సాధారణంగా మొక్కజొన్నను ఖరీఫ్‌లో వర్షాధార పంటగా సాగుచేయబడుతుంది. ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఎక్కువ లాభాల కోసం మొక్కజొన్నను రబీలో సాగుచేయడం మంచిది. పైగా రబీ మొక్కజొన్నకే దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. పంటకు అందించిన నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని దిగుబడులను పెంచుకునే పంటల్లో మొక్కజొన్న ఒకటి. ప్రస్తుతం ఉన్న తక్కువ వర్షపాతం, నీటి కొరత, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి.

మొక్కజొన్న పంట సాగుకు మొత్తం 450-600 మి.మీ. నీరు అవసరమవుతుంది. తక్కువగా నీరు ఉన్నప్పుడు మొక్క అవసరమైన దశల్లో ఇవ్వడం వల్ల దిగుబడులు పెంచుకోవచ్చు. మొక్కకు తొలిదశలో అనగా 30 రోజుల్లోపు తక్కువ నీరు ఉంటే సరిపోతుంది. మొక్క పెరిగే కొద్దీ దాని నీటి అవసరం పెరుగుతుంది. అంటే పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరమవుతుంది. పంట తొలిదశలో తేమ ఒత్తిడికి గురైతే పంట పూతకు వచ్చే కాలం పెరుగుతుంది. అదే పూత దశలో మొక్క తేమ ఒత్తిడికి గురైనట్లయితే దిగుబడులపై అధిక ప్రభావం చూపిస్తుంది. గింజ పాలుపోసుకునే దశలో తేమ ఒత్తిడికి గురైతే 20-30 శాతం దిగుబడులు తగ్గుతాయి. 30-40 రోజుల్లోపు ఉన్న లేత పంటకు అధిక నీరు హానికరం. ఇది కూడా ఖరీఫ్‌లో తక్కువ దిగుబడులకు ఒక కారణం.

సాధారణంగా పంట కాలంలో 4-6 నీటి తడులు అవసరమవుతాయి. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరు తడులు ఇవ్వవచ్చు. అంటే విత్తిన వెంటనే ఒకటి, మొక్క మోకాలి ఎత్తు పెరిగన తరువాత ఒకటి (విత్తిన 30 రోజుల తరువాత) పూత దశలో ఒకటి (50 రోజులకు) 60 రోజులకు ఒకటి, గింజ పాలుపోసుకునే దశలో, గింజ గట్టిపడే దశల్లో నీటిని అందించాలి. తక్కువ నీరు ఉన్నప్పుడు తగిన నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం మంచిది.

ప్రత్యామ్నాయ సాళ్ళల్లో నీటిని ఇవ్వడం :

సాధారణంగా మొక్కజొన్నలో నీటిని సాళ్ళ పద్ధతిలో ఇస్తారు. దీనివల్ల చాలా నీరు వృధా అవుతుంది. దీన్ని అధిగమించడానికి నీటిని ప్రత్యామ్నాయ సాళ్ళ పద్ధతిలో ఇవ్వడం మంచిది. ఈ పద్ధతి వల్ల 50 శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు. నీటిని ప్రత్యామ్నాయ సాళ్ళలో ఇవ్వడం వల్ల అంతరప్రవణం, ప్రవాహవేగం వంటి నీటి నష్టాలు తగ్గుతాయి. ఈ పద్ధతిలో నీటిని ఇవ్వడం వల్ల సాళ్ళలో సగభాగం నీటితో తడుస్తుంది. మిగిలిన సగ భాగం పొడిగా ఉంటుంది. పొడిభాగంలో ఉన్న వేరు వ్యవస్థ తేమ ఒత్తిడికి గురై ''ఎబిసిసిక్‌ ఆమ్లం'' అనే హార్మోనును విడుదల చేయడం వల్ల పత్రాల పైన ఉన్న స్టోమాటా మూసుకొని బాష్పోత్సేకము ద్వారా జరిగే నీటి నష్టాన్ని తగ్గిస్తుంది.

బిందు సేద్యం :

బిందు సేద్య పద్ధతిలో తక్కువ నీటిని ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడులు వస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. ఇందులో నీటి ఆవిరి, అంతర శ్రవణం వంటి నీటి నష్టాన్ని తగ్గించుకొని నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. బిందు సేద్య పద్ధతిలో ఎలాంటి ఆకారంలో ఉన్న పొలానికైనా సులభంగా నీటిని అందించవచ్చు. దీని వల్ల పొలం ఏకరూపంగా తడిచి మొక్కలు నీటి ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. దీనికి సబ్సిడీ ఉన్నందువల్ల పెట్టుబడి తగ్గి ఎకరాకు రూ. 10 వేలు ఖర్చు చేస్తే సరిపోతుంది. అలాగే ఎరువులను నీటితో కలిపి ఇవ్వడానికి కూడా సులభంగా ఉంటుంది.

బిందు సేద్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు :

నీటిలో కరిగే ఎరువులను మాత్రమే వాడాలి.

ఎలుకలు, ఉడతల బెడద తట్టుకోవడానికి అక్కడక్కడా లేటరల్స్‌ దగ్గర ఎలుక మందులను పెట్టాలి.

నీటిని విడుదల చేయలేని డ్రిప్పర్లను గుండు సూదులు లేదా మేకులతో పొడవకూడదు.

డ్రిప్పర్లను తరచుగా ఏసిడ్‌ లేదా క్లోరిన్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఏసిడ్‌తో శుభ్రం చేసేటప్పుడు కళ్ళ అద్దాలు, చేతులకు రబ్బరు గ్లౌజులు ధరించాలి.

ఫిల్టర్‌ డిస్క్‌లపై పేరుకుపోయిన మాంగనీస్‌, ఐరన్‌ మరియు కార్బోనేట్‌ అవశేషాలను ఆమ్ల చికిత్స ద్వారా శుభ్రం చేసుకుని తర్వాత మంచి నీటితో బాగా కడగాలి.

ఎప్పుడూ కూడా నీటికి ఆమ్ల ద్రావణం కలపాలి. ఆమ్ల ద్రావణంలో నీరు కలపరాదు.

నాగుబడి రమ్య, వీ.ూష., (ూస్త్రతీఱ) (నీటి యాజమాన్యం)