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి.

సస్యరక్షణ :

పేనుబంక : నివారణకు ఎసిఫేట్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎర్రనల్లి : ఆకుల అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి. నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

తామర పురుగులు : రసం పీల్చడం వల్ల ఆకులు పైకి ముడుచుకొని పోతాయి. వీటి నివారణకు ఫిప్రొనిల్‌ 2 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

లీఫ్‌ మైనర్‌ : పురుగుల లార్వాలు ఆకులను తొలిచి వేయడం వల్ల ఆకులు ఎర్రబారి ముడుచుకొనిపోతాయి. వీటి నివారణకు వేపనూనె 5 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

బూడిద తెగులు : ఆకుల పై తెల్లని బూడిద వంటి మచ్చలు కనబడుతాయి. ఈ తెగులు నివారణకు కెరాథేన్‌ 1 మి.లీ. లేదా కార్భండిజమ్‌ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ఎండుతెగులు : పంట మార్పిడి చేయని చోట్ల ఎక్కువగా వస్తుంది. విత్తనశుద్ధి తప్పని సరిగా చేసుకోవాలి.

కోతలు మరియు అనంతర సాంకేతిక పరిజ్ఞానం :

పంట 140-160 రోజుల్లో కోతకు వస్తుంది. గింజలు గోధుమ రంగులోకి మారి పరిపక్వ దశకు వచ్చినప్పుడు గింజరాలకుండా మొక్కలను పీకడం కాని కోయడం కానీ చేయాలి. కోసిన మొక్కలను 2-3 రోజులు పొలంలోనే ఎండనిచ్చి నూర్చు కోవాలి.

ఆర్‌.బిందు ప్రవీణ, ఉద్యాన శాస్త్రవేత్త, బి.హెచ్‌.చైతన్య, సస్య రక్షణ శాస్త్రవేత్త, డా.జి.ప్రసాద్‌ బాబు, కార్యక్రమ సమన్వకర్త

ఆచార్య ఎన్‌. జి. రంగా. వ్యవసాయ విశ్వ విద్యాలయం, కషీ విజ్ఞాన కేంద్రం బనవాసి, కర్నూలు జిల్లా