ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు పడవలసిన వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం రికార్డయింది. ఆలస్యంగా కురుస్తున్న వర్షాలకు కంది పంటను ఏక లేదా అంతర పంటలుగా ఆగష్టులో కూడా విత్తుకోవచ్చు. ఈ మాసంలో విత్తుకునే రైతులు ఈ కింద చెప్పిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.

నేలలు :

నీరు బాగా ఇంకి మురుగునీరు నిల్వ లేని మధ్యస్ధ బరువైన నేలలు అనుకూలం. చౌడు నేలలు పనికి రావు.

విత్తే సమయం :

జూన్‌ 15 నుండి జులై 15 వరకు విత్తుకోవచ్చు. కాని వర్షాభావ పరిస్థితుల్లో ''ఆగష్టు''లో కూడా కంది పంటను విత్తుకోవచ్చు.

విత్తన మోతాదు :

2-3 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది.

విత్తన శుద్ధి :

2.5 గ్రా. థైరామ్‌ మందును తెగుళ్ళు రాకుండా, ఇమిడాక్లోప్రిడ్‌ 5 గ్రా. కీటకనాశిని మందును ఒక కిలో విత్తనానికి పండించి విత్తుకోవాలి.

తొలిసారిగా వేసే భూముల్లో 200 గ్రా. రైజోబియం కల్చర్‌ను ఎకరానికి సరిపడే విత్తనానికి కలిపి విత్తుకోవాలి.

రకాలు :

ప్రాంతాల వారిగా మంచి రకాలను ఎన్నుకొని ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండేటట్లు విత్తుకోవాలి. డబ్ల్యు.ఆర్‌.జి-53, 65, ఎమ్‌.ఆర్‌.జి-1004. ఎల్‌.ఆర్‌.జి-41-52, ఆశ, మారుతి, పి.ఆర్‌.జి-158, ఆర్‌.జి.టి-1, టి.డి.ఆర్‌.జి-4డబ్ల్యు.ఆర్‌.జి.ఇ-93, డబ్ల్యు.ఆర్‌.జి.ఇ-97

విత్తే దూరం :

నేలలు రకాలను బట్టి మొక్కల సాళ్ళ మధ్య దూరం తగ్గించి ఎక్కువ సాంద్రతలో మొక్కలు ఉండేటట్లు విత్తుకోవాలి. సాలుకు, సాలుకు మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 15 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి.

ఎరువులు :

ఆఖరి దుక్కిలో రెండు టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఎరువులను ఒక ఎకరంలో వేసుకోవాలి.

అంతర పంటలు :

తక్కువ కాలపరిమితి గల జొన్న మరియు వేరుశనగ పంటలను ప్రాంతాల వారిగా ఎంపిక చేసుకొని విత్తుకోవాలి.

కంది : జొన్న : 1 : 4

కంది : వేరుశనగ : 1 : 7

కలుపు యాజమాన్యం :

కంది విత్తనాలు విత్తిన 1 నుండి 2 రోజుల లోపే పెండిమిథాలిన్‌ (30 శాతం) 1.25-1.5 లీటర్ల మందును ఒక ఎకరానికి, విత్తిన 20-40 రోజుల్లో గుంటక తోలి కలుపు లేకుండా చేయాలి. అధిక వర్షాల వల్ల గుంటక రాకపోతే ఇమాజిత్‌ఫిర్‌ (పర్‌ష్యుట్‌) 250-300 మి.లీ. మందును ఒక లీటరు నీటికి 1.5 మి.లీ. 200 లీటర్లలో కలిపి పొలంలో పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం :

వర్షాలు అంతగాలేకపోయినప్పటికీ కాయ, పూత దశలో నీటితడులు ఇచ్చినట్లయితే ఈ పంటలో ఎక్కువ దిగుబడులను పొందవచ్చు. నీటి వసతి లేనిఎడల 2 శాతం యూరియా లేదా 1 శాతం మల్టి-కెను లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారి చేయాలి.

