ఖమ్మం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం సుమారు 97, 863 హెక్టార్లలో ఉంది. ఈ తరుణంలో పత్తిని సాగు చేసే రైతులు ఎదుర్కునే ఒక ముఖ్యమైన చీడపీడల సమస్యలో గులాబి రంగు పురుగు ప్రధానమైనది. గత ఏడాది పంట మొదట మరియు మధ్య దశలో ఈ పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉన్న తరువాత దశలో ఈ పురుగు యొక్క ఉనికిని గమనించడమైంది. దీని యొక్క ఉధృతిపై సరైన అవగాహన పెంచుకొని సకాలంలో మంచి మెళకువలు మరియు యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు.
తల్లి పురుగు లేత ఆకుల అడుగు భాగాన, లేత కొమ్మలపైన లేత కాయలపైన రక్షక పత్రాలపైన గుడ్లను గుంపులుగా లేదా విడివిడిగా 150-200 వరకు గుడ్లను పెడుతుంది.
గుడ్ల నుండి బయటకు వచ్చిన కంటికి కనిపించని చిన్న లార్వాలు పూమొగ్గలోనికి తొలుచుకుపోయి లోపలి పదార్థాలను తిని వీటిని గుడ్డి పూలుగా మారుస్తాయి.
చిన్న లార్వాలు కాయలపై కనిపించనంత చిన్న రంధ్రాలు చేసి లోనికి ప్రవేవిస్తాయి. తరువాత కాయలకు చేసిన రంధ్రం పూడిపోయి పురుగు కాయలోనే ఉండి గింజలను తింటూ దూదిని బాగా నష్టపరుస్తుంది. దూది రంగు, నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది.
పురుగు లార్వా దశ మొత్తం కాయలోనే గడపడం వల్ల కాయ పగిలిన తరువాత మాత్రమే నష్టాన్ని గుర్తించగలం. పురుగు ఆశించిన కాయలు పూర్తిగా వృద్ధి చెందక త్వరగా పక్వానికి వస్తాయి.
గులాబి రంగు పురుగు వల్ల జరిగే నష్టం పైకి కనబడదు. కాయలు పగిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే గుడ్ల నుండి వెలువడిన వెంటనే చిన్న లార్వాలు మొగ్గలపైన లేదా కాయలపైన కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించి తమ జీవితకాలం మొత్తం కాయల్లోనే గడుపుతాయి.
లేత మొగ్గలను ఆశించి ఎదిగే పువ్వుల్లోని పదార్ధాలను తినడం వల్ల ఆకర్షణ పత్రాలు విప్పుకోకుండా ముడుచుకునే ఉంటాయి. వీటిన గడ్డిపూలు అంటారు.
ఎదిగిన మొగ్గలను ఆశించినప్పుడు పువ్వులు విచ్చుకోనప్పటికీ లోపల అండాశయాలను పుప్పొడిని తినడం వల్ల నష్టం కలుగుతుంది. ఈ విధంగా తొలిదశలో ఆశించనట్లయితే మొగ్గలు, పూలు రాలిపోతాయి.
లేత కాయలను ఆశించనప్పుడు అవి రాలిపోవడం కాని, కాయ పరిమాణం పెరగకపోవడం గాని కాయలు సరిగా పగలక ఎండిపోయి గుడ్డి కాయలుగా ఎర్పడడం జరుగుతుంది.
ఈ పురుగు నష్టాన్ని గుర్తించడానికి పొలంలోని గుడ్డిపూలను, కాయలను తెరచి లోపలి భాగాన్ని చూసినట్లయితే కాయ లోపల చిన్న లేక పెద్ద గులాబి రంగు పురుగులను గమనించవచ్చు.
గులాబి రంగు పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు, నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వల్ల దిగుబడి బాగా తగ్గుతుంది.
సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించి గులాబి రంగు పురుగును నివారించుకోవాలి. ఇవి ప్రధానంగా పంటలేని సమయాన, విత్తడానికి ముందు పంట కాలంలో మరియు పంట తీసిన తరువాత చేపట్టవలసిన వివిధ చర్యలు...
పత్తి విత్తడానికి ముందు మరియు పంటకాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
పంట మార్పిడి పద్ధతిని రెండు-మూడు సంవత్సరాలకొకసారి విధిగా పాటించాలి.
తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకొని సకాలంలో విత్తుకోవడం ద్వారా గులాబి రంగు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
బి.టి పత్తిని విత్తేటప్పుడు పత్తి చుట్టూ 5 వరుసల్లో నాన్ బి.టి పత్తి విత్తనాలను విధిగా విత్తుకోవాలి.
పత్తి పొలంలో మరియు చేను చుట్టూ తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.
పత్తి పంట దగ్గరలో బెండ పంట లేకుండా చూసుకోవాలి.
పత్తి పంట విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా బుట్టల్లో మూడు రోజులు 7 లేదా 8 తల్లి రెక్కల పురుగులను పడడం గమనించినట్లయితే లేదా 10 శాతం గుడ్డి పువ్వులు లేదా 10 శాతం పురుగు ఆశించిన కాయలను గమనించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
గులాబి పురుగు ఆశించిన గుడ్డి పూలను ఏరి నాశనం చేయాలి.
గులాబి రంగు పురుగు ఉధృతి వల్ల పంటను అధికంగా నష్టపరుస్తాయి. పురుగుల ఉధృతిని తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకోవాలి.
తొలిదశలో 5 శాతం వేప గింజల కషాయం లేదా 5 మి.లీ. వేపనూనెను (అజాడిరక్టిన్ 1500 పి.పి.యం) లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పూత దశలో క్వినాల్‌ఫాస్ 2.0 మి.లీ. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 శాతం ఎస్.జి. 0.5 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
చిన్నకాయ దశలో పంట కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్‌మెత్రిన్ 25 శాతం ఇ.సి 1.0 మి.లీ లేదా లామ్డాసైహలోత్రిన్ 5 శాతం ఇ.సి 1.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు.
సింథటిక్ పైరిత్రాయిడ్ మరియు పత్తి పంటపై ఎక్కువసార్లు పిచికారి చేసినట్లయితే రసంపీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశముంది.
గులాబి రంగు పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే క్లోరాంట్రానిలిప్రోల్ 9.3 శాతం + లామ్డాసైహలోత్రిన్ 4.6 శాతం 0.5 మి.లీ. / లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పై మందులేకాక కొన్ని సార్లు గులాబి రంగు పురుగుతోపాటు తెల్లదోమ నివారణకు డెల్టామెత్రిన్ 1 శాతం + ట్రయజోఫాస్ 35 ఇ.సి 2.0 మి.లీ. లేదా పైరిప్రోక్సిఫెన్ + ఫెన్‌ప్రోపాద్రిన్ 15 ఇ.సి 1.25 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
గులాబి రంగు పురుగుతో పాటు పేనుబంక, తామరపురుగులు, తెల్లదోమ నివారణకు క్లోరిపైరిఫాస్ 50 శాతం + సైపర్ మెత్రిన్ 5 శాతం ఇ.సి 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పంట తీసిన తరువాత చేనులో గొర్రెలు, మేకలు, పశువులను మేపాలి.
పత్తి మోళ్ళను ట్రాక్టరు రోటావేటరుతో భూమిలో కలియదున్నాలి.
నీటి వసతి ఉన్నప్పటికీ పత్తిని ఆరు నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి. పంటకాలం పొడిగించుట ద్వారా రాబోయే పంటలో పురుగు ఉధృతి తొలిదశలోనే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
నీటి వసతి ఉన్నచోట రెండో పంటగా ఇతర ఆరుతడి పంటల్ని సాగు చేసుకోవాలి.
పత్తి మోళ్ళను ఇళ్ళ వద్ద పొయ్యిలో వాడేందుకు నిల్వ చేయకూడదు.
పత్తి తీసిన తరువాత ఎండిన మోళ్ళను, విచ్చుకోని కాయలను భూమిలో కలియదున్నడం ద్వారా పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చు.
ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా పురుగు యొక్క కోశస్థ దశలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చు.
గులాబిరంగు పురుగు ఆశించిన పత్తిని జిన్నింగ్ చేయగా వచ్చిన విత్తనాలను నిల్వ చేయకుండా నాశనం చేయాలి. లేనిచో తరువాత పంటకాలంలో దీని ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
గులాబి రంగు పురుగు ఆశించిన పత్తిని రైతుల ఇళ్ళు వద్ద గాని లేదా జిన్నింగ్ మిల్లుల వద్ద గాని ఉంచకూడదు.
జె. హేమంతకుమార్, పోగ్రాం కో-ఆర్డినేటర్, కెవికె, వైరా, ఖమ్మం, ఫోన్ : 9989623831