మా గురించి

వ్యవసాయ, అనుబంధ రంగాల కాయకల్ప చికిత్సలో ‘‘అగ్రిక్లినిక్‌’’ సమగ్ర వ్యవసాయ మాసపత్రిక ఆరేళ్ళపాటు రైతుల వెన్నంటి ఉంది. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ వాణిజ్యవేత్తలు, అనుబంధ రంగాల ప్రముఖులందరి సహకారంతో వ్యవసాయ విప్లవాన్ని సాధించడంలో నూతన ఒరవడితో ముందుకు వెళ్ళడం, రంగుల హరివిల్లులా ఈ పత్రికను నెల, నెలా తప్పనిసరిగా తీసుకునిరావడం అనితర సాధ్యం. వ్యవసాయానికి ఇంత అందమైన పత్రిక అవసరమా? అని ప్రశ్నించిన వారికి ఈ పత్రిక మనుగడ అప్రతిహతంగా కొనసాగడమే సమాధానంగా మేము మరోసారి రైతు సేవకు, వ్యవసాయదారుని భద్రతకు, దానితోపాటు జాతీయ ఆహార భద్రతకు జరుగుతున్న కృషిలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ పత్రిక ప్రారంభమైన తరువాత రాష్ట్రంలోని రైతులు నూతన స్ఫూర్తితో కొంతవరకైనా గాని ప్రభావితం పొంది ఆధునిక వ్యవసాయం పట్ల మరింత మంది మక్కువ పెంచుకోవడం మాకు సంతోషం కలిగించే విషయం. అదే సందర్భంలో వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మార్చేందుకు జరుగుతున్న యజ్ఞంలో మేము కూడా అక్షర సైనికులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాము. సమాజానికి చాలినంత తిండి పెడుతూ, తాను మాత్రం పస్తులుంటున్న రైతన్న దీనస్థితిని కళ్ళకు కట్టినట్లు సమాజానికి తెలియజెప్పడంతోపాటు ‘‘రైతులను ఉత్పత్తిదారులుగాను, సాంకేతిక నిపుణులుగాను, అత్యంత విలువైన భూమిపుత్రులుగాను గౌరవించి, వ్యవసాయాన్ని పవిత్రవృత్తిగా గుర్తించే సమాజం’’రూపుదిద్దడంలో మా తొలి సంచికలో చెప్పిన విధంగా మేము చేసి చూపించాము.

కేవలం పత్రిక ప్రచురణకే పరిమితం కాకుండా, సోషల్‌ మీడియాలో రైతు ఔన్నత్యాన్ని నిరూపించడంలో కూడా ముందున్నాము. అగ్రిక్లినిక్‌ మాసపత్రిక కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకే కాకుండా, విశ్వవ్యాప్తంగా ఈ పత్రిక వెబ్‌సైట్‌లోని అంశాలు పాఠకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగునాట రైతన్నలు అమలుచేస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతోపాటు, ఇతర దేశాలలోను, రాష్ట్రాలలోను ఎక్కడ మేలురకం వ్యవసాయ పద్ధతులు అమలవుతున్నాయో వాటిని మనవారికి చేరవేయడానికి పత్రికతోపాటు అగ్రిక్లినిక్‌ వెబ్‌సైట్‌ కూడా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేవలం వెబ్‌సైట్‌లోనే కాకుండా అగ్రిక్లినిక్‌ మాసపత్రిక సోషల్‌ మీడియాలో పేరెన్నికగన్న విశేష ఆదరణ గల ఫేస్‌బుక్‌లో కూడా సంచరిస్తున్నది. అనేకమంది నెటిజన్లు, వ్యవసాయ, వాణిజ్య రంగాలకు చెందిన పాఠకులు అగ్రిక్లినిక్‌ మాతృసంస్థ అయిన ‘నోవా అగ్రిటెక్‌ ప్రై. లిమిటెడ్‌’ చేపడుతున్న వినూత్న వ్యవసాయ పద్ధతులను షేర్‌ చేసుకుని, వారు కూడా తద్విదంగా వ్యవసాయ రంగంలో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా జీరోటిల్లేజ్‌ పద్ధతిలో ప్లాస్టిక్‌ మల్చ్‌పై పత్తి పంటను పండిరచి ప్రపంచ వ్యాప్తంగా తొలిసారి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన విషయాన్ని తమిళనాడులోని ప్లాస్టిక్‌ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే సంస్థలు ఫేస్‌బుక్‌లో ప్రముఖంగా షేర్‌ చేసుకున్నాయి.

అగ్రిక్లినిక్‌ పత్రిక సంపాదకులు, ప్రస్తుత పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు, నోవా అగ్రిటెక్‌ ప్రై. లిమిటెడ్‌ విజయసారధి ఏలూరి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పాదకాల వాణిజ్యంతోపాటు, ఆధునిక వ్యవసాయ క్షేత్రాల అభివృద్ధి ` పరిశోధన సంస్థల ద్వారా చేసిన విశేష ప్రయోగాలు తెలుగు రైతులనే కాకుండా యావత్‌ భారతదేశంలో సంచలనం సృష్టించాయి.

వీటిని ప్రముఖంగా రైతులోకానికి వెల్లడిరచడంతోపాటు, ఇతర రైతు సోదరులను ఈ క్షేత్రాలకు తరలించి, క్షేత్రప్రదర్శనలు నిర్వహించడంలో అగ్రిక్లినిక్‌ మాసపత్రిక కీలకపాత్ర వహించింది. అదే విధంగా సిఐఐ, ఇతర సంస్థలు నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనల్లో, విజ్ఞాన సదస్సుల్లో కూడా పాల్గొని తనవంతు పాత్రగా రైతులను చైతన్యపరిచింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రైతుల విజ్ఞాన వేదికగా ఆధునిక రైతులు సంఘటితపడి తమలో తాము ఆధునిక విజ్ఞానాన్ని ఒకరికి ఒకరు చేరవేయడంలో అగ్రిక్లినిక్‌ పాత్ర విశిష్టంగా ఉంది. నాలుగు సంవత్సరాల వ్యవధిలో కొన్ని వందల మంది రైతు సోదరులను, రైతు శాస్త్రజ్ఞులను, పరిశోధకులను, నిపుణులను సమీకరించి ఒక సమగ్ర వ్యవసాయ విజ్ఞాన వేదికగా, రైతులను, రైతు హితులను హీరోలుగా చూపించి, వ్యవసాయం దండగ కాదు, పండుగని నిరూపించి, ఇతర వృత్తుల్లో వారిని సైతం ఈ రంగంలోకి ఆహ్వానించి, ఇతర వృత్తులతోపాటు వ్యవసాయానికి కూడా ఆదరణను కల్పించడంలో అగ్రిక్లినిక్‌ పాత్ర అద్వితీయమైనది. వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా మరల్చి, చట్ట సభల్లో రైతు ప్రతినిధులకు స్థానం కల్పించి, రైతే రాజుగా అవతరించేందుకు, రైతు సాధికారత నెలకొనేందుకు, రెండో సస్యవిప్లవాన్ని చేపట్టి సాధించేందుకు అగ్రిక్లినిక్‌ పత్రికకు తోడ్పాడునిచ్చిన అనేకమంది హితులకు, రైతు సోదరులకు, వ్యవసాయ వాణిజ్యవేత్తలకు, శాస్త్రవేత్తలకు, అందరికీ మరోసారి సస్యవిప్లవ శుభాకాంక్షలతో……

Group of Companies




మీ

ఏలూరి సాంబశివరావు, M.Sc., (Hort)

సంపాదకులు