మన రాష్ట్రంలో సాగు చేసే పూలలో బంతి చాలా ముఖ్యమైనది. బంతిని అన్ని కాలాల్లో సులువుగా సాగుచేయవచ్చు. బంతిలో చాలా ఆకర్షణీయమైన రంగులు, సైజులు, ఆకారాలతో బాటు ఎక్కువ కాలం నిల్వ ఉండే స్వభావం ఉన్నందున వాణిజ్యపరంగా రాష్ట్రమంతటా మంచి మార్కెట్ ఉంటుంది.
రాష్ట్రంలో బంతిని ఏడాది పొడవునా పెంచుటకు వీలున్నా ముఖ్యంగా వినాయక చవితి, దసరా, దీపావళి, కార్తీక మాసంలో పూజల కొరకు అత్యధికంగా వినియోగం ఉన్నందున ఈ పంటను ఎక్కువగా జనవరి చివరి వరకు వచ్చే విధంగా నాటిలి. అంటే నారు పెరుగుటకు 20-25 రోజులు, పొలంలో నాటిన తరువాత 45-50 రోజులకు మొక్కలు మొదటికోతకు తయారవుతాయి. అందుకు అనుగుణంగా ఉన్న పొలాన్ని 3-4 భాగాలుగా చేసి వేరు వేరు సమయాల్లో నాటుకుంటే పూలను 4 నెలలపాటు మార్కెట్‌కు సరఫరా చేయవచ్చు.
మార్కెట్‌లో నారింజ రంగుకు ఉన్న గిరాకి కంటే పసుపు రంగుకు తక్కువ. అందువల్ల రైతులు మూడు వంతులు నారింజ రంగు రకం, ఒక వంతు పసుపు రంగు రకాలను పండించి మంచి లాభాలను గడించవచ్చు.
మార్కెట్‌లో వివిధ కంపెనీలు మొదట సంక్రమణ విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటిలో సింజెంటా కంపెనీ నుండి వచ్చిన అంటిగువా, ఫర్‌ఫెక్షన్, లునాసి, మూన్‌సాంగ్, మూన్‌స్ట్రక్, ఇన్‌కా-2 మరియు ఈస్ట్‌వెస్ట్ కంపెనీ వీనస్, ఎల్లో రకాలు, మహికో రకాలు వీటితో పాటు కలకత్తా రకాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
బంతి నీరు ఇంకే గరప నేలలు, ఎర్రనేలలు అనుకూలం. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలతో వ్యత్యాసం ఎక్కువగా లేని కాలం బాగా అనుకూలం. గాలిలో తేమ అధికంగా ఉన్నా పూలు బాగా విచ్చుకొన్న తరువాత కోయకున్నా కుళ్ళి పోయే అవకాశం ఎక్కువ. అందువల్ల నీటిసౌకర్యం ఉన్న పొడి వాతావరణం మేలు.
మొక్క నాటుటకు 20-25 రోజులు ముందుగా తయారు చేసుకున్న ట్రేల్లో విత్తనం విత్తుకోవాలి. విత్తనం అత్యంత ఖరీదు కాబట్టి ప్రోట్రేలలో నారు పెంపకంలో జాగ్రత్త వహించాలి.
నారు పెంచే సమయంలో నారు కుళ్ళు తెగులు ఆశించినట్లయితే మొలకెత్తుతున్న లేతమొక్కలు చనిపోతుంటాయి. వాటి నివారణకు 1 గ్రా. కార్బండిజమ్ లేదా 3 గ్రా. కాపర్‌ఆక్సీక్లోరైడ్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
నారు పోసిన తరువాత పొలాన్ని బాగా దున్ని చివరి దుక్కిలో వీలున్నంత ఎక్కువ (10-15 టన్నులు) పశువుల ఎరువు, 50 కిలోల 20.20.0 ఎరువు, 100 కిలోల సూపర్‌ఫాస్పేట్ వేసి దున్నుకోవాలి.
