ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, చెఱకు మరియు ఉద్యానవన పంటలైన మామిడి, దానిమ్మ, బొప్పాయి, టమాటా చిత్తూరుజిల్లాలోని రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పంటలు ఎక్కువగా పండించడం వల్ల పోషకాల లభ్యత తగ్గి పోషకలోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కావున సరైన పోషకాల యాజమాన్యం పాటించాల్సిన అవసరముంది. పండ్ల తోటల్లో ఎక్కువగా సూక్ష్మపోషకలైన జింకు, ఇనుపధాతువు మరియు బోరాన్‌ లోప లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల వాటికి సరైన నివారణ చర్యలు చేపడితే పంటల దిగుబడిని పెంపొందిచవచ్చు.

వరి :

జింకు, ఇనుప లోప లక్షణాలు :

వరి పైరులో జింకు లోపాల వల్ల ఆకు అడుగు భాగంలో మధ్య ఈనె ఆకుపచ్చరంగు కోల్పోయి పసుపుపచ్చ రంగుకు మారుతుంది. ఈ లక్షణం మొక్కలో పై నుంచి మూడో లేదా నాలుగో ఆకులో కనిపిస్తుంది. ఆకు చివర్లో మధ్య ఈనెకు ఇరువైపులా తుప్పు రంగు లేదా ముదురు ఇటుకరంగు మచ్చలు ఏర్పడతాయి.

కొత్తగా వస్తున్న లేతాకులు పత్రహరితం కోల్పోయి పసుపుగా మారి చారలు ఏర్పడతాయి. ఈనెల మధ్యలో ఉన్న ఆకు భాగాలు పసుపు వర్ణంలోకి మారతాయి. ఈనెలు మాత్రం లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటాయి. లోపం తీవ్రమయే కొద్ది ఆకంతా పసుపుగా తెలుపు రంగులోకి మారుతుంది.

నివారణ :

జింకులోప లక్షణాలు గమనిస్తే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్‌ ను కలిపి 2-3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

ఇనుపదాతులోప లక్షణాలు గమనిస్తే 20-30 గ్రా. అన్నభేదిని (ఫెర్రస్‌ సల్ఫేట్‌) లేదా ఫెర్రస్‌ అమ్మోనియం సల్ఫేట్‌ 2-3 గ్రా. నిమ్మ ఉప్పు లీటరు నీటిలో కరిగించిన ద్రావణాన్ని 4-5 రోజులకు ఒకసారి ఆకులు పచ్చరంగు వచ్చే వరకు పిచికారి చేయాలి.

వేరుశెనగ :

జింకు :

జింకు లోపించిన ఆకు చిన్నవిగా మారి గుబురుగా కనిపిస్తాయి. మొక్కలు గిడసబరతాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రంగుగా మారవచ్చు. ఈ లోపాన్ని సవరించడానికి ఎకరానికి 400 గ్రా.ల చొప్పున జింకు సల్ఫేట్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

ఇనుము :

ఇనుముధాతు లోపం నల్లరేగడి నేలలలో అధిక తేమ ఉన్నప్ప్పుడు కనిపిస్తుంది. లేత ఆకులు పసుపుపచ్చ గాను తర్వాత తెలుపు రంగుకు మారతాయి.ఈ లోపాన్ని సవరించడానికి ఎకరానికి 1 కిలో అన్నభేది మరియు 200 గ్రా.ల సిట్రిక్‌ ఆమ్లాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

బోరాన్‌ :

బోరాన్‌ లోపం వల్ల వేరుశెనగ కాయలు డొల్లగా తయారవుతాయి. వీటి గింజ లోపల బోలుగా ఉండి, నల్లగా మారి ఉంటుంది. నూనె శాతం కూడా తగ్గుతుంది. గింజ దిగుబడి 30-50 శాతం తగ్గే అవకాశముంటుంది. ఒక ఎకరం వేరుశెనగ పంటకు పిచికారి చేయాలంటే 400 గ్రా. బొరాక్స్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ప్రొద్దుతిరుగుడు (సన్‌ ఫ్లవర్‌) :

బోరాన్‌ :

బోరాన్‌ సూక్ష్మమూలకం లోపం వల్ల గింజ కట్టడం తగ్గి తాలు గింజలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది. అందుకుగాను, 2 గ్రా.ల బోరాక్స్‌ పొడిని లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పూత దశలో ఆకర్షణ పత్రాలు తెరచుకున్నప్పుడు ఎకరానికి 200 లీటర్ల మోతాదులో మందు ద్రావణం పిచికారి చేయాలి.

చెఱకు :

జింకు :

జింకులోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపురంగు చారలు ఏర్పడి, దుబ్బు చేయడం నిలిచిపోయి, కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపంకనిపించిన తోటలకు లీటరు నీటికి 2 గ్రా.ల జింకు సల్ఫేట్‌ను కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే ఎకరాకు 20 కిలోల చొప్పున వేసుకున్నట్లైతే లోపం రాకుండా నివారించవచ్చు.

ఇనుప ధాతువు :

ఇనుపధాతువులోపం వల్ల ఆకులు పాలిపోయి లేత పసుపురంగు నుండి తెలుపు రంగుకు మారతాయి. ఈ లోపాన్ని సవరించడానికి 1 లీటరు నీటికి 10 గ్రా.ల అన్నభేది చొప్పున, ట్యాంకుకు (10 లీటర్ల కెపాసిటీ) 100 గ్రా.ల అన్నభేదితో పాటు ఒక పెద్ద నిమ్మకాయరసం లేదా 10 గ్రా.ల నిమ్మ ఉప్పు కలుపుకొని వారం, పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

మాంగనీసు :

మాంగనీసులోపం వల్ల చెఱకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపురంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలు ఈనెల పక్కన కనబడతుంది. చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మాంగనీసులోప నివారణకు ఎకరాకు 2.5 కిలోల మాంగనీస్‌ సల్ఫేట్‌ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

మొక్కజొన్న :

జింకు :

మొక్కల్లో జింకు లోపం వల్ల ఆకులు పసుపు పచ్చరంగులోకి మారడం లేదా లేత పైరు తెల్ల మొగ్గగా కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రా. ల జింకు సల్ఫేట్‌ను కలిపి పైరు పై పిచికారి చేయాలి.

