వరి సాగులో నారుమడి పెంపకం దశ అత్యంత కీలకమైనది. రైతులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నారుమడి దశలోనే వరిని పలు రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు నివారిస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆరోగ్యవంతమైన నారును తద్వారా ఆరోగ్యమైన పంటను అధిక దిగుబడులతో సాధించవచ్చు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దష్ట్యా రైతులు దీర్గకాలిక లేదా మధ్యకాలిక రకాలకు బదులుగా స్వల్ప కాలిక రకాలను సాగు చేసుకోవడం వల్ల ప్రతికూల పరిస్థితులు అధిగమించవచ్చు.
దీర్గకాలిక రకాలు (150 రోజులపైన) సాగు చేసుకోవాలనుకుంటే మే చివరి వారం నుండి జూన్ 20
మధ్యకాలిక రకాలు (125-135 రోజులు) సాగు చేసుకోవాలనుకుంటే జూన్ 20 నుంచి జూలై 15
స్వల్ప కాలిక రకాలు (110-115 రోజులు) సాగుచేసుకోవాలంటే జూన్ 20 నుంచి జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు.
ఎకరం వరిసాగు చేయడానికి 2 గుంటల నారుమడి సరిపోతుంది. మొదట నారుమడిని నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు బాగా దున్ని కలుపు లేకుండా చేయాలి. తరువాత నారుమడిలో10 రోజుల పాటు నీరు నిల్వ ఉంచాలి. దీనివల్ల పాత విత్తనాలు, గడ్డి కలుపు విత్తనాలు మురిగిపోతాయి. నీరు నిల్వ ఉంచిన సమయంలో 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు బాగా దమ్ము చేసి చివరి దమ్ము తరువాత చదును చేయాలి. దీర్గచతురస్రకారంలో 8-10 మీటర్ల పొడవు, 1-3 మీటర్ల వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు ఉండేలా నారు మడులను తయారు చేసుకోవాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి.
సన్న రకాలయితే 20 కిలోలు, దొడ్డు రకాలైతే 25 కిలోలు
లీటరు నీటికి 6.3 మి.లీ. గాఢ నత్రికామ్లం కలిపిన ద్రావణంలో విత్తనాలు 24 గంటలు నానపెట్టాలి. తరవాత విత్తనాలను మరో 24 గంటల పాటు మండే కట్టి మొలక వచ్చిన విత్తనాలను నారుమడిలో చల్లుకోవాలి.
నారుమడిలో విత్తనాలు ఒత్తుగా చల్లితే మొక్కలు బలహీనంగా ఉంటాయి. పలుచగా చల్లితే దుబ్బు కట్టి పీకేటప్పుడు వేర్లు తెగిపోతాయి. అందువల్ల విత్తనాన్ని నారుమడిలో సమతూకంగా చల్లుకోవాలి. ముఖ్యంగా దుంప నారుమడుల్లో శిలింద్రాలు ఆశించకుండా విత్తనాన్ని విత్తేముందు కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజమ్ మందును 1 లీటరు నీటిలో కలిపి విత్తనాలను 24 గంటలు నానబెట్టి మరో 48 గంటలు మండే కట్టి దుంప నారుమడిలో చల్లుకోవాలి.
200 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల నత్రజని(4.4 కిలోల యూరియా) 1 కిలో భాస్వరం (6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్), 1కిలో పోటాష్ (1.67 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ మరియు 1 కిలో జింక్ సల్ఫేట్ అవసరం)
విత్తనాలు చల్లడానికి రెండు రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 1 కిలో చొప్పున నత్రజని, పోటాష్, భాస్వరం, జింక్ సల్ఫేట్ మరియు 200 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి.
మిగిలిన కిలో నత్రజని విత్తిన 10-15 రోజుల తరువాత వేసుకోవాలి.
నారుమడిలో బ్యూటక్లోర్ 50 మి.లీ లేదా ప్రేటిలాక్లోర్ + సేఫనర్ 50 మి.లీ ఏదైనా ఒక దాన్ని ఎకరాకు సరిపడా నారుమడికి 5 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 8-10 రోజులకు పిచికారి చేసుకోవాలి.
బిస్ పైరీ బాక్ సోడియం అనే కలుపు మందును 0.5 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి విత్తిన 8-10 రోజులలోపు పిచికారి చేసుకోవాలి.
నారుమడిలో ఊద, ఒడిపిలి వంటిగడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే విత్తిన 15-20 రోజులకు సైహలోఫాప్- పి- బ్యుటైల్ అనే కలుపు మందును 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నారుమడిలో రెండు ఇంచుల మేర నీరు ఉంచి విత్తనాలు చల్లాలి.
విత్తనాలు చల్లిన 16-24 గంటల తరువాత విత్తనాలు కొట్టుకుపోకుండా చిన్న చిన్న మురుగు కాలువల ద్వారా నారుమడిలోని నీటిని పూర్తిగా తీసివేయాలి. దీనివల్ల మొలకలు సరిగ్గా నాటుకుంటాయి.వారం రోజుల తరువాత మళ్ళి నీరు పెట్టాలి.
నారు ఒకటి, రెండు ఆకుల దశకు వచ్చే వరకు ఆరు తడులు ఇస్తూ 10 రోజుల తరువాత నారుమడిలో పలుచగా నీరు ఉంచాలి.
నారుమడిలో విత్తనాలు చల్లిన 12-14 రోజుల తరువాత కాండం తొలిచే, ఉల్లికోడు, తాటాకు మరియు తామర పురుగులు కనిపిస్తే వాటి నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ మోనోక్రోటోఫోస్ లేదా ప్రోఫినోఫోస్ లేదా 2.5 మి.లీ క్లోరిఫైరిఫొస్ లేదా 2 గ్రా. కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కలిపి పిచికారి చేసుకోవాలి.
నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్లు నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు వేసుకుంటే మొగిపురుగు, ఉల్లికోడును అరికట్టవచ్చు.
జి. రంజిత్ కుమార్, ఎం.యస్సి (సాయిల్ సైన్స్), డి.అనిల్, శాస్త్రవేత్త (సేద్య శాస్త్రవిభాగం), వ్యవసాయ పరిశోధన స్థానం, కూనారం