మన రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతూ ఉంది. మొక్కజొన్నను మనం ఆహారంగానే కాకుండా దాణారూపంలో, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా ఉపయోగించడం జరుగుతుంది. మనరాష్ట్రంలో మొక్కజొన్నను సాగు చేస్తున్నాప్పుడు మొక్క యొక్క వివిధ దశల్లో వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టాన్ని కలుగచేస్తున్నాయి. కాబట్టి రైతులు సరైన సమయంలో తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తే చీడపీడల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.

మొక్కజొన్నను ఆశించే చీడపీడల్లో ముఖ్యమైనవి

కత్తెర పురుగు :

మన రాష్ట్రంలో మొక్కజొన్నను లద్దె పురుగు జాతికి చెందిన కొత్త పురుగైన స్పాజోస్పెరాప్రూజిపెర్టా ఆశించి నష్టాన్ని కలుగచేస్తుంది. ఈ పురుగును ఇంగ్లీష్‌లో ఫాల్‌ఆర్మీవార్మ్‌ అని లేదా తెలుగులో కత్తెరపురుగుగా పిలవడమైంది. ఫాల్‌ఆర్మీవార్మ్‌ మొట్టమొదటగా అమెరికాలోని జార్జియాలో 1797వ సంవత్సరం గుర్తించారు. ఇండియాలో ఏసిఏఆర్‌-లుస్‌బిఏఐఆర్‌ వారు స్పోడొప్టెరాప్రూజిపెర్డా (ఫాల్‌ ఆర్మీవార్మ్‌) మొక్కజొన్న స్ట్రెయిన్‌ను మొట్టమొదటగా కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో గుర్తించడమైనది.

మన రాష్ట్రంలోని ఇతర పంటలైన వరి, పత్తి, జొన్న, రాగి, గోధుమ, చెరకు, వేరుశనగ, సోయాచిక్కుడు మరియు కూరగాయ పంటలను కూడా ఆశించే అవకాశం ఉంది. పంటలతో పాటు కొన్ని రకాల కలుపు మొక్కల మీద కూడా తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండి కత్తెరపురుగును గుర్తించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

తల్లిరెక్కల పురుగు ఆకు కింద భాగంలో 100-200 గుడ్లను సమూహంగా పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు (లార్వాలు) తొలిదశలో ఆకుల్లో సొరంగాలను ఏర్పరుస్తాయి. తరువాతి దశలో ఆకులపై రంద్రాలు చేసి ఆకులను పూర్తిగా తినేస్తాయి. పురుగు బాగా ఎదిగిన దశలో కంకిని ఆశించి కూడా నష్టాన్ని కలుగచేస్తుంది.

యాజమాన్యం :

పొలం చుట్టూ కలుపు, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలి.

ఎరువులను అధిక మోతాదులో వాడరాదు.

మొక్కజొన్నలో అంతర పంటలు వేసుకోవాలి.

విత్తన శుద్ధి : ఇమిడాక్లోప్రిడ్‌ 600 ఎఫ్‌.ఎస్‌ (లేదా) సయాంత్రినిలిప్రోల్‌ + తైయామితాగ్జాంతోకిలో మొక్కజొన్న విత్తనానికి 4 గ్రా. చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఎకరానికి 10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి.

పురుగు ఉధృతిని గమనించడానికి ఎకరానికి 8-10 లింగాకర్షక బుట్టలు పెట్టాలి.

గుడ్లు పరాన్నజీవి అయిన ట్రైకోగ్రామ పరాన్నజీవులను పంటపొలంలో విడుదల చేయాలి.

పురుగులను తొలిదశలో గమనించినట్లయితే వేపనూనె 5 మి.లీ. / లీటరు నీటికి లేదా బి.టి పొడి మందు 2 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పురుగు ఉధృతి తక్కువగా గమనించినట్లయితే క్లోరిపైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. /లీటరు నీటికి కలిపి మొక్కసుడిలో పడేటట్లుగా పిచికారి చేయాలి.

పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్‌ 0.3 మి.లీ. లేదా ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా. లేదా క్లోరాంధ్రానిలిప్రోల్‌ 0.3 మి.లీ. లేదా ఇండాక్సాకార్బ్‌ 1 మి.లీ. / లీటరు నీటికి కలిపి మొక్కసుడుల్లో పడేటట్లు పిచికారి చేయాలి.

ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను మొక్క సుడుల్లో వేసుకోవాలి.

విషపు ఎర తయారీ :

ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం తీసుకొని బెల్లాన్ని 2 కిలోల బెల్లాన్ని తీసుకొని బెల్లంను 2-3 లీటర్ల నీటిలో కరిగించి తరువాత తవుడులో కలిపి ఆ మిశ్రమాన్ని 24 గంటలు పులియనిచ్చి అరగంట ముందు ఈ మిశ్రమానికి 100 గ్రా.ల ధయోడికార్బ్‌ మందు కలిపి విషపు ఎరను మొక్కసుడిలో వేసుకోవాలి.

