Print this page..

జూన్ మాసంలో ఉద్యాన పంటలలో సేద్యపు పనులు

మామిడి: 
కోతల అనంతరం 10-15 రోజులు చెట్లకు విశ్రాంతి నివ్వాలి. చెట్టు లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డు తగులుతున్న కొమ్మలను కత్తిరించాలి. పూత కాడల నుండి వెనకకు 10-15 సెం.మీ. వరకు కత్తిరించాలి. దీని వల్ల కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి అవి వచ్చే కాలంలో పూత, పిందెనిస్తాయి. 

జామ: 
ఈ మాసంలో పిండినల్లి నివారణకు ఎసిఫేట్ 1 గ్రా. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 
పాదులు చేసి, పెద్ద చెట్టుకి 1085 గ్రా. యూరియా, 1250 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేటు, 850 గ్రా. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లు వేసి నీరు కట్టాలి. నీరు కట్టిన 20-25 రోజులలో కొత్త చిగుర్లు వచ్చి చలికాలంలో వచ్చే పంట (మృగ్ బహర్) దిగుబడి ఎక్కువ వస్తుంది. 

అరటి : 
అరటిలో నులి పురుగులు సోకినట్లయితే ఆకుల అంచుల వెంబడి నల్లగా మారి క్రమేపి ఆకులు ఎండిపోతాయి. నివారణకు 25-40 గ్రా. కార్బోఫ్యూరాన్ గుళికలు మొక్కల మొదళ్ళక వద్ద 10 సెం.మీ. లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పెట్టాలి. పొట్టి పచ్చ, పెద్ద పచ్చ అరటి రకాలను తొలకరి వర్షాలు పడిన తరువాత జూన్ మొదటి వారం నుండి నాటుకోవచ్చును. 
జంట వరుసల్లో నాటేటప్పుడు వరుసల మధ్య దూరం తక్కువగా (1.2 మీ. లేదా 1.0 మీ) ఉండాలి. రెండు జంట వరుసల మధ్య దూరం ఎక్కువగా 2.0 లేదా 1.8 మీ) ఉండాలి. ముందు వరుస మొక్కలకు రెండవ వరుసలోని మొక్కలు ఎదురుగా కాకుండా ముందు వరుసలోని మొక్కల మధ్య వచ్చే విధంగా నాటాలి. 

బత్తాయి, నిమ్మ: 
ఈ మాసంలో వర్షాల వల్ల కొత్త చిగుర్లు రాకుండా నివారించడానికి క్లోరోమక్వాట్ క్లోరైడ్ 2 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 
కాయలు ఉంటే పరిమాణం పెంచడానికి పొటాషియం నైట్రేట్ 1.5 కిలోలు, 2,4-డి 1.5 గ్రా. మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 
జూన్ నెలలో గజ్జి తెగులు వ్యాపించడానికి అనువుగా ఉంటుంది. కావున ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 180 గ్రా. స్క్రిప్టోసైక్లిన్ 6 గ్రా. మిశ్రమాన్ని 60 లీటర్ల నీటికి చొప్పున కలిపి ఒకసారి పిచికారి చేయాలి. నెల తరువాత మరొకసారి పిచికారి చేయాలి. 
ఆకు ముడత, ఎగిరేపేను, ఆకు తినే గొంగళి పురగు ఈ నెలలో కనిపిస్తే డైమిథోయేట్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. 

ద్రాక్ష : 
ద్రాక్ష తోటలపై 500 పి.పి.ఎమ్ సైకోసిల్ ద్రావణాన్ని పిచికారి చేయాలి. 
కొమ్మలు ముదరడానికి కత్తిరించిన 45-120 రోజుల వరకు 60 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషను ఎకరాకు వేసుకోవాలి. 
మజ్జిగ తెగులు నివారణకు ముందుగా బోర్డోమిశ్రమం (1 శాతం), తర్వాత రెండోసారి మెటలాక్సిల్ + మాంకోజెబ్ 2.5 గ్రా., మూడోసారి సైమోక్యానిల్ + మాంకోజెబ్ 3 గ్రా.లు లీటరు నీటికి చొప్పున కలిపి 7 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. 