మొక్కలకు మొక్కలకు సాళ్ళ మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 45 సెం.మీ. దూరంలో త్రిభుజాకారంలో నాటుకోవాలి. 10 సాళ్ళకు ఒక సాలు 50 సెం.మీ. దూరంలో నాటితే మందులు పిచికారి చేయడం సులభం. డ్రిప్ ద్వారా నీరు అందించి మల్చింగ్ షీట్ కూడా ఉపయోగించి ఖర్చు 20-25 శాతం తగ్గించవచ్చు.
దేశవాళీ రకాలైన పూసా నారంగి గైండా, డబుల్‌ఆరెంజి, పూసా బంతి, యం.డి.యు-1, అర్కా బంతి రకాలను నాటిన 35-40 రోజులకు, లేక మొక్కలు 30-40 సెం.మీ. ఎత్తు పెరిగిన తరువాత తలకొమ్మ కత్తిరించాలి. దీనివల్ల మొక్క కింది నుండి పక్కకొమ్మలు వృద్ధి చెంది పూల దిగుబడి పెరుగుతుంది. దీన్నే పించింగ్ అంటారు.
శాస్త్రీయ పరిశోధనలను గమనిస్తే మొక్క నాటిన 40 రోజుల తరువాత కత్తిరింపులు జరిపి, పైపాటు ఎరువులు వేస్తే పూల దిగుబడి నాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం కూడా బాగా పెరుగుతుంది.
మొదట సంక్రమణ విత్తనాలు నాటితే వీటికి కత్తిరింపులు అవసరం లేదు. ఈ మొక్కలు 40 సెం.మీ. ఎత్తు పెరగక ముందుగానే మొక్క మొదటి నుండి పక్క కొమ్మలు ఏపుగా పెరుగుతాయి.
నత్రజని, పొటాష్ ఎరువులను డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు. కత్తిరింపులు అయిన తరువాత 20 కి. నజ్రనిని యూరియా లేదా అమ్మోనియా రూపంలో 35 కిలోల పొటాష్‌నిచ్చే యం.ఓ.పి లేదా సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌గా ఇవ్వాలి.
పూల నాణ్యత, నిల్వ శాతం పెంచుటకు సూక్ష్మధాతు ఎరువులను కత్తింరింపులు అయిన తరువాత 15-20 రోజులకు ఒకసారి పిచికారి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
బంతిలో ఆశించే పేను నివారించుటకు డైమిధోయేట్ / ఫిప్రోనిల్ 2 మి.లీ. 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి. ఆకులు, పూలను ఆశించే తామర పురుగుల నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. (లేదా) ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. శిలీంధ్రం ద్వారా ఆశించే ఆకుమచ్చ తెగుళ్ళను నివారించుటకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 2 గ్రా. సాఫ్‌ను వేసి పిచికారి చేసుకోవాలి.
బంతి పూలను బాగా విచ్చుకొన్న తరువాత కోయాలి. పూల కోతకు ముందు రోజు తడి ఇచ్చి కోయడం వల్ల కోత తరువాత పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. పూలను ఉదయం గాని , సాయంత్రం గాని కోయాలి. సకాలంలో పూల కోతలు చేస్తూ ఉంటే ఎకరాకు 6-7 టన్నులు పూల దిగుబడిని పొందవచ్చు.
పూల నాణ్యత చెడకుండా ఉండేందుకు పూల తొడిమ ఒకటిన్నర అంగుళాల పొడవుతో కోయాలి. దీనివల్ల పూల నాణ్యత బాగుంటుంది. పూలు కోసిన తరువాత నీరు చల్లకూడదు. ఉల్లిపాయల సంచులలో నింపితే బాగా గాలిసోకి తాజాగా ఉంటాయి. పూలకోత పూర్తయిన తరువాత పంట మార్పిడి చేసుకోవచ్చు. లేక మరల పొలం తయారుచేసి నెల రోజుల్లో తిరిగి బంతి నాటుకోవచ్చు.
ె.సి. భానుమూర్తి, డి. మనోహర ప్రసాద్, డా|| ఎస్. ఆదర్శ, పి. రాజశేఖర్, కృషీ విజ్ఞాన కేంద్రం, పందిరిమామిడి, ఫోన్ : 08864-243099