ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వై.ఎస్‌. జగన్మోహన రెడ్డి నాయకత్వంలోని ఏపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు అసెంబ్లీకి హాజరుకాలేని నేపధ్యంలో శాసన సభలో ఆయన పక్షాన మున్సిపల్‌ పరిపాలన శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలోనూ, మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ శాసన మండలిలోనూ బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి తన తొలి బడ్జెట్‌ ప్రసంగంలోనే ప్రాధాన్యతా రంగమైన వ్యవసాయానికి నిధుల కేటాయింపుపై సాధారణ బడ్జెట్‌లో ప్రస్థావించగా, మంత్రులు వ్యవసాయ బడ్జెట్‌లో వివరాలను పూర్తి స్థాయిలో ఉభయ సభల్లో సభ్యుల ముందు ఉంచారు. ముఖ్యమంత్రి జగన్‌ తన విస్తారమైన పాదయాత్ర సందర్భంలో పలుచోట్ల ప్రకటించిన, గమనించిన అంశాలతో పాటు, ఎన్నికల ప్రణాళికలో నవరత్నాల పేరిట రూపొందించి ప్రజల ముందుంచిన అంశాలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు దానిలో ఉన్న ప్రాధాన్యత అంశాల ద్వారా అర్ధమౌతున్నది.

మొత్తం రూ. 28,866,23 వేల కోట్ల మొత్తంతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రైతులకు పెట్టుబడి సహాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మరికొద్దికాలంలో రైతుల అకౌంట్లలో పెట్టుబడి కింద మొత్తాలను వేయడంతోపాటు, సమగ్రమైన సంక్షేమ కార్యాచరణ ద్వారా రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దానిలో భాగంగా రైతులకు ఉచిత బీమా పథóకం, వడ్డీలేని పంట రుణాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చింది.

చిరకాలంగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన కౌలు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారు. ప్రతికూల వాతావరణ స్థితిగతులతో పంట పాడైపోయి, పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర లేకుండా అమ్ముకునే దుస్థితి నుండి కాపాడేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ధరల స్థిరీకరణ నిధికి తొలిసారిగా రూ. 3 వేల కోట్లను కేటాయించింది.

వ్యవసాయ అనుబంధ రంగాలైన తోటల పెంపకం, పట్టు పెంపకం, పాడిపరిశ్రమ మత్స్య రంగాలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలను రూపొందించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళేందుకు కార్యాచరణ ప్రకటించింది. యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తూ, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు బిందు, తుంపరల సేద్యానికి పెద్దపీట వేసింది.

వ్యవసాయ రంగానికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్న కూలీల సమస్యను అధిగమించేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణకు అనేక చర్యలను ప్రకటించింది. రైతులకు మేలైన వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అనేక పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రులు ఉభయ సభల్లో తెలిపారు. దానిలో భాగంగా భారతీయ ఉద్యాన రాజధానిగా ప్రతిష్టాత్మకం భావిస్తున్న కడియం నర్సరీలకు ఇతర ఉద్యానవన అభివృద్ధికి ఆ ప్రాంతంలో ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో కేంద్ర మొక్కల పంటల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు వెల్లడించారు. అదే విధంగా విజయవాడలో భారత మొక్కల పరిశోధన-యాజమాన్య సంస్థను ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. కేరళలోని కోజీకోర్‌లో నెలకొని ఉన్న జాతీయ సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ సహకారంతో అల్లం పంట అభివృద్ధికి తోడ్పడే మంచి విత్తన తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశంలోనే అత్యధికంగా జి9 రకం అరటిని పండించే కడప జిల్లాలోని పులివెందులలో ఒక ఆధునిక అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రాష్ట్రానికి, దేశానికి ప్రత్యామ్నాయ ఆర్ధిక వనరుగా ప్రసిద్ధి చెందిన, సువిశాలమైన సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె, ప్రకాశం జిల్లా ఓడరేవు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడల్లో ఫిషింగ్‌ హార్బర్లు నెలకొల్పడం, అదే విధంగా నిజాంపట్నం, మచిలీపట్నంలోని ఓడరేవుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.

ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ద్వారా రైతులను ఆధునిక వ్యవసాయం వైపు మళ్ళించేందుకు సోలార్‌ విద్యుత్‌ను వినియోగించి సబ్సిడీపై రైతులకు అందచేసేందుకు పధకాన్ని రూపొందించారు. 2019-20 మధ్య 50 వేల సోలార్‌ పంపుసెట్లను రైతులకు అందచేస్తారు.

అగ్రిక్లినిక్‌ డెస్క్‌