వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో రైతులకు ఆర్థికంగా తోడ్పాటును అందించనున్నాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, రైతు పెట్టిన పెట్టుబడి రాక ఏటేటా రైతాంగం ఆర్థిక ఊబిలో కూరుకుపోతున్న స్థితి నుండి రైతాంగాన్ని ఆదుకోవాలనే దృక్పదంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు పండించే పంటకు అనుగుణంగా ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగింది. మేడ్చల్‌ జిల్లాలోని దూలపల్లి గ్రామంలో సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దృష్టికి తీసుకువెళ్ళడంతో ఇటీవల కాలంలో కేంద్రం నుండి ప్రాసెసింగ్‌ అనుమతులను పొందింది. రూ. 12 కోట్లతో దూలపల్లి, గండిమైసమ్మ ప్రాంతంలో ప్రాసెసింగ్‌ యూనిట్‌కు అనుకూలమని సంబంధిత అధికారులు నిర్దారించారు. కేంద్రం నుండి సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) (మైసూర్‌) డైరెక్టర్‌, డా|| రాఘవరావు హైదరాబాద్‌లోని సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ రీసోర్స్‌ సెంటర్‌ను సందర్శించి ప్రాసెస్‌ యూనిట్ల కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను అన్వేషించారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో దూలపల్లి ప్రాంతంలో సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ యూనిట్‌కు అనుకూలమని తేల్చారు. డిపిఆర్‌ ప్రకారం సివిల్‌ వర్కును ప్రారంభించేందుకు రూ. 6 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌ భవనాలను నిర్మించేందుకు డిపిఆర్‌ చేయడం జరిగింది.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో సమీపంలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఉద్యాన సంచాలకుల యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించి గ్రాంటును కూడా కేటాయించడంతో పనులను ప్రారంభించి వేగవంతంగా కేంద్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో యూనిట్‌ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేపట్టినప్పటి వ్యవసాయ శాఖా మంత్రి నేటి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా ఈ బృదం కలిసింది. ఉద్యానవన సంచాలకులు వెంటకరామిడ్డితో ప్రాజెక్టు నివేదికపై చర్చించారు. పూర్తి స్థాయిలో నిర్మాణాలను చేపట్టేందుకు ఉద్యానవన శాఖ సహకారం అందించి యూనిట్‌ను ఈ ఏడాది చివరికల్లా ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు వల్ల ఆ ప్రాంత రైతాంగానికి అదనపు ఆదాయం చేకూరుతుందని వ్యవసాయేతర ఉపాధి కలుగుతుందని తద్వారా చిన్న, మధ్య తరగతి రైతాంగానికి ఊతమిచ్చినట్టుగా ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లు పనిచేస్తాయని సంబంధిత అధికారులు రైతాంగాన్ని ఆర్థికంగా అభివృద్ధిపరచేందుకు ఇలాంటి యూనిట్లను రైతుల కొరకు విరివిగా ఏర్పాట్లు చేపట్టాలని పోచారం సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ బృందాన్ని కోరారు.

ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం గత ఏడాది మైసూర్‌ని సందర్శించడం కోసం ఉద్యాన వన సంచాలకు వెంకట్రామిరెడ్డి తీసుకొన్న నిర్ణయం హర్షించదగ్గదని మైసూర్‌లో ప్రాసెసింగ్‌ యూనిట్ల పని విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అక్కడ రైతాంగానికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందో పరిశీలించిన బృందం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పితే కొంతమేర రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివరించడంతో ముఖ్యమంత్రి తక్షణమే ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారని మాజీ వ్యవసాయశాఖా మంత్రి పోచారం తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నెలకొల్పేందుకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని రైతుల కోసం చేసే ప్రతిపనిని ప్రభుత్వం ఒకడుగు ముందే ఉంటుందని రైతులను ఆర్ధికంగా పరిపుష్టి చేయాలనే తలంపుతోనే రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని ఆయనను కలిసిన బృందానికి తెలిపారు. పోచారంను కలిసినవారిలో తెలంగాణ సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ డైరెక్టర్‌ రాఘవరావు, రాష్ట్ర ఉద్యాన సంచాలకులు వెంకట్రామిరెడ్డి, జోతిర్మయి సీనియర్‌ శాస్త్రవేత్త. హైదరాబాద్‌ సి.ఎఫ్‌.టి.ఆర్‌.ఐ రిసోర్స్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ బి. బాబు తదితరులు ఉన్నారు.