అంతర్జాతీయ వాణిజ్య సంస్థ డబ్ల్యుటిఒ నిబంధనల మధ్య ఎగుమతుల అవరోధాలు, విచ్చల విడిగా ప్రబలే రోగాలు, పీడిస్తున్న మార్కెట్‌ సమస్యలు, ప్రభుత్వ పరంగా ఎటువంటి తోడ్పాటు లేని పరిస్థితి. దశాబ్దాల స్వయం కృషితో ఎదుగుతున్న భారత కోళ్ల పరిశ్రమకు దిక్సూచిగా గత 12 ఏళ్ళుగా పౌల్ట్రీ ఇండియా-2018ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వ్యవసాయ రంగంలో ఇతర రంగాలు, పంటలకు లభిస్తున్న ప్రోత్సాహకాలు, అవకాశాలు లేనప్పటికీ ''పెరటితో ప్రారంభమై ప్రపంచ వ్యాప్తమైన కోళ్ళ పరిశ్రమ ప్రభుత్వాల దృష్టిలో ఇంకా పరిశ్రమగా, వృత్తిగా పరిగణించబడలేదు. పరిశ్రమ అభివృద్ధి చెందినంత వేగంగా విజ్ఞాన పంపిణీ వ్యవస్థ మెరుగుపడకపోవడం, రైతులే శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకొని ''కొక్కురోకో'' కూతను నిత్య ప్రభాత గీతంగా ఘనంగా మోగిస్తున్నారు''.

హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయంగా పేరొందిన హైటెక్స్‌ ప్రదర్శన శాలలోని ఒక భాగంలో 12 సం|| క్రితం చిన్నగా ప్రారంభమైన ప్రదర్శన పెను ఉద్యమంగా మారి నేడు 5 శాలలకు విస్తరించింది. అంతేకాదు పరిశ్రమకు సంబంధించిన సకల ఉత్పాదకాలు ఒకేచోట మోహరించి ఒక వ్యవసాయ విప్లవ వాతావరణాన్ని తలపించే విధంగా యంత్ర భూతాలు ఈ ప్రదర్శనలో మోహరించాయి. కోళ్లను పెంచే సమయంలో విస్తారమైన, ఆరోగ్యకరమైన, ప్రకృతిపరమైన రక్షణతో ప్రపంచానికి కావలసిన పోషకాహారాన్ని నిరంతరం అందచేయడానికి చేసే కృషిలో భాగంగా ఈ ప్రదర్శనా వేదిక దానిలోని సకల వర్గాల కలల పంటగా 5 రోజుల పాటు వేడుకగా జరుపుకోవడం ఆనవాయితి.

2018 నవంబరు 26 నుండి 30 వరకు 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా కోళ్ళ పరిశ్రమకు సంబంధించిన బ్రాయిలర్‌, లేయర్‌, వ్యాధుల నిర్మూలనకు, పోషకాలు, దాణా ఇతర అనుబంధ రంగాలు, ఉత్పాదకాలు, ఉత్పత్తులకు సంబంధించిన 350 కంపెనీలు పాల్గొన్నాయి. ప్రపంచ స్థాయిలోనే అత్యంత విస్తారమైన 27,500 చ.మీ. వైశాల్యంలో ఈ ప్రదర్శన జరిగింది. 30 వేల మంది సందర్శకులను ఈ ప్రదర్శన ఆకర్షించింది.

2020 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, సంక్షోభంలో ఉన్న ప్రధాన వ్యవసాయ రంగం సమస్యల పరిష్కారానికి సరైన రీతిలో జవాబు ఇవ్వడంతో పాటు, ఇతర అనుబంధ రంగాల కంటే మిన్నగా రైతన్న జీవితంలో కొత్త వెలుగులు నింపేందుకు ఈ ప్రదర్శన ఎంతో తోడ్పడుతుంది. పౌల్ట్రీ ఉత్పాదన, ఫీడ్‌ తయారీలో నూతన సాంకేతికలు, పశు, పక్షుల ఆరోగ్యం, పౌష్టికాహారం, సంతానోత్పత్తి, నిర్వాహణ వంటి అంశాలపై మెరుగైన పరిజ్ఞానాన్ని అందించడానికే యజ్ఞం లాంటి మహాకర్తవ్యాన్ని పౌల్ట్రీ ఇండియా 2018 పేరుతో నిర్వహించారు.