ఉద్యానవన పంటలు :

దానిమ్మ :

జింకు :

జింకులోపం కనిపించిన మొక్కల్లో ఆకుల పరిమాణం చిన్నవిగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. జింకు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా.ల జింకు సల్ఫేట్‌ను కలిపి ఒకటి, రెండు సార్లు కొత్త చిగుర్లు ఉన్నప్పుడు పిచికారి చేయాలి.

ఇనుపధాతువు :

ఇనుపధాతువు లోపించిన ఆకులు తెల్లబడును. పండ్లు చిన్నవిగా ఉండి ఎరుపురంగులోకి మారతాయి. ఈ లోపాన్ని సవరించడానికి 1 లీటరు నీటికి 2.5 గ్రా.ల ఫె˜ర్రస్‌ సల్ఫేట్‌ను పిచికారి చేయాలి.

బోరాన్‌ :

బోరాన్‌ లోపించినప్పుడు లేత కాయలో పగుళ్ళు ఏర్పడతాయి. బోరాన్‌ లోప నివారణకు 1 లీటరు నీటికి 12.5 గ్రా.ల బోరాక్స్‌ పాదులకు వేసుకోవాలి. 1 లీటరు నీటికి 2 గ్రా.ల బోరాక్స్‌ ను చెట్లపై పిచికారి చేయాలి.

బొప్పాయి :

జింకు, బోరాన్‌ :

సూక్ష్మధాతు మూలకాలైన జింకు, బోరాన్‌ లోప లక్షణాలు నివారణకు 5 గ్రా.ల జింకు సల్ఫేట్‌ను + 1 గ్రా. బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తేలికపాటి నేలల్లో బొప్పాయిలో జింకు మరియు బోరాన్‌ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు 1 లీటరు నీటికి 1 గ్రా. బోరాక్స్‌ మరియు 2 గ్రా.ల జింకు సల్ఫేట్‌ను కలిపి పిచికారి చేయాలి.

టమాట :

బోరాన్‌:

టమాట పంటలో బోరాన్‌ లోపం వల్ల పండ్లు పగలుతాయి. దీని నివారణకు నాటే ముందే ఎకరాకు 8-12 కిలోల చొప్పున బోరాక్స్‌ను వేసినట్లైతే పండ్లు పగలకుండా ఉంటాయి.

జింకు :

టమాట పంటలో ఎకరానికి 10 కిలోల చొప్పున జింకు సల్ఫేట్‌ను వేసినట్లైతే జింకు లోపం రాకుండా ఉంటుంది. నాటిన తరువాత 30, 45 రోజులకు లీటరు నీటికి 5 గ్రా.ల జింకు సల్ఫేట్‌ను కలిపి పిచికారి చేసినట్లైతే 20 శాతం దిగుబడి పెరుగుతుంది. పూతదశలో ఎకరాకు 400 మి. గ్రా. 2,4-డి మందును 200 లీటర్ల నీటికి కలిపి లేదా 1 మి.లీ. ప్లానోఫిక్స్‌ 4.0 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత, పిందే నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది.

మామిడి :

జింకు :

జింకులోపం సాధారణంగా చౌడునేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకులోపం ఉన్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకులోపం ఉన్న ఎడల ఆకులు చిన్నవిగా మారి సన్నబడి, పైకి లేదా కిందికి ముడుచుకుపోతాయి. కనుపుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకులవలే గుబురుగా తయారవుతాయి. కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గుతుంది. ఈ లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా.ల జింకు సల్ఫేట్‌ను కలిపి సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు పిచికారి చేయాలి.

ఇనుపధాతువు :

ఇనుపధాతువు లోపం వల్ల చెట్ల ఆకులు పచ్చదనంకోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకులు సైజు తగ్గిపోయి, తీవ్రమైన లోపం ఉన్న ఎడల మొక్కలు ఆకులుపై నుండి క్రిందికి ఎండిపోతాయి. దీని నివారణకు 2.5 గ్రా.ల అన్నభేదిం1 గ్రా.ల నిమ్మ ఉప్పు లేదా ఒక పెద్ద నిమ్మ కాయరసం 1 లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

బోరాన్‌ :

బోరాన్‌ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకుకొనలు నొక్కుకుపోయినట్లుయి, పెళుసుబారతాయి. కాయ దశలో కాయలు పగుళ్ళు చూపడం సర్వసాధారణంగా కనబడే లక్షణం. బోరాన్‌ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రా.ల బోరాక్స్‌ గాని, బోరిక్‌ ఆమ్లాన్ని గాని భూమిలో వేయాలి, లేదా 1-2 గ్రా. బోరాక్స్‌ లేదా బోరిక్‌ ఆమ్లన్ని కొత్త చిగురు వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేయాలి.

కె. రెడ్డెమ్మ, రీసెర్చ్‌ అసోసియేట్‌ (సేద్య విభాగం), డా|| యం. కిషన్‌ తేజ్‌, శాస్త్రవేత్త (కీటక శాస్త్రం),

డా|| యం. రెడ్డి కుమార్‌, సమన్వయకర్త, జిల్లా ఏరువాక కేంద్రం, కలికిరి, చిత్తూరు జిల్లా