అంతర్జాతీయ విత్తన సదస్సులో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా|| కె. కేశవులను ఇష్టా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ విత్తన సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులతో నిర్వహించిన కమిటీ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌ డా|| కేశవులను సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు భారతదేశానికి వైస్‌ ప్రెసిడెంట్‌ స్థానం లభించలేదు. ఈసారి జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ విత్తన సంస్థలో అరుదైన గౌరవం లభించింది. ఈ స్థానం సాధించడం భారతదేశానికే తలమానికంగా తెలంగాణ నిలిచిందనడంలో సందేహం లేదు.

విత్తన రంగంలో దశాబ్ద కాలం నుండి తెలంగాణ రాష్ట్రం వివిధ దేశాలకు ధీటుగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ద్వారా విత్తనోత్పత్తి చేసి మన దేశ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేస్తూ వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్న తరుణంలో ఇటువంటి స్థానం సాధించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ నుండి వివిధ దేశాలకు మరింత నాణ్యతతో కూడిన విత్తనాలను రూపొందించి ప్రపంచ మార్కెట్‌కి ఎగుమతి చేసుకోవడానికి దోహదపడుతుంది.

తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్‌ డా|| కె. కేశవులు ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి వరంగల్‌ జిల్లాలో విద్యనభ్యసించారు. వ్యవసాయ రంగంపై ఆసక్తితో తమిళనాడులోని కోయంబత్తూరులో గల అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుండి వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్‌డి పట్టాను పొందారు.

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో విత్తన శాస్త్రంలో అత్యంత అనుభవం గడించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన శాస్త్ర విభాగంలో అధిపతిగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థలో, విత్తన అభివృద్ధి సంస్థలో సంచాలకులుగా పనిచేస్తున్నారు. విత్తన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన డా|| కె. కేశవులకు అంతర్జాతీయ విత్తన సంస్థలో వైస్‌ ప్రసిడెంట్‌గా ఎన్నికవ్వడం తెలంగాణ రాష్ట్రానికే ఏంతో గర్వకారణం.

డా|| కేశవులు విత్తన రంగానికి అందించిన సేవలు :

జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట అనుభవం కలిగి ఉండి విత్తన పరిశోధనపై అంతర్జాతీయ విత్తన ప్రముఖులైన కెన్ట్‌ బోర్డాఫ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కలసి పనిచేశారు. యుఎస్‌ఎఐడి భాగస్వామ్య సభ్యులుగా ఉండి ఈస్ట్‌ ఆఫ్రికన్‌, సౌత్‌ ఆసియా దేశాల్లో విత్తన అభివృద్ధిపై అధ్యయనం చేశారు. అదే విధంగా విత్తన నిల్వలో ఆహార ధాన్యాల నష్టాన్ని తగ్గించి అంతర్జాతీయంగా అంగీకరించిన వినూత్న సాధారణ విత్తన నిల్వ పద్ధతులను కనుగొనడం జరిగింది. వివిధ నేషనల్‌ సీడ్‌ సంస్థలతో కలసి విత్తన రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మెండైన అనుభవం గల డా|| కేశవులకు తెలంగాణ ప్రభుత్వ సహకారం అందడంతో దేశ విదేశాల్లో విత్తనాభివృద్ధిపై తన పట్టును పెంచుకున్నారు. రాష్ట్ర విత్తనోత్పత్తిలో అనేక నూతన పద్ధతులను వేగవంతంగా చేపట్టి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడమే కాకుండా విత్తన అక్రమాలను అరికట్టడంలో కేశువులు చేసిన కృషి రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుంది.

విత్తన ఎగుమతులు :

విత్తన ధృవీకరణ కింద తెలంగాణ రాష్ట్రం 17.50 లక్షల క్వింటాళ్ళ నుండి 22 లక్షల క్వింటాళ్ళ వరకు విత్తనోత్పత్తి పెంచారు. దాదాపు 4 సంవత్సరాలుగా దేశంలో, ఇతర 10 రాష్ట్రాలకు తెలంగాణ విత్తనాన్ని సరఫరా చేయడంలోనూ నూతనంగా ఆన్‌లైన్‌ విత్తన ధృవీకరణ పద్ధతిని ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థకు మోడల్‌ విత్తన ధృవీకరణ సంస్థగా పేరుతెచ్చారు. పారదర్శకతతో వేగవంతమైన సేవలను రైతులకు అందించేందుకు విత్తన ధృవీకరణ పద్ధతిని నేడు అనుసరిస్తున్న సాంకేతిక పద్ధతికి జోడించి ఆన్‌లైన్‌ ద్వారా రైతులకు తమ సేవలను అందించేందుందుకు ఏర్పాట్లు చేపట్టారు. 55 సంవత్సరాల్లో భారత విత్తన ధృవీకరణలో జరగని విధంగా మొట్టమొదటిసారిగా డా|| కేశవుల ఆధ్వర్యంలో తెలంగాణ విత్తన ధృవీకరణ సంస్థ తీసుకురావడం జరిగింది. 2008లో ఇండియా ఒఇసిడి భాగస్వామ్య దేశంగా చేరిన తరువాత దేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ విత్తన ధృవీకరణ కింద 720 టన్నుల వివిధ రకాల పంట విత్తనాలను ఈజిప్ట్‌, సుడాన్‌, ఫిలిప్పీన్స్‌, రష్యా మొదలగు దేశాలకు ఎగుమతి చేసే అంతర్జాతీయ విత్తన వాణిజ్యాన్ని పెంపొందించడం జరిగింది.

94 సంవత్సరాల ఇష్టా చరిత్రలో మొదటిసారిగా భారతదేశానికి ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెస్టింగ్‌ అసోసియేషన్‌ (ఇష్ట) మెంబరుగా ఎన్నికకావడం 1924లో స్విట్జర్లాండ్‌లో స్థాపించబడిన ఈ సంస్థ విత్తన పరిక్షలకు సంబంధించి అంతర్జాతీయ ప్రామాణిక పద్ధతులను అభివృద్ధి పరుస్తూ దాదాపు 70 దేశాల్లో భాగస్వామ్య అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాలను కలిగి ఉండి ప్రపంచ మొత్తానికే ఒకే రకమైన విత్తన పరీక్షా ప్రమాణాలను పాటించడం వంటి అంశాలపై ఈ సంస్థ నిరంతరం పనిచేస్తుంది. ఇటువంటి సంస్థకు తెలంగాణ నుండి ప్రముఖపాత్ర పోషించే స్థాయిలో ఉండడం వల్ల ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో తెలంగాణ విత్తనానికి ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ చేకూరనుంది. నాణ్యతా ప్రమాణాలతో నూతన వంగడాల తయారీకి హైదరాబాద్‌లో 600 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా విత్తన పరీక్ష ప్రయోగశాలలను డా|| కేశువులు చేసిన కృషి ఫలితంగా నేడు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో నిర్మించబోతున్నారు. డా|| కేశవులు నిబద్ధత పట్టుదల కష్టపడే స్వభావం వలనే అత్యున్నత పదవి లభించింది. భారతదేశానికి ఇలాంటి మంచిపేరు తీసుకురావడం తెలంగాణకే గర్వకారణంగా నిలిచింది.

-

ఎలిమిశెట్టి రాంబాబు, ఫోన్‌ : 9949285691

అగ్రిక్లినిక్‌ డెస్క్‌