అంతర్జాతీయ విత్తన పరిశోధనా సంఘం అనేది అంతర్జాతీయ స్థాయిలో విత్తన నాణ్యతా ప్రమాణాలు, విత్తన పరిక్షా పద్ధతులు ఏ విధంగా ఉండాలనే అంశాలపై 1924లో ఏర్పడిన సంస్థ. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ నగరం జూరిచ్‌లో ఏర్పాటైన సంస్థ. వివిధ దేశాల నుండి ప్రతినిధులు పాల్గొని గవర్నింగ్ బాడీగా ఈ సంస్థ నిర్వహణకు బాధ్యత వహిస్తారు. ఇష్టా ఏర్పడి 92 సంవత్సరాల చరిత్రలో ఒక భారతీయుడు గవర్నింగ్ బాడీ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించడం ఇదే మొదటిసారి. అది కూడా మన తెలుగు శాస్త్రవేత్త, ప్రత్యేకించి తెలంగాణ వాసి డా|| కేశవులు ఎన్నికవ్వడం గర్వకారణం. ఆయన ఎంపికైన అనంతరం 2019 ఫిబ్రవరి 8 నుండి 16 వరకు జర్మనీలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పాల్గొనడానికి అవకాశం రావడం, హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఇష్టా కాంగ్రెస్ 2019 (విత్తన సదస్సు) నిర్వహణకు నిర్ణయం తీసుకోవడం బహుగర్వకారణం.
జర్మనీలో జరిగిన ఇష్టా కార్యనిర్వాహక వర్గ కమిటీ సమావేశంలో 2019-2025 వరకు 5 సంసంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా విత్తన ప్రణాళిక అమలుతోపాటు, దేశాల మధ్య విత్తన ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడం అన్ని దేశాలకు ఒకే విధంగా నాణ్యమైన విత్తన ప్రమాణాలను వర్తింపచేయడం ప్రధాన ఎజెండాగా నిర్ణయం చేయడం విశేషం.
విత్తనాల భద్రత కొరకు బార్‌కోడెడ్ పద్ధతి ద్వారా లేబులింగ్ చేయడం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రైతులను పీడిస్తున్న విత్తన కల్తీ నివారణకు, నియంత్రణకు చర్యలు తీసుకుంటూ రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు కమిటీ సిఫార్సులు చేస్తూ, ఆ నేపధ్యంలోనే హైదరాబాద్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సుకు నిర్ణయం తీసుకొని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్ళడం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు, రైతు హితులకు, శాస్త్రజ్ఞులకు స్ఫూర్తిని కలిగించనున్నది. అదే విధంగా ఇప్పటివరకు సరైన ఫలితాలు రావడానికి, నూతన విత్తన నమూనాల సేకరణ పద్ధతులు బహువార్షిక మొక్కల్లో కూడా విత్తన నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలనే అంశంపై కూడా కమిటీలో చర్చ జరిగింది. విత్తనశుద్ధి పద్ధతులు వాటి ప్రభావం విత్తన నాణ్యతపై ఏ విధంగా ఉంటుంది? వాటి విధి విధానాలను సమగ్రంగా చర్చించారు.
విత్తన ఆరోగ్యం (సీడ్ హెల్త్) పరిక్ష ద్వారా మన దేశం నుండి మరిన్ని దేశాలకు చీడపీడలు లేని విత్తన ఎగుమతులను ప్రోత్సహించే అవకాశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. దానితో పాటు కీలకమైన మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. వివిధ దేశాల్లో విత్తనోత్పత్తి దారులకు విత్తన అధికారులకు, నూతనంగా ఈ రంగంలోకి ప్రవేశించిన శాస్త్రవేత్తలకు, పరిశోధనా విద్యార్ధులకు అంతర్జాతీయ విత్తన ప్రమాణాలపై శిక్షణ / అవగాహన కర్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన విత్తన రైతులకు ఎంతగానో దోహదపడింది. ఇప్పటికే ప్రపంచ మేధోరాజధానిగా, ఆతిధ్య రాజధానిగా, ఆరోగ్య రాజధానిగా, ముత్యాల నగరంగా ప్రపంచస్థాయిలో కీర్తింపబడుతున్న మన భాగ్యనగర శిగలో తురిమిన మరో కలికి తురాయిగా ఈ అంతర్జాతీయ విత్తన సదస్సు మనదేశంలో మరో వ్యవసాయ విప్లవానికి, ప్రపంచ అగ్రభాగాన వెలుగొందడానికి దేశం సిద్ధమౌతున్న నేపద్యంలో ఈ కార్యక్రమం చరిత్రాత్మకంగా, స్ఫూర్తివంతమైన సందేశాన్ని అందించింది.
దేశంలో విత్తనాలు ఉత్పత్తి చేయడానికి అనువైన వాతావరణం తెలంగాణలోనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయి. తెలంగాణలో విత్తనరంగ అభివద్దికి బాటలు వేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి అన్నారు. హైదరాబాద్ నోవాటెల్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు. రైతాంగ అభివద్దికి, దేశ ఆహార భద్రతకు విత్తనమే కీలకమని, ఆసియాలో తొలిసారి అంతర్జాతీయ విత్తన సదస్సు భారతదేశంలో జరగడం గర్వకారణం అని, ప్రపంచంలోనే పత్తి విత్తనోత్పత్తిలో భారత్‌ది అగ్రస్థానం కాగా వరి, గోధుమ, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, కూరగాయల్లో మేలైన విత్తనాల ఉత్పత్తి జరుగుతుందని ఆయన అన్నారు.
దేశంలో 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం అభివద్ది చెందితేనే, దేశం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుందని, మారుతున్న పర్యావరణం, తరుగుతున్న సహజవనరుల నేపథ్యంలో వ్యవసాయ ఉత్పాదకత పెంచాలంటే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చి సరఫరా చేయాల్సిన అవసరం ఉందని కైలాష్ చౌదరి అన్నారు. ప్రపంచంలో భారతీయ విత్తన పరిశ్రమ వేగంగా ఎదుగుతుందని, ఆసియా దేశాల్లో తొలిసారి భారతదేశంలో విత్తన సదస్సు నిర్వహించడం గర్వకారణం అని, నాణ్యత గల విత్తనాలు అవసరం మేర రైతాంగానికి అందించేందుకు భారత ప్రభుత్వం కషి చేస్తుందని తెలిపారు. దేశంలో వందకు పైగా వ్యవసాయ పరిశోధనా సంస్థలు, 60కి పైగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విత్తనాలు, పంటల అభివ ద్దిపై రైతులకు సహకారం అందిస్తున్నాయని, 16 రాష్ట్ర స్థాయి విత్తన కార్పోరేషన్లు, 26 రాష్ట్ర విత్తన దవీకరణ ఏజన్సీలు, విత్తన ''లా ఎన్ ఫోర్స్ మెంట్'' అధారిటీ ద్వారా విత్తనాల నాణ్యత పరీక్షించడం జరుగుతుందని, 1966లోనే దేశంలో భారత విత్తన చట్టం రూపొందించుకుని నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించేందుకు కషి చేస్తున్నామని, దానిని భవిష్యత్ లో కొనసాగిస్తామని అన్నారు.
భారతదేశ విత్తన పరిశ్రమలో తెలంగాణ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కషితో గత ఐదేళ్లలో తెలంగాణ విత్తనోత్పత్తికి చిరునామాగా మారిందని, ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ ఎదిగేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు దోహద పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నోవాటెల్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో ప్రైవేటు విత్తనరంగ సంస్థలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తూనే, ప్రభుత్వ విత్తన రంగ సంస్థలను బలోపేతం చేస్తామని, నాణ్యమయిన విత్తనమే వ్యవసాయాభివద్దికి మూలం అని, విత్తన నాణ్యత, సరఫరా పెరిగేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థలలో విత్తన పరిశ్రమ ఒకటి అని, ఆధునిక శాస్త్రీయతను విత్తనానికి ఆపాదించి నాణ్యమైన విత్తనాలను రూపొందించాలని, తెలంగాణ నుండి ఏడాదికి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తవుతున్నాయని తెలిపారు.
ప్రపంచంలోని 771 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరితోనో అన్నీ సాధ్యం కావని, ఏటేటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు పెరుగుతున్నాయని, వాటిని తీర్చేందుకు శాస్త్ర సాంకేతికత నవీకరణ అవసరం అని, దానిని ఆయా రంగాలకు ఆపాదించాలని తెలిపారు. పదివేల ఏళ్లక్రితమే వ్యవసాయం మొదలయిందని, ఈ 60 ఏళ్లలో వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని, అందుబాటులో ఉన్న సాంకేతికతను అనుసరిస్తూ సాంప్రదాయ వ్యవసాయం నుండి మన రైతులు బయటకు రావాలని నిరంజన్ రెడ్డి కోరారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ప్రసిద్ధి అని, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు జరిగేవని, కాలక్రమంలో ద్రాక్ష పంటలు కనుమరుగు అయ్యాయని, మహారాష్ట్ర ద్రాక్ష రైతులు మేలైన సాగు విధానాలు అవలంభిస్తూ విదేశాలకు ద్రాక్ష ఎగుమతులు చేస్తున్నారని, తెలంగాణ రైతులు ద్రాక్ష సాగు తిరిగి చేపట్టి పూర్వవైభవం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహారం అవసరం ఉన్నంత వరకు రైతే ప్రపంచానికి ఆధారం అని, భవిష్యత్ ఆహార భద్రతకు వీరే కీలకమని అన్నారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెంచడానికి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, మిగిలిన రంగాలతో పోలిస్తే ఈ రంగంలోనే ఎక్కువమందిని భాగస్వాములను చేయగలమని, మారుతున్న ఆహారపు అలవాట్లే మన విత్తనాలకు ఎగుమతి అవకాశాలని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, రైతుబంధు, రైతుభీమా ఏ పథకం అయినా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుకు భరోసానివ్వటమే ముఖ్య లక్ష్యమని నిరంజన్ రెడ్డి అన్నారు. ఆహార సమతుల్యతలో భాగంగా పండ్లు, కూరగాయల ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో తెలంగాణ రైతులు ఉద్యాన పంటల సాగుపై దష్టి సారించాలని కోరారు. తరచుగా మన దేశం నుండి ఎగుమతి ఆహార పదార్థాలు పురుగు మందుల అవశేషాల మూలంగా నిరాకరణకు గురవుతున్నాయని, మేలైన సాగు పద్ధతులతో ఈ సమస్యను అధిగమించాలని అన్నారు.
తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులకు అండగా నిలుస్తున్న 20 అత్యుత్తమ పథకాల్లో తెలంగాణ నుండి రైతుబంధు, రైతుభీమా పథకాలు నిలిచాయి. ఐక్యరాజ్యసమితి ఈ పథకాలను అన్ని దేశాలకు వివరించాలని ఆహ్వానించిందని, రైతుల పట్ల కేసీఆర్ నిబద్దత, చిత్తశుద్ది మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యం అయ్యాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్‌లో జరిగిన విత్తన రైతుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణలోని రైతుబంధు, రైతుభీమా పథకాలు మాత్రమే కాకుండా కళ్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి ప్రతి పథకం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఆదర్శనీయం, ఆచరణీయం అని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు చనిపోయిన వారం రోజుల్లో రూ.5 లక్షలు సాయం ఎలాంటి సిఫారసులు లేకుండా ఆ బాధిత కుటుంబం దరిచేరడం మామూలు విషయం కాదని, ఇప్పటికి 1200 పైచిలుకు కుటుంబాలకు రూ.650 కోట్ల వరకు పరిహారం అందిందని, రాష్ట్రంలో మొత్తం 58 లక్షల మంది రైతులకు 53 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులేనని, వారికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఈ పథకం అమల్లో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల కషి అభినందనీయమని పోచారం అన్నారు
తెలంగాణలో అమలుచేస్తున్న రైతుబంధు పథకాన్ని త్వరలోనే కర్ణాటకలో అమలు చేస్తామని, తెలంగాణలో రైతులకు భరోసానిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలు ఎంతో బాగున్నాయని కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్‌లో నిర్వహించిన విత్తన రైతుల సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన ఆయన రైతులను ఉద్దేశించి పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విత్తన సదస్సు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఉపయోగపడే విధంగా ఉందని ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చి మోడల్‌గా తీర్చిదిద్దేందుకు సహాయపడాలని ఆయన సూచించారు.