గత 12 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన నుండి పశువైద్య విశ్వ విద్యాలయ విద్యార్థులు కూడా ఎంతో స్ఫూర్తిని పొందుతూ వస్తున్నారు. పరిశ్రమ భావి అవసరాలకు వీరి తోడ్పాటు ఎంతో ఉన్న నేపధ్యంలో భారత ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు, పశు సంవర్ధక శాఖలు, భారత వ్యవసాయ రంగానికి చుక్కానిలా పనిచేస్తున్న ఐసిఎఆర్‌, పౌల్ట్రీ పరిశోధనా డైరెక్టరేట్‌ కార్యాలయాలు నేరుగా ప్రదర్శనలో పాల్గొని నిర్వాహకులకు చేయూతనివ్వడంతో పాటు రైతులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు తమ సమ సహకారాన్ని అందచేస్తూ వస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలోని చెనిగిచర్ల ప్రాంతంలో గల జాతీయ మాంస పరిశోధనా సంస్థ ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను నిర్వహిస్తూ, దేశంలోని మాంస అవసరాలను, గుడ్లు , కోడి మాంసాలకు పౌష్టికరంగంలో ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, మెరుగైన ఉత్పత్తుల కొరకు కావలసిన విజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఆహూతులకు వివరించారు.

భారత పౌల్ట్రీ రంగ పితామహుడు ఈ రంగ ఉన్నతికి, జగద్విఖ్యాతికి కృషి చేసిన తెలుగు తేజం పద్మశ్రీ డా|| బి. వి. రావు నెలకొల్పిన వెన్‌కాబ్‌ చికెన్‌, ఆ సంస్థతో పాటు పౌల్ట్రీ రంగానికి మ¬న్నత స్థితి కల్పించిన ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న కుమార్తె అనురాధా దేశాయ్‌ సేవలను వివరిస్తూ ఏర్పాటు చేసిన వెంకటేశ్వరా హేచరీస్‌ ప్రదర్శనా శాల, కోళ్ళ పరిశ్రమకు ఔన్నత్యాన్ని కల్పించిన సుగుణ సంస్ధ వారి నిరంతర సేవలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన విశిష్టమైన ప్రదర్శనా శాల సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమను సంక్షోభాల నుండి కాపాడేందుకు డా|| బి.వి రావు చోరవతో ఏర్పాటైన జాతీయ గుడ్ల సమన్వయ సంఘం (నెక్‌) ప్రదర్శనాశాల సందర్శకులను బాగా ఆకట్టుకుంది. గుడ్లు, కోడిమాంసం వినియోగం, పౌష్టిక భద్రతపై వారు ప్రచురించిన పుస్తకం బహుళ ఆదరణను పొందింది. నిరంతర పౌష్టికాహార ఆవశ్యకతను తెలియచేస్తూ పరిశ్రమ వర్గాలు చేపడుతున్న ప్రచార కార్యక్రమానికి నెక్‌ ఎంతో దోహదపడుతుంది.

ఈ ప్రదర్శనలో హైదరాబాద్‌కు చెందిన చక్ర గ్రూప్‌ సంస్థలు, శ్రీనివాసా హేచరీస్‌, ''హెవే ఫార్మాగ్రూపు'' సంస్థలు పశు ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంతర్జాతీయ సంస్థలు పౌల్ట్రీ ఉపకరణాల రంగంలో ప్రసిద్ధిచెందిన ''గార్‌టెక్‌ సంస్థ'', పౌల్ట్రీ సాహిత్య ప్రచురణ రంగంలో పేరొందిన హింద్‌ ప్రచురణ సంస్థలు స్థానికంగా ప్లాస్టిక్‌ ఉత్పాదనల రంగంలో విశిష్టస్థానాన్ని పొందిన సాయికృష్ణా క్వాలిటీ పౌల్ట్రీ ఎక్వూప్‌మెంట్‌ సంస్థ, శ్రీనివాస ఫార్మావారి హైలైన్‌, ఇంజెక్షన్‌ పరిశ్రమలో పేరెన్నిక గన్న ''వెంట్రి బయోలాజికల్స్‌, హువే ఫార్మా, శ్రీనివాసా ఫామ్స్‌'' తదితర సంస్థలు పాల్గొన్నాయి.

