విజయనగరం జిల్లాలో మొక్క జొన్న పంటను ఖరీఫ్‌ మరియు రబీ కాలాల్లో దాదాపు 50,000 హెక్టార్ల విస్తీర్ణంలో పండిస్తున్నారు. ఇక్కడి రైతులు మొక్కజొన్న పంటను వివిధ కాలాల్లో పండించటం జరుగుతుంది. కొంత మంది రైతులు మొక్కజొన్నను వర్షాధార పంటగా ఖరీఫ్‌ జూన్‌ నుండి ఆగస్టు మాసాల వరకు విత్తటమే కాకుండా మరలా రెండో పంటగాను అక్టోబరు రెండవ పక్షం నుండి జనవరి వరకు నీటి వసతి ఉన్న దగ్గర మరియు వరి మాగాణుల్లో పండించటం జరుగుతుంది. ఈ విధంగా మొక్కజొన్నను దఫ దఫాలుగా విత్తుకోవటం వల్ల కత్తెర పురుగు యొక్క ఉధతి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

పురుగులను గుర్తించుట :

రెక్కల పురుగు మొక్క కాండానికి దగ్గరగా ఉన్న ఆకుల అడుగు భాగంలో రాత్రి సమయంలో 150 - 200 వరకు సముదాయంలో గుడ్లు పెడుతుంది. దాని జీవిత కాలం (7-21 రోజులు)లో మొత్తం 4 నుండి 5 సార్లు గుడ్లు పెట్టి మొత్తం పంట కాలంలో 6-12 తరాలను ఉత్పత్తి చేయగలదు.

లద్దెపురుగు పెరుగుదల 6 దశల కలిగి ఉంటుంది. పిల్ల దశలో లేత పచ్చ వర్ణంలోను, పెరిగే కొద్ది గోధుమ వర్ణం నుండి బూడిద రంగుకి మారుతాయి. మూడవ దశకు చేరిన లద్దె పురుగు తల మీద తిరగబడిన ్‌ ఆకారపు పసుపు రంగు చారలు, పురుగు చివరి ఖండితంలో చతురస్రాకారంలో నాలుగు నల్లటి చుక్కలు ఉంటాయి

నష్టపరిచే విధానం :

గుడ్లు పగిలి పిల్లపురుగులుగా మారిన లద్దెపురుగు గుంపులు తొలి (1-3) దశల్లో ఆకులలోని పత్రహరితాన్ని గీకి తిని రంధ్రాలేర్పరిచి జల్లెడాకులుగా మారుస్తాయి.

4-6 దశల్లో మొక్కజొన్న కాండం మొవ్వు దగ్గర చేరి లేత ఆకులను తినేసి పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పరుస్తాయి.

శాఖీయదశలో ఆశించినప్పుడు మొవ్వును పూర్తిగా తినివేయడం వల్ల మొవ్వు కత్తిరించినట్లుగా కనిపిస్తుంది. పురుగు తిని విసర్జించిన మలపదార్థం అడచిన రంపపు పొట్టులా మొవ్వంతా నిండి ఉంటుంది.

పూత మొదలయ్యే సమయంలో ఆశిస్తే మొవ్వు లోపల ఉన్న పూతను రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి. పూత చనిపోయి కంకి తయారవదు.

కంకి తయారయ్యే సమయంలో పురుగు కండెలను చుట్టుకొని ఉండే ఆకు పొరలను కొరికి లోపలి ప్రవేశించి, లేత గింజలను తింటుంది. పగటి సమయంలో లద్దెపురుగు మొవ్వు లోపల ఆకుల అడుగు భాగంలో ఉండి రాత్రి పూట బయటకు వచ్చి ఆకులను తినివేస్తాయి.

కత్తెర పురుగు వ్యాప్తి :

రెక్కల పురుగులు ఒక్క రాత్రిలో 100 కి. మీ. ప్రయాణించగలవు. ఒక్క తల్లి పురుగు దాని జీవిత కాలంలో సుమారు 2000 కి.మీ. ప్రయాణిస్తుంది.

జీవిత కాలంలో ఎక్కువ గుడ్లను సముదాయాలుగా పెట్టడం వల్ల ఒకే సారి అధిక సంఖ్యలో పిల్ల పురుగులు కొత్త ప్రాంతాలకు వ్యాపించగలవు.

కత్తెర పురుగు సోకిన మొక్కల భాగాలను మరియు కండెలను వేరే ప్రాంతాలకు తరలించటం వల్ల వీటి వ్యాప్తి ఎక్కువవుతుంది.

ఏక పంటగా మొక్కజొన్నను దఫ దఫాలుగా సాగు చేయడం వల్ల కూడా వ్యాపిస్తుంది.