నాణ్యమైన ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని, తెలంగాణ విత్తనాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందడానికి నాణ్యతే ప్రధాన కారణమని రాష్ట్ర ¬ంమంత్రి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో ఆయన మాట్లాడుతూ విత్తన ఉత్పత్తిలో తెలంగాణ ఎప్పుడూ ముందంజలోనే ఉంటూ వస్తుందని గొలుసుకట్టు చెరువులు ఉండడం వల్ల పాకాల్, రామప్ప, బయ్యారం, పెద్ద చెరువుల కింద మేలైన వరి విత్తనాలను పండించేవారని ఈ విత్తనాలు దేశదేశాలకు తీసుకువెళ్ళారని అటువంటి విత్తన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని గిరిజన ప్రాంతాల్లో ఆయా ప్రజలు వారి అవసరాలకు ఉపయోగించే పంటలను పండించుకునేందుకు వారే స్వతాగా విత్తనాన్ని తయారు చేసుకొని నిల్వ ఉంచుకునే వారని విత్తన తయారీలో ఇక్కడ రైతుకు అపార అనుభవం ఉందని ఆ అనుభవలను వెలికి తీసి నేడు శాస్త్ర, సాంకేతిక విధానానికి జోడించి నూతన వంగడాల తయారీలో తెలంగాణ ముందంజలో ఉంచడంలో ఈ సదస్సులు ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. పరీక్షా ప్రమాణాలు మన రైతులకు, మన నిపుణులకు తెలుస్తాయని, దానికి అనుగుణంగా పంటలు పండించి విత్తనాలను రూపొందించడం మూలంగా జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణ విత్తనాలకు మరింత డిమాండ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రైతులు డిమాండ్‌కు అనువుగా పంటలను సాగుచేయాలని, సేంద్రీయ తరహాలో పంటలను సాగు చేస్తే మార్కెట్లో ఆదరణ ఉంటుందని, ఎక్కువ ధర వస్తుందని అటువంటి పంటలను పండించేందుకు రైతులు ముందుకు రావాలని మూస పద్ధతిలోని వ్యవసాయాన్ని విడనాడి వాణిజ్యపంటల వైపు సాగుచేపట్టాలని విత్తన ఎంపికలో రైతుదే తుది నిర్ణయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అవసరమైన 65 శాతం విత్తనాలు అందిస్తుందని, విత్తన పంటల సాగులో రైతు సమన్వయ సమితీలు కీలకంగా పనిచేస్తాయని వెల్లడించారు.
తెలంగాణ విత్తనరంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ విత్తన రైతులకు త్వరలోనే గుర్తింపు కార్డులు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి పార్ధసారధిఅన్నారు. విత్తన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టబోయే విత్తన పంట సబ్సిడీలు, ఇతర పథకాలకు విత్తన రైతు గుర్తింపు కార్డులు ప్రధాన భూమిక పోషిస్తాయని అన్నారు. విత్తన రైతుల పూర్తి వివరాలతో కూడిన డాటాబేస్‌ను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తామని వెల్లడించారు. గ్రామాలు, జిల్లాలు, పంటల వారీగా విత్తన రైతులకు సాంకేతిక శిక్షణ అందిస్తామని, దేశంలోనే నర్సరీ చట్టం ద్వారా కూరగాయ పంటలలో కల్తీకి అడ్డుకట్ట వేయగలిగామని తెలిపారు. విత్తన వ్యాపారంలో కల్తీ పెరుగుతున్న నేపథ్యంలో విత్తనం ఎక్కడ పండించబడింది ? ఆ భౌగోళిక ప్రాంతం, ఉత్పత్తిదారుని వివరాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని మార్కెట్లో లభించే విత్తన పాకెట్లపై ఉండేలా బార్ కోడింగ్ విధానం అమల్లోకి రాబోతుందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా విత్తన మొలకశాతం, నాణ్యత పరీక్షలు, బయోటెక్నాలజీ వంటి అంశాలపై జరిగిన పరిశోధనా ఫలితాలు అందరూ తెలుసుకునేందుకు ఇది అవకాశం అని, తెలంగాణ విత్తన బ్రాండ్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయడానికి, నూతన ఎగుమతి అవకాశాలు దీంతో మెరుగవుతాయని అన్నారు.
అంతర్జాతీయ విత్తన సదస్సులో విత్తన ఉత్పత్తి కంపెనీ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రతినిధులను ఎంతో ఆకర్షించాయి. విత్తన కంపెనీలు వారి వారి విత్తన ఉత్పత్తుల వివరాలతో కూడిన విత్తన ప్రదర్శనలో ఉంచారు. రైతులను ఎంతగానో స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విత్తనాల ఎంపిక వాటి విధానాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, మొలకశాతాన్ని గుర్తించడం ఎలాగో ఈ ప్రదర్శనలో వివరంగా తెలిసే విధంగా ఉండడంతో రైతులు విత్తన స్టాళ్ళను ఎంతో ఆసక్తితో తిలకించారు.
వివిధ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు అన్ని సౌకర్యాలను కల్పించడంతోపాటు సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రతినిధులను ఉత్సాహభరితంగా చర్చా వేదికల్లో పాల్గొనేటట్లుగా చేయడం భారతీయ తెలంగాణ కళాప్రదర్శనలకు దేశ విదేశ ప్రతినిధులు ముగ్దులైనారు. తెలంగాణ కళా ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఎలిమిశెట్టి రాంబాబు, అగ్రిక్లినిక్ ప్రతినిధి