కాండం తొలుచు పురుగు :

మొక్కజొన్నను రెండు రకాల కాండం తొలుచు పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. అవి మచ్చల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీఫ్‌లో ఆశిస్తుంది. గులాబిరంగు కాండం తొలిచే పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి మొలకెత్తిన 10-12 రోజులకు పైరును ఆశిస్తాయి. తల్లిపురుగు ఆకుల పైభాగాన గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి వచ్చిన పిల్లపురుగులు ఆకులపైన పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండంలోపలికి చేరతాయి.

ఇవి గాయపరచిన ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది వెడల్పు రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుసక్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడంవల్ల మొవ్వు చనిపోయి ఎండిపోతుంది. అంతేకాకుండా కాండంలోపల గుండ్రని లేదా ూ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది.

నివారణ :

పొలంలో చెత్త, చెదారం లేకుండా చూసుకోవాలి.

పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి.

పొలం చుట్టూ 3-4 వరుసల్లో జొన్నను ఎరపంటగా వేసి 45 రోజుల తరువాత తీసివేయాలి.

విత్తనం మొలకెత్తిన 10-12 రోజులకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లేదా క్లోరాంధ్రానిలిప్రోల్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

పురుగు ఉధృతి ఉన్నట్లయితే కార్భోఫ్యూరాన్‌ 3జి గుళికలు ఎకరానికి ఆకుల సుడుల్లో మొలకెత్తిన 30-35 రోజుల మధ్యకాలంలో వేసుకోవాలి.

రసం పీల్చు పురుగులు :

రసంపీల్చు పురుగుల్లో ముఖ్యమైనది పేనుబంక.పొడి వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 30 రోజులు పైబడిన పైరును పేనుబంక ఆశిస్తుంది. తల్లి, పిల్ల పురుగులు లేత కాండం, ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారతాయి. మొక్క గిడసబారిపోతుంది. ఇవి తేనెవంటి జిగట పదార్థాన్ని విసర్జాంచడం వల్ల దాని మీద శిలీంద్రాలు ఏర్పడి మసితెగులు ఆశించడం వల్ల కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం ఏర్పడుతుంది.

ఉధృతి ఎక్కువగా గమనించినట్లయితే డైమిథోయేట్‌ 2.0 మి.లీ. లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

తెగుళ్ళు :

ఆకు ఎండు తెగులు :

ఈ తెగులు ఆశించిన ఆకులపై కోలారపు బూడిదరంగుతో కూడిన ఆకుపచ్చ లేదా గోధుమ రంగు చిన్న మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత వల్ల మచ్చల పరిమాణం పెరిగి ఈనెల మధ్య బందించబడి, దీర్ఘచతురస్రాకారంగా మారతాయి.

తుప్పు తెగులు :

ఈ తెగులు ఆశించిన ఆకులపై రెండు వైపులా గుండ్రని లేదా పొడవాటి గోధుమ వర్ణపు పొక్కుల మాదిరిగా తెగులు లక్షణాలు కనిపిస్తాయి. అధిక తేమ గల చల్లని వాతావరణంలో పూత సమయంలో తెగులు ఉధృతి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

నివారణ :

ఆకు ఎండు తెగులు మరియు తుప్పు తెగులు నివారణకు విత్తే ముందు కిలో విత్తనానికి 2.5 గ్రా. మాంకోజెబ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

బొగ్గు కుళ్ళు/కాండం కుళ్ళు తెగులు :

నేలలో ఉండే శిలీంధ్రం వల్ల ఈ తెగులు వస్తుంది. పూతదశ తరువాత నేలలో తేమశాతం తగ్గడం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ తెగులు తీవ్రత ఎక్కువగా సోకుతుంది. దీనివల్ల పంట కోతకు రాకముందే కాండం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. మొక్కలను చీల్చి చూపినప్పుడు లోపల బెండు భాగం కుళ్ళి నలుపురంగుకు మారుతుంది.

నివారణ :

తెగులు నివారణకు పూతదశలో నేలలో తేమశాతం తగ్గకుండా చూసుకోవాలి. ట్రైకోడర్మా శిలీంద్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి నేలలో కలుపుకోవాలి.

పాముపొడ తెగులు :

ముదురు ఆకులపై బూడిదవర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేపి కాండానికి వ్యాపించి చూడటానికి పాముపొడ మాదిరిగా కనిపిస్తాయి.

నివారణ :

ప్రోపికొనజోల్‌ 1 మి.లీ లేదా కార్బండిజమ్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

యస్‌. ఓంప్రకాశ్‌, శాస్త్రవేత్త (ఎంటమాలజీ), జి. మహేష్‌బాబు, యమ్‌. రాజేంద్రప్రసాద్‌, డా|| ఆర్‌. ఉమారెడ్డి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల