ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రం. మనరైతులు పంటసాగుతో పాటు రవాణాకు, పాల ఉత్పత్తికి పశువులను పోషిస్తారు. అందుకే పాడిపంట అనేది మనకు అనాదిగా వస్తుంది. వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా మన జీవనాధారం. మనకు పశుసంపద సంమద్ధిగా ఉన్నప్పటికీ వాటి ఉత్పాదకత చాలా తక్కువ. పశువుల్లో దాదాపు 80 శాతం వరకు ఒకటి, రెండు లీటర్లు పాలను ఇచ్చేవే, అధిక పాల దిగుబడి కోసం సంకరజాతి పశువుల ఎంపిక మరియు మేలైన పశువుల పోషణ చేపట్టడం ద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చు. పాడిపశువుల పెంపకానికి అయ్యే మొత్తం ఖర్చులో సుమారు 70 శాతం వరకు వాటియొక్క పోషణకే ఖర్చు అవుతుంది.

ఒక్కొక్క పశువుకు రోజుకు 3 కిలోల దాణాను ఇవ్వాల్సి ఉంటుంది. కాని దాణా ఖర్చు అధికంగా ఉండటం వల్ల తగిన విధంగా పాడిపశువులను మేపలేక పోతున్నారు. పుష్ఠికరమైన దాణాలో శక్తి నిచ్చే పదార్థాలు అనగా తవుడు, మొక్కజొన్నలు, సజ్జలు మొదలైనవి, మాంసకత్తులు (వేరుశనగ చెక్క, పొద్దుతిరుగుడు చక్క మొదలగునవి) ఖనిజలవణాల మిశ్రమం ఉండాలి. కాని గ్రామాల్లో చాలా వరకు రైతులు తవుడు మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల పోషకపదార్థాల పొషకానికి ప్రత్యామ్నాయంగా, తక్కువ ఖర్చుతో పోషక పదార్థాలు సమృద్ధిగా అందడంలేదు. పాల దిగుబడి పెంచేందుకు మంచి దాణాగా అజొల్లాను ఉపయోగించవచ్చు.

అజొల్లాను వరిలో సేంద్రీయ ఎరువుగా వాడటం జరుగుతుంది. కాని పశువుల దాణాగా కొంత మంది రైతులు మాత్రమే వాడుతున్నారు. వేసవి కాలంలో పశుగ్రాస కొరత సమస్యగా మారింది. దీని దష్ట్యా పచ్చి మేతకు ప్రత్యామ్నాయంగా అజొల్లాను సాగుచేసుకోవచ్చు. దీనివల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా చేయవచ్చు.

అజొల్లా అనేది ఫెర్న్‌ జాతికి చెందిన మొక్క, ఇది చిన్న చిన్న పలకల లాంటి ఆకులతో ఒకదాని మీద ఒకటిగా ఉండి, వేర్లు నీటిలో వేలాడుతూ నీటిమీద తేలుతూ ఉంటుంది. దీనిలో నత్రజనిని నిల్వ చేసే అజొల్లా అనాబీన అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని ఆకుల్లో స్థిరపరుస్తుంది. అజొల్లాలో ఏడురకాలు ఉన్నాయి. మనదేశంలో ''అజొల్లా పిన్నేట మరియు అజొల్లా మెక్సికాన'' అనే రకాలు ప్రస్తుతం సాగులో ఉంది. ఇది మురుగు నీటిలోను, వరి పొలల్లోను ఎక్కువగా కన్పిస్తుంది.

అజొల్లాలో పోషక విలువలు :

మాంసక త్తులు 25-35 శాతం.

ఫాస్ఫరస్‌ 13-14 శాతం.

ఖనిజ లవణాలు 10-15 శాతం.

ఫాస్ఫరస్‌ 1.63-1.65 శాతం.

కాల్షియం 2.3-2.5 శాతం.

జీర్ణమయ్యే మాంసకత్తులు 10.1- 10.3 శాతం.

అజొల్లాలో లిగ్నిన్‌ తక్కువగా ఉండడం వల్ల పశువులు తేలికగా జీర్ణం చేసుకొంటాయి. అజొల్లాను రోజుకు 1.5-2 కిలోలను పాడిపశువులకు మేపటం వల్ల పాల దిగుబడి 15-20 శాతం, పాలలో కొవ్వు మరియు ఘనపదార్ధాల పరిమాణం పెరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్ళు, కోళ్ళు వంటి వాటికి కూడా అజొల్లా మేతగా ఉపయోగపడుతుంది.

అజొల్లా ఉత్పత్తి :

1. ముందుగా భూమిపై ఉన్న కలుపు మొక్కలను తీసి వేసి నేలను చదరంగా చేసుకోవాలి.

2. రోజుకు 4 కిలోల అజొల్లా ఉత్పత్తి చేయాలంటే 2.25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 0.2 మీటర్ల లోతు సైజులో తొట్టి చేసుకోవాలి.

3. బయటి నుండి వేర్లు లోనికి రాకుండా గోతి లోపల ప్లాస్టిక్‌ సంచులు పరవాలి. దాని మీద 1.50 జి.యస్‌.యం. మందం గల షిల్పాలీన్‌ షీట్‌ వేసి, కొనల పైన ఇటుకలు అమర్చుకోవాలి.

4. తరువాత 30-35 కిలోల భూసారం గల మెత్తటి మట్టిని(రాళ్ళు, చెత్త, చెదారం, గడ్డలు లేకుండా) జల్లెడ పట్టి షీట్‌ పైన సమంగా పరచుకోవాలి.

5. ఈ మట్టిపై 2 రోజుల నిల్వ ఉంచిన పశువుల పేడను (4-5 కిలోల) 20 లీటర్ల నీటిలోకలిపి చల్లుకోవాలి. దానికి 20-30 గ్రా. సూపర్‌ ఫాస్ఫేటు, 30-40 గ్రా. మినరల్‌ మిక్చర్‌ కలిపి ఆ మట్టిమీద పోయాలి. తరువాత నీరు పోసి మట్టం 10 సెం.మీ. ఉండే విధంగా చేయాలి. తరువాత ఆ బెడ్‌లోని మట్టిని, నీటిని కలియ తిప్పాలి.

6. తరువాత 1-1.5 కిలోల తాజా అజొల్లాను బెడ్‌ మీద సమానంగా పడేలా చేయాలి. తరువాత అజొల్లాపై నీరు చల్లితే అజొల్లా నిటారుగా వస్తుంది.

7. అజొల్లా త్వరగా పెరిగి గొయ్యి మొత్తాన్ని 10-15 రోజుల్లో ఆక్రమిస్తుంది. (1 కిలో అజొల్లా నుంచి వారం రోజులలో 8-10 కిలోలు వస్తుంది). 7వ రోజు నుంచి అజొల్లాను ప్రతి రోజు తీసుకోవచ్చు.

8. తరువాత 7 రోజులకొకసారి 1 కిలో పేడను 20 గ్రా. మినరల్‌ మిక్చర్‌ 5 లీటర్ల నీటిలో కలిపి గుజ్జుగా చేసి అజొల్లా తొట్టిలో పోయాలి.

అజొల్లాను మేతగా వాడడం :

చదరపు సెంటి మీటరు వెడల్పైన రంధ్రాలు గల ప్లాస్టిక్‌ ట్రేలో సేకరించి అజొల్లాను ఉంచాలి. సగం నీరు నింపిన బక్కెట్టు మీద ట్రే ఉంచి, పైనుంచి నీటిని పోసి ఆవుపేడ వాసన పోయేటట్లు కడిగి మేతగా వాడవచ్చు. చిన్న అజొల్లా మొక్కలు రంధ్రాల ద్వారా బక్కెట్టులోకి వెళతాయి ఆ నీటిని మరలా బెడ్‌లో పోయుట ద్వారా అజొల్లాను తిరిగి పెంచవచ్చు.

అజొల్లా ఉత్పత్తికి తీసుకోవలసిన జాగ్రత్తలు :

1. నేరుగా సూర్యకాంతి పడేచోటగాని, మరీ ఎక్కువ నీడగల ప్రదేశంలో గాని అజొల్లాను పెంచకూడదు.

2. అజొల్లా పెంపకంలో ఉష్ణోగ్రత చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఉష్ణోగ్రత 300 సెల్సియస్‌ కంటే తక్కువ ఉంటే అజొల్లా బాగా పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద అజొల్లా పాడవుతుంది. కావున వేసవిలో ఉష్ణోగ్రత నియంత్రణ చాలా ముఖ్యం.

3. అజొల్లా పెంచు గుంటలు ఆకులు రాలని ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకోకపోతే గుంటలో ఆకులు రాలితే అజొల్లా కుళ్ళిపోయే ప్రమాదముంది. అందువల్ల ఆకులు, చెత్తా, చెదారం పడకుండా జాలీని లేదా వలను పెట్టుకోవచ్చు.

4. అజొల్లా తొట్టెలో నీరు తగిన మోతాదులో ప్రతిమూలలో సమానంగా ఉండేటట్లు చూడాలి.

5. 10 రోజులకు ఒకసారి సగం నీరు తీసి వేసి, మరలా తాజా నీటితో నింపాలి.

6. నెల రోజుల కొకసారి బెడ్‌లో మట్టిని తీసివేసి 5 కిలోల కొత్త సారవంతమైన మట్టిని తోట్టెలో నింపుకోవాలి.

7. ప్రతి ఆరు నెలల కొకసారి విత్తనపు అజోల్లాను మార్చుకోవాలి.

వ్యాధులు మరియు వాటి నివారణ :

అజొల్లాకు వచ్చే వ్యాధుల్లో కుళ్ళుడు వ్యాధి ముఖ్యమైనది. ఫంగస్‌ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన అజొల్లా కుళ్ళిపోవడం జరుగుతుంది. వ్యాధిసోకిన అజొల్లాను బెడ్డునుంచి వేరుచేసి వేరేచోట పూడ్చిపెట్టాలి. వంద చ.మీ. 200 గ్రా. కార్బోఫ్యూరాన్‌ గుళికలు చల్లి ఈ వ్యాధి నివారించవచ్చు.

డా|| ఎమ్‌. మల్లికార్జున, సేద్య విభాగం, డా|| ఎమ్‌. రెడ్డి కుమార్‌ (సమన్వయకర్త ),

కషి విజ్ఞాన కేంద్రం, కలికిరి, ఫోన్‌ : 8008500320