సస్యరక్షణ :

తెగుళ్ళు :

ఎండు తెగులు :

ఈ తెగులు సోకిన మొక్కల్లోని కొంతభాగం లేక పూర్తిభాగం వడలి ఎండిపోతుంది. ఈ తెగులు వచ్చే ప్రాంతంలో విత్తనాలను 10 గ్రా. ట్రైకోడెర్మా మిశ్రమం పట్టించి విత్తుకోవాలి. ఈ తెగులును తట్టుకునే రకాలైన ఆశ, మారుతి, పిజిఆర్‌-158, డబ్ల్యుఆర్‌జి-65, డబ్ల్యుఆర్‌జిఇ-93, డబ్ల్యుఆర్‌జిఇ-97, ఆర్‌జిటి-7, టిడిఆర్‌జి-4, ఎల్‌ఆర్‌జి-52 ఎన్నుకొని విత్తుకోవాలి.

వెర్రి తెగులు :

ఈ తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు గుంపులు గుంపులుగా కనబడి పూత పూయదు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ నల్లి వ్యాప్తిని తగ్గించడానికి 4 మి.లీ డైకోఫాల్‌ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆశ, ఎల్‌ఆర్‌జి-52, బిఎస్‌ఎమ్‌ఆర్‌-736, బిఎస్‌ఎమ్‌ఆర్‌-853 తట్టుకునే రకాలను ఎన్నుకొని విత్తుకోవాలి.

పురుగులు :

మారుక మచ్చల పురుగు :

ఈ పురుగు కంది ఆకులను, పూతను గుండ్రంగా చుట్టుకొని లోపల ఉండి గోకి తింటుంది. ఈ మచ్చల పురుగు నివారణకు 5 శాతం వేపనూనె లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ను కలిపి పిచికారి చేయాలి.

శనగపచ్చ పురుగు :

ఈ పురుగు పూత, పిందె దశలో ఎక్కువ నష్టం చేస్తుంది. ఈ పురుగు తీవ్రత వల్ల సుమారు 70-80 శాతం నష్టం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పురుగు వచ్చే ప్రాంతాల్లో తట్టుకునే రకాలైన ఎల్‌ఆర్‌జి-41, డబ్ల్యుఆర్‌జి-65 మరియు అభయ ఎన్నుకొని విత్తుకోవాలి.

ఈ పురుగుల గుడ్లను తొలిదశలోనే గుర్తించి 5 శాతం వేపగింజల కషాయంను పిచికారి చేయాలి. శనగపచ్చ పురుగు చిన్నగా ఉన్నప్పుడు 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్‌ లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ లేదా 0.3 మి.లీ. స్పైనోసాడ్‌ మందులను ఒక లీటరుకి కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పొలంలో ఉంచాలి.20 పక్షిస్థావరాలను / కర్రలను ఒక ఎకరంలో పెట్టడం వల్ల పక్షులు వాలి లార్వా / పురుగులను తింటాయి. ఈ పురుగు ఉదృతితగ్గినట్లయితే పై మందులను మార్చి మరొకసారి పిచికారి చేయాలి.

పైన చెప్పిన విధంగా వర్షాభావ పరిస్థితుల్లో మంచి రకాలను ఎన్నుకొని ఎక్కువ సాంద్రతలో మొక్కలను వరుసల మధ్య దూరం తగ్గించి విత్తన శుద్ధి చేసి చీడపీడలను తట్టుకునే రకాలను ఎన్నుకొని సరైన సమయంలో తెగుళ్ళను, పురుగులను గుర్తించి సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే మంచి దిగుబడులను రైతులు పొందవచ్చు.

డా|| అరిశెనపల్లి విజయభాస్కర్‌ రావు, సీనియర్‌ శాస్త్రవేత్త, కరీంనగర్‌, పి.జె.టి.యస్‌.యు, ఫోన్‌ : 9849817896