కౌలు రైతుల విధానం అనాదిగా భారతీయ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేస్తూ వస్తోంది. భూమిపై యాజమాన్యపు హక్కులు లేని కోట్లాది మంది రైతులు కౌలు విధానంలో సాగుచేసి భారతీయ వ్యవసాయానికి మూల స్థంబాలుగా నిలుస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉండడం గిట్టుబాటు ధరలు లేక, ప్రకృతి వైపరీత్యాలు వీరి ఆశలపై నీళ్ళుజల్లడంతో ఎటూ రక్షణ లేని స్థితిలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి బాధలు తెలిసికూడా భూమి యజమానులతో ఎదురయ్యే ప్రతికూలతకు భయపడి సున్నితమైన ఈ అంశంపై జోక్యం చేసుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడంతో అడకత్తెరలో పోకచెక్కలా కౌలు రైతులు నలిగి పోతున్నారు.
దేశంలో రైతుల పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు, ప్రకటిస్తున్నా కూడా ఏ ఒక్క లబ్ది కౌలుదారుకు చెందకపోవడం గమనిస్తున్నాము. వారి పరిస్థితులను దైన్యాన్ని చక్కదిద్దేందుకు మరో మార్గం లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్న నేపద్యంలో సమస్య నివారణకు కొత్తగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఒక చట్టాన్ని ఆమోదింపచేసుకుంది.
ఈ చట్టం అమలు భూయజమానులు-కౌలుదారుల మధ్య ఉన్న సున్నితత్వం నేపధ్యంలో చట్టమైతే చేశారుగాని దాని అమలుపై ఉన్న సందేహాలు, చట్టబద్ధత గురించి ఎలా ఉన్నా ఆ చట్టంలోని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం...
పంట సాగుదారుల హక్కుల రక్షణ బిల్లును అనేక చర్చలు, వాదోపవాదాల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా రూపొందిన నేపధ్యంలో మామూలు రైతులతోపాటు పంటలు పండించే 16 లక్షల మంది కౌలు రైతులకు ప్రస్తుతం పెట్టుబడి సహాయం అందనుండడం తక్షణ ప్రయోజనమే. పెట్టుబడి సాయం కింద ఏటా ఒక్కొక్కరికీ రూ.12,500 లభించనున్నాయి.
ఉపముఖ్యమంత్రి కూడా అయిన పిల్లి సుభాష్‌చంద్రబోస్ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా మాట్లాడుతూ కేవలం కౌలు రైతుల ప్రయోజనాల కోసమే బిల్లు తీసుకొచ్చామని, అసలు భూయజమానులకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది రాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు కావలసిన పత్రాలు ఇవ్వడానికి ఇక భూయజమానులు ఎలాంటి భయాందోళనలను గురికాకుండా చట్టం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. కేవలం 11 నెలల కాలం వరకే ఈ పత్రం సజీవంగా ఉంటుందని ఆ తరువాత చెల్లదని స్పష్టత ఇచ్చారు. ప్రతి సంవత్సరం కౌలును పునరుద్ధరించుకునేందుకు యజమాని - కౌలు దారు కొత్తగా పత్రాలు ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుందని వివరించారు.
బిల్లు ఆమోదం అనంతరం ఈ చట్టంపై ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్‌లో వ్యాఖ్యచేస్తూ ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామని, లక్షలాది మందికి ఉపయోగపడే చట్టం వల్ల నిజమైన భూయజమానులకు ఎలాంటి అభద్రతాభావం కలగదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయాభివృద్ధికి, రైతు పురోగతికి తోడ్పడేందుకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని నూతన ప్రభుత్వం ఒక వ్యవసాయ మిషన్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి సారధ్యంలో మాజీ ఐసిఎఆర్ డైరెక్టర్, ఎమ్.వి.ఎస్. నాగిరెడ్డి ఉపాధ్యక్షుడిగా, ప్రముఖ జర్నలిస్టు, మెగసెసే అవార్డు గ్రహీత, గ్రామీణాభివృద్ధి నిపుణులు డా|| పాలగుమ్మి సాయినాధ్ సభ్యునిగా, ఇంకా అనేక మంది నిపుణులు, వ్యవసాయ మంత్రి, సచివులు, మాజీ ఉపకులపతి సభ్యులుగా ఈ కమీషన్ వ్యవసాయ రంగం తీరు తెన్నులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి మార్గాలను చూపిస్తుంది.
అగ్రిక్లినిక్ డెస్క్