సపోట: 
ఈ మాసంలో తోటను దున్ని చెట్లకు పాదులు చేసి, పెద్ద చెట్లకు 880 గ్రా. యూరియా, 1000 గ్రా. సింగిల్ సూపర్ ఫాస్పేట్, 750 గ్రా.ల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను చెట్టు చుట్టూ 1.5 మీ. దూరంలో పాదంతా సమానంగా చేసి మట్టిలో కలిపి తేలికపాటి తడి ఇవ్వాలి. 

బొప్పాయి : 
మొక్క మొదళ్ళ వద్ద నీరు నిల్వ కుండా చూడాలి. బోర్డో మిశ్రమం 1 శాతం లీటరు నీటికి కలిపి మొదలు తడపాలి. 

కూరగాయలు: 
టమాట: 
21-25 రోజుల వయస్సు ఉండి 3-4 ఆకులు గల నారును 60X45 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. 30 రోజులు మించిన ముదురు నారును నాటరాదు. 
ఎర పంటగా బంతిని వేసుకోవాలి. ప్రతి 16 వరుసల టమాటాకు 1 వరుస బంతి మొక్కలు నాటాలి. 

వంగ: 
నాటే ముందు ఎకరాకు 200 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. రసం పీల్చు పురుగులు 
ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బోఫ్యురాన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి. 
30-35 రోజుల నారుని నాటుకోవాలి. పొడవుగా నిటారుగా పెరిగే రకాలను 60x60 సెం.మీ. గుబురుగా పెరిగే రకాలను 75x50 సెం.మీ. దూరం పాటించి నాటుకోవాలి. 

బెండ: 
వర్షాకాలపు పంటను 60 సెం.మీ. ఎడంతో బోదెల మీద 30 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. సరైన సమయంలో వర్షం లేకపోతే 7-8 రోజులకొకసారి నీరు పెట్టాలి. 

మిరప : 
ఈ మాసం చివరిలో నారుమడులు 1 మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు ఉండేటట్లు తయారు చేసి మధ్యలో 30 సెం.మీ. కాలువలు తీయాలి. సెంటు నారు మడిలో 650 గ్రా. విత్తనం చల్లుకోవాలి. విత్తనంతోపాటు సెంటు నారు మడికి 80 గ్రా. ఫిప్రోనిల్ గుళికలను వాడినచో రసం పీల్చు పురుగులను నివారించవచ్చును. 

పందిరి కూరగాయలు : 
ఈ మాసంలో ఆనప, దోస, కాకర, బీరలను నాటుకోవచ్చు. భూమి మీద పాకించే పాదులకు, వర్షా కాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవడానికి 2 మీ. దూరంలో కాలువలు చేయాలి. 
అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1-2 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 2-4 ఆకుల దశలో లీటరు నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారి చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. 

చిక్కుడు : 
ఎకరాకు తీగ రకాలు 0.8-1.2 కిలోల వరకు, పొద రకాలకు అయితే 15 కిలోల వరకు విత్తనం అవసరం అవుతుంది. కిలో విత్తనాలకు తొలుత 4 గ్రా. ట్రైకోడెర్మాతో రెండు గుంటల తరువాత 1 గ్రా. కార్బండాజిమ్ తో విత్త నశుద్ధి చేసుకొని నాటుకోవాలి. 

బంతి: 
ఈ మాసంలో ఎకరాకు సరిపోయే 400-500 గ్రా. విత్తనం నారు పోసుకోవాలి. 

మల్లె : 
ఈ మాసంలో 1.25-2 మీ. దూరంలో అంటు మొక్కలు లేదా కొమ్మ కత్తిరింపులు నాటుకోవాలి. 

కనకాంబరం: 
ఈ మాసంలో ఎకరాకు 2 కిలోల విత్తనంతో నారు పోసుకోవాలి. 

పసుపు: 
ఈ మాసం మొదటి పక్షం వరకు పసుపును విత్తుకోవచ్చు. విత్తన కొమ్ముల బరువు 30-40 గ్రా. బరువుతో, విత్తే లోతు 8 సెం.మీ. ఉంటే ధృడంగా మంచి ఎదుగుదల గల మొక్కలు పొందవచ్చును. 
 

రచయిత సమాచారం

జి. శైలజ, ఎం.ఎస్సీ, (హార్టికల్చర్), శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ : 8179088347