కోళ్ళ పెంపకంలో ప్రధాన పాత్ర వహించే పౌల్ట్రీ షెడ్‌ల నిర్మాణ ప్రక్రియ అతిముఖ్యమైనది. కాలుష్యం, ఇతర పర్యావరణ సమస్యల నుండి కోళ్ళను, కోళ్ళ ఫారాలు ఉన్న ప్రాంతాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు షెడ్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, మెళకువలను పాటిస్తూ నిర్మాణ సంస్థలు రంగంలోకి వచ్చాయి. ఇందులో ముఖ్యమైనవి పూనేకు చెందిన ధూత్‌ కంపెనీ వారి ప్రీ ఇంజనీర్స్‌ పౌల్ట్రీ హౌస్‌ మరియు షెడ్లు సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. అదే విధంగా అత్యంత మెరుగైన సౌకర్యాలతో షెడ్లు నిర్మించే బిల్డ్‌ క్రీటే సంస్థ కూడా తన నమూనాలను ప్రదర్శించి సందర్శకులను ఆకర్షించాయి.

పర్యావరణ సమస్యలు, రసాయన అవశేషాలు లేని ఉత్పత్తుల తయారీలో ప్రత్యేకత పొందిన ఎన్‌.హెచ్‌.ఎఫ్‌ కంపెనీ కోళ్ళకు ఎంతో శక్తినిచ్చే ఎలక్ట్రాల్‌ సి ఉత్పాదనను సహజ సిద్ధంగా కోడిపిల్లల ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్‌-ఎ, ఇమ్యూ-100 వంటి ఉత్పాదనలను, విష రసాయనాలను శరీరం నుండి బయటకు పంపే బయోటాక్స్‌ మందులను ఆకర్షణీయమైన ప్రదర్శనాశాలలో ఉంచింది. ఈ రంగంలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు గడించిన బయోమిన్‌ కంపెనీ స్టాల్‌ సందర్శకులను ఆకర్షించింది. త్వరలో దేశంలోని ఆరు ప్రాంతాల్లో విషరసాయన రహిత కోళ్ళ ఉత్పత్తుల తయారీకి సహకరించేందుకు ఈ సంస్థ ఆరుచోట్ల అకాడమీలను ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

మానవ ఆరోగ్య రక్షణలో విశిష్ట స్థానాన్ని పొందిన అలెంబిక్‌ బహుళజాతి సంస్థ కోళ్ళలో రక్తహీనత, హెమోగ్లోబిన్‌ తక్కువగా ఉండి బరువు లేకపోవడం, రోగ నిరోధక శక్తిని సంతరించు కోలేకపోవడం వంటి దుష్పలితాలతో దిగుబడి తగ్గిపోయే పరిస్థితుల్లో ఉన్న చోట ఉపయోగించాల్సిన షార్కోఫెర్రాల్‌ మందు కోళ్ళ రైతులను విశేషంగా ఆకర్షించింది. గతంలో ఎన్నో తరాల పాటు మానవ ఆరోగ్యానికి విశేషంగా తోడ్పడిన పోషకాహార ఉత్పాదకమైన చేపల నుండి తీసిన షార్కులివర్‌ ఆయిల్‌ తరహాలోనే ఈ షార్కోఫెర్రాల్‌ ప్రస్తుతం కోళ్ళ ఆరోగ్య రక్షణలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అదే విధంగా పంటలను కాపాడడంలో విశిష్ట స్థానం పొందిన బేయర్‌ కంపెనీ వారి రసాయనాలు, పోషకాలూ ఆకర్షించాయి. ఇంకా కోడిగుడ్లను, మాంసాన్ని నిల్వ చేసే పరికరాలు, ప్లాస్టిక్‌ ట్రేలు, ఇంక్యుబేటర్స్‌, జియూస్‌ లాంటి ఆధునిక దాణా తయారీ కంపెనీలు, కేజస్‌ కంపెనీల్లో ఒమెగా లాంటి ప్రముఖ సంస్థలతో పాటు అనేక ఇతర కంపెనీలు, దేశ విదేశ కంపెనీలు పాల్గొన్నాయి. దేశ విదేశాలకు చెందిన వ్యవసాయ. పౌల్ట్రీ, పశు సంవర్థక కార్యకలాపాలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చే జాతీయ, అంతర్జాతీయ, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సంస్థలు తమ ప్రచురణలను ఉంచాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో, తనకంటూ ప్రత్యేకత ఏర్పరచుకున్న అగ్రిక్లినిక్‌ మాసపత్రిక సందర్శకులను విశేషంగా ఆకర్షించింది.

ఒక వైపు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి క్రమంగా పుంజుకుంటున్నప్పటికీ , రాజకీయ కార్యకలాపాల్లో రైతులు మునిగి తేలుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో పౌల్ట్రీ యజమానులు, భారీ సంఖ్యలో రైతులు, ఆసక్తి గల వర్గాలు ప్రదర్శన చూడడానికి తరలివచ్చాయి.

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