పర్యవేక్షణ :

మొక్కజొన్న విత్తిన వారం రోజుల నుండి 2 - 3 రోజులకొకసారి రైతులు పొలంలో ఆకులపై గ్రుడ్లు, లద్దెపురుగు, రంధ్రాలు చేయబడిన ఆకులు మరియు మొవ్వు ప్రాంతంలో అధికంగా విసర్జితాలను ఉన్నది లేనిదీ గమనించాలి.

ప్రతి వంద మొక్కలు పది మొక్కలను పలుచోట్ల నిశితంగా గమనించాలి. పొలంలో 25 శాతం కంటే ఎక్కువ మొక్కలకు పురుగు ఆశిస్తే పురుగు మందులు చల్లాలి.

కత్తెర పురుగు యాజమాన్యం :

విత్తేటప్పుడు :

దఫ ధఫాలుగానూ మరియు ఆలస్యంగా విత్తుకునే పంటలో ఈ పురుగు ఉధతి ఎక్కువ కనుక మొక్కజొన్న సాగు చేసుకునే రైతులు సకాలంలో (ఖరీఫ్‌లో జూన్‌-జులై నెలలో మరియు రబీ కాలంలో నవంబరులో) విత్తుకుంటే మంచిది.

అంతర పంటలుగా లేదా కంచె పంటలుగా నేపియర్‌ గడ్డి వేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధతి తగ్గుతుంది.

విత్తిన తరువాత :

విత్తిన తరువాత 3 - 4 రోజులకు ఎకరా పొలంలో 8 - 10 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉధతిని గమనించాలి.

తొలి దశలో పురుగు ఆశించి గుడ్లు పెట్టకుండా ఉండేందుకు, విత్తిన వారం రోజులకు వేప నూనె (10,000 పి. పి. యమ్‌.) 0.5 మీ. లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ప్రతి రెండు మూడు రోజులకు పొలానికి పరిశీలించి పురుగు గుడ్లు లేదా పిల్ల పురుగుల సమూహాలు కనిపిస్తే ఏరి నాశనం చేయాలి.

జీవ నియంత్రణ :

విత్తిన తరువాత 7 - 8 రోజులకు ట్రైకోగ్రామా కిలోనిస్‌ గుడ్లు పరాన్న జీవులను ఎకరానికి 40,000 - 60,000 గుడ్లు చొప్పున ట్రైకోకార్డుల ద్వారా పొలంలో వదలాలి.

మూడవ దశ లద్దెపురుగులను ఆకర్షించడానికి విషపు ఎరలను సాయంత్రం వేళలో మొవ్వు సుడుల్లో వేయాలి. విషపు ఎర తయారీకి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, 2 లీటర్ల నీటిని కలిపి ఒక రాత్రంతా పులియబెట్టి దానికి 100 గ్రా. థయోడికార్బ్‌ మందును కలిపి ఉండలుగా చేసి సాయంత్రం పూట సుడుల్లో వేయాలి.

రసాయన మందులు :

తొలి దశలో పురుగుల నివారణకు క్లోరిపైరిఫోస్‌ 20 శాతం ఈ. సీ. 500 మి. లీ. లేదా క్వినాల్‌ ఫాస్‌ 25 శాతం ఈ. సీ. 400 మి. లీ. చొప్పున ఎకరానికి 200 లీటర్లు నీటికి కలిపి పిచికారికి చేయాలి.

పురుగు ఉధతి ఎక్కువగా ఉంటే నివారణకు ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5 శాతం ఎస్‌. జి. 80 గ్రా. లేదా క్లోరాన్త్రినిలిప్రోల్‌ 18.5 శాతం యస్‌.సి. 80 మి. లీ. ఎకరానికి 200 లీటర్లు నీటికి కలిపి పిచికారికి చేయాలి.

పంట విత్తిన 40 - 45 రోజుల దశలో లద్దె పురుగు నివారణకు, స్పైనోసాడ్‌ 45 శాతం యస్‌.సి. 60 మి. లీ. చొప్పున ఎకరానికి 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పురుగు ఉధతి తీవ్రమైనప్పుడు, లామ్డా సైహలోత్రిన్‌ 20 శాతం ఈ. సీ. మందు 200 మి. లీ. మందును ఎకరానికి 200 లీటర్లు నీటికి కలిపి పిచికారికి చేయాలి.

- జి. హారిక, కెల్లా లక్ష్మణ, శ్రీమతి వై. సంధ్యారాణి,

శాస్త్రవేత్తలు, ఏరువాక కేంద్రం, విజయనగరం