రాష్ట్రంలో చిన్న మరియు సన్నకారు రైతాంగం మొక్కజొన్న, కంది, పెసర, వేరుశెనగ వంటి పంటలను నాగలి ద్వారా గొర్రు సాళ్ళలో మహిళలు ఒడిలో జోలి కట్టుకొని (లేక డబ్బాలో) విత్తనాలు వేసుకొని సాళ్ళ వెంబడి ఒక చేతితో విత్తనాలు వేసుకుంటూ వెళుతుంటే. మరో మనిషి అదే సాళ్ళలో విత్తనంతో పాటు వేసే భాస్వరం ఎరువులను వేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా రైతు వారీగా అనుసరిస్తున్న విధానం. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీడ్ కం ఫర్టిలైజర్ బ్యాగును తయారు చేయడం జరిగింది.
ఇది ఒక చొక్కాలా ఉంటుంది. దానికి ముందు భాగంలో కింద పక్క రెండు జేబులు ఉంటాయి. ఒక్కొక్క జేబులో 1.5 నుండి 2 కిలోల వరకు ఒక జేబులో విత్తనాలు మరియు రెండవ జేబులో ఎరువులను వేసుకొని ఒకే సారి ఒకే మనిషి విత్తనాలు మరియు ఎరువును సాళ్ళలో వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. లేదా రెండు జేబుల్లో ఒక మనిషి రెండు నాగలి సాళ్ళలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. నడక కూడా తగ్గుతుంది మరియు కొద్దిపాటి శారీరక శ్రమ కూడా తగ్గుతుంది.
ఈ సీడ్ కం ఫర్టిలైజర్ బ్యాగును విత్తనాలు వేసి పనిలో కాకుండా పత్తి, మిరప, మొక్కజొన్న వంటి పంటలపై ఎక్కువ సార్లు ఎరువులను రైతాంగం వేస్తూ ఉంటారు. కాబట్టి ఎరువులను వేసేటప్పుడు కూడా వాడుకోవచ్చు. సీడ్ కం ఫర్టిలైజర్ బ్యాగును ఉపయోగించి రెండు జేబుల్లో ఎరువును వేసుకొని మొక్కకు దగ్గర లేక సాళ్ళ వెంబడి తక్కువ శ్రమతో సరైన మోతాదులో ఎరువులు వేసుకోవచ్చు. మొక్కల్లో ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది. సీడ్ కం ఫర్టిలైజర్ బ్యాగు ఖరీదు 250-300 రూపాయలు మిత్రమే లేదా ఖాదీ/ కాటన్ బట్టతో కుట్టించుకోవచ్చు. దీన్ని మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు.
ఒక మనిషి రెండు చేతులతో రెండు సాళ్ళలో ఒకేసారి విత్తనం విత్తుకోవచ్చు. దీని వల్ల నడక, శారీరక శ్రమ తగ్గుతుంది.
ఒక మనిషి ఒక చేతితో విత్తనం మరియు రెండవ చేతితో భాస్వరం వంటి ఎరువులను ఒక సాళ్ళలో ఒకే సారి వేసుకోవచ్చు. దీని వల్ల కూలీ ఆదా అవుతుంది.
భుజము, నడుము మొత్తంగా శరీరం అంతటా శ్రమ/ ఒత్తిడి/నొప్పి గాని తగ్గుతుంది. మనిషికి శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది మరియు పని సులభంగా అవుతుంది.
సీడ్ కం ఫర్టిలైజర్ బ్యాగును రైతాంగం వాడి శరీరక శ్రమను తగ్గించుకొని సమయం మరియు ఒక కూలీని ఆదా చేసుకుంటారని ఆశిద్దాం...
ఎం. మిల్కా పాల్, సీనియర్ రీసెర్చ్‌ఫెలో (గృహవిజ్ఞాన శాస్త్ర విభాగం), డా|| జి. వీరన్న, సీనియర్ శాస్త్రవేత్త (అగ్రోనమి) మరియు పోగ్రాం కో- ఆర్డినేటర్, కృషీ విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం, ఫోన్ : 99896 33364